టార్గెట్ సెంటర్: చంద్రబాబు విజన్ 2019

లక్ష్యం…విజన్..గమ్యం.. ముందుచూపు…,పలుకుబడి ఏదైనా, పదం ఏదైనా కావచ్చు.,,.ఎదగాలనుకున్న వారు ఎవరికైనా అవసరం. అందునా రాజకీయనాయకులకు మరీ అత్యవసరం. అల్లంతదూరంలో ఎన్నికలు వుంటే, ఇప్పటి నుంచే ఎత్తుగడలు వేసుకోవడం తప్పని సరి. మరి సాదా సీదా…

లక్ష్యం…విజన్..గమ్యం.. ముందుచూపు…,పలుకుబడి ఏదైనా, పదం ఏదైనా కావచ్చు.,,.ఎదగాలనుకున్న వారు ఎవరికైనా అవసరం. అందునా రాజకీయనాయకులకు మరీ అత్యవసరం. అల్లంతదూరంలో ఎన్నికలు వుంటే, ఇప్పటి నుంచే ఎత్తుగడలు వేసుకోవడం తప్పని సరి. మరి సాదా సీదా రాజకీయ నాయకులకే ఇలాంటి అవసరం వుంటే, రెండెకరాల ఆసామీగా జీవితం ప్రారంభించి, ఎమ్మెల్యేగా మారి, ముఖ్యమంత్రికి అల్లుడై, ముఖ్యమంత్రై.. ఇలా అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తున్న ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రికి ఎంత ముందుచూపు వుండాలి? 1990ల్లోనే విజన్ 2020 అని బోలెడు దూరం ఆలోచించినవాడు..ఇప్పుడు ఆ విజన్ ను మరో పుష్కరకాలం ముందుకు తోసినవాడు ఆయనే. 

ఆ విజన్ అంతా రాష్ట్ర అభివృద్ధి విషయంలో. ఆయన రాజకీయాల విషయంలోకి వస్తే…దీనికీ ఆయన విజన్ ఆయనకు వుందన్నది రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న వార్తల సారాశం. పదేళ్లు ప్రతిపక్షంలో వుండి, మళ్లీ అధికారం సాధించడమే విజన్ గా పెట్టుకుని, యావత్తు శక్తులను, వర్గాలను, సామ,దాన, బేధోపాయాలతో తనకు అనుకూలంగా మార్చుకుని, లక్ష్యం సాధించారు. అదే విధంగా ఇప్పుడు విజన్ 2019 అంటూ కొత్త లక్ష్యాలు ముందుంచుకుని, ఆ విధంగా ముందుకు వెళ్తున్నారని తెలుస్తోంది. 

ఇందులో ఒక లక్ష్యం అందరికీ తెలిసిందే. చినబాబు లోకేష్ ను నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా చూడడం. ఆ దిశగా ఆయన పావులు కదపడం ఎప్పుడో ప్రారంభించారు. అడ్డం వస్తుందనుకున్న, వచ్చినట్లనిపించిన జూనియర్ ఎన్టీఆర్ ను ఎప్పుడో పక్కకు తప్పించారు. మరో మాటకు, మరో ప్రస్తావనకు, మరో అభ్యంతరానికి ఎలాగూ తావులేదు..ఎందుకంటే ప్రాంతీయ పార్టీ అంటే ప్రొప్రయిటరీ కన్సర్న్ లాంటిది కనుక. ఇదే లోకేష్ ను బాబు పార్టీలోకి ఇంజక్ట్ చేసినట్లు వైఎస్ అప్పట్లో జగన్ ను చేసి వుంటే పరిస్థితి ఘోరంగా వుండేది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వై ఎస్ సొత్తు కాదు కాబట్టి. 

ఇక్కడ తెలుగుదేశం బాబు కి నూటకి నూరుపాళ్లు హెరిటేజ్ లాంటిదే. ఇంకా చెప్పాలంటే హెరిటేజ్ కన్నా ప్రభుత్వం, సెబి , కంపెనీ నియమ నిబంధనలు వుంటాయేమో కానీ, పార్టీకి ఆ బాధలు లేవు. ఓకె అన్నవారికి ఓకె. లేని వారిని పక్కకు తప్పించడం. అందుకే లోకేష్ పార్టీ ప్రవేశం, యువరాజ పట్టాభిషేకం చులాగ్గా జరిగిపోయాయి. 

ఇక మిగిలింది రాజ్య పట్టాభిషేకం. సరే, వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపొందితే చాలు. అదేమంత కష్టమైన పని కాదు. కానీ మరి అప్పుడు బాబు గారి సంగతేమిటి? అరవై దాటినా అలుపు ఎరగకుండా పనిచేయగల సత్తా ఆయన స్వంతం. అలాంటిది కొడుకుకి పాలనా పగ్గాలు అప్పగించి ఆయన మనవడితో ఆడుకుంటూ ఇంట్లో వుండిపోతారా? ఎంత మాట? ఎంతమాట? అందుకోసమే బాబు తన విజన్ 2019ని స్వయంగా రచించుకుని, అమలు చేసేదిశగా వడివడిగా అడుగుల ముందుకు వేసుకుంటూ సాగిపోతున్నారని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. తమ తమ గుసగుసలకు మద్దతుగా అనేకానేక ఉదాహరణలను చెబుతున్నారు. రాజకీయ వర్గాల గుసగుసలు, కథనాలు, వార్తలు సమీకరించుకుంటే బాబు విజన్ కళ్లకు కడుతోంది. అదెలా వుందంటే…

చంద్రబాబు 2019 నాటకి కేంద్రంలో చక్రం తిప్పాలనుకుంటున్నారు. చక్రం తిప్పడం అంటే అక్కడేదో చేయాలన్నది కాదు..సరైన అధికారం అందుకోవడం. అది ఏ స్థాయి అధికారం, అసలు బాబు ఆలోచన ఏమిటి అన్నది వేరుగా వుంది. 2019 నాటికి భాజపా, మోడీ ఇప్పటి స్థాయి బలంగా వుండవు అన్నది తెలుగుదేశం వర్గాల అభిప్రాయంగా వుంది. భాజపా తీరును ఓ సారి చూసిన రాష్ట్రం మరోసారి వెంటనే తలకెత్తుకోవడం అన్నది చాలా తక్కువ. పైగా మోడీ పాలన, ఆయన వ్యక్తిగత ఎజెండా దిశగా సాగుతోంది తప్ప, పార్టీ ప్రతిష్టం లేదా జనాదరణ పెంచే దిశగా నడవడం లేదు. 

2019 ఎన్నికల తరువాత భాజపా లేదా మోడీ ఈపాటి తిరుగులేని అధికారం చలాయించే స్థితిలో వుండకపోవచ్చు. కాంగ్రెస్ కోలుకున్నా కోలుకోకపోయినా, ప్రత్యామ్నాయ ప్రాంతీయ శక్తులు ఎదురొడ్డడం ఖాయం. అలాంటి పరిస్థితే వస్తే చక్రం తిప్పడంలో బాబును మించిన ఘనాపాఠి లేరు. ఆ సంగతి అందరికీ తెలుసు. అయితే ఇక్కడ బాబుకు వున్న సమస్య ఒక్కటే..రాష్ట్రం రెండుగా చీలిపోవడం. అందువల్ల అనుకున్నన్ని ఎంపీ స్థానాలు ఆయన పాకెట్ లోకి రావడం అన్నదే కీలకం. అది ఒక్కటి సాధిస్తే చాలు, కేంద్రంలో చక్రం తిప్పేస్తారు. 

అలా అని ప్రధాని పదవి ఇలా అంటే అలా వచ్చి బాబు వడిలో వాలిపోతుందా అంటే..ఏమో చెప్పలేం…కాలం కలిసి వస్తే గుర్రం ఎగరా వచ్చు. ఇప్పటి వరకు ప్రధానిలు అయిన వారిలో చాలా మందికన్నా బాబు రాజకీయంగా టాలెంట్ వున్నవారే. అయితే ఇన్నాళ్లు ఆయన ఆ దిశగా దృష్టి సారించలేదు. కారణం, రాష్ట్రంలో పార్టీని, ప్రభుత్వాన్ని తాత్కాలికంగానైనా ఎవరినైనా నమ్మి అప్పగించే అవకాశం లేకపోవడమే. ఇప్పుడు కొడుకు అంది వచ్చాడు. బ్రాంచ్ ఆఫీస్ చూసుకోగల సమర్థత వుంటే, బాబు ఢిల్లీలో హెడ్డాఫీసు పెట్టేయచ్చు. 

ఈ విజన్ సాధించడానికి ముందు, బాబు తన స్థానం, తన ఇమేజ్ పెంచుకునే పనిలో పడ్డారు. ఢిల్లీలో పరిచయాలు, లాబీయింగ్, ఇతరత్రా వ్యవహారాలు చూసుకునే దిశగా ఆయన ఆత్మ (వైఎస్ కు కేవిపి మాదిరిగా) సుజన చౌదరి తలమునకలై వున్నారు. మరో పక్క బాబు ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్న చందంగా నవ్య రాజధాని, పారిశ్రామిక ప్రగతి అనే లక్ష్యాల కోసం విదేశాలు తిరుగుతూనే, వివిధ దేశాల పెద్దలతో తన పరిచయాలు పెంచుకుంటున్నారు. విదేశాల్లో ఆయన ప్రసంగాలు రాను రాను మారుతున్నాయి. 

జపాన్, సింగపూర్ వెళ్లినప్పటికి, చైనా వెళ్లినపట్టి ప్రసంగాలను గమనిస్తే అర్థమవుతుంది. చైనాలో ఆయన మాటలన్నీ ఓ జాతీయ నాయకుడు,లేదా ప్రధాని మాదిరిగా సాగుతున్నాయి. ఏకంగా చైనా పెద్దలను మా దేశం రండి అంటూ ఆహ్వనించేస్తున్నారు. తాము కేంద్రంలో ప్రాధాన్యత గల పాత్ర పోషిస్తున్నామని అక్కడి జనాలను నమ్మబలుకుతున్నారు. సింగపూర్ కు ఏకంగా పరామర్శకు భారత్ తరపును వెళ్లాలనుకున్నారు. చివరి నిమిషంలో బెడిసి కొట్టింది. అమెరికా, చైనా, జపాన్, సింగపూర్ ప్రభుత్వాలకు ఇప్పుడు భారత ప్రధాని, విదేశాంగ మంత్రితో పాటు చంద్రబాబు కూడా సుపరిచితుడైపోతున్నారు. ఆయా ప్రభుత్వాలకు ఇష్టమైన పారిశ్రామిక సంస్థలకు తాను ఇక్కడ అవకాశాలు ఇవ్వడం ద్వారా, వారితో స్నేహం బలోపేతం చేసుకుంటున్నారు. ఇవన్నీ భవిష్యత్ లో అవసరమైతే తురుపు ముక్కల్లా పనికి వస్తాయి. 

కేంద్రంలో చక్రం తిప్పడం అంటే చిన్న విషయం కాదు. నిధుల భారీగా అవసరం పడతాయి. సుజనా చౌదరి ఆ విషయంలో తిరుగులేని నాయకుడు. పదేళ్లు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో వుండగా, రెండో చేతికి తెలియకుండా, ఆయనే ఖర్చు చేసుకుంటూ వచ్చారు. లక్ష కోట్ల రాజధాని పనులు, వేల కోట్ల ప్రాజెక్టులు అన్నీ ఇప్పుడు కళ్ల ముందు వున్నాయి. అవినీతి చేయాల్సిన పని లేదు. కమిషన్లు కొట్టక్కరలేదు. కావాల్సిన వాళ్లకు అసైన్ చేయగలిగితే చాలు. ఆ పనులు పూర్తయ్యే వరకు ఈ ప్రభుత్వమే వుండాలనుకుంటారు. దీనికే అండగా నిలబడతారు. అందువల్ల నిధులు అనేది పెద్ద సమస్య కానేకాదు.

ప్రధాని పదవే అందాలని చంద్రబాబు అనుకోనక్కరలేదు. వచ్చే ఎన్నికల నాటికి చంద్రబాబు డెబ్భై ఏళ్లకు ఒకటో, రెండో తక్కువగా వుంటారు. అంటే రాష్ట్రపతి పదవికి కూడా సరైన వయస్సే. ఇన్నాళ్లు ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం, దేశ అభివృద్ధిపై ఆయనకు వున్న విజన్, ఇవన్నీ ఆ పదవికి సరిపోయే అర్హతలే. ఒక్క టెర్మ్ రాష్ట్రపతిగా చేస్తే చాలు భారత చరిత్రలో చంద్రబాబు పేరు నిలిచిపోతుంది. ఇటు ఆంద్ర రాష్ట్రంలో ఎలాగూ అమరావతి నగర నిర్మాతగా పాఠ్య పుస్తకాలకు ఎక్కేస్తారు. పైగా కేంద్రంలో చక్రం తిప్పడానికి కిందా మీదా పడడం కన్నా, వారికి ఆసరాగా వుండి రాష్ట్రపతి పదవి అందుకోవడం అత్యంత సులువు.

అయితే అనకాపల్లి, లేకుంటే ముదినేపల్లి అని మొత్తం మీద కేంద్రంలో 2019 నాటికి ఓ కీలక పదవి పట్టుకోవడం అన్నది చంద్రబాబు ఆలోచనగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అందుకే ఆయన చిన్న చిన్న విషయాల వైపు దృష్టి సారించడం మానేసారు. కేవలం బృహత్ ప్రాజెక్టులు, ఆయన పేరును జాతీయ స్థాయిలోకి తీసుకెళ్లే వాటిపైనే కీలకంగా దృష్టి సారిస్తున్నారు. ఇక్కడ ఆయనను బాధించే సమస్యలు కూడా అంతగా లేవు. జగన్ అనే ఒక్కడు తప్ప. కానీ అదే జగన్ వున్న సమస్య ఆయనపై కేసులు. అవి ఎలా వుంటాయో, ఏ మలుపు తిరుగుతాయో ఎవరికీ తెలియదు. 

అందువల్ల అవి జగన్ కు వ్యతిరేకంగా, బాబుకు కలిసి వచ్చేలా పయనించి, గమ్యం చేరుకునే వరకు చంద్రబాబు కేంద్రంతో పూర్తి సఖ్యతతోనే వుంటారు. రాష్ట్రంలో ఓట్లు రాబట్టుకునే దిగులుతో ఆయన జగన్ కు వెరవడం లేదు. ఓట్లు ఎలా రాబట్టుకోవాలో, ఎలా వేయించుకోవాలో, చంద్రబాబుకు తెలుసు. అందుకు కావాల్సిన ఫౌండేషన్ పార్టీ పరంగా, నాయకత్వ పరంగా ఆయన పటిష్టపరిచేసారు. జనాలకు కాస్త మేలు చేసి, సంక్షేమ పథకాలు అమలు చేయగలిగితే చాలు. కానీ అసలు పోటీ అనేది వీలయినంత తగ్గించడం కోసమే జగన్ ను నొక్కాలని చూస్తున్నది. అందువల్ల బాబు పని సులువు అవుతుంది. 

మరోపక్క తెలంగాణలో ఎలాగూ వచ్చే ఎన్నికలకు తొలి ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంక్ అన్నది కొంత వరకు ఏర్పడుతుంది. అయితే అది క్యాష్ చేసుకోవడానికి తెలుగుదేశం లేదుగా అని అనొచ్చు. మొన్నటి ఎన్నికలకు కొద్ది నెలల ముందు తెలుగుదేశం పరిస్థితి అదే. వట్టిపోయినట్లు కనిపించింది. కానీ అంతలోనే నిండు గోదారిలా మారిపోయింది. ఎన్నికలు ముంచుకువచ్చి, ప్రభుత్వ వ్యతిరేక ఓటు కనిపిస్తే, నాయకుల క్యూ కడతారు. 

అన్నీ బాగానే వున్నాయి. కానీ రాజకీయ వర్గాల గుసగుస మామూలు జనాలకే అందితే, మోడీకి అందకుండా వుంటుందా..ఆయన కూడా మేనేజ్మెంట్ గురూనే కదా అన్న అనుమానం తలెత్తవచ్చు. ఎన్నికల వేళవరకు,, ఎవరి పని వారిది..ఎవరి హద్దులు వారివి. కానీ అప్పుడు చూసుకుంటే భాజపా ఏమైనా బలోపేతం అయిపోతుందా ఆంధ్రలో? వెంకయ్య, కామినేని, వగైరాలు బాబును కాదని ఓటు బ్యాంకును పెంచే పనేమైనా చేస్తున్నారా ఇప్పుడు? గతంలోనూ భాజపా వుంటే తెలుగుదేశం పంచన వుండడం లేదంటే, ఆ పాటి అధికారం లేకుండా డిక్కీలో వుండిపోవడం. అందువల్ల ఆ భయమేమీ లేదు.

ఇన్ని విధాల అనుకూలమైన స్థితి కనిపిస్తున్నందునే బాబు ధైర్యంగా తన చినబాబును జనం ముందుకు వదిలారు. ఆయన కూడా నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తా అంటున్నారు. ఎవరైనా గుర్తు చేస్తున్నారా? తెలుగుదేశం పార్టీ నేతలు గతంలో విరుచుకుపడ్డ వారసత్వ రాజకీయాల విమర్శలను? అబ్బే..ఎంతమాట. అదే మరి..బాబు చాకచక్యం అంటే. అదే అండా దండా..బాబుగారి విజన్ 2019కి. అది విజయం సాధించినా ఆశ్చర్యం ఏమీ లేదు.

చాణక్య

[email protected]