Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ : సెజ్‌ల నుంచి నేర్చుకున్నదేమిటి? - 1

ఎమ్బీయస్‌ : సెజ్‌ల నుంచి నేర్చుకున్నదేమిటి? - 1

ఇతర దేశాల్లో సెజ్‌ల కాన్సెప్ట్‌ సక్సెసైందిట కానీ మన దేశంలో వివాదాస్పదం అయింది. ముఖ్యంగా ఎడాపెడా సెజ్‌లు పెట్టేసిన మన రాష్ట్రంలో. భూ సొంతదారుల వద్ద తక్కువ ధరకు ప్రభుత్వం తక్కువ ధరకు గుంజుకుని, పారిశ్రామికవేత్తలకు ఎక్కువ ధరకో, అస్మదీయులయితే తక్కువ ధరకో కట్టబెట్టడంతో పేచీలు వచ్చాయి. భూమి తీసుకున్న కంపెనీలు పరిశ్రమలు ప్రారంభించడం లేదు. ఎందుకని అడిగితే రావలసిన అనుమతులు రాలేదంటున్నారు. అలాగే కొంతకాలం వుంచుకుని తర్వాత అమ్మేసుకుంటారన్న భయం వుంది. అలా చేయకూడదని రూల్సు ఏవైనా వున్నా ప్రభుత్వంలో మనవాళ్లుంటే వాటిని వంచవచ్చని వాళ్ల ధైర్యం. ఏమైతేనేం ఏ లక్ష్యాలను దృష్టిలో పెట్టుకుని సెజ్‌ పాలసీని రూపొందించారో అది విఫలమైందని అందరూ ఒప్పుకోవాల్సిందే. గతంలో యిండస్ట్రియల్‌ పార్కులు, ఎస్టేట్లు సాధించిన విజయం కూడా వీటికి దక్కలేదు. ఏదైనా ప్రాంతాన్ని ఇండస్ట్రియల్‌ జోన్‌గా గుర్తించి ప్రభుత్వం అక్కడ యిన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఏర్పాటు చేసి వదిలేస్తే పరిశ్రమలు వాటి తంటాలు అవే పడేవి. అనవసరంగా ప్రభుత్వం భూసేకరణకు పూనుకోవడంతో కోతిపుండు బ్రహ్మరాక్షసి అయింది. దీని నుంచి మనం గుణపాఠం నేర్చుకోవాలి. కానీ ఆంధ్ర ముఖ్యమంత్రి నేర్చుకోవడం లేదు. రాజధాని నిర్మాణానికై సిఆర్‌డిఏ అనే అథారిటీని ఏర్పరచి మొత్తం రాజధాని ప్రాంతాన్ని సెజ్జున్నరగా చేసేట్టున్నారు. అసెంబ్లీలో నిన్న ఆయన చేసిన ప్రసంగం వింటే, చెప్పొద్దూ నాకు భయం వేసింది. 

అటు మోదీ చూస్తూంటే మినిమమ్‌ గవర్నెన్స్‌ అంటున్నారు. ప్రతి దానిలోనూ ప్రభుత్వం తలదూర్చకుండా మార్కెట్‌ ఫోర్సెస్‌ను వాటంతట వాటిని వదిలేస్తే ఆటోమెటిక్‌ బాలన్సింగ్‌ అయిపోతుందని, పనులన్నీ చకచకా సాగుతాయనే సిద్ధాంతంతో ముందుకు సాగుతున్నారు. ఆగ్రాలో, కేరళలో మతమార్పిడుల విషయంలో ప్రధాని ఒక ప్రకటన చేయాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. అది రాష్ట్రాలకు సంబంధించిన సబ్జక్ట్‌. ప్రభుత్వానికి గాని, అధికార పార్టీకి గాని సంబంధించిన విషయం కాదు, ప్రధాని దీనిపై విధానపరమైన ప్రకటన ఎందుకు చేయాలి అని వెంకయ్యనాయుడు ఒక స్టాండ్‌ తీసుకున్నారు. దానికి సమాధానం చెప్పలేక ప్రతిపక్షాలు గిలగిల కొట్టుకుంటున్నాయి. అయినా ప్రభుత్వాధినేతగా మోదీ ఏమని ప్రకటన చేయగలరు? హర్షిస్తున్నాం అంటారా, ఖండిస్తున్నాం అంటారా? ఇలా అయితే దేశంలో ఓ పదిమంది మతం మారినప్పుడల్లా ఆయన మైకు పట్టుకోవాలి. కొన్ని విషయాల్లో ప్రభుత్వం కలగజేసుకోకుండా వుంటేనే ప్రజలకు సుఖం. 

రాజధాని విషయంలో బాబుకి యిది అర్థం కావటం లేదు. అన్నీ తన నెత్తిన వేసుకుంటున్నారు. అంతిస్తాం, యింతిస్తాం, అలా డెవలప్‌ చేసి యిస్తాం, యిలా డెవలప్‌ చేసి యిస్తాం అంటూ ఒకటే వాగ్దానాలు. ఋణమాఫీ వాగ్దానం అనుకున్న రీతిలో చేయలేకపోయాం కాబట్టి కాస్త తగ్గాలి అన్న స్పృహ లేదాయనకు. రాజధాని అంటే ఆఫీసులు మాత్రమే కాదట. మరేమిటి? నాకు తెలియక అడుగుతాను, సింగపూరులా నైట్‌ క్లబ్బులు కూడా వుండాలా? వాటి నిర్మాణం కూడా ప్రభుత్వం పర్యవేక్షించాలా? పర్యాటకులు వస్తారట, పెద్ద పెద్ద కంపెనీలు వచ్చి తమ ఆఫీసులు పెడతాయట, వాటిలో పనిచేసేవారు రిలాక్సవ్వాలంటే యివన్నీ వుండాలి కదా అని కొందరు వాదిస్తున్నారు. ప్రభుత్వం తను కట్టాల్సినవేవో కడితే ఆ పైన ప్రయివేటు పార్టీలు వచ్చి రకరకాల బజెట్‌లలో రకరకాల రీతుల్లో వాళ్లే కట్టుకుంటారు. రోమ్‌ యీజ్‌ నాట్‌ బిల్డ్‌ యిన్‌ వన్‌ డే. బాబుగారు ఆకాశానికి ఎత్తేస్తున్న (సింగపూరు, జపాన్‌లలో అవినీతి లేదని బాబు సర్టిఫికెట్టు యిస్తున్నారు. సింగపూరు గురించి పెద్దగా చదివిన గుర్తు లేదు కానీ జపాన్‌ ప్రధానుల్లో చాలామంది అవినీతి ఆరోపణలపై గద్దె దిగినవారే! ఈయన వెళ్లి ఒప్పందాలు చేసుకుంటున్నారు కదాని వాళ్లంతా స్వామీజీలు అయిపోరు) సింగపూరుకు కూడా యీ స్థితికి రావడానికి 50 ఏళ్లు పట్టింది. అంతంత దూరాలున్న దేశాల గోలెందుకు, హైదరాబాదు ఎన్నాళ్లు పట్టిందో అది గమనించండి. కొందరి పాలనలో వేగంగా, మరి కొందరి పాలనలో మందంగా నడుస్తూ వచ్చి యీ రోజు దానికోసం తెలుగువాళ్లందరూ కొట్టుకుని చచ్చే స్థాయికి వచ్చింది. 

ఈ రోజు బాబుగారు చెపుతున్న పనులన్నీ జరగాలంటే హీనపక్షం యిరవై ఏళ్లు పడుతుంది. నయా రాయపూర్‌ యిప్పటికి రెడీ కాలేదు. ఝార్‌ఖండ్‌ ప్రభుత్వం యిప్పటికీ అద్దె భవనాల్లోనే వుందని యివాళ చర్చల్లో చెపుతున్నారు. విభజన చేసినది బిజెపి కాబట్టి మధ్యలో యుపిఏ ప్రభుత్వం వచ్చి నిధులు విదల్చకపోవడం వలన యిలా జరిగిందని వాదించవచ్చు. ఈ గతి మనకు మాత్రం పట్టదన్న గ్యారంటీ వుందా? ఇప్పుడున్నది బిజెపి ప్రభుత్వమే. వస్తూనే తాను చీల్చిన రాష్ట్రాలకు ఎడాపెడా నిధులు గుమ్మరిస్తోందా? 20 ఏళ్లలో నాలుగు ప్రభుత్వాలు మారతాయి. ఏ ప్రభుత్వం ఏ పార్టీదో, దానిలో ఏ నాయకుడిదో, అతడెంత మొనగాడో ఎవరికి తెలుసు? ఇంత పెద్ద భారాన్ని తలకెత్తుకోవడం తగునా? అంటే కటువుగానే వుంటుంది కానీ ఆంధ్రప్రజలు హైదరాబాదు సిండ్రోమ్‌తో బాధ పడుతున్నారు. హైదరాబాదు తమకు కట్టబెడతారన్న ఆశతోనే ఆంధ్ర కాంగ్రెసు నాయకులు విభజన విషయంలో నోరు కట్టేసుకున్నారు. ఆంధ్ర టిడిపి నాయకులకు కూడా బాబు బహుశా అదే నచ్చచెప్పి విభజనకు అనుకూలంగా లేఖ యిచ్చారు. పైకి సమైక్యం అంటూనే లోపల 'విడిపోతే మన ప్రాంతమూ బాగుపడుతుంది, ప్లస్‌ హైదరాబాదును యూటీ చేస్తారు కాబట్టి అక్కడా మనకు ఎదురు వుండదు' అనుకున్న అక్కడి నాయకులు ఆ ప్రజలకు అదే చెప్పి మభ్యపెట్టారు. అందుకే అక్కడ సమైక్య ఉద్యమం అంత నీరసంగా సాగింది. విభజనవాదుల తప్పుడు వాదనలను అసలైన సమయంలో వారెవరూ ఖండించలేదు. ఈ నాయకులను మభ్యపెడుతూ వచ్చిన ఢిల్లీ పెద్దలు చివరకు హైదరాబాదును తెలంగాణకు పూర్తిగా కట్టబెట్టడంతో ఆంధ్రులు ఉక్రోషంతో గిలగిలలాడుతున్నారు. మళ్లీ హైదరాబాదు వంటి నగరాన్ని కట్టిపెడతాననే హామీతో బాబు వారిని ఆకట్టుకుని గెలుపొందారు. ఆ ముక్క తన అసెంబ్లీ ప్రసంగంలో ఆయనే చెప్పారు. (సశేషం)

 - ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (డిసెంబరు 2014)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?