మనం సినిమా అద్భుతమైన విజయం సాధించింది. మరోసారి నాగ్ మీడియాతో తన మనసులోని మాటలు పంచుకున్నాడు. పనిలో పనిగా విక్రమ్ కుమార్ దగ్గర బోలెడు కథలున్నాయని, మహేష్ కూడా ఒకటి వింటున్నాడని చెప్పాడు.
నిజమే. కానీ విక్రమ్ కుమార్ గొప్పొడే అంటారా?
సినిమా కాస్త ఆడుతుందో ఆడదో తెలియకుండానే, తెల్లవారి టీవీల్లో ఊదరగొట్టడం ప్రారంభిస్తారు మన దర్శకులు. ఎక్కే చానెల్ దిగే చానల్ అంటూ బుర్రలు తినేస్తారు. అసలు సీన్లు ఎలా తీసారో..ఏ టెక్నీషియన్ ను ఎలా పిండేసారో..ఎలా జ్యూస్ తీసేసారో భలే రంజుగా వల్లిస్తారు. ట్వీట్లిస్తారు..షేర్ చేస్తారు. అబ్బో ఒకటేమిటి?
కానీ ఇవన్నీ విక్రమ్ కు చాతకాదు. సినిమా తీస్తాడంతే. క్లిష్టమైన స్క్రిప్ట్ సవాళ్లు తలకెత్తుకుని, వాటిని విజయవంతంగా పరిష్కరించి, మౌనంగా వుండిపోతాడు. నాగార్జున లాటి వాడు స్క్రిప్ట్ రెడీ చేయి అంటే …వన్ మినిట్ అని బ్యాంకాక్ ఈ ఫ్లయిట్ లో వెళ్లి, ఆ ఫ్లయిట్ లో స్క్రిప్ట్ తో దిగిపోలేదు. ఏడాది సమయం కావాలని,. అడిగి మరీ తీసుకున్నాడు. అఖిల్ కు మహేష్ కు కథ చెబితే, ఇంకో దర్శకుడైతే ఈ పాటికే ''ఇప్పుడే మహేష్ కు లైన్ చెప్పా..వెయింటింగ్ ఫర్ గుడ్ న్యూస్ ' అని ఓ ట్వీట్ కొట్టేస్తాడు. అరడజను సినిమాలు చేతిలో వున్నట్లు తనకు తెలిసిన మీడియా జనాలకు లీకులిస్తాడు. కానీ విక్రమ్ అవేమీ చేయడు. అంతెందుకు..ఇవాళ మనం క్రెడిట్ నూటికి నూరుపాళ్లు విక్రమ్ కుమార్ దే.
కానీ కనీసం పదో వంతు కూడా నాది అని చెప్పడానికి మనిషి కనిపిస్తేనా? నాగార్జున బాగా నటించి వుండొచ్చు, చైతన్య బాగా చేసి వుండొచ్చు. ఎక్సెట్రా..ఎక్సెట్రా..మరి ఈ జనాలే..గడచిన రెండు మూడేళ్లుగా హిట్ లు లేక, నానా గెటప్ లు వేస్తూ, జనానికి నానా 'చిత్రాలు' చూపిస్తూ, హిట్ కు మొహం ఎందుకు వాచారు? అంటే విక్రమ లాంటి డైరక్టర్ దొరక్క. డైరక్టర్ కు దమ్ముంటే నాగ్ గెటప్పూ బాగుంటుంది. చైతన్య నటనా బాగుంటుంది. ఎందుకంటే విక్రమ్ స్టామినా అలాంటిది.
దెయ్యం సినిమా అంటే లైట్లు ఆర్పేసి, ఊరు చివరి బంగ్లాలో తీయడం కాదు..ఊరి మధ్య ఫ్లాట్ లో, వెలుతురులో కూడా తీయచ్చు అని తీసి చూపించాడు 13బిలో. హిట్ లు లేక అల్లల్లాడుతున్న నితిన్ కు ఓ మాంచి ప్రేమకథ ఇచ్చి, ఆనందించు అన్నాడు. అయినా ఎక్కడా మీడియా ముందుకు రాలేదు. రెండేళ్లు సైలెంట్ గా మనం సినిమా చేసుకుపోయాడు. విజయం సాధించాడు. తనదే ఆ విజయం అని తెలుసు. కానీ ఆ క్రెడిట్ అంతా కావాల్సిన వాళ్లకు వదిలేసి, తాను తరువాతి సినిమా కోసం కథలు చెప్పడంలో బిజీగా వున్నాడు. అన్నీ వున్న ఆకు..అలాగే వుంది. ఎగిరి ఎగిరి పడదు. విక్రమ్..యు ఆర్ గ్రేట్.
చాణక్య