దటీజ్ ప‘వన్’

పవన్.. పవనం… వనం.. వన్ .పవర్.. పయనం.. ఎన్ని దాగి వున్నాయో ఒక్క పదంలో.. పవన్ కూడా అచ్చంగా అలాంటి వాడే.. ఒకటా రెండా ఎన్ని షేడ్‌లు.. పవన్.. నిజంగా పవనమే.. అలా అని…

పవన్.. పవనం… వనం.. వన్ .పవర్.. పయనం.. ఎన్ని దాగి వున్నాయో ఒక్క పదంలో.. పవన్ కూడా అచ్చంగా అలాంటి వాడే.. ఒకటా రెండా ఎన్ని షేడ్‌లు.. పవన్.. నిజంగా పవనమే.. అలా అని పిల్ల తెమ్మెర కాదు.. జంఝామారుతమే. కుర్రాళ్లు ఊగిపోతారు. అమ్మాయిలు ఆశగా చూస్తారు.. అంతకన్నా వయసైన వాళ్లు కూడా పడిపోతారు. వనం.. అడవి.. లోపల ఏముందో అందులోకి వెళ్లేదాకా తెలియదు.. మనం అనుకోవడమే.. అవుంటాయి.. ఇవుంటాయి అనీ.. పవన్ కూడా అంతే.. పైపైన చూసి అంచనా వేయడమే.. లోతు తెలియదు.. పవర్.. పయనం.. ఆయన పవర్ ఆయనేక తెలియదు.. ఆవేశంతో ఊగిపోవడం తెలుసు.. ఆలోచించడం తెలుసు.. ఆచరణ మాత్రం అయోమయం.. అందువల్లే ఆయన పయనం ఎటో ఎవరికీ అంతు పట్టడదు.. ఆ చిక్కుముడి ఆయన విప్పాల్సిందే.. అది ఎప్పుడో ఆయనకైనా తెలుసోలేదో మరి

18 ఏళ్ల కెరీర్.. 19 సినిమాలు. సగటున ఏడాదికి ఒక్క సినిమా. నిజానికి ఈ లెవెల్ క్రేజ్ సంతరించుకున్నవారు ఏడాదికి రెండయినా చేయాలనుకుంటారు.. కానీ పవన్ తన కెరీర్ లో కొన్ని సంవత్సారాల్లో అస్సలు సినిమాలే చేయలేదు.. చేసిన వాటిలో సగానికి పైగా సినిమా పెద్ద గొప్ప సినిమాలు కావు.. అద్భుతమైన విజయాలు సాధించలేదు. నిత్యం జనం మధ్య కనిపించిందీ లేదు.. సభలు సమావేశాలకు తరచు హాజరయ్యేదీ లేదు. తన గురించి తానో, తనకు తెలిసినవారో చెప్పిందీ లేదు.. చూసిందీ లేదు.. కానీ నిరంతరం వార్తల్లో వుంటారు. జనంలోకి వస్తే, అక్కడ నేల ఉన్నట్లుండి ఈనేస్తుంది. ప్రతి ఒక్కరు పవన్ గురించి పక్కనుండి చూసినట్లే మాట్లాడేస్తారు… తమ మాటలతో ఆయనను అల్లంత ఎత్తున వుంచే ప్రయత్నం చేస్తారు. తాను చెప్పాలనుకున్నదే.. తాను వెళ్లాలనుకున్నబాటలోనే.. తాను వుండాలనుకున్నతీరులోనే…  చెప్తారు.. వెళ్తారు.. వుంటారు.. ఎవరేమనుకుంటేంనేం… నా పయనం నాది.. నా గమ్యం నాది.. నా వైఖరి నాది.. అనుకుంటారు. ఈ లక్షణాలేనా.. ఈ విలక్షణతేనా…. నేటికీ ఆయనే ప‘వన్’గా వుంచుతున్నది?

గుప్పిట ఎంత మూస్తే, ఆసక్తి అంత పెరుగుతుంటారు.. పవన్ జీవితం మూసిన గుప్పిట. అందుకే జనాలకు అంత ఆసక్తి. కొందరి జీవితాలు భలేగా వుంటాయి. వాళ్లు జనానికి ఎంత దూరంగా వుందామనుకుంటే అంత దగ్గరైపోతుంటారు. మరి కొందరి జీవితాలు ఇంకా చిత్రంగావుంటాయి. వద్దనుకున్న కొద్దీ వివాదాల్లో కూరుకుపోతుంటాయి. పవన్ ది మొదటి రకం జీవితం. ఆయన ఎంత లో ప్రొఫైల్ లో వుండాలనుకుంటారో, అభిమానులు ఆయన్ను అంతకు అంతా ఎత్తున నిల్చోపెడతుంటారు.

మౌనమే ఆయుధం

పవన్ ఆయుధం ఆయన మౌనమే అనిపిస్తుంది. దేనికీ స్పందించరు.. అసలు ప్రపంచం తన గురించి తన వ్యవహారాల గురించి ఎమనుకుంటోందో పట్టించుకున్నట్లే కనిపించరు. ఎందుకంటే మనిషిగా వుంటూ భావోద్వేగాలకు అతీతంగా వుండడం చాలా కష్టం. యోగిగా మారే ప్రయత్నం చేస్తే తప్ప. ఎందుకంటే స్వామీజీలు సైతం రాగద్వేషాలకు, భావోద్వేగాలకు లోనై, నిత్యం ప్రకటనలు చేస్తున్న కాలం ఇది. అలాంటిది పవన్ ఒకసారి కాకుంటే ఒకసారైనా స్పందించడం అన్నది అస్సలు కానరాని విషయం. ఆయన సినిమాలపై ఎన్ని గాసిప్‌లు, ఆయన వ్యక్తిగత జీవితంపై ఎన్ని వార్తలు, ఆయన రాజకీయ ప్రవేశంపై ఎన్ని వదంతులు, అన్నదమ్ముల బంధాలపై ఎన్ని అనుమానాలు,  ఒకటమేటి ఆయన సవాలక్ష.. కానీ దేనినీ ఆయన అవుననరు.. కాదనరు.. నిజమో చెప్పరు.. కాదో చెప్పరు. అసలు ఎవరికైనా ఇంటర్వూ ఇస్తే కదా? తెలియడానికి.

ఆయనకు కాస్త దగ్గరగా వెళ్లినవాళ్లు ఎవరైనా వున్నారంటే వాళ్లు సినిమా రంగానికి చెందినవారే ఎక్కువ. వారంతా చెప్పేది వింటుంటే చాలా చిత్రంగా వుంటుంది. నిజమా.. అనిపిస్తుంది. వారు చెప్పేదాని ప్రకారం పవన్ ఏమిటన్నది తెలుసుకునేముందు అసలు ఆయన గురించి ఆయనేం చెబుతారన్నది ఇప్పటివరకు ఆయన ఇచ్చిన కొద్ది పాటి ఇంటర్వ్యూల సారాంశం నుంచి చూస్తే…

పవన్ కోణం నుంచి

తనకు పట్టేవి రెండే ఒకటి మొక్కల పెంపకం.. రెండు సమాజంలో జరిగే అన్యాయాలు. అన్యాయాలను చూస్తూ సహించలేని మనస్తత్వం. పూర్తి శాకాహారి.. మద్యం.. మాంసం.. గుడ్డకు కూడా దూరం. నాగురించి నేనెందుకు మాట్లడడం అన్నది పవన్ ప్రశ్న. ఎవరెవరో, ఏదోదో మాట్లాకుంటారు.. రాసుకుంటారు.. అలాగే కానివ్వనీండి… పుస్తకాలు విపరీతంగా చదువుతారు.. అవి కూడా భిన్నమైన విషయాలు. అటు మొక్కలపెంపకం నుంచి అడవుల పెంపకం వరకు, ఇటు ధ్యానం.. యోగం.. ఆధ్యాత్మిక వగైరా.. పైగా మరోపక్క శరత్ సాహిత్యం.. ఇంకోపక్క ఆంగ్ల సాహిత్య.. ఇవి చాలక యోగా, ధ్యానం, కుండలినీ యోగం అన్నీ ప్రయత్నించేయడం. పూర్తిగా ఒంటి పూట భోజనం.. ఒకపక్క గద్దర్ అంటే ఇష్టం. మరో పక్క స్వాతంత్య్ర సమర యోధుడు జయప్రకాష్ నారాయణ అన్నా ఇష్టమే. జనం తరపున పోరాడిన మహా మహులంతా మహా ఇష్టమే. జనానికి జరుగుతున్న అన్యాయం చూసి సహించలేక జనసేన పార్టీ.

అభిమాన జనం కోణంలో

ముందుగానే చెప్పుకున్నట్లు పవన్‌ను కాస్త దగ్గరగా చూసినవాళ్లలో ఎక్కవ మంది సినిమా జనాలే,. వారంతా పవన్‌ను దేవుడంటారు. పోనీ సినిమా జనాలకు అలా అనడం అలవాటే అనుకుంటే, వాళ్లు చెప్పే విషయాలు చిత్రంగా వుంటాయి. పవన్ విపరీతంగా చదువుతారు. ప్రపంచ సినిమాలపై ఆయనకు విపరీతమైన ప్రవేశం వుంది. అలాగే ప్రపంచ సాహిత్యంపై కూడా. అదే సమయంలో జానపద గీతాలు అంటే ఇష్టం. మితభాషి. మాట ఇస్తే దాటరు. తన మనసులో ఏముందో చెప్పరు.. కానీ ఏం చేయాలో అది మాత్రమే చెబుతారు. నలుగురిలోకి, సాదా సీదా ఫంక్షన్లకు రావడం ఆయనకు అంతగా ఇష్టం వుండదు. సహజంగా సిగ్గరి. ఎదుటివాళ్ల కళ్లలోకి కన్నా, కిందకు, పక్కకు చూసే మాట్లడతారు. సినిమా జనాలతో మాత్రం తన స్వంత విషయాలు పొరపాటున కూడా మాట్లడరు. దగ్గరైతే సినిమాలు, పుస్తకాల గురించి మాత్రమే ఎక్కువగా మాట్లడతారు. నమ్మినవారు, ఆయన దగ్గరకు తీసిన వారు ఒకరిద్దరుకన్నా ఎక్కవ మంది లేరు.

జనం కోణంలో

పవన్ ను ఏదో విధంగా బతిమాలి బామాలి, ఎవరి ద్వారానో ఒత్తిడి చేసి రాజకీయాల్లోకి దింపారు. కేవలం జగన్‌ను ఓడించడం కోసం వందల కోట్లు ఇచ్చి మరీ పవన్ రంగంలోకి దింపారు. అబ్బే.. అదంతా వట్టిమాట.. ఆయన అలాంటి వ్యక్తి కాదు. అయిదేళ్ల తరువాత ఆయనను మోడీ, భాజపా తరపున సిఎమ్ పదవికి పోటీకి దింపుతారు. ఇప్పుడు ఆయన పార్టీ నిర్మాణంపై కసరత్తు చేస్తున్నారు. అన్ని జిల్లాల్లో రాజకీయాల్లో వున్నవారి గురించి, వారి మంచి చెడ్డలు ఆరా తీస్తున్నారు. హోంవర్క్ చేస్తున్నారు. అప్పటిదాకా మౌనంగానే వుంటారు. చిరంజీవితో సరిపడక, ఆ ఫ్యామిలీకి దూరంగా వుంటున్నారు. అలా అని చెప్పి వారిపై మాటల తూటాలు విసరడం అన్నది ఆయనకు సరిపడని నైజం. ప్రజలకు ఉపయోగపడే, వారిని చైతన్యం చేసే కార్యక్రమాలకు మాత్రమే హాజరవుతారు.

ఏదేమైనా..

పవన్ మాత్రం ఆల్వేజ్ నెంబర్ వన్.. సినిమాల పరంగా చెబుతున్నమాట కాదు. అన్ని వైపుల నుంచి అంచనావేసుకుని చెబుతున్న మాట. ఓ పక్క వందలకోట్లు తీసుకువచ్చారన్న నిందలు. మరోపక్క ప్రజల కోసం అన్న మాటలు. ఇంకోపక్క పవన్‌కు అనారోగ్యం. ఇంకా ఇంకా అనేకం.

అయినా కూడా పవన్ రాని సభలో కూడా పవన్ గురించి  మాటలు వినిపిస్తాయ్. పవన్ లేని చోట్ల కూడా పవన్ అభిమానుల నినాదాలు మిన్నుముడతాయ్.. పవన్ ఎప్పుడొస్తాడా అని బోలెడు కళ్ల ఎదురుచూస్తున్నాయ్.. అదే సమయంలో అతను రాడు కాక రాడు.. అయిదేళ్లు అధికారపక్షానికి అండగా వుండి, ఆ తరువాత ఏ విధమైన కారణాలతో ఆ పార్టీకి ఎదురుగా రంగంలోకి దిగుతాడు అనే ప్రశ్నలు..

ఇన్నింటి నడుమ పవన్ అలా వార్తల్లో వుంటూనే వుంటున్నాడు.. దటీజ్ ప‘వన్’..

చాణక్య

[email protected]