శ్వేతపత్రాలు జిందాబాద్

రాష్ట్ర ప్రభుత్వం వ్యవహారాలపై శ్వేతపత్రాలు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిజంగా మంచి ఆలోచన. మన వుంటున్న రాష్ట్రం, మనని పాలిస్తున్న ప్రభుత్వం, మన వ్వవహారాలు మనకు తెలియాల్సిన అవసరం వుంది. కేవలం ఏడాదికి…

రాష్ట్ర ప్రభుత్వం వ్యవహారాలపై శ్వేతపత్రాలు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిజంగా మంచి ఆలోచన. మన వుంటున్న రాష్ట్రం, మనని పాలిస్తున్న ప్రభుత్వం, మన వ్వవహారాలు మనకు తెలియాల్సిన అవసరం వుంది. కేవలం ఏడాదికి ఓ సారి బడ్జెట్ అనే సామాన్యుడికి అర్థంకాని బ్రహ్మ పదార్థం తప్ప,మరో అవకాశం లేదు, మన ప్రభుత్వం పరిస్థితి ఏమిటో తెలుసుకోవడానికి. రాష్ట్ర విభజన నేపథ్యంలో పంపకాలు ప్రారంభమైనపుడు తెలిసి వస్తోంది. ఆర్టీసీకి ఇన్ని అప్పులున్నాయి, ఇన్ని బస్సులున్నాయి. ఫలానా సంస్థకు ఇన్ని భవనాలు వున్నాయి, ఇంతమంది ఉద్యోగులు వున్నారు అని. 

విభజన జరిగిపోయింది.విభజించే ముందు తూతూ మంత్రపు కసరత్తు జరిగిపోయింది. ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో సందట్లో సడేమియా అన్న తంతుగా సైలెంట్ గా విభజన లెక్కలు కానిచ్చేసారు. ప్రభుత్వాలు వచ్చేసరికే, తాంబూలాలిచ్చాం, తన్నుకోండి అని చెప్పేసారు. దీంతో ఉద్యోగులు, పోస్టింగ్ లు, ఆఫీసుల కోసం రగడ. నిజానికి ఈ తంతు అంతా ముందు జరగాలి. అదేం లేకుండా, కనీసం రాజధాని కూడా ప్రకటించకుండా, ముక్కలు చేసింది యుపిఎ ప్రభుత్వం. 

ఇలాంటి నేపధ్యంలో ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాయి. అధికారంలోకి రావడానికి సవాలక్ష హామీలు ఇచ్చాయి. రాజకీయ పోరు జోరులో, ఎన్నికల హడావుడిలో, అధికారం సాధించాలన్న రంథిలో పడి, అసలు అక్కడ ఖజానాలో వున్నదేమిటో, లేనిదేమిటో పట్టించుకోలేదు. ప్రజలకు పంచ భక్ష్య పరమాన్నాలు హామీ ఇచ్చారు. తీరా చేస్తే, అక్కడ పట్టెడు గింజలు లేవు. ఇప్పుడెలా? ముందు చూస్తే నుయ్యి, వెనుక చూస్తే గొయ్యి. 

అందుకే ఇప్పుడు ప్రజలకు విషయం చెప్పాలి. అయ్యా..మీకు మేం బోలెడు చెప్పాం..అవగాహనా లేమి..అక్కడ అధికారం అందితే చాలు..ఖజానా మీకు దోచి పెడదాం అనుకున్నాం..కానీ ఖజానాలో ఖాళీ తప్ప, కాసుల్లేవు. ఇప్పుడేం చేయాలి..ఎలా చేయాలి..ఖజనా ఎలా నింపాలి..అందుకోసం ఎవరిపై భారం వేయాలి. అన్నీ ఈ 'తెల్లకాగితాల్లో' వివరిస్తాం..ఆ పై ఆ విధంగా వంట ప్రారంభించి, వడ్డించేవరకు మీరు కాస్త ఓపిక పట్టాలి అని ప్రజలకు చెప్పాలన్న ప్రణాళికలో భాగమే ఈ శ్వేత పత్ర వ్యవహారం. 

కానీ ఒకటి ఈ శ్వేతపత్ర వ్యవహారం అన్నది మంచి విషయమే. ఇలాంటిది నిరంతరం కొనసాగాలి. ప్రతి ఏటా మంత్రులు, ఎమ్మెల్యేలు తమ తమ ఆస్తుల వివరాలు ప్రకటించినట్లు, ఏటా ప్రభుత్వాలు కేవలం బడ్జెట్ అంకెలు కాకుండా, సక్రమమైన అంకెలు స్పష్టంగా ప్రకటించాలి. వీడైతే లాయర్ లా ఏదోదో చెబుతాడు…అన్నట్లు, బడ్జెట్ అంకెలు అందరికీ అర్థం కాదు. అసలు రాష్ట్ర బడ్జెట్ పై మన మహా  మహులకే సరియైన అవగాహన కరువు. ఇప్పటికీ స్టేట్ బడ్జెట్ వచ్చిన మర్నాడు పత్రికల్లో పన్నుల్లేని బడ్జెట్..పన్నల మోతలేదు. ఇలాంటి హెడ్డింగ్ లు కనిపిస్తుంటాయి. అసలు రాష్ట్ర బడ్జెట్ లో పన్నులే వుండవని తెలియదు. కేంద్ర బడ్జెట్ లోనే పన్నులుంటాయి. అదే విధంగా ప్రణాళికా వ్యయం, ప్రణాళికేతర వ్యయం ఏమిటో..ప్రణాళికేతర వ్యయం పెరుగుతున్న కొద్దీ వచ్చే ముప్పేమిటో తెలియచెప్పే ప్రయత్నం చేయరు. 

అందువల్ల సామాన్యుడికి సైతం అర్థమయ్యేలా..ప్రభుత్వం దగ్గర వున్నది ఇదీ..చేయగలిగింది ఇదీ అని చెప్పేస్తే, ఓ సదుపాయం కలుగుగుతుంది. వచ్చే ఎన్నికల ముందు  పార్టీలు రెచ్చిపోయి, 'ఆకాశం దించాలా..నెలవంక తుంచాలా..సిగలో వుంచాలా..'అని గాలికిపోయే హామీలు ఇచ్చే ప్రయత్నం చేయరు. అలా చేస్తే, జనం..'చాల్లేవోయ్..బోసిడీకే..ఖజానాలో ఎంతుందో మాకెరికే..నువ్వేటిస్తావ్' అని ఓటుతో ఒక్కటిచ్చుకుంటారు. లేకుంటే చూడండి. రెండు బెడ్ రూమ్ ల ఇంటి నిర్మాణానికి ఎంత ఖర్చవుతుందో తెలియదు..కెసిఆర్ మహాశయుడు హామీ పడేసారు. ఇప్పుడు గెలిచి, సీట్లో కూర్చున్నాక, అధికారులను పిలిచి, రెండు బెడ్ రూమ్ ల ఇంటి నిర్మాణానికి ఎంత ఖర్చవుతుందో చూడండి..అని ఆదేశాలిచ్చారు. వాళ్లు 500 అడుగుల్లో, అగ్గిపెట్టెల్లాంటి రెండు గదుల ఇల్లు తయారుచేయాలన్నా, కనీసం అయిదు లక్షలు అవుతుంది అని చెప్పాక, కళ్లు తేలేస్తే, హామీలు నమ్మి ఓట్లేసిన జనం ఏం కావాలి..మళ్లీ మరో పార్టీని నమ్మి మోసపోవడానికి ఓట్ల బూత్ దిశగా నడవాలి. అంతే. 

అందుకే చంద్రబాబు తన హామీల బాధతో, ప్రజల ముందు భోరున విలపించడానికి ఈ శ్వేతపత్ర ఎత్తుగడ ఎత్తితే ఎత్తి వుండొచ్చుగాక..మంచి అయిడియ. ముఖ్యంగా ప్రభుత్వం నుంచి అయిదేళ్ల తరువాత దిగిపోయే ముందు కూడా ఇలా ప్రకటిస్తే, మరోసారి అవకాశ రాజకీయనాయకులు  ప్రకటించే హామీలను నమ్మకుండా వుండేందుకు వీలవుతుంది. లేదంటే, మళ్లీ మరో ప్రభుత్వం, మరోసారి శ్వేతపత్రాలు, కమిటీలు..కాలయాపనలు..ఈ చక్రం ఇలా తిరుగుతూనే వుంటుంది. అందుకే శ్వేతపత్రాలు జిందాబాద్.

చాణక్య

[email protected]