సాధారణంగా పార్టీలు ఎవరు పెడతారు? కాస్తో కూస్తో ప్రజాదరణ వుంది, తాము రంగంలోకి దిగితే ఓట్లు పడతాయి అనుకునేవాళ్లే. అయితే రాజకీయ రంగం లేదా ఇతరత్రా ప్రజాభిమానం సంపాదించగల సినిమా, క్రీడా తదితర విభాగాల వారు. ఇలాంటివారంతా పార్టీలు ముందు పెట్టి, ఆపై తమ బలం ఇంత అని చాటి, ఆపై ఎందుకైనా మంచిదని పొత్తుల జోలికిపోతారు. సహజంగా జరిగేది ఇదే. కానీ రాష్ట్రం అంతటా భయంకరమైన ఫాలోయింగ్ వుందని అందరూ భావిస్తున్న పవన్ కళ్యాణ్ పార్టీది మాత్రం చిత్రమైన వైఖరి. అది పుట్టకముందే పొత్తుల కోసం అర్రులు చాచిందనుకోవాలి.
అసలు పవన్ కళ్యాణ్ పార్టీ పెడతాడని గడచిన ఆరు నెలలుగా వినిపిస్తోంది. టీవీ 9, ఈనాడు అధిపతులు పవన్ తో చర్చలు జరిపారని, అద్వానీ తరపున వారు పవన్ ను ప్రోత్సహిస్తున్నారని వార్తలు అందాయి. ఇవన్నీ గాలి వార్తలు, పవన్ రాజకీయాల్లోకి రాడు అని కొందరు. అతగాడు అలాంటి వ్యవహారాలకు లొంగడని మరి కొందరు అనుకున్నారు. మీడియా పవన్ కు వున్న చరిష్మా రీత్యా ఇలా ఏదో ఒక వార్త పుట్టిస్తూనే వుంటుందని కూడా అనుకున్నారు. పవన్ గబ్బర్ సింగ్ సినిమా మాదిరిగానే ఈ పార్టీ వ్యవహారంపై కూడా రకరకాల ఊహాగానాలు. ఆఖరికి మమ అనే రీతిలో ఆ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. అదే విధంగా పార్టీ ప్రారంభం కూడా జరిగిపోయింది. పవన్ పార్టీ పెట్టడానికి కొద్ది రోజులకు ముందే సీమాంధ్రలోని మెజార్టీ కాపు లీడర్లు తెలుగుదేశం పార్టీలోకి వలసపోవడం ప్రారంభించారు.
రాజకీయాలను పరిశీలించేవారిని ఇది కాస్త అయోమయానికి గురిచేసింది. పవన్ కు కులాభిమానం వున్నా లేకున్నా, ఆయన పార్టీ పెడతారని తెలిసి, వీళ్లంతా తెలుగుదేశం వెంట ఎందుకు వెడుతున్నట్లు? అంటే పవన్ పార్టీ పెట్టడు అన్నదే నిజం అనుకున్నారు. తీరా పార్టీ పెట్టాక మళ్ల మరో సందేహం. మరి పవన్ తాకిడికి వైకాపా, తేదేపా ఇబ్బంది పడితే ఇలా జంప్ జిలానీలుగా మారిన కాపు నాయకుల పరిస్థితి ఏమిటి?
ఇప్పుడీ మబ్బులన్నీ విడిపోతున్నాయి. పవన్ పార్టీ వైనం, దాని పూర్వాపరాలు, ఇవన్నీ సోకాల్డ్ జంప్ జిలానీలకు ముందే తెలుసి వుండాలి. పవన్ పార్టీ భాజపా,తేదేపాలకు మద్దతు ఇస్తుందనీ తెలిసి వుండాలి. లేదా ఈ మేరకు అంతకు ముందుపుట్టిన గాలి వార్తలను వారు నమ్మి వుండాలి. పవన్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేయనపుడు, అధికారం కోసం ప్రయత్నించదని తెలిసినపుడు, సీనియర్ రాజకీయనాయకులు అటెందుకు వెళ్తారు. బాబుతో లేదా జగన్ తో వెళ్తే, ఎన్నిక కావడం, పదవి సంపాదించుకోవడానికి అవకాశం వుంటుంది. పవన్ మద్దతు ఎలాగూ దేశానికే వుంటుంది కాబట్టి,అటే జంప్ చేస్తే బెటర్. అందుకే అలాంటి పరిణామాలు సంభవించాయి అని అనుకోవాల్సి వస్తోంది.
పైగా పవన్ కేవలం జనసేన అనే సంస్థను మాత్రం ప్రకటించారు. అది ఎన్నికల్లో పోటీ చేస్తుందో, దాని విధి విధానాలమిటో ఇంతవరకు ప్రకటించలేదు. సాధారణంగా భావసారూప్య పార్టీలతోనే ఎవరైనా పొత్తు పెట్టుకుంటారు.ఇదో కొత్తపదం. సిద్ధాంతాల సారూప్యం అంటే ఏ రెండు పార్టీలు కలవవు. అవినీతిపై పోరాడే లోక్ సత్తా అయితే అసలే పార్టీతోనూ కలవలేదు. అందుకే భావసారూప్యత అన్న దగ్గర దారి. ఇక్కడ చిత్రమేమిటంటే ఈ భావసారూప్యత కు కూడా అవకాశం లేకుండానే పార్టీ లన్నీ పవన్ పార్టీ మద్దతు కొసం ప్రకటించడం. భాజపా, లోక్ సత్తా, తేదేపా అన్నీ బాహాటంగానే మద్దతు అడిగేసాయి. సరే ఈ ఎన్నికలు దాదాపు అన్ని ప్రధాన పార్టీలకు చావు బతుకుల సమస్య కాబట్టి, తమ స్థాయి మరిచి పొత్తుకోసం వెంపర్లాడాయని అనుకోవచ్చు. కానీ తమకు భయంకరమైన ఫాలోయింగ్ వుందని, తమనేమైనా అంటే తాట తీస్తామని, అన్నవారి బతుకులు యూ ట్యూబ్ లో పెడతామని బెదిరిస్తూనే పార్టీ పెట్టగలిగిన పవన్, తనంతట తాను ఈ పొత్తుల కోసం ఎందుకు ముందుకు అడుగేసినట్లు? పవన్ పవర్ తెలిసి బాబు కానీ, ఆయన మనుషులు కానీ అతగాడి ఇంటికొ్చ్చి, కలిసినట్లు వార్తలు రాలేదు.ఈయనే బాబును రాత్రి పొద్దుపోయాక, చాటుగా కలిసి వచ్చినట్లు వార్తలు వచ్చాయి.
అదే విధంగా భాజపావారిని కూడా. ఇవన్నీ ఎంతవరకు నిజం అన్నది పక్కన పెడితే. నిజం కాకుంటే జనసేన నుంచి ప్రకటన ద్వారా ఖండించాల్సి వుంది. అధికార ప్రతినిధులు లేరని, ఇలా చిన్నా చితకా ప్రకటనలు వచ్చాయి కాబట్టి, ఇలాంటి పెద్ద విషయాఅనికి కూడా ప్రకటన ఇవ్వాలి మరి. అది కాకున్నా, పారదర్శకత, ప్రశ్నించే హక్కు, లాంటి కొత్త విషయాల గురించి మాట్లాడేటపుడు, ఇలా చాటుగా ఎందుకు కలవడం. బహిరంగంగానే కలిసి, చర్చలు సాగించవచ్చు. తప్పేమీ లేదు. మీడియా ఎదురైనా వదిలేయచ్చు. ఓ పార్టీ పెడుతున్నా అని చెప్పి, రాజకీయాల్లోకి వచ్చి కూడా ఇంత వరకు మీడియాతో మాట్లాడని ఒక ఒకే వ్యక్తి బహశా ఈ దేశంలో పవన్ కళ్యాణ్ ఒక్కడే కావచ్చు. ఈ విషయంలో శభాష్ అనాల్సిందే. అదే సమయంలో తమను పట్టించుకోకున్నా, తమంతట తామే భయంకరంగా గోక్కుంటున్న మీడియాను కూడా తప్పకుండా ప్రశంసించాల్సిందే. అదే సమయంలో పవన్ తో ఈ పార్టీలన్నీ ఎలా చర్చలు సాగిస్తున్నాయన్నిది ఓ అనుమానం. పవన్ పార్టీ విధి విధానాలు తెలియలేదు. ఆయన కమ్యూనిస్టు సిద్ధాంతాల ఆలంబనగా వెళ్తారని అంటున్నారు. అలాంటపుడు భాజపా ఆయనతో పొత్తు ఎలా పెట్టుకుంటుంది. పైగా మొన్న సమావేశంలో ఆయన ఎమ్ ఐ ఎమ్ నాయకుడి అరెస్టు తప్పు అన్న రీతిలో మాట్లాడారు. మతాలను కించపరచడం లేదా రెచ్చ గొట్టే ప్రసంగాలు అన్నది ఆ కేసు అని అందరికీ తెలుసు. మరి ఆ సంగతి తెలిసే పవన్ ఆ అరెస్టు అన్యాయం అన్నారా? ఈ సంగతి తెలిసీ భాజపా పవన్ తో మద్దతు పెట్టుకుంటుందా? మరి అదే కేసు దరిమిలా అరెస్టు చేసిన హిందూ స్వామీజీల విషయంలో పవన్ వైఖరి ఏమిటి?
సరే, భాజపా సంగతి ఇలా వుంటే, తేదేపా తనంతట తాను పొత్తు కోసం అంగలార్చడం సహజం. ఇస్తానంటే వైకాపా కూడా రెడీ అవుతుంది. కానీ జంపింగ్ లను ప్రోత్సహించనని, కుల మతాలకు అతీతంగా విధి విధానాలుంటాయని చెప్పే పవన్ మరి ఎలా పొత్తుకు ముందుకు వెళ్తారు. ఇప్పటికీ బాబు పాలసీ ఒకటే, అవతలి పార్టీ లో ఏ నాయకుడిని విమర్శించాలంటే, ఆ నాయకుడి కులపోడి చేతనే ప్రెస్ మీట్ పెట్టించడం. ఏ పార్టీకైనా ఒకరే స్పోక్స్ పర్సన్ వుంటారు. కానీ బాబుకు కులానికి ఒకరు వంతున వుంటారు. అవతలి వాడు ఏ కులమైతే, ఇవతల ఆ కులాన్ని ఎంచి బాబు ముందుకు పంపిస్తారు. మరి కులాన్ని ఇంతలా వాడుకునే పార్టీతో పవన్ ఎలా పొత్తు పెట్టుకుంటారు.
ఇలా ఎవరైనా రాసినా, అడిగానా, పవన్, తేదేపా పొత్తు కలిస్తే, వైకాపాకు నష్టం కనుక అలా అంటున్నారు, రాస్తున్నారు అనడం కొత్తగా ఫ్యాషన్ అయింది. వైకాపాను నష్టం అయితే చాలా? ఇంక మరేమీ చూడనవసరం లేదా అని ఎదురు ప్రశ్నించడం ఎవరూ చేయకపోవచ్చు. పవన్ ది ఇతర పార్టీల్లా ఫక్తు రాజకీయ పార్టీ అంటే ఇంక మరేమీ అడగక్కరేలేదు. రాయక్కరలేదు.కానీ అలా కాకుండా విలువల పునాదుల మీద నిర్మిస్తున్నాం అని చెప్పుకుంటేనే ఇలాంటివి రాయాల్సి వస్తుంది.
అసలు పవన్ తన బలం ఎంత అని అనుకుంటున్నారు. జనానికి, అభిమాన జనానికి సంబంధించినంత వరకు పవన్ బలం కొండంత. మరి ఆయన పొత్తు బాబూ..పొత్తు.. అంటూ పార్టీల గుమ్మాల చుట్టూ ఆయనెందుకు తిరగడం.. పార్టీలే ఆయన దగ్గరకు రావాలి కానీ? అలాగే నాలుగైదు సీట్లేం ఖర్మ, సగానికి సగం లాక్కోవాలి కానీ? అసలు పుడుతూనే పొత్తు..పొత్తు అని అనడం ఎందుకు? పుట్టకముందే పొత్తు పొడపు వార్తలు వినవచ్చాయి. ఇప్పుడు అదే నిజమని తేలుతోంది. అంటే పుట్టకముందు ఏయే పెద్ద మనుషులు పవన్ పార్టీ వెనుక వున్నారని వార్తలు వినవచ్చాయో, అవి కూడా నిజమని అనుమానించాల్సి వస్తుంది.
ఇవే నిజమైతే, పవన్ పార్టీ కూడా ఆ రాజకీయ తానులోని ముక్కే. మరింతకన్నా ఏమీ లేదు.
చాణక్య