ఆంద్రప్రదేశులో జరుగనున్న 2014 ఎన్నికలు రాజకీయ పక్షాల, వాటి నేతల మధ్యనే కాకుండా వారికి సంభందించిన మీడియాల మధ్య కూడా అన్నట్టయిపోయింది! అంటే ఇంతకముందు ఇలా లేదా అంటే ముందు కూడా ఈ పైత్యం ఉంది కాని, ఇంతలా మీడియా బరితెగించిన సందర్భం లేదు.
ఒక వర్గానికి దన్నుగా నిలిచే మీడియా వైఎస్సార్ కాంగ్రెస్, జగన్మోహన్ రెడ్డిపై ఏ చిన్న వివాదం పైనైనా ఏకంగా 14 న్యూస్ చానళ్ల కెమెరాలు ఎక్కుపెడతాయి. అవకాశం దొరికితే చీల్చి చెండడతాయి. అదే వైఎస్సార్ కాంగ్రెసుకుండే అనుకూల పరిస్థితి గురించి మాత్రం ఏ ఒక్క ఛానల్ కూడా ప్రసారం చేయదు. తాము మద్దతిచ్చే పార్టీ కుక్కలు చింపిన విస్తరిలా తయారవుతున్నా ఆ పార్టీని వెనకేసురావడానికి, వెలిగిపోతోంది అంటూ అనుకూల సర్వేలను ప్రచారంలోకి తీసుకురావడానికి మాత్రం ముందుంటుంది!
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని మాత్రమే ఈ మీడియా టార్గెట్ చేస్తోంది. అక్కడికీ సాక్షి పేపర్, సాక్షి టీవీ చానల్ ఉంది కాబట్టి సరిపోయింది. లేకపోతే ఈ పాటికి అసలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒకరు ఉన్నారని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనేది ఒకటి ఉందని కూడా రాష్ట్ర, దేశ ప్రజలకు తెలిసేది కాదు. అయినా జగన్మోహన్ రెడ్డి తరపున సాక్షి ఒంటరిపోరాటం చేస్తోంది. అయితే వైఎస్సార్ కాంగ్రెసులో చీమ చిటుక్కుమన్నా 14 న్యూస్ చానళ్లు, రెండు పెద్ద పత్రికలు నానా హైరానా చేస్తాయి. ఒకవేళ నామినేషన్ల కోలహాలంలోనూ, బీజేపీతో పొత్తు వ్యవహారంలోనూ తెలుగుదేశం పార్టీలో రేగిన వివాదాల వంటి వివాదాలే వైఎస్సార్ కాంగ్రెసులో గనుక రేగి ఉంటే నిజంగా వైకాపా పరిస్థితి చాలా దారుణంగా ఉండేది.
తెలుగుదేశం నేతల మధ్య విభేదాలున్నట్టుగా, తెలుగుదేశం నేతలు తన్నుకొన్నట్టుగా వైకాపా వాళ్లు తన్నుకొని ఉంటే వైఎస్సార్ కాంగ్రెసును మరో ప్రజారాజ్యం పార్టీలా చూపించేది ఈ మీడియా. జగన్మోహన్ రెడ్డి చాలా జాగ్రత్తగా ఉండి అభ్యర్థులను ప్రకటించుకొని రెబల్స్ పోటు లేకుండా చేసుకొన్నాడు. జగన్మోహన్ రెడ్డిలో ఇలాంటి టాలెంట్ లేకపోతే ఈ మీడియా చేతిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలి అయ్యేది. ఈ మీడియాకు మొత్తం ఇప్పుడు వైకాపాలోని లోపాలు మాత్రమే కనిపిస్తున్నాయి. ఆ పార్టీకి అనుకూలంశాల గురించి మాత్రం ఈ మీడియా ప్రచారం చేయడానికి ఇష్టపడటం లేదు. అంతదాకా ఎందుకు శోభా నాగిరెడ్డి అంత్యక్రియలకి జగన్, విజయమ్మ, షర్మిల, భారతి – నలుగురు తమ అత్యంత ముఖ్యమైన ప్రచారాన్ని మధ్యలో వదిలేసి రెండు రోజుల పాటు సమయాన్ని గడిపితే, ఇదే మీడియా జగన్ కుటుంబం అంత్యక్రియలకి హాజరుకాలేదని రాసింది! అయితే మీడియా అనుకూలంగా నిలిచినంత మాత్రాన పార్టీలు గెలిచేస్తాయని చెప్పడానికి లేదు. దీనికి గతంలోని అనేక ఉదాహరణలు కూడా ఉన్నాయి. ఇదే జగన్మోహన్ రెడ్డికి, వైఎస్సార్ కాంగ్రెసుకి కొండంత ధైర్యాన్ని ఇస్తోంది!
చంద్రబాబు, తెలుగుదేశం పార్టీలకి అధికారం సాధించి పెట్టడానికి ఈ మీడియా ఎంతకు తెగించిందంటే పార్టీ శ్రేణులు చేసే ప్రచారానికంటే వేల రెట్లు ప్రచారం చెయ్యడానికి సన్నద్ధమయ్యాయి. వారు మద్దత్తిచ్చే తెలుగుదేశం పార్టీ గెలిచే ఆస్కారం లేకపోయినా గెలుస్తుంది అని తాము చెప్తే ప్రజలు నమ్మరని, తప్పుడు సర్వేలని తమతో సంభందాలున్న జాతీయ మీడియాతో వండి వార్పించి మరీ ప్రాచారం చేస్తున్నాయి. అదే సమయంలో అసలు సిసలు సర్వేలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయని కొంతవరకు తటస్తంగా ఉండే చానల్స్ ప్రసారం చెయ్యకుండా వత్తిడి చేసి నిలుపు చేయిస్తున్నాయి.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఇప్పటివరకూ ఎప్పుడూ గురి తప్పని ప్రపంచ ప్రఖ్యాత నీల్సన్ ఆఖరి సర్వేలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సీమాంధ్రలో 125 అసెంబ్లీ సీట్లు వచ్చి, తెలుగుదేశం పార్టీకి కేవలం 45 సీట్లే వచ్చాయని, అలాగే 20 పైగా పార్లమెంట్ సీట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వచ్చాయని తెలిసి ఎన్టీవీ ప్రసారాన్ని తెలుగుదేశం పార్టీలోని కొంతమంది పారిశ్రామికవేత్తల సహాయంతో ఆపేసారని తెలిసింది. వారు మాత్రం సి-ఓటర్ సర్వే, ఎన్డీటీవీ సర్వే అని, లగడపాటి సర్వే అని పలురకాల ఫేక్ సర్వేలుప్రసారం చేస్తున్నాయి. 2004లో తెలుగుదేశానిదే విజయం (ఈనాడు), 2009లో మహాకూటమిదే మహావిజయం (ఈనాడు), 2011 కడప ఉప ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి, విజయమ్మల ఓటమి ఖాయం (ఈనాడు/టీవీ 9), 2012 ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెసుకు ఎదురుదెబ్బ (ఆంధ్రజ్యోతి/ఈనాడు) అని ప్రచారం చేసిన ఘనత ఈ మీడియాది! వీళ్ళ తప్పుడు ప్రచారం ఇలా ఉంటుంది! ఎండమావుల్లో నీళ్ళన్నా దొరుకుతాయేమో గాని వీళ్ళ మాటల్లో నిజాలు మాత్రం దొరకవు! 2009 నుండి ఆ మీడియా సపోర్ట్ చేస్తున్నపార్టీ గెలిచిన ఉపఎన్నికలు సున్నా, డిపాజిట్లు గెలిచింది సగం వాటిల్లో. మోడీ/పవన్ కళ్యాణ్ దయతో ఎలాగోలా అధికారంలోకి వస్తామనే ఆశతో ప్రజలని మభ్యపెట్టే ప్రయత్నం ముమ్మరంగా జరుపుతున్నది ఈ మీడియా.
ఈ మీడియా వారి ట్యాగ్ లైనులే ఆకర్షణీయంగా ఉంటాయి, కాని వారి విధానలన్నీ తమ వర్గ ప్రయోజనాలకోసమే! ప్రజా పక్షాన నిలిచి, ప్రజాహితం కోసం నాలుగవ స్థంబంగా నిలవాల్సిన మీడియా వారి వారి వర్గ కుత్సిత ప్రయోజనాల కోసం ప్రక్క దారి పట్టడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు!
గురవా రెడ్డి, అట్లాంటా