పుట్టపర్తి మరో షిరిడీ కాదా..?!

సత్యసాయి బాబా మహాభినిష్ర్కమణం తర్వాత పుట్టపర్తి విషయంలో రెండు రకాల అభిప్రాయాలు వినిపించాయి. అంత వరకూ ప్రపంచంలోనే ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా వెలుగొందిన పుట్టపర్తి ప్రభ తగ్గిపోతుందని కొందరు అభిప్రాయపడగా.. మరికొందరు అలా కాదు,…

సత్యసాయి బాబా మహాభినిష్ర్కమణం తర్వాత పుట్టపర్తి విషయంలో రెండు రకాల అభిప్రాయాలు వినిపించాయి. అంత వరకూ ప్రపంచంలోనే ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా వెలుగొందిన పుట్టపర్తి ప్రభ తగ్గిపోతుందని కొందరు అభిప్రాయపడగా.. మరికొందరు అలా కాదు, పుట్టపర్తి మరో షిరిడీ కాగలదన్న అభిప్రాయాలను వ్యక్తం చేశారు. షిరిడీలో ఉన్నది సాయిబాబా సమాధే.. పుట్టపర్తిలో మిగిలేదీ సత్యసాయిబాబా సమాధే. కాబట్టి సత్యసాయి అనంతరం  పుట్టపర్తి ప్రభ తగ్గదనే అభిప్రాయాలు ఆలోచింపజేశాయి. షిరిడీ ప్రభ గురించి వేరే వివరించనక్కర్లేదు. ప్రపంచంలోనే అత్యంత ఆదాయం కలిగిన ట్రస్టుల్లో షిరిడీ ట్రస్టు ఒకటిగా ఉంది. అనునిత్యం కొన్ని వేలమంది షిరిడీ బాబా దర్శనానికి వెళుతున్నారు. 

ఇలాంటి దైవస్థానాన్ని ఆధారంగా చేసుకొని అనేక వర్గాలు బ్రహ్మాండంగా బతికేస్తున్నాయి. మరి సాయి తదనంతరం పుట్టపర్తికి కూడా అలాంటి కళ వస్తుందని స్థానికులు అనుకొన్నారు, విశ్లేషకులు కూడా అంచనా వేశారు. అయితే పుట్టపర్తి షిరిడీ కాలేకపోతోంది!  సాయి అనంతరం పుట్టపర్తి ప్రభ చాలా వరకూ తగ్గిపోయింది. సెలబ్రిటీల తాకిడి లేదు. క్రికెటర్ల కళ లేదు. సాయి ఉన్నంత వరకూ చుట్టూ తిరిగిన రాజకీయ నేతలు కూడా ఇప్పుడు అటువైపు వెళ్లడం మానేశారు!  అనునిత్యం కొన్ని వేల మంది భక్తులతో రద్దీగా కనిపించిన పుట్టపర్తిలో వీధులు ఇప్పుడు ఖాళీ గా కనిపిస్తున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే పుట్టపర్తి పరిసర ప్రాంతాలకు.. మొత్తంగా అనంతపురం జిల్లాకే ఇప్పుడు సత్యసాయి లోటు కనిపిస్తోంది.

మహాసమాధి దర్శనానికి అప్పుడప్పుడు కొందరు ప్రముఖులు వస్తున్నారు.. సాంస్కృతిక కార్యక్రమాలకు లోటు లేదు, వైద్య సేవాలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. అయితే ఎక్కడో తేడా వచ్చింది. దీంతో పుట్టపర్తి రద్దీ తగ్గిపోయింది. గతంలో అనంతపురం వంటి ప్రాంతాల నుంచి పుట్టపర్తికి ప్రతి పదిహేను నిమిషాలకూ ఒక బస్సులు ఉండేవి. అయితే ఇప్పుడు అన్ని బస్సుల కోసం వెయిట్ చేసినట్టే పుట్టపర్తి బస్సు కోసం కూడా ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. విదేశీ భక్తుల తాడికి చాలా వరకూ తగ్గింది. ఉత్తరాది నుంచి అనునిత్యం వేలమందిగా వచ్చేవారిలో ఇప్పుడు పదోశాతం మంది కూడా రావడం లేదు. దీంతో ఇలాంటి భక్తులపై ఆధారపడ్డ వ్యాపార రంగాలు దెబ్బతిన్నాయి. 

అనునిత్యం రద్దీగా కనిపించిన పుట్టపర్తిలోని లాడ్జిలు ఇప్పుడు ఖాళీ అయ్యాయి. దీంతో చాలా మంది వాటి నిర్వహణనే మానేశారు. పుట్టపర్తి తాలూకా ప్రజల చర్చల్లో సాయికి ముందు సాయికి తర్వాత అనే  మాటలు తరచూ దొర్లుతున్నాయి. ఇది వారిలో నిండిన నిరాశవాదానికి నిదర్శనం.   ఇక్కడే స్థిరపడే వాళ్లు కూడా తగ్గిపోవడంతో పుట్టపర్తి పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ బాగా డౌన్ అయ్యింది. ఒకప్పుడు కోట్ల రూపాయల స్థాయి వరకూ వెళ్లిన భూములు ఇప్పుడు లక్షల స్థాయికి వచ్చేశాయి. ఇలా పుట్టపర్తి డీలా పడిపోయింది.

అయితే సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సక్రమంగా పనిచేస్తోంది. వేలమందికి వైద్యసేవలు అందిస్తోంది. ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా పుట్టపర్తి అందం తగ్గలేదు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఎటువంటి లోటూ జరగడం లేదు. సత్యసాయి వర్సిటీ చక్కగా పనిచేస్తోంది. కాబట్టి ట్రస్టును నిందించడానికి ఏమీ లేకుండా పోతోంది. ఎటొచ్చీ భక్తుల తాకిడి తగ్గడం పుట్టపర్తిపై ఆధారపడ్డ వ్యాపార రంగాలు దెబ్బతినడంతో ప్రభ తగ్గిపోయింది. అయితే ఇదే అంతిమం కాదు. భవిష్యత్తులో ఏమైనా జరగొచ్చు. ఈ అధ్యాత్మిక కేంద్రంలో అద్భుతాలు జరగొచ్చు! పుట్టపర్తి  మరో షిరిడీ స్థాయికి ఎదగొచ్చు. అందుకు తగ్గ పరిస్థితులు ఏర్పడాలంతే!