Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ : సెజ్‌ల నుంచి నేర్చుకున్నదేమిటి? - 2

ఎమ్బీయస్‌ : సెజ్‌ల నుంచి నేర్చుకున్నదేమిటి? - 2

హైదరాబాదు 23 జిల్లాలకు రాజధాని. అయినా దానికి యిప్పటి వైభోగం పట్టడానికి 5 దశాబ్ధాలు పట్టింది. తెలంగాణ ఉద్యమం చెలరేగిన తర్వాత ప్రభ క్షీణించసాగింది కూడా. మరి యిప్పుడు 13 జిల్లాలకు రాజధాని అయిన ఆంధ్ర రాజధానికి 2006 నాటి హైదరాబాదు వైభవం పట్టమంటే ఎలా పడుతుంది? 'ఏం ఎందుకు పట్టకూడదు? 10 జిల్లాల తెలంగాణకే హైదరాబాదు వుండగా లేనిది, దాని కంటె 3 జిల్లాలు ఎక్కువున్న మాకు రాజధాని అంత  కంటె గొప్పగా ఎందుకు చేసుకోకూడదు? కొంతమంది తమ యిళ్లల్లో పెళ్లికే కోటి రూపాయలు ఖర్చు పెట్టగాలేనిది ఆంధ్రులకు నాలుగు లక్షల కోట్లతో రాజధాని వుండకూడదా?' అని కొందరు సీనియర్‌ జర్నలిస్టులే వాదిస్తున్నారు. హైదరాబాదు యీ రోజు 10 జిల్లాల రాజధాని కావచ్చు, కానీ ఒకప్పుడు ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలలో విస్తరించిన  నిజాం రాజ్యానికి రాజధాని అని గుర్తుంచుకోవాలి. కోటి రూపాయల ఖర్చుతో పెళ్లి చేసేవాళ్లున్న యీ నేలలోనే మంగళసూత్రానికి ప్రభుత్వధనంపై ఆధారపడే జంటలు కూడా వున్నాయని గుర్తుంచుకోవాలి. వ్యక్తిగతంగా డబ్బుంటే ఎంతైనా సోకు చేసుకోవచ్చు. ఇక్కడ యీ ముఖ్యమంత్రులు, మంత్రులు యింట్లోంచి డబ్బు పట్టుకుని వచ్చి రాజధాని కట్టరు. పన్ను రూపంగా వచ్చిన ఆదాయంతోనే కడతారు. 

వస్తున్నది చాలకనే ఋణమాఫీ లాటి అనేక విషయాల్లో బోల్తా పడుతున్నారు. అయినా సంక్షేమపథకాలు పెంచుకుంటూ పోతున్నారు. వచ్చే 20 ఏళ్లల్లో యింకెన్ని వస్తాయో, వాటికి ఎంత కావాలో తెలియదు. నిధులు లేవు, ప్రజలు అర్థం చేసుకోవాలి అని హితవు చెప్తున్నారు. ఓ పక్క యిది చెపుతూనే మరో పక్క ఇంద్రప్రస్థం కడతామంటే ఎలా పొసుగుతుంది? అయినా 'సిరిగలవానికి జెల్లు తరుణులు పదియారువేలమందిని తగ పెండ్లియాడ.. తిరిపెమున కిద్దరాండ్రా?' అన్నట్టు లోటు బజెట్‌ వాళ్లు, కేంద్రం ఆదుకోకపోతే బతిక బట్టకట్టలేమని నిత్యం వాపోయేవాళ్లు, తగినన్ని పరిశ్రమలు లేవు కాబట్టి యువతకు ఉద్యోగాలు చూపించలేని వాళ్లు తమకు తగ్గట్టే ప్లాన్‌ చేసుకోవాలి. తిరుపతి ఎన్నికల ప్రచారసభలో మోదీగారు నిధులిస్తామని హామీ యిచ్చారు కదా అని బాబు చెప్తున్నారు. ఎన్నికల్లో లక్ష అంటారు. ఝార్‌ఖండ్‌ ఎన్నికల్లో మోదీ దాన్ని దేశంలో నెంబర్‌ వన్‌ చేస్తామన్నారు. ఇప్పుడు వాళ్లు అధికారం కట్టబెట్టారు. అక్కడా యివ్వాలి కదా. హుదూద్‌ హామీ ఏమైందో చూస్తున్నాంగా. వినాశనం అయింది అదుకోమంటేనే యిలా వుంటే, మేం రంగురంగుల భవంతులు కట్టుకుంటాం డబ్బివ్వండి అంటే యిస్తారా? 

ప్రత్యేక హోదా గురించి గుర్తు చేస్తే విభజన చట్టంలో సవరణలంటారు వెంకయ్యగారు. రెండిటికీ సంబంధం ఏముంది? మేం అధికారంలోకి వస్తే పదేళ్లపాటు హోదా కల్పిస్తాం అన్నారు బిజెపి వారు ఆనాడు. చట్టంలో మార్పులు చేద్దామనుకుంటే అది వేరే సంగతి. అయినా సవరణలకు తెలంగాణ ఒప్పుకుంటుందా? వాళ్లకు ఆంధ్రపై, కేంద్రంపై నమ్మకం లేదు. తేనెతుట్ట కదిపినట్లే అనుకుంటారు. అసలీ లోపభూయిష్టమైన బిల్లుకు లోకసభలో, రాజ్యసభలో ఎందుకు మద్దతిచ్చారు స్వామీ అంటే అప్పటి పరిస్థితుల్లో యివ్వవలసి వచ్చింది అంటున్నారు వెంకయ్య. అయ్యవారేం చేస్తున్నారంటే చేసిన తప్పులు దిద్దుకుంటున్నారు అన్నారట. అంత అడావుడిగా తప్పులు చేయడమెందుకు? దారం చిక్కుపడేట్లు చేసి, యిప్పుడు దాన్ని కత్తిరించి మళ్లీ అతుకుతామంటే కుదురుతుందా? కాంగ్రెసు, బిజెపి రెండూ కలిసి తెలుగువాళ్ల జీవితాలతో ఆడుకున్నాయి. కాంగ్రెసుకు శిక్ష పడింది. బిజెపికి ఎప్పుడు పడుతుందో మరి! ప్రత్యేక హోదా, పన్నుల రాయితీ వంటివి ఆకాశకుసుమాలగానే వున్నాయి. జనసంఘ్‌ రోజుల నుండి బిజెపి యూనిటరీ ప్రభుత్వం కోసం వాదించేది. ఆ తర్వాత బలమైన కేంద్ర ప్రభుత్వం అంటుంది. ఇప్పుడు విధానపరమైన మార్పులు చేసి ఆదాయంలో సింహభాగం కేంద్రానికి వెళ్లి, నిధుల కోసం రాష్ట్రాలు వాళ్లను దేబిరించే పరిస్థితికి దిగజారేలా మార్పులు చేయడానికి చూస్తోంది. 

ఇలాటి పరిస్థితుల్లో ఆంధ్ర ముఖ్యమంత్రి 'పిండి కొద్దీ రొట్టె' అన్నట్లు మాట్లాడాలి కానీ 'రొట్టె కాదు, కేక్‌ వండుతాం దానిమీద ఐసింగ్‌ చేస్తాం' అని కలలు కంటే, ప్లాన్లు వేస్తే అల్నాస్కర్‌ (పగటి కలలు కంటూ చేతిలో వున్న దాన్ని ధ్వంసం చేసుకునే కథలో కుర్రవాడి పేరు) అని పేరు పెట్టాలి. దీని కంతా కారణం హైదరాబాదు సిండ్రోమ్‌. బాబు అసెంబ్లీ ప్రసంగంలో కూడా హైదరాబాదు ప్రస్తావన అనేకసార్లు వచ్చింది. ఒక విషయం గమనించండి - హైదరాబాదును మేన్‌టేన్‌ చేయడానికి తెలంగాణలో తక్కిన జిల్లాలకు తలకు మించిన భారమౌతోంది. హైదరాబాదులో విద్యుత్‌ వాడకం కారణంగానే లోటు బాధలు వస్తున్నాయి. హైదరాబాదులోని పౌరసమస్యలు పరిష్కరించే క్రమంలో చాలా భాగం నిధులు అక్కడ ఖర్చయి తక్కిన జిల్లాలు అభివృద్ధిలో వెనకబడతాయి. కొత్తగా ఏర్పడే ఆంధ్రలో యీ సమస్య లేదు. చిన్న రాజధాని కట్టుకుంటే తక్కిన జిల్లాల నిధులు పట్టుకుని వచ్చి యిక్కడ పోయనక్కరలేదు. 

హైదరాబాదు సిండ్రోమ్‌తో పేద్ధ రాజధాని అనుకుంటే మొత్తం రాష్ట్ర అభివృద్ధికే దెబ్బ. ఎందుకంటే ఆ సూపర్‌ రాజధానిని మేన్‌టేన్‌ చేయడానికి తక్కిన జిల్లాలను ఎండగట్టాలి. ఉన్న విద్యుత్‌ను సిటీకి మళ్లించాలి. అక్కడ మెట్రో, ఓఆర్‌ఆర్‌ వంటి పౌరసౌకర్యాలకే బోల్డు ఖర్చవుతుంది. రాష్ట్ర ఆదాయంలో కనీసం మూడో వంతు అక్కడే ఖర్చవుతుంది. హైదరాబాదు విషయంలో అదే జరిగి రాష్ట్రంలో వెనకబడిన జిల్లాల సంఖ్య పెరిగింది. అయితే హైదరాబాదులో అన్ని జిల్లాల వారు పెట్టుబడులు పెట్టారు కాబట్టి, అందరూ అది తమదే అనుకున్నారు కాబట్టి దానిపై అంత ఖర్చు పెట్టినా మరీ ఫిర్యాదులు రాలేదు. కానీ ఆంధ్రరాజధాని విషయంలో అలాటి ఫీలింగ్స్‌ లేవు. అది బాబు సమర్థకులున్న కృష్ణా, గుంటూరు జిల్లా వాసులదే అనే ఫీలింగు రాయలసీమవారితో బాటు కోస్తాలో తక్కిన జిల్లాలలో కూడా వుంది. రాష్ట్రమంతా దోచి అక్కడ పెడుతున్నారన్న ఫీలింగు రాయలసీమలో కలిగితే మరో విభజనోద్యమానికి పునాది పడినట్టే. తెలుగు రాష్ట్రాన్ని చీల్చడానికి ప్రధాన భూమిక వహించిన దిగ్విజయ్‌ సింగ్‌ ఎప్పుడు మాట్లాడినా సీమాంధ్ర అనలేక సీమా, ఆంధ్రా అని విడగొట్టి పలికేవాడు. ఆయనకు వాక్శుద్ధి వుంటే సీమ, ఆంధ్ర కూడా విడిపోతాయేమో!  (సశేషం)

 - ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (డిసెంబరు 2014) 

[email protected]

Click Here For Part-1

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?