స్మార్ట్ విలేజ్‌లు- భారతదేశపు తక్షణ అవసరం

కొద్ది కాలం క్రితం తొలిసారి స్మార్ట్ అన్న పదం భారతదేశంలో ఉపమానంగా వాడింది శ్యామ్‌సంగ్ కంపెనీ. మామూలు టీవీలో ఇంటర్ నెట్ కూడా బ్రౌజ్ చేసుకునే సదుపాయం కల్పించి, దానికి స్మార్ట్ టీవీ అని…

కొద్ది కాలం క్రితం తొలిసారి స్మార్ట్ అన్న పదం భారతదేశంలో ఉపమానంగా వాడింది శ్యామ్‌సంగ్ కంపెనీ. మామూలు టీవీలో ఇంటర్ నెట్ కూడా బ్రౌజ్ చేసుకునే సదుపాయం కల్పించి, దానికి స్మార్ట్ టీవీ అని పేరు పెట్టింది. తెలివైన వాళ్లని స్మార్ట్ బాయ్ అని ప్రశంసిస్తారు. ఇప్పడు స్మార్ట్ సిటీ అన్న కాన్సెప్ట్ ను తెరపైకి తెచ్చిన మోడీ స్మార్ట్ బాయ్ అనుకుంటే,  దాని అర్థం పరమార్థం తెలిసినా తెలియకున్నా, పెద్దాయిన అన్నాడు కదా అని, తాను తందానా తానా అంటున్న చంద్రబాబు మాత్రం టూ స్మార్ట్ అనుకోవాలి. 

సినిమాల్లో విదేశీ పట్టణాలు చూస్తుంటేనే మనకు మహా చిత్రంగా వుంటుంది. ఇంటి నుంచి ఇంటికి పరుచుకున్న రోడ్లు, అత్యంత పరిశుభ్రంగా కనిపిస్తూ, వాహనాలు ఓ పద్దతిగా వెళ్తూ, చాలా అద్భుతంగా వుంటుంది. ఇప్పటికే ఇండియాలో ఈ తరహా అనుభూతి పొందే అవకాశం కొందరికి దక్కింది. అది పట్టణాలు, నగరాల వారికి కాదు.. గేటెడ్ కమ్యూనిటీల్లో నివసించేవారికి. చక్కటి రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రయినేజీ, వైర్లు, లాండ్ స్కేప్ ఇలాంటివి అన్నీ గేటెడ్ కమ్యూనిటీ వెంచర్లలో కనువిందు చేస్తూ వుంటాయి. 

ఇప్పుడు స్మార్ట్ సిటీ అనగానే జనం రకరకాలుగా ఊహించుకుంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల రీత్యా మన దేశంలో ఎక్కడైనా సరే ఓ పట్టణం స్మార్ట్ సిటీగా మారాలంటే అంత సులువు కాదు.. దానికి చాలా పట్టుదల, త్యాగాలు రెండూ కావాలి. ఇటు ప్రభుత్వం పట్టుదలతో అమలు చేయాలి. నిధులు అందించాలి. అటు ప్రజలు త్యాగాలు చేయాలి, ఎందుకంటే రోడ్లు విశాలం కావాలి. ఇళ్ల ముందు ఆక్రమణలు పోవాలి. రోడ్ల పక్క ఫుట్‌పాత్‌లు కావాలి. రోడ్లపై అడ్డగోలు పార్కింగ్‌లు వుండకూడదు. రోడ్ల పక్కన ఫుట్‌పాత్ విక్రయాలు పనికిరావు. కేబుల్ సంస్థలు, నెట్ సంస్థలు తమ చిత్తానికి వైర్లు వేసుకుంటూ పోకూడదు. ఇలా చాలా వుంది వ్యవహారం. ఇప్పుడు పట్టణాల్లో ఎవరికీ పట్టని వ్యవహారాలు ఇవన్నీ. అన్ని బహుళ అంతస్తుల వ్యాపార కట్టడాలు తమ తమ సెల్లార్‌లను స్వంతానికి వాడుకుంటాయి లేదా, వ్యాపారానికి వాడుకుంటాయి. పార్కింగ్ కోసం రోడ్లను ఆక్రమిస్తాయి. ఫుట్‌పాత్‌లను వ్యాపారులు ఆక్రమిస్తారు. పోలీసులు మామూళ్లు తీసుకుని వీటిని అనుమతిస్తారు. ఇప్పుడు ఇవన్నీ బంద్ కావాలి. 

ఇలాంటి నేపథ్యంలో కేంద్రం స్మార్ట్ సిటీల నిర్మాణానికి పూనుకుంటొంది. మంచిదే. ఎక్కడో ఓ పాయింట్ దగ్గర పని అంటూ ప్రారంభమైతే, మరో పదేళ్లు, పాతికేళ్ల కయినా దేశంలో కొంతయినా మంచి భౌగోళిక వాతావరణం కనిపిస్తుంది. అయితే దేశంలోని వేలాది పట్టణాలు అన్నీ స్మార్ట్ సిటీలుగా మారడానికి ఏళ్లూపూళ్లూ పడుతుంది. ఇప్పుడున్న జనంలో మూడు వంతుల మందికి ఆ చిత్రం చూసే అదృష్టం వుండకపోవచ్చు కూడా.  

మరి మనదేశపు పల్లెల మాటేమిటి? భారతదేశం అంటేనే పల్లెలు. పల్లెలు లేని భారతదేశాన్ని ఎవరైనా ఊహించగలరా? నిజమైన భారతదేశం అంటే పల్లెల్లోనే వుందన్నా గాంధీజీ మాటలను విస్మరించగలరా? పైగా ఇన్నాళ్ల తరువాత స్వఛ్ భారత్ పథకం ద్వారా గాంధీజీని తలెకత్తుకున్న ఆరెస్సెస్, భాజపా నాయకులు, వారి సారథి మోడీ పల్లెలను ఎలా విస్మరించగలరు? 

అసలు అవసరం స్మార్ట్ విలేజెస్

భారతదేశంలోని పల్లెల సంఖ్య అక్షరాలా 5.9 లక్షలు. అంటే దగ్గర దగ్గర ఆరు లక్షల పల్లెటూర్లు వున్నాయన్నమాట. ఈ పల్లెల్లో నివసిస్తున్న జనాభా సంఖ్య 33.5 మిలియన్ల మంది. అంటే దాదాపు 12వందల మిలియన్ల జనాభా మన దేశానిది అనుకుంటే మూడు వంతులకు పైగా పల్లెల్లో నివసిస్తున్నారు. అధికారిక లెక్కల ప్రకారం 69శాతం జనాభా పల్లెల్లో వుంది. అంటే ఇప్పుడు మన తక్షణ అవసరం స్మార్ట్ సిటీలా.. స్మార్ట్ విలేజ్ లా?

ఇక్కడే ఇంకో చిత్రం కూడా వుంది. కేంద్రం, వివిధ రాష్ర్ట ప్రభుత్వాలు ఖర్చు చేస్తున్నపథకాల నిధుల్లో సింహభాగం పల్లెటూర్లేక వెళ్తోంది. అది ఏ పథకమైనా కావచ్చు. అయితే ఇక్కడే ఇంకో తమాషా కూడా వుంది. పల్లెటూళ్ల కన్నా పల్లెజనాలకు ఎక్కువ ఉపయోగపడే పథకాలే ఎక్కువ. ఇదే అతి పెద్ద కారణం మన పల్లెలు పల్లెలుగానే వుండిపోవడానికి. ఫించన్లు, మరుగుదొడ్లకు నిధులు, డ్వాక్రా రుణాలు, రేషన్ సరుకులు, పంట రుణాలు, ఉచిత విద్యుత్, ఇలా ఎన్ని తీసుకోండి.. వ్యక్తిగత అవసరాలు తీర్చేవే కానీ పల్లెలను అభివృద్ధి చేసేవి కావు. పల్లెల అభివృధ్ధి ఆయా గ్రామాల నిధులు లేదా కమ్యూనిటీ అవసరాలకు ఊరంతా కలిసి చేసుకునే వ్యవహారాలు తప్ప వేరు కాదు. ఇటీవల కాలంలో పంచాయితీల్లో నిధులున్నవి కనీసం వాటి సంఖ్యలో సగం కూడా వుండవు. అందుకే ఇటీవల పంచాయతీలు కొత్త దారి తొక్కాయి. ఇసుక వేలం, బెల్టు దుకాణాల పాటలు చేసి, ఆ విధంగా వచ్చిన సొమ్మును గ్రామాల ప్రగతికి వాడుతున్నాయి. ప్రభుత్వం ఎంత కట్టడి చేసినా, ఇటు ఇసుక మాఫియా కానీ, అటు బెల్టు దుకాణాలు కానీ తగ్గకపోవడానికి ఇదో కారణం. అదే కనుక ప్రభుత్వమే గ్రామాలను అభివృద్ధి చేస్తే, గ్రామీణులు వీటి జోలికి పోరు. అప్పడు ఆ డబ్బు వారికి అవసరం పడదు. 

అంటే కొన్ని సమస్యల పరిష్కారానికి కూడా పల్లెల అభివృద్ధిపై దృష్టి పెట్టాల్సి వుంది. ఎప్పుడో బిసి కాలం నాడు చేసిన నిబంధనలు కూడా పల్లెల ప్రగతికి అడ్డం వస్తున్నాయి. స్కూలుకు స్కూలు కు ఇన్ని కిలోమీటర్ల దూరం వుండాలి. హైస్కూలుకు హైస్కూలుకు ఇంత గ్యాప్ వుండాలి ఇలా. ఆరోగ్యేకంద్రాలు, ఆసుపత్రులు కూడా అంతే. దాంతో కొన్ని పల్లెలు ప్రగతి బాట పడితే మరి కొన్ని పల్లెలు ఏళ్ల తరబడి ఒకే విధంగా వుంటున్నాయి. అభివృద్ధి వికేంద్రీకరణ పల్లెల విషయంలొ కూడా జరగడం లేదు.

ఎన్టీఆర్ హయాంలో పంచాయతీ సమితులు పక్కన పెట్టి, ఒక్కో సమితిని మూడు మండలాలుగా మార్చి, వెయ్యికి పైగా మండలాలు ఏర్పాటు చేసారు. అంటే దాంతో సుమారు ఏడు వందల మేజర్ పంచాయతీలకు ప్రభుత్వ కార్యాలయాలు అందుబాటులోకి వచ్చాయి. వాటికి వివిధ సదుపాయాలు వచ్చాయి. సుమారు లక్ష గ్రామాల్లో ఏడువందల గ్రామాలు అభివృద్ది చెందాయి.  ఒక్క ఉత్తరప్రదేశ్ లోనే లక్ష గ్రామాల వరకు వున్నాయి. వీటిలో 155 మిలియన్ల మంది నివసిస్తున్నారు. వీళ్లందిరకీ పోలీసు స్టేషన్లు పట్టణాల్లోనే వుంటాయి. పెద్దాసుపత్రులు పట్టణాల్లోనే వుంటాయి. కాలేజీలు పట్టణాల్లోనే. ప్రభుత్వ కార్యాలయాలు పట్టణాల్లోనే. 

అందుకే ఇప్పుడు కావాల్సింది స్మార్ట్ సిటీల కన్నా స్మార్ట్ విలేజ్‌లు. ఇప్పటికి నూటికి తోంభై శాతం గ్రామాలకు ఇంటర్ నెట్ సదుపాయంలేదు. మరి ప్రభుత్వ సేవలు ఆన్ లైన్ చేసి ప్రయోజనం ఏమిటి? సరే ఇంటర్‌నెట్ సదుపాయం సంగతి అలా వుంచండి. ఆసుపత్రులు, కాలేజీలు, గ్రంధాలయాలు ఇలాంటి కనీస సదుపాయాలకు నోచుకోని గ్రామాలు దేశం మొత్తం మీద లక్షల సంఖ్యలో వున్నాయి. ఒక స్మార్ట్ సిటీ తయారు కావాలంటే కనీసం వందల కోట్లలో డబ్బు, ఏళ్ల కాలం అవసరం. అదే ఒక స్మార్ట్ విలేజ్ తయారు పదుల కోట్ల డబ్బు, ఏడాది నుంచి రెండేళ్ల కాలం సరిపోతుంది. మంచి నీటి కుళాయిలు, మంచి రోడ్లు, మురుగుకాల్వలు, వీధి దీపాలు, కమ్యూనిటీ ఆసుపత్రి, పాఠశాల, గ్రంధాలయం, దగ్గరల్లోని పట్టణాన్ని కలుపుతూ రహదారి. ఇవే కనీస అవసరాలు. ఇందుకోసం ఒక పల్లెకు మహా అయితే పది నుంచి పదిహేను కోట్లు సరిపోతాయి. అంటే ఒక స్మార్ట్ సిటీని తయారు చేయడానికి వందల కోట్లు కావాలి అనుకుంటే, అయిదేళ్ల కాలంలో దేశం మొత్తం మీద పదుల సంఖ్యలో స్మార్ట్ సీటీలు తయారవు అవుతాయనుకుంటే, అదే సమయంలో అదే నిధులతో దేశంలో వేలాది పల్లెలు స్మార్ట్ విలేజ్‌లుగా మారతాయి. 

ఇక్కడ స్మార్ట్ సిటీలు అంటే విదేశీ అందాలు, సదుపాయాలు. కానీ స్మార్ట్ విలేజ్‌లు అంటే కనీస అవసరాలు.. కనీస సదుపాయాలు.. భారతదేశానికి ఏవి అవసరమో మీరే ఆలోచించండి.

-చాణక్య

[email protected]