పాలక పక్షాలకు సరే, ప్రతిపక్షాలకు ఏం చెయ్యాలో పాలుపోవటం లేదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత, నాలుగు నెలలు తిరగకుండానే ఈ స్థితి వచ్చేసింది.
ఎన్నికలుంటే అందలాలుంటాయి; అందలాలుంటే ఆశలుంటాయి; ఆశలుంటే ఉత్సాహాలు వుంటాయి; ఉత్సాహాలుంటే శ్రేణులుంటారు, కార్యకర్తలుంటారు, నాయకులూ వుంటారు. సరిగ్గా రాష్ర్టవిభజన జరుగుతున్నప్పుడే ఎన్నికలన్నీ కట్టకట్టుకుని ఒకేసారి వచ్చాయి. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలతో పాటు, జిల్లా పరిషత్, మునిసిపల్ ఎన్నికలుకూడా జరిగిపోయాయి.
ఇలాంటి సందర్భాల్లో ప్రతిపక్షాల్లో నేతలు నిలవాలంటే ‘అరిషడ్వర్గాలనూ’ త్యజించిన మునీశ్వరులయి వుండాలి. కానీ మన నేతల్లో నూటికి తొంభయితొమ్మిది మంది అధికారాన్నీ, తద్వారా వచ్చే ఆదాయాన్నీ, రెండు చేతుల్తో జుర్రుకోవాలని వచ్చిన వారే. ఏదో ఒక ఎన్నికలో, ఏదో ఒక పదవి వస్తుందంటే, కొన్నాళ్ళు ఎదురు చూస్తాడు. ఐదేళ్ళవరకూ అలాంటి ముచ్చటే లేదంటే ఏంచేస్తాడు? సొంత పనులో, వ్యాపారాలో చూసుకుంటాడు.
రెండు రాష్ట్రాల్లోనూ ప్రతిపక్షంలో కూర్చుకున్న వారికీ ఇదే పరిస్థితి వున్నా, తెలంగాణలో పరిస్థితి కొంతలో కొంత నయం. కనీసం గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్( జి.హెచ్.ఎం.సి) ఎన్నికలయినా వున్నాయి. కాబట్టి ఇక్కడ ప్రతిపక్షంలో కూర్చున్న కాంగ్రెస్, తెలుగుదేశం, బీజేపీలు తమ కార్యకర్తల్నీ, నేతల్నీ ఊరించటానికి నగరంలో ‘కార్పోరేటరు’ పదవులయినా వున్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షాలకు ఏమున్నాయి? పేరుకు బహువచనం ప్రయోగించాల్సి వస్తోంది కానీ, అక్కడ వున్నది ఒకే ఒక్క ప్రతిపక్షం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ(వైయస్సార్సీపీ). కాంగ్రెస్కయితే, అధికారం మాట తర్వాత..! అసెంబ్లీ తొక్కే ముచ్చటే లేదు.
హైదరాబాద్ తెలంగాణ రాష్ర్టపరిధిలోకే వచ్చేసినా, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు కూడా ఈ నగరమే ఇప్పుడు రాజకీయంగా ‘ఒయాసిస్సు’లాగా కనిపిస్తోంది. మే నెలలో జరిగిన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలలో హైదరాబాద్ పరిధిలో ‘తెలంగాణ సెంటిమెంటు’ కే కాదు, ‘సమైక్యాంధ్ర’ నినాదానికి కూడా వోట్లు రాలాయి. మొదటి దానికి స్థానికులు స్పందిస్తే, రెండవ అంశానికి ‘సెటిలర్లు’ స్పందించారు. కాబట్టే తెలుగుదేశం పార్టీ కూడా ఇక్కడ కొన్ని స్థానాలను సంపాదించుకోగలిగింది. రాష్ర్టవిభజన తర్వాత కూడా ఈ ‘భావోద్వేగాలు’ చల్లారకుండా, తెలంగాణలోని ‘టీఆర్ఎస్’ ప్రభుత్వం జాగ్రత్తపడింది. గత నాలుగు నెలల్లో తీసుకున్న ప్రతీ నిర్ణయంలోనూ, జరుపుకున్న ప్రతీ ఉత్సవంలోనూ ‘తెలంగాణ ముద్ర’ పేరు మీద ఆంధ్ర వ్యతిరేకతను కొన్నాళ్ళు కొనసాగించటానికే ప్రయత్నించింది. ఈ పనిని కావాలనే జి.హెచ్.ఎం.సిని దృష్టిలో పెట్టుకునే చేసి వుండవచ్చు. ఫలితంగా, ఇక్కడ ప్రతిపక్షాలుగా వున్న, కాంగ్రెస్, తెలుగుదేశం, బీజేపీలకు ఇంత వరకూ కాళ్ళూనటానికి కూడా చోటు దొరకలేదు. అయితే విద్యుత్ సమస్య మాత్రం తెలంగాణ రైతును రోడ్డును పడవెయ్యటంతో, ప్రతిపక్షాలన్నీ అక్కడ తేలాయి. ఎన్నికల కదన క్షేత్రం మహానగరంలో(హైదరాబాద్లో) వుండిపోయినప్పటకీ, గ్రామీణ తెలంగాణలో మాత్రమే వీరికి జాగా దొరికింది. దాంతో తెలుగుదేశం ‘బస్సుయాత్ర’, తెలంగాణ కాంగ్రెస్ ‘రైతు భరోసా’ యాత్రలతో దిగారు. కానీ దీని వల్ల రైతులకు జరిగే మేలు ఏమో కానీ, వారు ఆశిస్తున్న రాజకీయ లబ్ధి మాత్రం జరగలేదు.(రైతులు విషయంలో ఈ పార్టీలు పాలనలో వున్నప్పుడు కూడా ఒరిగిందేమీ లేదు.) అలా కలిగి వుంటే తెలుగుదేశం జంటనగరాల నేతలు ‘గులాబీ’ కండువాలను కప్పుకోవటానికి క్యూలు కట్టేవారు కారు.
వైయస్సార్సీపీ కూడా ఇదే బాట పట్టటం ఆశ్చర్యమే. ఎందుకంటే, ఈ పార్టీకున్న ‘సమైక్యాంధ్ర’ ముద్ర వల్లనే ఆంధ్రప్రదేశ్లో, ఒకపక్కన కాంగ్రెస్ తుడుచు పెట్టుకు పోయినా బలమైన ప్రతిపక్షంగా నిలిచింది. ఒక దశలో అయితే ప్రభుత్వం ఏర్పాటు చేయటం ఖాయమనే స్థితికి వచ్చింది. ఇప్పుడు ఈ పార్టీ తెలంగాణలో చేప్పటిన ‘పరామర్శ’ యాత్ర వల్ల ప్రయోజనం ఏమిటో అర్థం కావటం లేదు. ఈ పార్టీ ఎంత ప్రచారం చేసుకున్నా తనకున్న ‘సమైక్యాంధ్ర’ ముద్రను తెలంగాణలో తొలగించుకోలేదు. ఆ మాట కొస్తే, 20కి పైగా సీమాంధ్ర చానెళ్ళూ, అరడజను దినపత్రికలూ తెలంగాణ జిల్లా, మండల, జోనల్ ఎడిషన్లలో ‘సమైక్యాంధ్ర’ గురించి ఊదరగొట్టినా, తెలంగాణ పౌరుల మనసుల నుంచి ‘ప్రత్యేకవాదాన్ని’ తీయలేక పోయారు. అలాంటిది ఇప్పటికిప్పుడు గ్రామీణ తెలంగాణలో వైయస్సార్సీపీ అనుకూల వైఖరి ప్రదర్శించటం వల్ల ఏం ప్రయోజనం వుంటుంది? ఇలా చెయ్యటం వల్ల నగర తెలంగాణకు మారు పేరుగా వున్న హైదరాబాద్లో ఏం లబ్ధిపొందుతుంది? రేపు జిహెచ్ఎంసి ఎన్నికలలో ఈ యాత్ర ఏం ప్రయోజనాన్నిస్తుంది? నలుగురూ నడిచిన దారే సరయిన దారి అనుకోవటం రాజకీయ పరిణతికి చిహ్నం కాదు. తనకంటూ సొంత దారీ, సొంత వ్యూహం వుండాలి. అప్పుడే పార్టీని సంక్షుభిత స్థితిలో కూడా నిలబెట్ట వచ్చు.
సతీష్ చందర్