భగత్ సింగ్‌పై యిప్పటికే దాదాపు 400 పుస్తకాలున్నాయట. సగం హిందీలో కాగా, తక్కినవి యితర భారతీయభాషలు, ఇంగ్లీషు. ఒకటి జర్మన్ భాషలో కూడా వుంది. ఆయన జీవితంపై కూలంకషంగా పరిశోధించిన చమన్‌లాల్ అనే సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత, ఢిల్లీ జెఎన్‌టియులో హిందీ ప్రోఫెసర్ ''అండర్ స్టాండింగ్ భగత్ సింగ్'' అనే పుస్తకం రాశారు. అందరి కంటె ఎక్కువగా భగత్ సింగ్‌ను ఎక్కువగా ప్రొజెక్టు చేసేది రైటిస్టులు. నిజానికి అతను కమ్యూనిస్టు భావాలు కలవాడు. నాస్తికుడు. చిత్రం ఏమిటంటే కమ్యూనిస్టులు భగత్ సింగ్‌ను చాలా ఏళ్లపాటు పట్టించుకోలేదు. తెలిసీ తెలియని వయసులో అతనేదో దుందుడుకుగా ప్రవర్తించి బలి అయిపోయాడనే భావం చాలామందిలో వుంది. అది వాస్తవం కాదని యీ పుస్తకం చెపుతుంది. 1931లో అతను ఉరి తీయబడేనాటికి అతని వయసు 24. కానీ అప్పటికే అతను అనేక విషయాలపై ఎంతో జ్ఞానాన్ని సంపాదించి వున్నాడని చమన్‌లాల్ అంటారు. ''నేను ఎందుకు నాస్తికుణ్ని?'' అని భగత్ పత్రికలకు రాసిన వ్యాసాన్ని కూడా ఆయన సేకరించారు.
భగత్ పినతండ్రి అజిత్ సింగ్ విప్లవకారుడు. అజ్ఞాతంలో వుండేవారు. వాళ్లకు పిల్లలు లేరు. అతని భార్య హర్‌నామ్ కౌర్ భగత్‌ను ఆప్యాయంగా చూసేది. అతను కాన్పూరు వచ్చాక గణేశ్ శంకర్ విద్యార్థి నడిపే ''ప్రతాప్'' అనే వామపక్ష హిందీ దినపత్రికలో పని చేశాడు. అక్కడే అతనికి బి కె దత్, జయదేవ్ కపూర్ వంటి విప్లవకారులు పరిచయమయ్యారు. వారిలో ఒకరైన అజయ్ ఘోష్ తర్వాతి రోజుల్లో కమ్యూనిస్టు పార్టీకి జనరల్ సెక్రటరీగా పనిచేశారు. భగత్ హిందీలో వ్యాసాలు రాసేవాడు. పంజాబ్‌లో భాషాసమస్య గురించి అతను రాసిన వ్యాసం చమన్‌లాల్‌కు లభించింది. ''పంజాబ్‌లో పంజాబీ వుండాల్సిందే. హిందీ భాష పంజాబీ హృదయానికి చాలా దూరం. అయితే పంజాబీ ప్రస్తుతం గురుముఖి లేదా ఉర్దూ లిపులలో రాస్తున్నారు. రెండూ అసమగ్రమైనవే. అందుకని దేవనాగరి లిపిలో పంజాబీని వాడాలి.'' అని ఆ వ్యాసంలో భగత్ ప్రతిపాదించాడు. ఆ సందర్భంగా మాజిని, గారిబాల్డీ, టాల్‌స్టాయ్, కార్ల్ మార్క్స్, రూసో, వాల్టేర్‌లను అతను ఉటంకించాడు. అప్పటికి అతని వయసు 17 మాత్రమే. అంటే అతను ఎంతటి చదువరో అర్థం చేసుకోవచ్చు.
అతనికి స్పష్టమైన రాజకీయ అవగాహన కూడా వుండేది. 'హిందూస్తాన్ సోషలిస్టు రిపబ్లికన్ ఆర్మీ కార్మిక, కర్షక, విద్యార్థిలను ఆకర్షించాలి. వారితో బాటు విప్లవానికి సుముఖంగా వుండే వర్గాలకు చేరువ కావాలి.' అని రాశాడు. తన 'ఇంక్విలాబ్ జిందాబాద్' ఎద్దేవా చేస్తూ ''మోడర్న్ రివ్యూ'' పత్రిక సంపాదకుడు రామానంద్ చటర్జీ సంపాదకీయం రాస్తే ''విప్లవం అంటే రక్తపాతం మాత్రమే కాదు. తుపాకులు, బాంబులు సాధనాలే కానీ అవే లక్ష్యం కాదు. మానసిక పరివర్తనే విప్లవధ్యేయం..'' అంటూ లేఖ రాశాడు. భగత్ సింగ్‌ను గాంధీ ఎన్నడూ ఆదరించలేదు. సుభాష్ చంద్ర బోస్, జవహర్‌లాల్ నెహ్రూతో సత్సంబంధాలుండేవి. లాలా లజపతి రాయ్‌కి హిందూత్వ భావాలు మెండుగా వున్నా భగత్‌కు ఆయనంటే ఆదరం వుండేది. వీరందరి కంటె భగత్ పక్షాన నిలిచినది మహ్మదాలీ జిన్నా! భగత్ సింగ్ మరణించినపుడు పెరియార్ రామస్వామి నాయకర్ తన ''కుడి అరసు'' మార్చి 29, 1931 సంచికలో రాస్తూ గాంధీని తిట్టిపోశాడు. భగత్ సింగ్, అతని సహచరులు మతతత్వాన్ని, కులతత్వాన్ని, ప్రాంతీయతత్వాన్ని పూర్తిగా వ్యతిరేకించారు. అతని పేరుమీద సభలు, సమావేశాలు జరిపేవారు, వ్యాసాలు రాసేవారు యీ విషయాన్ని గుర్తు పెట్టుకుని ఆచరించాలి. అదే అతనికి ఘన నివాళి.
– ఎమ్బీయస్ ప్రసాద్