ప్రత్యేక హోదా…పార్టీలకు భలే కిక్కు

ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా అన్నది ఇప్పుడు మాంచి మాటల గేమ్ గా మారింది. అసలే సరైన రాజకీయ వార్తలు లేక ఇబ్బంది పడుతున్న మీడియాకు ఇదొక్కటే ఆధారంగా మారింది.  ముందు చంద్రబాబు…

ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా అన్నది ఇప్పుడు మాంచి మాటల గేమ్ గా మారింది. అసలే సరైన రాజకీయ వార్తలు లేక ఇబ్బంది పడుతున్న మీడియాకు ఇదొక్కటే ఆధారంగా మారింది.  ముందు చంద్రబాబు కోణం లోంచి ఈ సమస్యను చూస్తే, మళ్లీ రెండు కళ్ల సిద్ధాంతం అడ్డం పడుతోంది.చంద్రబాబుకు ఆంధ్ర అధికారం చాలదు..తెలంగాణ కూడా కావాలి. మీదు మిక్కలి హైదరాబాద్ ఆయన పాలనలో  వుండాలి. అందుకే ఆయనకు ఈ సిద్ధాంతం అవసరం.  చంద్రబాబు చిరకాలంగా ఈ  సిద్దాంతాన్ని నమ్ముకున్నారు. విభజన ఉద్యమకాలం నుంచీ కూడా ఆయనకు అచ్చి వచ్చిన సిద్ధాంతం ఇది.  ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్  కష్టకాలంలో ఉన్న వేళ కూడా మళ్లీ అదే రెండు కళ్ల సిద్దాంతంతో ముందుకుపోతున్నారు.  

అప్పట్లో రాష్ట్ర విభజన సంధర్భంగా నాకు తెలంగాణ, సీమాంద్ర రెండు కళ్లు అన్నారు. చివరిదాకా అదే మాటపై ఉండి చివర్లో ఏదో ఓవైపుకు తలవంచక తప్పనిసరి పరిస్థితులు తెచ్చుకుని, మళ్లీ అటు ఇటు ఊగిసలాడి, చివరకు తెలంగాణలో టిడిపికి తీరని నష్టాన్ని కొనితెచ్చుకున్నారు. ఇప్పుడిప్పుడే అక్కడ మళ్లీ ఆసలు చిగురస్తున్నాయి. అందుకే మళ్లీ ఈ రెండు కళ్ల సిద్ధాంతాన్నే నమ్ముకున్నారు. సరే, రాష్ట్రం విడిపోయాక ఏపి అభివృద్ధికి ప్రత్యేక హోదాతో పాటు పలు విభజన హామీలను కేంద్రం నుంచి అమలు చేయాల్సి ఉంది. లేదంటే ఏపి దారుణంగా కష్టాలపాలవుతుంది. ఈ విషయాన్ని చంద్రబాబు సైతం ఒప్పుకుంటూనే… వాటి సాధనలో మాత్రం మెతక వైఖరి అవలంబించాలని నిర్ణయించారు.

ఇప్పుడు కూడా ఆయన పరిస్థితి అరకత్తెరలో పోకలాంటిదే. అటు ఏపికి హోదా విషయంలో మొండికేస్తున్న కేంద్రంతో దోస్తానా, ఇటు ఏపిలో తానే అధికారంలో ఉన్నందున ఏపి ప్రయోజనాలు కాపాడుకోవాల్సిన బాధ్యత. మరోపక్క ఈ ప్రత్యేక హోదా తెలంగాణకు లేకపోతే అక్కడి నుంచి వచ్చే విమర్శలు.. ఈ తరుణంలో కట్టె విరవకుండా పాము చావకుండా అన్న తరహాలో ఇటు హోదా కావాలంటూనే అటు కేంద్రాన్ని మాత్రం ఇరకాటంలో పెట్టవద్దంటూ తన పార్లమెంటు సభ్యులకు దిశానిర్దేశం చేసారు. అటు ఏపి మరో కన్ను కాగా, అటు కేంద్రంలోని బిజేపి కూడా తన రెండో కన్నులాంటిదే అన్న రెండు కళ్ల సిద్దాంతాన్ని మళ్లీ పాటిస్తున్నారన్న మాట. 

కాంగ్రెస్ వార్

ఇక కాంగ్రెస్ కోణం లోంచి చూస్తే, సోమవారం నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో ఈ అంశం ప్రస్తావించే అవకాశం వుంది. ఇప్పటికే, ఏపికి ప్రత్యేక హోదా కోసం పార్లమెంటు సమావేశాల్లో కేంద్రంపై యుద్ధాన్ని ప్రకటించాయి కాంగ్రెస్, వైకాపాలు. కేంద్రంలోనూ ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కావడం, కాంగ్రెస్ పెద్దలు అంటే ఏకంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ లాంటి వారే ఏపికి ప్రత్యేక హోదా, ఇతర ప్యాకేజీల అమలు కోసం పట్టుపడుతే, వైకాపా మద్దతు ఇస్తే, తెలుగుదేశం పార్టీ చేతులు ముడుచుకు కూర్చుంటే ఇబ్బందే.  సభలో మౌనంగా ఉండి ఆ పోరాటానికి మద్దతివ్వకుంటే అది ఏపి ప్రజల్లో టిడిపి పట్ట తీవ్ర వ్యతిరేకతను పెంచుతుంది. ఇది ఎంత మాత్రం చంద్రబాబుకు మంచిది కాదు. ఇప్పటికే పట్టిసీమ, పిఆర్సీ, ఉద్యోగులు, ఉద్యోగాలు, సచివాలయం తరలింపు ఇలా ఎన్నో అంశాలపై వ్యతిరేకతలు మూటగట్టుకున్న చంద్రబాబుకు ఇది మరింత నష్టాన్ని తెచ్చిపెట్టడం మాత్రం ఖాయం.

దద్దమ్మలు ఎవరు అవుతారు?

విభజన సంధర్భంగా ఏపి నుంచి ఇంత మంది ఎంపీలు, కేంద్ర మంత్రులు ఉండి ఏంచేసారు, దగ్గరుండి విభజించారు, రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలను గాలికి వదలేసారు. పార్లెమంటులో విభజన జరగొద్దని ఏపిలోని విపక్షాలన్నీ పోరాడితే అధికారంలో ఉండి మీరు ఏమి చేయలేని దద్దమ్మల్లా తయారయ్యారు.. అంటూ చంద్రబాబు గతంలో ఏపి కాంగ్రెస్ ను దుమ్మెత్తి పోసారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ను నామరూపాల్లేకుండా చేసింది కూడా ఈ వాఖ్యలే. అడ్డగోలుగా రాష్ట్రాన్ని కాంగ్రెస్ విభజించిందని, అందుకే దాన్ని తుంగలో తొక్కారని చంద్రబాబు ఇప్పటికీ అంటుంటారు. కానీ కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు, అదృష్టం ఎప్పుడు తిరగబడుతుందో తెలియదు… ఏడాది గడవక ముందే ఏపిలో సీన్ రివర్స్ అయింది. అప్పుడు కాంగ్రెస్ ను అన్న మాటలే, తిట్లే ఇప్పుడు టిడిపి కి తగిలేలా కనిపిస్తున్నాయి. ఇప్పుడు మీరు అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో అధికారంలో వున్నారు. మరి మీరేం  చేస్తున్నారు.. అంటూ విపక్షాల నుంచే కాదు.. సాధారణ ప్రజలనుంచి కూడా ఇవే మాటలు వినిపిస్తున్నాయి. పలు న్యూస్ చానళ్లు నిర్వహించే న్యూస్ వాచ్ వంటి కార్యక్రమాల్లో కొందరు ఫోన్ ద్వారా ఇవే ప్రశ్నలు సంధించడమే దీనికి నిదర్శనం.

అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతలే ఏపికి అన్యాయం చేసారు. ఏపికి అన్యాయం జరుగుతుంటే చూస్తున్న దద్దమ్మల్లా నిలిచిపోయారు. ఇప్పుడ అలాంటి అన్యాయమే జరుగుతోంది. కష్టాల్లో ఉన్నాం అంటున్న చంద్రబాబు.. ఆ కష్టాలను మరింత ఎక్కువ చేస్తున్న కేంద్రాన్ని ఎందుకు నిలదీయడం లేదు. విభజన చట్టం ప్రకారమైనా రావాల్సిన వాటి కోసం ఎందుకు పోరాడడం లేదు. పైగా కేంద్రంలోనూ అధికారంలో భాగస్వాములై ఉండి సాధించుకోకపోవడం అంటే ప్రజల దృష్టిలో ఎలా వుంటుంది? . ఆనాడు కాంగ్రెస్ ఎంపీలు, మంత్రులు దద్దమ్మలయితే నేడు టిడిపి ఎంపీలు, మంత్రులు దద్దమ్మలు అని జనాలు ప్రశ్నించరా? దీనికి సమాధానమీయలేని పరిస్థితి. ఈ విషయంలో టిడిపి ఎంపీల్లో కూడా చంద్రబాబు తీరు పట్ల కొంత వ్యతిరేకత కనిపిస్తోంది. తాజాగా కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు మీడియాతో మాట్లాడుతూ తాము ప్రత్యేక హోదా దక్కించుకోకపోతే మేమున్నా.. లేనట్టే అని తన లోపల ఉన్న ఆవేదనను వెళ్ల గక్కారు. చంద్రబాబేమో.. బాబ్బాబు కేంద్రాన్ని నిలదీయకండి, విపక్షాలు ఏపి కోసం పోరాడితే మద్దతీయకండి.. అనడంతో వారి పరిస్థితి గోతిలో పడ్డ ఎలుకలా తయారైంది. ఈ పరిణామాలు మున్ముందు ఎలాంటి ఫలితాలిస్తాయో చూడాలి.

నాయకుల ద్వయం

నాయుడు అంటే నాయకుడు అని నిర్వచనం చెప్పారు వెంకయ్య నాయుడు. ఆ లెక్కన మనకు ఇద్దరు నికార్సయిన నాయకులు వున్నారు. చంద్రబాబు నాయుడు..వెంకయ్య నాయుడు. కానీ ఈ ఇద్దరు కూడా ఏమీ చేయలేని పరస్థితి కనిపిస్తోంది. ఇది రాష్ట్రంలో టిడిపి, బిజేపిలకు రాజకీయంగా కాస్త ఇబ్బందే.  అంతే కాదు వైకాపా, కాంగ్రెస్ లకు కాస్తయినా కలిసి వచ్చే అవకాశం వుంది. ఎంతో కలిసి వచ్చి అవి మరింత బలం పుంజుకునేందుకు దోహదం చేసే అవకాశం అయితే వుంది. విభజన సంధర్భంగా కూడా ఈ నాయుడు ద్వయమే ఏపి విషయంలో కేంద్ర బిందువులయ్యారు. అయితే అప్పట్లో వారి తీరు ఏపిలో వారి పార్టీలకు మేలు చేస్తే… ఇప్పుడు రివర్స్ అవుతోందన్న మాట. అప్పట్లో విభజన సంధర్భంగా చంద్రబాబు నాయుడు, వెంకయ్యనాయుడుల ఒత్తిడి వల్లనే విభజనలో ఏపికి న్యాయం కోసం బిజేపి పోరాడిందని, ప్రత్యేక హోదా హామీతో పాటు పలు ప్రత్యేక ప్యాకేజీలను సాధించుకోగలిగిందన్న పేరు తెచ్చుకున్నారు. అంతే కాదు అధికారంలో ఉండి కూడా కాంగ్రెస్ మంత్రులు, ఎంపీలు చేయలేని పని ఈ నాయుడులే చేశారన్న క్రెడిట్ కొట్టేసారు.

ఇప్పుడు ఆ నాయుడులే ఇటు రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ ప్రముఖులు. ఏపి సిఎం గా ఉండి కూడా చంద్రబాబు నాయుడు అప్పట్లో తాము సాధించామని చెప్పిన వాటినే అంటే ప్రత్యేక హోదా, ప్యాకేజీలు, ఆర్థిక సహాయాన్ని ఏపికి తెచ్చుకోలేక పోతున్నారు. పైగా వీటి కోసం కేంద్రంపై ఎలాంటి ఒత్తిడి తేవద్దని, కేవలం అవి కావాలని నివేదించాలని మాత్రమే బహిరంగంగా పేర్కొన్నారు. అంతే కాదు మోడీ పాలనను తెగ పొగిడేసారు. అప్పుడు తాను రాజ్యసభలో విభజన బిల్లుకు అడ్డం పడితే కాని ప్రత్యేక హోదాపై అప్పటి ప్రధాని మన్మోహన్ సభలో ప్రకటించారని, మరెన్నో ఏపికి కావాల్సిన ప్రయోజనాలు చట్టంలో పొందుపర్చారని చెప్పారు వెంకయ్యనాయుడు. 

ఇప్పుడేమో అవన్నీ అమలు చేయడం సాధ్యం కాదంటూ బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. అవి మాత్రం కుదరుదు, మరేమైనా చేస్తాం, వాటి కోసం కసరత్తులు చేస్తున్నాం అంటున్నారే తప్ప చేసింది మాత్రం ఏమీ లేదు. అటు ఏపికి చెందిన బిజేపి, టిడిపి నేతల్లోనూ ఈ ఇద్దరు నాయుడుల వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. కారణం ఆయా పార్టీల నాయకులు వారి వారి ప్రాంతాల్లో పర్యటించే సంధర్భంగా ప్రజలు అడిగే వాటిని చేయలేక, ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక ఇబ్బందులు పడుతున్నారు. 

మరో వైపు విపక్షాలు సంధిస్తున్న ప్రశ్నలకు, విమర్శలకు సమాధానాలు చెప్పలేక పోతున్నారు. తాజాగా మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ఈ ఇద్దరు నాయుడులే ఏపిని ముంచుతున్నారని, వారిని ఏపి ప్రజలు క్షమించరని అన్నారు. వెంటనే కళ్లు తెరిచి ఏపికి న్యాయం చేయకపోతే ఏపి ప్రజలు వారి రాజకీయాన్ని రచ్చరచ్చ చేస్తారన్నారు. ఇదే భావం మెల్లమెల్లగా ఏపి ప్రజల్లో నాటుకుపోయే ప్రమాదమూ లేకపోలేదు.. 

మొత్తానికి ప్రత్యేక హోదా వ్యవహారం రంజైన రాజకీయాలకు దారితీసేలా కనిపిస్తోంది.

చాణక్య

[email protected]