రాజుల కాలం నుంచి వున్న జాగ్రత్తే ఇది. శత్రువులు విషప్రయోగం చేస్తారేమోనన్న భయంతో రాజులు తినే అన్నాన్ని ఎవరైనా సామాన్యుడి చేత ముందే తినిపించి కాస్సేపు వేచి చూస్తారు. అతనికి ఏమీ జరగలేదని నిర్ధారించుకున్న తర్వాతే రాజు తింటాడు. అధికారంలో ఎవరున్నా ఈ అలవాటు కొనసాగింది. హిట్లర్ వంటి నియంత ఇలాంటి జాగ్రత్త తీసుకోకుండా వుంటాడా? ముఖ్యంగా అతనిపై ఎందరో హత్యాప్రయత్నాలు చేస్తున్నారని తెలిసిన తర్వాత! ఒక దశలో 15 మంది ఆడపిల్లలను ‘ఫుడ్ టేస్టర్స్’ నియమించారు. ఆహారం తిన్నాక ఎవరి ఆరోగ్యం విషమించినా హిట్లర్ అది ముట్టడు. అలా హిట్లర్‌కు 1941-44 మధ్య టేస్టర్‌గా వున్న మార్గాట్ వోల్క్ ఇప్పటికీ జీవించి వుందని పత్రికల్లో కథనాలు వచ్చాయి.
1917లో బెర్లిన్‌లో పుట్టిన మార్గాట్ తండ్రి జర్మనీలో రైల్వే ఉద్యోగి. ఆమెకు వివాహమైంది కానీ పిల్లలు లేరు. 1933లో నాజీలు అధికారంలోకి వచ్చాక ఆమె భర్తను యుద్ధంలోకి పంపారు. 1941లో బెర్లిన్‌పై బాంబులు పడడంతో ప్రష్యాలోని పార్ష్ పట్టణంలో వున్న తల్లి దగ్గరకు వెళ్లింది. అదే పట్టణంలో హిట్లర్ హెడ్‌క్వార్టర్స్ (ఉల్ఫ్‌స్ లయర్ అని దానికి పేరు) వుండేది. హిట్లర్ శాకాహారి. అందువలన అన్నం, నూడుల్స్, బఠాణీలు, కాలిఫ్లవర్ ఇలాంటివే తినేవాడు. దానికి టేస్టర్స్ కావలసి వచ్చారు. ఆ బాధ్యత ఆ వూరి మేయరుకు అప్పచెప్పారు. అతని కన్ను మార్గాట్‌పై పడింది. 15 మందిలో ఒకతెగా ఆమెను ఎంపిక చేశాడు. రోజూ ఒక గార్డ్ వచ్చి ఆమెను, తక్కిన అమ్మాయిలను ఒక ప్రత్యేకమైన బస్సులో ఒక స్కూలు బిల్డింగ్‌కు తీసుకుని వెళ్లేవారు. అక్కడ హిట్లర్ కోసం వండిన తిండిని వీళ్లందరూ తినేవారు. తిన్నాక ఒక గంట దాకా చూసి, వీళ్లేకమీ కాలేదని నిర్ధారించుకున్న తర్వాతనే హిట్లర్‌కు ఆహారాన్ని తీసుకుని వెళ్లేవారు. అంటే వీళ్లకు దినదినగండం అన్నమాట. ముద్ద నోట్లో పెట్టుకోబోతూ ‘ఇది తిన్నాక ఉంటామో, పోతామో’ అనుకోవాల్సిందే. గంట గడిచాక బతికి వుంటే ఆనందంతో ఏడ్చేవారు. యుద్ధం తీవ్రమైన కొద్దీ, హిట్లర్‌కు శత్రువులు పెరుగుతున్నారు వీళ్లకూ తెలుసు. అంటే తమకు ప్రమాదం అన్ని రెట్లు పెరుగుతోందన్నమాట.
హిట్లర్‌కు సెక్యూరిటీ చాలా టైట్‌గా వుండేది. అతని కోసం ప్రాణం వదలడానికి కూడా సిద్ధపడిన వీళ్లు కూడా హిట్లర్‌ను ఎప్పుడూ చూడలేదు. ‘‘అతని అల్సేషియన్ డాగ్‌ను మాత్రం చూశా.’’ అందామె. ఇంత సెక్యూరిటీ ఉన్నా 1944 జులై 20న అతని అనుచరులే అతనిపై కుట్ర చేసి బాంబుతో చంపేయబోయారు. అసలైన టైములో బాంబు వున్న సూట్‌కేసును అనుకోకుండా ఎవరో పక్కకు జరపడంతో హిట్లర్ బతికిపోయాడు. కుట్రలో పాలు పంచుకున్నారనే అనుమానంతో 5000 మందిని చంపేశారు. ఈ హత్యాయత్నం తర్వాత హిట్లర్‌కే కాదు, వీళ్లకీ భయం పెరిగింది. వీళ్లందరినీ భారీ కాపలా వున్న భవంతిలోకి మార్చారు. అక్కడ అదను చూసి ఒక జర్మన్ సెక్యూరిటీ ఆఫీసరు ఈమెను రేప్ చేశాడు. అయినా ఫిర్యాదు చేసే అవకాశమే లేదు. 1944 చివరకు వచ్చేసరికి రష్యావారి రెడ్ ఆర్మీ ఆ వూరిపై దాడి చేసింది. తప్పించుకుని పోవడానికి ఈ ఆడపిల్లలకు ఒక అధికారి సాయపడ్డాడు. నాజీ ప్రాపంగాడా మంత్రిగా చేసిన జోసెఫ్ గోబెల్స్ వాడుతూండే ఒక రైలులో వాళ్లను రహస్యంగా బెర్లిన్ పంపేశాడు. 1945 మే వచ్చేసరికి రెడ్ ఆర్మీ బెర్లిన్‌కు కూడా వచ్చి చేరింది. హిట్లర్ ఆచూకీ కోసం తమను పీడిస్తారనే భయంతో ఈ అమ్మాయిలందరూ ముసలివాళ్లగా వేషం వేసుకుని పారిపోబోయారు. కానీ రష్యన్ సైనికులు వీళ్లను పట్టుకుని క్షుణ్ణంగా పరీక్షించారు. ఒక డాక్టర్‌గారి ఫ్లాట్‌లో అందర్నీ బంధించి 14 రోజుల పాటు అత్యాచారం చేశారు. ఈ నరకయాతన తర్వాత విముక్తి లభించింది.
బయటకు వచ్చాక నార్మన్ అనే ఒక బ్రిటిషు ఆర్మీ అధికారి ఆమెకు సన్నిహితుడయ్యాడు. ఇద్దరూ ప్రేమించుకున్నారు. యుద్ధానంతరం ఇంగ్లండు వెళ్లిపోతూ అతను ఈమెను తనతో వచ్చేయమన్నాడు. ‘‘యుద్ధంలో పాల్గొన్న నా భర్త బతికున్నాడో లేదో నిర్ధారణగా తెలిసేదాకా ఏమీ తేల్చుకోలేను.’’ అందామె. 1946లో ఆమె భర్త కార్ల్ తిరిగి వచ్చాడు. రష్యన్లకు యుద్ధఖైదీగా పట్టుబడి యుద్ధఖైదీల క్యాంప్‌లో ఏళ్లు గడిపి, చివరకు వాళ్లు విడిచిపెడితే వచ్చాడు. బరువు బాగా తగ్గిపోయి కేవలం 45 కిలోలున్నాడు, తలకు కట్టు. చూడగానే గుర్తుపట్టలేకపోయింది. వాళ్లు కలిసి జీవించసాగారు కానీ యుద్ధం చేసిన గాయాలు వారి మనసుల్లోంచి తొలగిపోలేదు. కలిసి కాపురం చేయలేక విడిపోయారు. 1990లో అతను చనిపోయాడు కూడా. ఈమె ఒంటరిగా తన బెర్లిన్ ఫ్లాట్‌లో బతుకుతోంది. వయసు 96.
-ఎమ్బీయస్ ప్రసాద్