తెలంగాణ ఏర్పడిన కొత్తలో విపరీతమైన డిస్కషన్లు..సినిమా రంగం ఇక్కడ వుంటుందా…తరలిపోతుందా? అని కానీ ఇప్పుడు స్పష్టమైపోయింది. టాలీవుడ్ అంగుళం కూడా ఇక్కడ నుంచి కదలదని. దీనికి ఒక కారణం కాదు చాలా వున్నాయి. టాలీవుడ్ లో సీమాంధ్రుల పెట్టుబడి ఎక్కువగా వున్నమాట వాస్తవం. కానీ అది చాలా వరకు ఇన్ఫాస్ట్రక్చర్ రూపంలో స్థిరాస్థులుగా వుంది. దాన్ని తరలించడం కష్టం. కావాలంటే ఇది వుండగా విశాఖలోనో, మరో చోటొ కొత్త పెట్టుబడులు పెట్టాలి.
అలా పెట్టినందువల్ల వచ్చే అదనపు ఆర్జన ఏమీ పెద్దగా వుండదు. సినిమా పరిశ్రమ ఒకదగ్గర నుంచి మరో దగ్గరికి తరలించాలంటే ఏళ్లకాలం పడుతుంది. అనేకానేక సమస్యలున్నాయి. పైగా హైదరాబాద్ నుంచి విశాఖ, తిరుపతి, విజయవాడ,రాజమండ్రి ఎక్కడికైనా అయితే ఓ రాత్రిప్రయాణం..కాదంటే, ఓ గంట ప్రయాణం. ఈ మాత్రం దానికి ఎందుకు తరలించాలి?
తెలంగాణ ప్రభుత్వంతో సమస్యలు వస్తాయేమో, కక్ష సాధింపు వ్యవహారాలు వుంటాయేమో అని కాస్త ముందుగా భయపడిన మాట వాస్తవం. కానీ కేసిఆర్ వైఖరి ఇప్పుడు స్పష్టమైంది. ఆయన ఇండస్ట్రీ ఫ్రెండ్లీగా వుండాలనుకుంటున్నారు. అందుకే ఆ విధంగా ముందుకు వెళ్తున్నారు. రామోజీని కలవడంతో టాలీవుడ్ జనం సగం ఊపిరి పీల్చుకున్నారు.
టాలీవుడ్ పై పట్టున్న సామాజికవర్గానికి చెందిన తుమ్మల నాగేశ్వరరావు టీఆర్ఎస్ మంత్రిగా చేరినప్పడు మరికొంతన ధీమా వచ్చింది. ఎప్పటి నుంచో ఇండస్ట్రీ వర్గాలతో సన్నిహిత సంబంధాలు కలిగిన తలసాని శ్రీనివాస యాదవ్ టీఆర్ఎస్ ప్రభుత్వంలో సినిమాటోగ్రఫీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో టాలీవుడ్ కుదటపడింది.
హుద్ హుద్ కార్యక్రమాల సమయంలో కేసిఆర్ అండ్ కో ఊసెత్తని సురేష్ బాబు అండ్ కో, వెంటనే తలసానిని కలిసి అభినందనలు తెలిపారు. టాలీవుడ్ లో తెలంగాణ వర్గం అంతకు ముందు తలసానిని కలిసినపుడు కూడా, ఆయన చాలా స్పష్టంగా మాట్లాడారు. టాలీవుడ్ వ్యవహారాలు తనకు తెలుసని, అందరూ తనకు పరిచయమే, అన్నారు తప్ప, చాంబర్, తెలంగాణ నిర్మాతలు ఇలా ఏమీ మాట్లాడలేదు.
ఇప్పటికే హీరో కృష్ణ, ఇంకా మోహన్ బాబు కుటుంబ సభ్యులు తెరాస నాయకులతో మంచి సంబంధాలు కలిగి వున్నారు. హైదరాబాద్ లో తీసే సినిమాలకు రాయతీలు కూడా ఇస్తామన్నట్లుగా కేసిఆర్ తనయ, ఎంపీ కవిత అన్నారు. ఇప్పుడు తలసాని కూడా వచ్చారు కాబట్టి ఇక టాలీవుడ్ తరలి పోవడం అన్న సమస్య రాదు. పైగా వెళ్లాలని టాలీవుడ్ జనాలకు కూడా లేదు. మురళీమోహన్ ఎప్పటి నుంచో చెబుతున్నారు. టాలీవుడ్ తరలి పోదని.
విశాఖలో స్థలం లేదు
టాలీవుడ్ సెటిల్ కావాలన్నా విశాఖలో ఎక్కడా స్థలాలు లేవు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా వున్నపుడు, ఆ తరువాత వైఎస్ వచ్చినపుడు విశాఖలో చాలా స్థలాల వివిధ సంస్థలకు పంపిణీ జరిగిపోయింది. అప్పట్లోనే రామానాయుడు స్టూడియోకి స్థలం దొరికింది. విశాఖ-భీమిలి రోడ్ లో స్థలాలు లేవు. విశాఖకు ఏ వైపున చూసినా కనీసం యాభై కిలోమీటర్లు వెళితే తప్ప స్థలం లేదు. అంత దూరం వెళ్లడానికి కనీసం గంటన్నర నుంచి రెండు గంటలు పడుతుంది. అదే విశాఖ నుంచి హైదరాబాద్ ఫ్లయిట్ లో గంటలోపే వెళ్లచ్చు.
గంటా ప్రయత్నాలు
టాలీవుడ్ ను కొంతయినా విశాఖకు తీసుకెళ్లాలని మంత్రి గంటా శ్రీనివాసరావు ఆసక్తితో వున్నారు. స్థలం కొరత వుందని ఆయనకూ తెలుసు. అందుకే ఆయన ఓ కొత్త ఎత్తుగడ వేసినట్లు తెలుస్తోంది. విశాఖకు-మధురవాడకు మధ్య సుమారు మూడు వందల ఎకరాలకు పైగా జంతు ప్రదర్శన శాల వుంది. గతంలో ఊరికి అయిదు కిలోమీటర్ల దూరం అని అక్కడ ఏర్పాటు చేసారు. ఇప్పుడు అది ఊరికి దగ్గరైంది. అందుకే జూ పార్క్ ను దూరంగా మంచి స్థలం చూసి తరలించి, ఇక్కడ సినిమాకు వాడుకుంటే ఎలా వుంటుందన్నది ఆయన అయిడియా అని గుసగుసలు వినిపిస్తునాయి.
అదే విధంగా అవసరమైతే అటవీ భూములను కన్వెర్ట్ చేస్తామని కేంద్రం విభజన సమయంలో మాట ఇచ్చింది. జూ పార్క్ ఎదురుగా కంబాల కొండ భూములు వున్నాయి. వాటిని ఏమైనా చేయచ్చా అన్న ఆలోచన కూడా తెలుగుదేశం నేతలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా ఓ అయిదారు వందల ఎకరాలు దొరికితే, స్థలాల కొసమైనా టాలీవుడ్ పెద్దలు అక్కడ బ్రాంచ్ ఆఫీసులు పెట్టడానికి రెడీ కావచ్చు.
నిర్మాణాలు ఇక్కడ..ఫంక్షన్లు అక్కడ
టాలీవుడ్ తరలి వెళ్లినా వెళ్లకున్నా, ఫంక్షన్ లు మాత్రం ఆంధ్రలో చేయక తప్పడం లేదు. ప్రస్తుతానికి ఇక్కడా అక్కడా చేస్తున్నారు ఏదో ఒక వంక పెట్టి. తెలంగాణ నిర్మాత, హీరో అయినా నితిన్ కూడా ఇటీవల తన సినిమా ఫంక్షన్ తిరుపతిలో చేసారు. అందువల్ల ఈ ఆనవాయితీ మాత్రం ఇలా కొనసాగుతుంది.