పరిశ్రమలు తెస్తాం, మీ పిల్లలకు ఉద్యోగాలు యిస్తాం అంటూ కబుర్లు చెప్పి పాలకులు ప్రజలను నిర్వాసితులను చేస్తున్నారని గ్రహించిన కేంద్రం చాలా ఏళ్లు తాత్సారం చేసి చివరకు 2013లో లాండ్ ఎక్విజిషన్ చట్టం తెచ్చి ముకుతాళ్లు వేసింది. నయవంచనతో, మాయమాటలతో భూములు తీసుకున్నవాళ్లు బాధితుల పునారావాసం గురించి పట్టించుకోవటం లేదని గ్రహించి ఆ దిశగా షరతులు విధించింది. తను చేస్తున్నది సవ్యమైనదే అనే నమ్మకం బాబుకు వుంటే ఆ చట్టం క్రిందనే భూమిని సేకరించాల్సింది. కానీ ఆయన ఆ జోలికి పోలేదు. విదేశీ, స్వదేశీ పెట్టుబడిదారుల కొమ్ము కాయడంలో యుపిఏ ప్రభుత్వాన్ని తలదన్నుతున్న మోదీ ప్రభుత్వం యీ మధ్యే దాన్ని నీరు కారుస్తూ పార్లమెంటులో ఎటువంటి చర్చ జరపకుండా, అఖిలపక్షాన్ని సంప్రదించకుండా ఆర్డినెన్సు తెచ్చింది. అది వస్తోందని బిజెపి భాగస్వామి ఐన టిడిపికి ముందే తెలిసి వుంటుంది. కనీసం దాని ప్రకారం వెళ్లినా భూసొంతదారులకు ఎంతో కొంత మేలు కలిగేదేమో! ఆ పాటి ప్రయోజనం కూడా మిగల్చకుండా బాబు రాజధాని విషయంలో మాత్రం లాండ్ పూలింగ్ అంటూ మొదలుపెట్టారు.
ఇది నిజంగా మెరుగైన పథకమైతే గతంలో సెజ్‌లకు భూములిచ్చి నష్టపోయిన వారికి యిదే పద్ధతిలో నష్టపరిహారం కల్పించాలి. ప్రజలంతా సమానమే, కానీ రాజధాని పరిధిలో వున్నవారు మాత్రం ఎక్కువ సమానం అంటే మనం చేసేదేమీ లేదు. ఒక వేళ యీ పథకం మోసపూరితమైనదిగా తేలితే అప్పుడు వాళ్లు తక్కువ సమానం వాళ్లుగా తేలతారు. చట్టంలో ప్రభుత్వానికి వున్న అధికారాలు స్పష్టం చేస్తున్నారు, హామీలు ప్రకటిస్తున్నారు, అవి అమలు కాకపోతే భూములిచ్చినవారు ప్రభుత్వంపై ఏం చర్యలు తీసుకోగలరో వుందా? బాబు తన ఉపన్యాసంలో దాని మాట ఎత్తలేదు. కెసియార్ పథకాలు ప్రకటించినపుడు – ఇది అమలు చేయకపోతే వచ్చే ఎన్నికలలో నేను ఓట్లు అడగను అని వాగ్దానం చేస్తారు. బాబుకి అలాటి శంకలే లేవు. అమలు చేయకపోవడమనే ప్రశ్నే ఉదయించదు అన్నట్లు మాట్లాడతారు. అందుచేత రైతులకున్న రికోర్స్ క్లాజ్ పెట్టి వుండరు. ఒప్పందం రెండు పార్టీల మధ్య జరిగినపుడు ఫలానా టైములోపుల అనుకున్నది జరగకపోతే యిచ్చినది ఒప్పందం రద్దు అవుతుంది అన్న షరతు పెడతారు. పరిశ్రమలకై తక్కువ ధరకు ప్రభుత్వం భూమి కేటాయించినపుడు యీ టైములో చేయకపోతే వెనక్కి తీసుకోగలం అనే షరతు పెడుతుంది. ఇప్పుడు భూములిస్తున్న రైతులకు అలాటి షరతు విధించే అధికారం వుందా లేదా?
ఇప్పుడు తెస్తున్న బిల్లులో నష్టపరిహారం విషయం సరిగ్గా లేదు. పంటభూములు తీసుకుంటున్నారు, వ్యవసాయం తప్ప వేరే ఏదీ రాని రైతులు భూములిచ్చేస్తే ఏం చేయగలుగుతారు? అని ప్రశ్నలు అడిగితే మొదట్లో టిడిపి మంత్రులు 'మేం యిచ్చిన భారీ నష్టపరిహారంతో వేరే చోట యింతకు మూడింతలు పొలం కొనుక్కుని వ్యవసాయం చేసుకుంటారు. తద్వారా అక్కడ కూడా వ్యవసాయం పెరుగుతుంది.' అనేవారు. ఇప్పుడు నష్టపరిహారం ఒక్కసారిగా యివ్వం అంటున్నారు. లాండ్ ఎక్విజిషన్ చట్టం అమలు చేసి వుంటే వాళ్లకు యిలాటి సౌకర్యాలు కలిగేవి. అవి లేకుండా చేశారు. నెలకు యింత అని యిస్తూంటే అది కందిపప్పులా ఖర్చయిపోతుంది. వీళ్లకు వేరే చోట భూములమ్మేవాళ్లు యిన్‌స్టాల్‌మెంట్ స్కీముకి ఒప్పుకుంటారా? ఈ ఏడాది డబ్బిచ్చి, వచ్చే ఏడాది ఋణమాఫీలోలా బాండ్లు యిస్తామని చెప్తే.. అనే సందేహం వస్తుంది. ఇక్కడ ప్రభుత్వం డెవలప్ చేసి యివ్వడానికి మూడేళ్లంటోంది. చులాగ్గా ఐదేళ్లు అనుకోవచ్చు. కమ్మర్షియల్ స్థలం చేతిలో వున్నా అక్కడ కమ్మర్షియల్ యాక్టివిటీ ప్రారంభమైతే తప్ప దానిపై అద్దెలు రావు. దానికింకో మూడేళ్లో, నాలుగేళ్లో అనుకుంటే ఏడెనిమిదేళ్లపాటు యీ రైతులంతా ఏం చేస్తారు? కాళ్లు బారచాపి కూర్చుంటారా? 120 రకాల పంటలు పండించగల మొనగాళ్ల శక్తిని, యుక్తిని అలా వృథా చేయడం భావ్యమా? ఖాళీగా కూర్చుంటే దుర్వ్యసనాల పాలవుతారు. వచ్చిన డబ్బు ఎప్పటి కప్పుడు వ్యయం చేసేస్తే చివరకు ఏదీ సాలిడ్‌గా మిగలదు. ఈ పరిహారాన్ని డబ్బు రూపేణా యివ్వటం కంటె వ్యవసాయంలో దిట్టలైన వీళ్లకు వెనకబడిన జిల్లాల్లో భూమి రూపంలో యిస్తే వీళ్లకూ మంచిది, ఆ ప్రాంతాలకూ మంచిది కదా.
పంట భూములను నాశనం చేస్తున్నారే అంటే అక్కడ పంటలు వేయరు కాబట్టి నీరు మిగిలిపోతుంది, దాన్ని రాయలసీమకు తరలించవచ్చు అని విడ్డూరంగా మాట్లాడారు బాబు. రాయలసీమకు నీరివ్వాలంటే యిక్కడ పంటలు మానేయాలా!? రాజధానిలో ప్రభుత్వం యిచ్చే కమ్మర్షియల్ స్పేస్, ప్రయివేటు పార్టీలు తమంతట తాము డెవలప్ చేసే కమ్మర్షియల్ స్పేస్ మొత్తమంతా కలిసి డిమాండ్ కన్నా సప్లయి ఎక్కువై పోయి స్లంప్ వచ్చేస్తుందన్న అనుమానమూ వుంది. కోఠి, ఆబిడ్స్‌లలో ఒకప్పుడు దుకాణానికి స్థలం దొరికేది కాదు. ఎందుకంటే హైదరాబాదులో మంచి షాపింగ్ సెంటర్లన్నీ అక్కడే వుండేవి. పోనుపోను హైదరాబాదు నలువైపులా విస్తరించింది. ఎక్కడ పడితే అక్కడ విశాలమైన ప్రాంగణాల్లో షాపింగ్ సెంటర్లు వచ్చేశాయి. సినిమా హాళ్లు, హోటళ్లు కూడా వచ్చేశాయి. ఆబిడ్స్, కోఠీలో యిప్పుడు బోల్డంత చోటు. ఆంధ్రలో తక్కిన జిల్లాలలో కూడా ప్రభుత్వం పెట్టుబడులు పెడతానంటోంది. వాళ్లు చేయకపోయినా స్థానికులు ఉత్సాహంగా ఎక్కడికక్కడ పెట్టుబడులు పెట్టుకుని డెవలప్ చేసుకుంటే వ్యాపారం అన్ని చోట్లా సర్దుకుంటుంది. అన్నిటికీ రాజధానికి రావలసిన పని వుండదు. అప్పుడు యింత కమ్మర్షియల్ స్పేస్ వృథా అవుతుంది. భూములిచ్చి ఆ స్పేస్ తీసుకున్న రైతులకు గిట్టుబాటు కాదు. ఇవన్నీ భయాందోళనలే కావచ్చు. కానీ యిలా జరగదని ఎవరైనా ఖచ్చితంగా చెప్పగలరా?
విధివిధానాలు తర్వాతి అధ్యాయంలో అంటున్నారు బాబు. అవేమీ తేలకుండానే సింగపూరుతో ఒప్పందాలకు ఏం కంగారు వచ్చింది? అసలు సింగపూరు లింకే గందరగోళంగా వుంది. మన రాజధాని కమిటీలో వాళ్లు సభ్యులుగా వుండడమేమిటి? మనం కస్టమర్లం. రైల్వే శాఖ వారి కమిటీలలో ప్రయాణికుల తరఫున ఒక ప్రతినిథిని పెడతారు. అలాగ మనం వారి కమిటీలో సభ్యులుగా వుండి, మాకు ఇలా కావాలి, అలా కావాలి అని చెప్పాలి కానీ వాళ్లు మన కమిటీలోకి వచ్చేసి వాళ్ల కనుకూలంగా తక్కిన సభ్యులను ప్రభావితం చేసే పొజిషన్‌లో వుండడమేమిటి? ఇలా అయితే కాంట్రాక్టర్లకు కూడా ప్రభుత్వాఫీసుల్లో ఓ సీటు వేసి 'మీకు బిల్లు ఎంత పే చేయాలో నిర్ణయిద్దాం రా' అనవచ్చు. అసలు సింగపూరు ప్రభుత్వానికి యిలాటి వెంచర్లలో వున్న సత్తా ఏమిటి? అన్న కుతూహలం నన్ను వదలటం లేదు. ఇంటర్నెట్ శోధిస్తే కొన్ని విషయాలు తెలిశాయి. (సశేషం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (డిసెంబరు 2014)