విభజన జరిగిపోయింది, రెండు రాష్ట్రాలు ఏర్పడ్డాయి. తెలుగువారు విడిపోయి రెండురాష్ట్రాలు ఏర్పాటు చేసుకున్నారు. విడిపోయి కలిసుందాం..విడివిడిగా అభివృద్ధి చేసుకుందాం అని అధికారంలోకి వచ్చిన టిడిపి అధినేత చంద్రబాబు, టిఆర్ఎస్ అధినేత కేసిఆర్ నోట వెలుబడ్డ మాటలు. అంతే కాదు గెలిచినందుకు పరస్పరం అభినందించుకున్నారు కూడా. కాని రోజులు గడుస్తున్నా కొద్ది ఈ వైఖరిలో మార్పు వస్తోంది. పలు ఉమ్మడి రాష్ట్ర వ్యవహారాల్లో తేడాలు కనిపిస్తున్నాయి. అందుకే సమీప భవిష్యత్తులో రెండు రాష్ట్రాల మద్య స్నేహపూర్వక వాతావారణానికి బదులు వివాదాలు ముదిరి ఘర్షణ వాతావరణం నెలకొనే ప్రమాదం కనిపిస్తోంది.
రాష్ట్ర విభజన విషయంలో సీమాంద్రకు ప్రధానమైన ఆశ చూపించి విడగొట్టిన అంశమే పోలవరం ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు నిర్మాణంతో కొత్త ఆంద్రప్రదేశ్ కు సాగు, తాగునీటి అవసరాలు తీరుతాయి. అందుకే దానికి జాతీయ హోదాను ప్రకటించింది కాంగ్రెస్ ప్రభుత్వం. తెలంగాణ ప్రాణహిత-చేవెళ్లకు కూడా జాతీయ హోదా ఇవ్వాలని పట్టుబట్టినప్పటికి కాంగ్రెస్ అందుకు ఒప్పుకోలేదు, కేవలం పరిశీలిస్తాం అని మాత్రమే అంది. అంతే కాదు రాష్ట్రాలు విడిపోయాక పోలవరం విషయంలో తెలంగాణ అడ్డుకాకుండా ఉండేందుకు ముంపు గ్రామాలను కూడా సీమాంద్రలోనే కలపాలని నిర్ణయించింది కాంగ్రెస్. అంటే పోలవరం ప్రాజెక్టు ఆంధ్రకు ఎంత ప్రాధాన్యం అన్నది,, అవసరం అన్నది దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు.
ఇదే పోలవరం నిర్మాణం ఇప్పుడు రెండు రాష్ట్రాల మద్య చిచ్చుపెట్టేలా ఉంది. విడిపోయే దాకా కేసిఆర్ పోలవరం విషయంలో సానుకూలంగా స్పందించి ఇప్పుడు అడ్డుకుంటా అంటున్నారు. పైగా పోలవరం సరైనది కాదు అని నిరూపించేందుకు నానా ఎత్తుగడలు వేస్తున్నారు. భూకంప స్థానంలో అది నిర్మించాలనుకుంటున్నారు అని అంటున్నారు. . సాద్యం కాని డిజైన్ మార్పును సూచిస్తూ పోలవరం ప్రాజెక్టుకు అవరోదాలను కల్పించే ప్రయత్నాలు ప్రారంభించారు. అంతే కాదు ముంపు గ్రామాలను కూడా ఆంద్రప్రదేశ్ లో కలపవద్దంటూ మెలిక పెడుతున్నారు. మరో వైపు గిరిజన సంఘాలతో ముంపుగ్రామాల వారి ఆందోళనలు కూడా మొదలయ్యాయి. దీంతో పోలవరం విషయంలో రెండు రాష్ట్రాల మద్య తీవ్రమైన ఘర్షన చోటు చేసుకోబోతోంది అన్న సంకేతాలు వచ్చేసాయి.
అయితే తెలంగాణ ఏర్పాటు విషయంలో, పలు కీలక బిల్లుల ఆమోదం విషయంలో కేంద్రం ప్రయోగించిన అస్త్రం ఆర్టికల్ 3, ఆర్డినెన్స్ ద్వారా బిల్లుల ఆమోదం. ఇప్పుడు కేసిఆర్ ప్రభుత్వమే కాదు తెలంగాణాలోని రాజకీయ పక్షాలన్నీ పోలవరం ను వ్యతిరేకించినా ఇలాంటి అస్త్రాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రయోగించే అవకాశాలున్నాయి. దీనిని పసిగట్టిన కేసిఆర్ తాజాగా పోలవరం విషయంలో ఆర్డినెన్స్ ను ప్రయోగిస్తే ఊరుకోం అంటూ ప్రకటన జారీ చేసారు. అంటే ఆదిశగా కేంద్రం సిద్దమయినట్టే అన్న సంకేతాలు కెసిఆర్ కు అందాయని అనుకోవాలి.
పైగా పోలవరం జాతీయ హోదా, ప్రాజెక్టు నిర్మాణం వంటి హామీలను సీమాంద్రకు బిజేపి ఇచ్చింది. అంతే కాదు తాను సీమాంద్రలో ఆశించిన మేరనే ఫలితాలు సాధించింది. పైగా అక్కడ తన మిత్రపక్షం టిడిపి అదికారంలో ఉంది. అంటే కేంద్రం ఏవిషయంలోనైనా ఆంద్రప్రదేశ్ కే సహకరించే అవకాశాలు ఎక్కువ. అంతే కాదు పోలవరంకు సమస్యగా మారనున్న ప్రాంతం భద్రాచలం. అక్కడి నుంచి ఎంపీగా గెలిచింది కూడా సిపిఎం. సిపిఎం మొదటి నుంచి సమైక్య గళం వినిపించిన పార్టీ. ఇది కూడా పరిస్థితులను బట్టి, ఇప్పటికయితే ముంపు గ్రామాలవిషయంలో తెలంగాణవైపే ఉంది కాని పోలవరం నిర్మాణం విషయంలో తన వైఖరి మార్చుకునే అవకాశాలు ఉన్నాయి. అంటే పోలవరం పోరు పెట్టడం ఖాయం, పోల‘వరం’ ఏమో కాని పోల ‘రణం’ గా మారే ప్రమాదం కనిపిస్తోంది.
ఇది సరే, ఈ వ్యవహారాన్ని కాస్సేపు పక్కన పెడితే, మరో ప్రదానమైన సమస్య ఉద్యోగుల విభజన. ఇది ఇప్పటికే రెండు రాష్ట్రాల మద్య చిచ్చు పెట్టింది, రోజురోజుకు రాజుకుంటోంది. ఈ విషయంలో కేసిఆర్ తెలంగాణ భవన్ లో వార్ రూం ఏర్పాటు చేస్తే దానిపై చంద్రబాబు మండిపడ్డారు. తమపై యుద్దం ప్రకటించారని పేర్కొన్నారు. మహానాడులో కూడా ఈ విషయంలో ఆగ్రహం వ్యక్తం చేసారు చంద్రబాబు. అది వార్ రూం కావద్దని, చర్చల గది కావాలని అన్నారు. అంతే కాదు అది చర్చల కోసం ఏర్పాటు చేస్తే తాను కూడా వస్తానన్నారు.. అయితే వార్ రూమ్ సమాచార కేంద్రం తప్ప మరేమీ కాదంటున్నారు హరీష్ రావు. కాంగ్రెస్ కు వార్ రూమ్ వుంది కదా, మనకి లేకుంటే ఎలా అని భావించారేమో? ఈ పేరు పెట్టుకున్నారు. అప్పటి నుంచీ తంటాలే.
మొత్తానికి తెలంగాణ-ఆంధ్ర వివాదాలు ఇప్పట్లో సమసే దాఖలాలు అయితే కనిపించడం లేదు. దీని వెనుక కెసిఆర్ స్ట్రాటజీ కూడా వున్నట్లు కనిపిస్తోంది. ఎక్కడ తమ పార్టీని చీల్చి, తనను అధికారం నుంచి తప్పిస్తారో అన్న భయంతో, వివాదపు నెగడును నిత్యం రాజేస్తూ వుండాలని ఆయన అనుకుంటున్నట్లు వుంది. అలా అయితేనే, తమ పార్టీ జనాలు తన అవసరం గుర్తించి, తనతోనే వుంటారని ఆయన అనుకుంటున్నట్లుంది. కానీ ఇలా చేయడం వల్ల తెలంగాణ పరిస్థితి మరింత అస్తిరత్వంలోకి జారుకునే ప్రమాదం వుంది. ఇప్పటికైనా తెలంగాణ కుదరుకుందని, ఇక్కడ పెట్టుబడులు, పరిశ్రమలకు మళ్లీ మంచి వాతావరణం వుందని ప్రభుత్వం సానుకూల పరిస్థితి కలిగించాలి. లేదంటే, అభివృద్ధి అసాధ్యమవుతుంది.
చాణక్య