క్రికెట్ నేపథ్యంలోవచ్చే సినిమాలకు కొదవలేదు. ఏదో ఒక చోట ఈ కథతో సినిమా తయారవుతూనే ఉంటుంది. అయితే… తెలుగులో ఇలాంటి కథాంశాలు తక్కువే వచ్చాయి. మొన్నామధ్య ప్రకాష్ రాజ్ ధోని సినిమా తీశాడు. ఇప్పుడు మధుర శ్రీధర్ కూడా క్రికెట్ నేపథ్యంలో ఓ సినిమా తీస్తున్నాడు. ఆ సినిమా పేరు.. ఐయామ్ నాట్ సచిన్. నేను సచిన్ కాదు.. అనేది ఉపశీర్షిక. ఆద్యంతం క్రికెట్ చుట్టూ తిరిగే కథ అట.
మ్యాచ్ ఫిక్సింగ్, క్రికెటర్లు – సినిమాస్టార్ల ప్రేమాయణాలు, టీమ్‌లో లొసుగులు ఇలా అనేక విషయాల్ని ఈ సినిమాలో ప్రస్తావిస్తారట. అయితే మానవ సంబంధాలను అంతర్లీనంగా చూపిస్తున్నాం.. అని చిత్రబృందం చెబుతోంది. డబ్బు కంటే దేశం గొప్పదనే సందేశం ఇస్తున్నారట. కథానాయకుడిగా ఎవరిని ఎంచుకొంటారో చూడాలి.
అన్నట్టు ఇది వరకు మధుర శ్రీధర్ తీసిన రెండు సినిమాలూ ఫ్లాపే. ఆమధ్య లేడీస్ అండ్ జెంటిల్‌మెన్ అనే ఓ సినిమా చేస్తున్నట్టు ప్రకటించాడు. అదెంత వరకూ వచ్చిందో చెప్పలేదు. విక్కీ డోనర్ తెలుగు రీమేక్ అజాపజా లేదు. ఈ సినిమా అయినా తీస్తాడో, లేదంటో ఇలాంటి ప్రకటనలతో సరిపెడతాడో..!