దక్షిణ కోస్తా మొత్తం పండగ వాతావరణం సంతరించుకుంది. వేలాది లైట్లు, వందలాది టెంట్లు, హెలికాప్టర్లు, లక్షల మంది జనం, వందల మంది నాయకులు, భోజనాలు, ప్రత్యేక రవాణా.. ఒకటేమిటి? సవాలక్ష ప్రత్యేకతలు.
బాబు కదిలె రవితేజము లలరగ..అన్నట్లు, అంగరంగ వైభవంగా పట్టాభిషేక మహోత్సవానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
సీమాంధ్ర ఘనతను చాటి చెప్పాలి..పెట్టుబడులు రప్పించాలి..అందుకే ఇదంతా..అంతకు మించి మరేమీ కాదు. ఆ మాటకు వస్తే మేమేమీ ఫ్రీ రైళ్లు వేయలేదు..?
ఇదీ తెలుగుదేశం నేత నెంబర్ టూ కమ్ వారసుడు నారా లోకేష్ సమాధానం.
ముఫై నలభై కోట్లు ఖర్చు చేసి ఆర్భాటాలు చేస్తున్నారన్న వైకాపా నాయకుల విమర్శకు నిజానికి ఇది సరైన సమాధానమే. లోకేష్ చాలా తెలివిగానే బదులిచ్చారు. కేవలం పెట్టుబడులు సమీకరించడానికేనా ఈ మార్గం..అని ప్రశ్నించుకుంటే..కాదు..కాదు..ఇంకేదో వుంది అనిపిస్తుంది.
జూన్ 2 ముక్కలై మిగిలిన సీమాంద్ర ప్రదేశ్ కొత్త పుట్టిన రోజు. తెలంగాణ మొత్తం ధూమ్ ధామ్ జరిగిన రోజు. కెసిఆర్ జాతకానికి ముహుర్తం నప్పంది. బాబకు నప్పలేదు. అందుకే మన ధూమ్ ధామ్ అంతా 8నే. రఘువీరా రెడ్డి మంచిగానే సెలవిచ్చారు. పదేళ్ల పాటు అధికారంలో లేకుండా చంద్రబాబు నానా బాధలు పడ్డారు. ఆ మాత్రం ఆనందం వుంటుంది. అది పెద్ద మనిషి తరహా. జగన్ ఏమన్నాడు. లోటు బడ్జెట్ లో వుండగా ఇంత ఖర్చా..ఆర్భాటమా అని. అదీ నిజమే. కానీ అప్పుల్లో వున్నామని పెళ్లిళ్లు, పేరంటారు.సంబరాలు మానేసుకుంటామా ..కాదుగా.
సరే, ఇంతకీ ఇది సీమాంధ్ర బలప్రదర్శన అంటారు లోకేష్. వస్తున్నావారిలొ సగం మంది మన సీమాంధ్ర పార్టీ అభిమానులు. మిగిలిన సగం మందిలో రాష్ట్రానికి చెందిన వివిధ పార్టీల నాయకులు, ప్రజా ప్రతినిధులు. మొత్తం హాజరులో పది శాతం వుంటుందా..రాష్ట్రం వెలుపల నుంచి వచ్చేవారి సంఖ్య. తెలుగుదేశం అంచనా అయిదులక్షల జనం అనుకుంటే, అందులో ఒక్కశాతం మంది పరాయి రాష్ట్రం వాళ్లు వుంటారా..అంటే అయిదు వేల మంది. ఉండరు కాక వుండరు. వున్నవాళ్లలో కూడా తొంభై శాతం మంది రాజకీయ నాయకులే. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు.
మరి వీరంతా రావడం వల్ల సీమాంధ్రకు పెట్టుబడులు ఎలా వస్తాయి? ఏ ముఖ్యమంత్రీ కూడా పక్క రాష్ట్రం సిఎమ్ పట్టాభిషేక మహొత్సవం ధూమ్ ధామ్ గా జరిగిందని చెప్పి, అక్కడ పరిశ్రమలు పెట్టమని ఎవరికీ రికమెండ్ చేయడు కాక చేయడు. ఇక కేంద్ర మంత్రులు. వీరు కావాలంటే, తమ తమ పరిథిలో రాష్ట్రానికి సాయ పడగలరు. అలా అని బాబు ఇప్పుడు పనిగట్టకుని టాటాలకు, బిర్లాలకు, అంబానీలకు ఆహ్వానం పంపలేరు కదా. పంపకుండా వుండరు. కానీ దాన్ని పైకి హడావుడి చేయరు. ఎందుకంటే, వాళ్లతో లింక్ లు వున్నాయని వార్తలు పుడతాయి కాబట్టి. మరి ఏ విధంగా పెట్టుబడులకు ఈ పట్టాభిషేక మహానాడు ఉత్సవం పనికి వస్తుంది? అంటే సమాధానం అక్కడే వుంది.
ఇదంతా రెండు విధాల ప్లాన్ చేసిన వ్యవహారం.
నిర్మొహమాటంగా చెప్పు,కోవాలంటే, తొలిసారి ఈ రాష్ట్రంలో రెండు కులాలు ముసుగులు తొలగించి ఎన్నికల యుద్ధానికి సిద్ధ పడ్డాయి. రెడ్డి, కమ్మ కులాలు కత్తులు దూసాయి. రెడ్డి కులానికి వ్యతిరేకంగా మిగిలిన కులాలను తనకు దన్నుగా తెచ్చుకోవడంలో తెలుగుదేశం విజయం సాధించింది. అందులో సందేహం లేదు. దాంతో సహజంగానే విజయం వరించింది. తెలంగాణతో కలిసి వున్నన్నాళ్లు అక్కడి రెడ్ల బలం కూడా ఇక్కడి రెడ్లకు తోడయ్యేది. ఇప్పుడు అది కరువయింది. అందువల్ల ఇక కొత్తగా ఏర్పడిన సీమాంధ్ర ప్రదేశ్ లో తమ ప్రాబల్యం పెంచుకొవాలనుకున్న కమ్మవర్గం కోరిక నెరవేరింది. నిజానికి విభజన తరువాత ఈ వర్గం కాస్త భయపడింది. ఎందుకంటే సంఖ్యలో బలంగా వున్న కాపుల నుంచి ఎక్కడ తలకాయనొప్పలు వస్తాయో అని. కానీ పలువురు కాపు నేతలు, పవన్ కళ్యాణ్ తొ సహా అందరూ తెలుగుదేశం వెనుకే వుండడానికి మొగ్గు చూపడంతో ఆ సమస్య తీరింది.
ఇలా తమదైన తెలుగు రాష్ట్రంలో విజయం సాధించిన కమ్మ వర్గం, తమ పురిటిగడ్డలయిన కృష్ణ-గుంటూరు ప్రాంతంలో ఆ విజయ ప్రదర్శన జరుపుకోవడంలో ఎంత మాత్రం తప్పు లేదు. విజయం సాధించిన వారు ఆనందించడం సహజం. అందువల్ల ఇప్పుడు జరుగుతున్నది నికార్సయిన కమ్మ వర్గ బల ప్రదర్శన. సీమాంధ్ర ప్రదేశ్ లో మాది అధికారం అని చాటే వేళ చేస్తున్న పండుగ ఇది. ఇదే సభ రాజమండ్రిలోనో, విశాఖలోనో పెట్టకుండా ఇక్కడ పెట్టడానికి అంతకన్నా కారణం మరేమీ కనపడదు. అందుకే ఇలా అంటారనే ముందుగా రాయలసీమ వాసులు బాధ పడకుండా, తిరుపతిలో తెలుగుదేశం శాసనసభా పక్ష సమావేశం నిర్వహించి, బాబును నాయకుడిగా ఎన్నుకునే కార్యక్రమం అక్కడ నిర్వహించేసారు. మిగలినది ఉత్తరాంధ్ర. వాళ్లు నోరు విప్పేది ఎలాగూ లేదు.
ఎవరు ఎంత కాదన్నా తొంభై శాతం కమ్మవారు తెలుగుదేశానికి 90 శాతం రెడ్లు వైకాపకు ఓట్లు వేస్తారు. మొన్న ఎన్నికల్లో అయినా, 2019 నాటికి వచ్చే ఎన్నికల్లో అయినా. కానీ వాళ్లిద్దరిలో ఎవరు గెలవాలన్నా, కాపులు, బిసి లు పల్లకి మోయాల్సిందే. వాళ్ల నాయకులు పల్లకిలో కూర్చుంటే మాత్రం మోస్తారా అంటే మాత్రం అనుమానమే. సంఖ్యాబలం మాత్రమే వారిది. అధికారం వేరే వారికి అండగా వుండి అందించడమే వారి పని అనుకోవాలి. ఇంతకాలం నడిచిన చరిత్ర చూస్తుంటే.
ఇక రెండో కోణం కూడా వుంది. అది బాబు బల ప్రదర్శన. మోడీ నాయకత్వంలోని భాజపా చంద్రబాబుతో పొత్తును ఏమంత హడావుడిగా ఖరారు చేయలేదు. ఆచి తూచి నిర్ణయం తీసుకుంది. ఇప్పడు కేంద్రంలో వున్నది పూర్తి బలం వున్న ప్రభుత్వం. అంతకన్నా బలమైన ప్రధాని వున్న ప్రభుత్వం. మోడీలాంటి నాయకుడు, అతగాడి ప్రభుత్వం అంత సులుగా బాబు వ్యవహారాలను సమర్థించుకుంటూ పోకపోవచ్చు. అందువల్ల నా బలం ఇదీ..అని మరోసారి చంద్రబాబు సకల రాష్ట్ర నాయకుల సమక్షంలో, రాజకీయ పరిషత్ మధ్యలో చాటి చెప్పాల్సి వుంది. ఈ తరహా ప్రమాణ స్వీకారం న భూతో న భవిష్యత్ అని చేసి చూపాల్సి వుంది. అప్పుడు కచ్చితంగా బాబు చరిష్మా మరింత పెరుగుతుంది కేంద్రం వద్ద. అది చాలా అవసరం ఇప్పుడు. ఎందుకంటే లోటు బడ్జెట్ ప్రభుత్వానికి కేంద్రం అండ చాలా కావాలి. అది కావాలంటే, జాతీయ నాయకులు, వివిధ రాష్ట్ర నాయకుల మద్దతు అవసరం. అది కూడగట్టేందుకు, వారి గుడ్ లుక్స్ లో వుండేదుకు బాబు చేస్తున్న బల ప్రదర్శన గా కూడా దీన్ని చెప్పుకోవచ్చు.
ఏదైతేనేం..ఓ పండుగ వచ్చింది ఈ వేళ. దాదాపు మూడేళ్లుగా ఓ దశ, దిశ లేకుండా నిసత్తుగా పడి వున్న సీమాంధ్రలో కాస్త ఉత్సాహం. ఈ ఉత్సాహం ఇలాగే ఉరకలెత్తి, అభివృధ్ధి జయకేతనం ఎగురవేస్తుందని ఆశిద్దాం. బల ప్రదర్శన ఎవరిదైతేనేం..బలం బలగం సీమాంధ్రదేగా.