'ఓకే బంగారం' సినిమా విడుదలకు ముందే.. ఆ సినిమా ఆడియో సూపర్ హిట్ అయ్యింది. సోనీ మ్యూజిక్ ద్వారా విడుదల అయిన రెహమాన్ ఆల్బమ్ కు మంచి ఆదరణ దక్కింది. ఈ సినిమా తెలుగు వెర్షన్ పాటలనే యూట్యూబ్ లోనే కొన్ని లక్షల మంది వెదుక్కొని విన్నారు. ఈ మధ్యకాలంలో రెహమాన్ కొన్ని సినిమాలకు స్వరాలు అందించినా ఆయా పాటలు అంతగా హిట్ కాలేదు.
'లింగా' 'ఐ' తదితరాలనమాట. ఆయా ఆడియోలు పర్వాలేదనిమాత్రమే అనిపించుకొన్నాయి. అయితే 'ఓకే బంగారం' మాత్రం రెహమాన్ ఒకనాటి ప్రభను గుర్తు చేసింది. విశేషం ఏమిటంటే.. ఈ సినిమా కోసం రెహమాన్ కంపోజ్ చేసిన పాటను సినిమాలో వాడుకోలేదు!
సూపర్ హిట్ అయిన ఆ పాటను సినిమాలో హీరోహీరోయిన్లపై చిత్రీకరించలేదు. దాన్ని కేవలం టైటిల్ సాంగ్ గా ఉపయోగించారు! కథపరంగా సందర్భం కుదరకపోవడంతోనే.. ఆ పాటను చిత్రీకరించనట్టుగా తెలుస్తోంది. 'రారా..అతగాడా, వేచి ఉన్నా రారా..'' అనే సాంగ్ ను సినిమా టైటిల్స్ పడే టప్పుడే బీజీఎంలో వాడేశారు.
ఆ తర్వాత సినిమాలో ఎక్కడా ఆ పాట వినపడదు. ఆ పాటలోని సాహిత్యం పరంగా చూస్తే.. సినిమాలో అదెక్కడా సెట్ కాదు. దీంతో దాన్ని వాడుకోలేదని తెలుస్తోంది. మరి మణిరత్నం పర్ఫెక్షన్ అంటే ఇలానే ఉంటుందేమో! ఈ సినిమాకు సంబంధించి ఇంకో విశేషం ఏమిటంటే.. రెహమాన్ చాన్నాళ్ల తర్వాత వెంటాడే బీజీఎం ను సమకూర్చాడు. సినిమా చూసొచ్చిన తర్వాత కూడా బీజీఎం ట్యూన్స్ మనసును హంట్ చేస్తూ ఉంటాయి!