ఇక పార్లమెంటు ఫలితాలపై దృష్టి సారిద్దాం. మోదీ గెలవవచ్చు అనుకున్నా యీ స్థాయిలో గెలుస్తాడని చాలామంది పరిశీలకులు అనుకోలేదు. వారంత సమాచారం లేకపోయినా నేనూ అనుకోలేదు. మోదీ గెలవడం నాకు హర్షదాయకం కాదని ఎప్పుడో చెప్పాను. అయినా అతను గెలుస్తాడని నాకు తోచడానికి కారణం ఏమిటంటే – నేను మోదీని విమర్శిస్తూ వ్యాసాలు రాసినపుడల్లా, 'ఓకే మీరు నిజమే చెప్తూ వుండవచ్చు, కానీ మోదీకి కాకుండా ఎవరికి ఓటేయమంటారు చెప్పండి' అని ప్రశ్న సంధిస్తూ జాబులు రాసేవారు. దానికి నా వద్ద సమాధానం లేదు. 'ప్రత్యామ్నాయం చూపడం నా పని కాదు. మోదీ ఏదో చేసేస్తాడని ఊహించుకుని ఆశాభంగం చెందకండి. కళ్లు తెరుచుకుని ఓటేయండి.' అని జవాబిచ్చేవాణ్ని. అప్పుడే నా కర్థమైంది – మోదీ తప్ప నాయకుడెవరూ లేని పరిస్థితి దాపురించిందని. అతని వలన బిజెపికి సీట్లు పెరుగుతాయని, అయితే ఎన్‌డిఏ కూటమికి నాయకత్వం వహించడానికి అతని యిమేజి అడ్డుపడుతుందని అనుకుంటూ వుండేవాణ్ని. సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థాయిలో బిజెపి సీట్లు తెచ్చుకుంటుందని కొందరు నాతో వాదించినా, వాళ్లు అతిగా కలలు కంటున్నారని అనుకున్నాను. పత్రికలన్నీ కూడా బిజెపి గెలుస్తుందంటూనే మ్యాజిక్ ఫిగర్ చేరలేదని అంచనా వేశారు. ఎన్‌డిఏకు 249 సీట్లు వస్తాయని టైమ్స్ నౌ, 270-282 అని సిఎన్‌ఎన్, 261-283 అని ఇండియా టుడే, 272-283 అని ఆజ్ తక్, 281 అని ఎబిపి అన్నాయి. కానీ యిన్ని సీట్లు బిజెపికే వచ్చాయి (282). ఎన్‌డిఏకు వచ్చినవి 340.
'తూర్పు తిరిగి దణ్ణం పెట్టమన్న మోదీ' అనే వ్యాసంలో నేను రాసినది యిది – 'కామన్‌సెన్స్ ఉపయోగించి చూస్తే మార్చి మూడోవారంలో వీక్-సిఎన్‌ఎన్-ఐబిఎన్ కొంతవరకు వాస్తవంగా తోచింది. దాని ప్రకారం యుపిఏకు 111-123 (కాంగ్రెసుకు 94-106), ఎన్‌డిఏకు 234-246 (బిజెపికి 206-218) వచ్చేట్లు వున్నాయి. (దీనిలో టిడిపికి విడిగా 13-19 చూపారు. దాన్ని ఎన్‌డిఏకు కలపాలి).'' అంటే 265! ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ మోదీ బలం పుంజుకోవడంతో సిఎన్‌ఎన్ 282 దాకా పెంచింది. టైమ్స్ గ్రూపు, ఇండియా టుడే గ్రూపు పూర్తిగా మోదీ ఏజంట్లుగా పనిచేశాయి. విపరీతంగా హైప్ చేశాయి. వాటి అంచనాలను నమ్మలేం అనిపించింది. అయితే వాస్తవఫలితాలు వాటి అంచనాలను కూడా దాటిపోయాయి. ఎందుకిలా జరిగింది? అన్నదే లోతుగా పరిశీలించాలి.
ఎన్నికలలో ప్రభుత్వ వ్యతిరేకత ఓటు కారణంగా ప్రతిపక్షాలు అధికారంలోకి వస్తూ వుంటాయి. ఈ సారి ఆ ఓటుకి తోడుగా మోదీ పట్ల పాజిటివ్ ఓటు కూడా పడింది. నిజం చెప్పాలంటే కాంగ్రెసు యీ విజయాన్ని మోదీకి బంగరు పళ్లెరంలో అందించింది. అలా అని మోదీ కాళ్లు చాచుకుని కూర్చోలేదు. విపరీతంగా కష్టపడ్డాడు. అతని వెనుక అనేక రకాల శక్తులు మోహరించాయి. గత ఏడాదిగా అతన్ని పాజిటివ్‌గా ప్రొజెక్ట్ చేస్తూ వచ్చి మానవాతీతుడు, దైవాంశ సంభూతుడి లెవెలుకి తీసుకెళ్లారు. మోదీ విజయం తమ సొంత విజయంగా కోట్లాది ప్రజలు ఫీలయ్యేట్లా చేశారు. మోదీకి వ్యతిరేకంగా ఎవరైనా చిన్న మాట అన్నా విరుచుకు పడేట్లు చేశారు. ఎప్పుడో 1984లో రాజీవ్ గాంధీకి యిలాటి విజయం సిద్ధించింది. మళ్లీ యిన్నాళ్లకు మోదీకి! రాజీవ్ తన గుడ్‌విల్‌ను ఐదేళ్లలో ఖర్చు పెట్టేసుకున్నాడు. మోదీ ఏం చేస్తాడో వేచి చూడాలి. గత 30 ఏళ్లగా భారతీయ ఓటరు ఒకే పార్టీకి సొంతంగా విజయం కట్టబెట్టడం లేదు. సంకీర్ణ ప్రభుత్వాలు తప్పని పరిస్థితి తెచ్చాడు. ఈ సారి అలాటి అవసరం లేకుండా బిజెపికి సొంతంగా బలం చేకూర్చాడు. ఇది బిజెపి, మోదీలకు గొప్ప విజయం. 'ఈ విజయం తర్వాతైనా నీకు మోదీపై అభిప్రాయం మారాలే' అని కొందరు అడిగారు. మారలేదు. ఇప్పటివరకు మోదీ ఎలా ప్రవర్తించాడో చూసినవాణ్ని కాబట్టి, యీ ఎన్నికలలో కార్పోరేట్ శక్తులు ఎలా పనిచేశాయో గమనించాను కాబట్టి, లిబరలైజేషన్ పేర కార్పోరేట్‌లకు దేశసంపద, ప్రభుత్వ సంస్థలు అప్పగించబడతాయనే భయం నాకుంది. మోదీ విజయం వెనుక ఆర్‌ఎస్‌ఎస్ పాత్ర గణనీయంగా వుంది కాబట్టి, జనతా పార్టీ ప్రభుత్వం నడిచినపుడు వాళ్లు ఎలా ప్రవర్తించారో చూశాను కాబట్టి హిందూత్వ భావాలు మళ్లీ తలెత్తుతాయన్న భయమూ వుంది. దానికి తగ్గట్టే ఊరికి ముందు ఆర్టికల్ 370 గురించి రగడ మొదలైంది.
ఊరంతటిది ఒక దారి, ఉలిపికట్టెది ఒక దారి అనే సామెతలా నేను మెజారిటీ ఆఫ్ ఇండియన్స్ ఆలోచనాధోరణికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నానని, దాని వలన తిట్లు పడాల్సివస్తుందని నాకు తెలుసు. లోకసత్తా జయప్రకాశ్ నారాయణ గారి గురించి తెలుగు జనం వూగిపోయినప్పుడు, అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమం గురించి యావద్భారతం వూగిపోయినపుడు, అరవింద్ కేజ్రీవాల్ గురించి యువత అంతా క్రేజీ అయినపుడు నేను ప్రజాబాహుళ్యంతో గొంతు కలపలేదు. నా అభిమానులు కూడా నన్ను తిట్టిపోశారు. అనుభవం జాగ్రత్తలు నేర్పుతుంది. ఉద్రేకపడనీయదు. మోదీ అద్భుతాలు సాధిస్తాడని నేనేమీ అనుకోవడం లేదు. దేశాన్ని నాశనం చేస్తాడనీ అనటం లేదు. ప్రస్తుతానికి ఫింగర్స్ క్రాస్‌డ్ అంటూనే ప్రజలు పెట్టుకున్న ఆశల లెవెల్లో అతని పాలన వుండదని మాత్రం వూహించి చెప్తున్నాను. అవినీతిరహిత పాలన ఏ లెవెల్లో వుంటుందో ఎడ్యూరప్పను పార్టీలోకి ఆహ్వానించినపుడే తెలిసింది కదా.
ఆంధ్ర ఎన్నికలలో ప్రవహించిన డబ్బు ఎవరిది? సగం వైకాపాది అనుకున్నా మిగతా సగమైనా బిజెపి-టిడిపి కూటమిని సమర్థించిన కార్పోరేట్ శక్తులది కావాలిగా! ఆ కూటమి అధికారంలోకి వచ్చాక వాళ్లు ఆ డబ్బు రాబట్టుకోరా? లాభాల్లో నడుస్తున్న పబ్లిక్ సెక్టార్ యూనిట్ వైజాగ్ పోర్టును తమకు అప్పగించమని అడాని గ్రూపు అడిగితే.., కెజి బేసిన్‌ను యిష్టం వచ్చినట్లు వాడుకునే అధికారం మాకివ్వమని రిలయన్సు అడిగితే.. మోదీ కాదనగలరా? గుజరాత్‌ను ఏలుతున్నది పెట్టుబడిదారీ వ్యవస్థ కాదా? అక్కడ కార్మిక చట్టాలు అమలవుతున్నాయా? పర్యావరణ చట్టాలు పాటించబడుతున్నాయా? ఫైనాన్షియల్ బయాన్సీ పేర దేశంలోని పెట్టుబడిదారులు విచ్చలవిడిగా ప్రవర్తించడానికి అనుమతిస్తారనే నా ఊహ. మోదీ ఎన్నికల ఖర్చు సాదాసీదాగా జరగలేదు. అతనిపై అంత పెట్టుబడి పెట్టినవారు రిటర్న్ ఆశించరా? అవినీతి అంటే సొంతానికి డబ్బు తీసుకోవడం ఒకటే కాదు. జాతి సంపదను దోచిపెట్టడం కూడా. మోదీ పాలన మొదలుపెట్టగానే ఆహాఓహోలు తెగ వినబడుతున్నాయి. 1977లో జనతా పార్టీ అధికారంలోకి వచ్చినపుడు యిలాటివి యింకా విన్నాం. అతి త్వరలోనే లొసుగులు బయటపడ్డాయి. సింప్లిసిటీ అంతా గాలికి ఎగిరిపోయింది. మోదీ కథ ఎలా సాగుతుందో తెలిసేవరకూ మరీ ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దని హితవు చెప్తున్నాను. నిజంగా బాగా పాలిస్తే అంతకంటె ఏం కావాలి?
మోదీ ఓడించినది కాంగ్రెసును, దాని మిత్రపక్షాలను మాత్రమే. కేరళ వంటి రాష్ట్రాలలో అదీ చేయలేకపోయాడు. తమిళనాడులో, ఒడిశాలో, బెంగాల్‌లో తెలంగాణలో, పంజాబ్‌లో – అంటే ప్రాంతీయపార్టీలు బలంగా వున్న కొన్ని చోట్ల మోదీ మంత్రం పని చేయలేదు. యుపి, బిహార్‌లలో పని చేసింది. అక్కడ ప్రాంతీయపార్టీలు కూడా మట్టి కరిచాయి. ఇది ఎవరూ ఊహించని పరిణామం. పరిశీలకుల అంచనాలు తప్పు కావడానికి కారణం యుపి, బిహార్‌లలో అనూహ్య ఫలితాలే. కాంగ్రెసు పరిస్థితిని కక్షుణ్ణంగా పరిశీలిస్తే బిజెపి విజయానికి ప్రధాన కారణం ఏమిటో అర్థమవుతుంది. (సశేషం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (జూన్ 2014)