ఎమ్బీయస్‌ : అవశేష ఆంధ్రప్రదేశ్‌ అవతరించిందా?

జూన్‌ 2 న తెలుగుజాతి రెండుగా విడింది. రెండు రాష్ట్రాలు ఏర్పడ్డాయి. రిజర్వ్‌ బ్యాంక్‌లో రెండు ఖాతాలు తెరిచారు. ఇరు రాష్ట్రాలకు చెరో చీఫ్‌ సెక్రటరీ, చెరో డిజిపి నియమించబడ్డారు. ఉద్యోగులను కూడా విడగొట్టారు.…

జూన్‌ 2 న తెలుగుజాతి రెండుగా విడింది. రెండు రాష్ట్రాలు ఏర్పడ్డాయి. రిజర్వ్‌ బ్యాంక్‌లో రెండు ఖాతాలు తెరిచారు. ఇరు రాష్ట్రాలకు చెరో చీఫ్‌ సెక్రటరీ, చెరో డిజిపి నియమించబడ్డారు. ఉద్యోగులను కూడా విడగొట్టారు. అన్ని డిపార్టుమెంట్లు రెండురెండుగా విడిపోయాయి. అయితే జూన్‌ 2 న తెలంగాణలో మాత్రమే హడావుడి కనబడింది. కొత్త చిహ్నం ఆవిష్కరించబడింది. 'సంబురాలు' జరిగాయి. ధూంధాంలు జరిగాయి. గీతాలు ఆలపించారు, నృత్యాలు నర్తించారు. పాలకులు హామీలు కురిపించారు. ప్రజల్ని ఆశల డోలికలలో ఓలలాడించారు. పోలవరం విషయంలో పొరుగు రాష్ట్రంతో పోరాడి తీరతామని నినదించి ఉత్తేజపరిచారు. 

అదే రోజు అవశేష ఆంధ్రప్రదేశ్‌ అవతరించినా అక్కడ యిలాటిది ఏదీ, ఛాయామాత్రంగా కూడా జరగలేదు. రాష్ట్రవిభజన వలన ఆంధ్ర ప్రాంతం యిప్పటికైనా బాగుపడుతుందని, కెసియార్‌ తన ఉద్యమం ద్వారా అనుకోకుండా ఆ ప్రాంతానికి మేలు చేశాడని అనేవాళ్లు చాలామంది వాదిస్తున్నారు. వాళ్లయినా ఆ రోజుని సెలబ్రేట్‌ చేసి వుండాల్సింది. ఏమీ చేయకుండా నిరాసక్తంగా దాటబెట్టేయడం ఆశ్చర్యకరంగా వుంది. పవన్‌ కళ్యాణ్‌ జనసేన పెట్టినపుడు మీ పార్టీ విధానాలేమిటి? మానిఫెస్టో ఏమిటి? అని పాత్రికేయులు అడిగితే ఓ రోజంతా దీర్ఘంగా ఆలోచించి మర్నాడు పత్రికా ప్రకటన వెలువరించారు. తెలంగాణ, అవశేష ఆంధ్రప్రదేశ్‌ అవతరణోత్సవ దినోత్సవాలను మాత్రం సెలవుదినాలుగా ప్రకటిస్తే చాలని, నాయకుల జయంతి, వర్ధంతి రోజుల్లో సెలవులు అక్కరలేదని, అదే తమ విధానమని చెప్పారు. అంతకంటె పెద్దదేమీ తట్టకపోయితే తట్టకపోయింది కానీ కనీసం దాన్ని ఆ పార్టీ అయినా అమలు చేసిందాని నాకు అనుమానం. జూన్‌ 2న జనసేన కార్యాలయంలో అవతరణ దినోత్సవాలు ఏమైనా జరిపారా? జరిపినట్లు పేపర్లో చదవలేదు. తెలంగాణలో తను చెడతిట్టిన కెసియార్‌ అధికారంలోకి వచ్చినందుకు తెలంగాణ అవతరణోత్సవాన్ని జరపకపోయినా, తన మాట విని టిడిపి-బిజెపిని గెలిపించిన అవశేష ఆంధ్రప్రదేశ్‌ అవతరణోత్సవమైనా జరపాలి కదా! ఆయనా పట్టించుకోలేదా?

ఈ ముక్క ఎవరితోనో అంటే – అబ్బే, యింకా ఎక్కడ అవతరించింది? జూన్‌ 8 న కదా! అన్నాడాయన. జూన్‌ 8 ఒక ప్రభుత్వం ఏర్పడే రోజు. ఆవిర్భావం కాదు. రాష్ట్రచరిత్రలో అలాటి అనేక ప్రభుత్వాలు వస్తాయి, పోతాయి. జూన్‌ 8 అనేది ఒక పార్టీ – టిడిపి – వ్యవహారం. ఆ పార్టీ ఆ రోజు అధికారం చేపడదామనుకుంటోంది. అప్పటికే రాష్ట్రం పుట్టి ఆరు రోజులు అవుతుంది. జూన్‌ 2 అనేది తెలుగువారి చరిత్రలో ఒక ముఖ్యమైన రోజు. ఒక ప్రధాన ఘట్టం. ఇప్పటికే  కొత్త రాష్ట్రం పని చేయడం మొదలై పోయింది. బ్యాంకు అధికారులు మే 31న పాస్‌ చేయాల్సిన ఎంట్రీని జాప్యం చేయడం వలన ఉమ్మడి రాష్ట్రానికి చెందిన ఖర్చు ఒకటి ఆంధ్రప్రదేశ్‌ ఖాతాకు ఖర్చు రాసేశారని పేపర్లో వచ్చింది కూడా. ఆంధ్రకు ఎలాట్‌ చేయబడిన ఉద్యోగులందరూ కొత్త రాష్ట్ర ఉద్యోగులు అయిపోయారు. కొన్ని కంపెనీలు ఆంధ్రలో రిజిస్ట్రేషన్‌ కూడా చేయించేసుకుంటున్నాయి. కొత్త రాష్ట్రం అన్ని విధాలా అమల్లోకి వచ్చేసింది. అయినా పత్రికలు కూడా స్పెషల్‌ యిస్యూలు అవీ వేయలేదు. ఎవరూ యాడ్స్‌ యివ్వలేదు. అందరూ జూన్‌ 8 గురించి ఆగారేమో! అవేళ చంద్రబాబు ప్రమాణస్వీకారం తర్వాతనే ఆంధ్రచరిత్ర ఆరంభమైందంటారేమో! శాలివాహన శకంలా బాబుశకం ఆవిష్కృతమైంది అంటారేమో! 

ఇప్పుడు ఆంధ్రరాష్ట్రంలో బాబు మాటే ఫైనల్‌. ఆయన 'వీరీవీరీ గుమ్మడిపండు, యిదిగో రాజధాని' అని రచ్చబండ చూపించినా అదే రాజధాని అయిపోతుంది. విద్యారణ్యస్వామి హరిహర బుక్కరాయలకు విజయనగర సామ్రాజ్యం ఎక్కడ స్థాపించాలో చూపించారట. అక్కడ కుందేలు కుక్కను తరుముతోంది కాబట్టి పౌరుషవంతుల భూమి యిదే అని తీర్మానించారట ఆయన. కుందేలు సరే, కుక్క కూడా అక్కడిదే కదా, కుందేలుని చూసి పారిపోతోందంటే దానికేం పౌరుషం వున్నట్లు!? బాబు ఆంధ్రలో కూడా అలాటి టెస్టు ఏదో చేసి విజయవాడ-గుంటూరులను సెలక్టు చేసినట్లు అనిపిస్తోంది. కేంద్రం తను వేసిన శివరామకృష్ణన్‌ కమిటీ సిఫార్సు కాగితాలు మడిచి అటకమీద పెట్టుకోవాలి. కమిటీని రద్దు చేయించేస్తే ఆ నిధులు  మిగిలి, బోర్డుల పెయింట్‌ కైనా పనికివస్తాయి. సిపిఐ లీడర్లు తనను కలిసినప్పుడు బాబు రాజధాని గుంటూరే అన్నారని పేపర్లో వచ్చింది. బాబు అనుకూల మీడియా విజయవాడ-గుంటూరు బెల్టే బెస్టు అని వూదరగొట్టేస్తోంది. మరి పాపం రాయలసీమ అంటే, కావాలంటే హైకోర్టు అక్కడ యివ్వవచ్చు అంటున్నారు. మళ్లీ అక్కడ పూర్తి హైకోర్టు అక్కరలేదట. బెంచి అంటూ ఏర్పాటు చేసి, దాన్ని రాజధాని ప్రాంతంలో పెట్టాలట. బెంచి ఐడియా మంచిదే కానీ మళ్లీ దాన్ని కూడా రాజధాని ప్రాంతంలో దేనికి? ఏ ఉత్తరాంధ్రలోనో పెట్టవచ్చుకదా! 

రాజధాని గురించి బాబు ఆలోచన అయోమయంగా వుంది. 'ప్రపంచస్థాయి రాజధాని కడతాం' అనే దంపుళ్ల పాట బాబు వదలలేదు. ఆ పాట పాడుతూనే వికేంద్రీకరణ చేస్తాం, అన్ని జిల్లాలలో తలో ఆఫీసూ, పరిశ్రమల హబ్‌ పెడతాం అంటున్నారు. రెండూ ఎలా పొసుగుతాయి? అన్నిటినీ కాస్త కాస్త పంచితే ఒకే చోట ప్రపంచస్థాయి రాజధాని ఎలా ఏర్పడుతుంది? బాబుగారిని హైదరాబాదు సిండ్రోమ్‌ వదలిపెట్టడం లేదు. విజిఎంటిలో రాజధాని పెట్టించి, దాన్ని నేనే డెవలప్‌ చేశాను అని చెప్పుకుంటారేమో – హైదరాబాదును నేనే కనిపెట్టానని చెప్పుకుంటున్నట్లే! ఎవరైనా కొత్తవాళ్లు వింటే అంతకుముందు హైదరాబాదులో ఏమీ లేకుండా ఒట్టి శ్మశానం వుందేమో, యీయనే వెళ్లి చిన్నమయ్య మాయాబజార్‌ కట్టినట్లు కట్టాడేమో అనుకోగలరు. విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి ఎప్పణ్నుంచో వున్నవే. ఈయన అక్కడ రాజధాని పెట్టేసి దానిపై తన స్టాంప్‌ కొట్టేద్దామనుకుంటున్నట్లు వుంది.

వాస్తవాలు మాట్లాడుకోవాలంటే గుంటూరు కాస్త విశాలంగానే వుంటుంది కానీ తక్కినవన్నీ యిరుకు ప్రాంతాలే. మంగళగిరి, తెనాలి పట్టణం  అయితే సందులే. విజయవాడలో కూడా పాత బస్తీలో పార్కింగ్‌ కూడా కష్టం. శివారు ప్రాంతాల్లోనే కాస్త తిరగగలం. ఈ వూళ్లలో రాజధాని పెడితే  కొత్తరకంగా ప్లాన్‌ చేయడం కష్టం. క్లీన్‌ స్లేట్‌లా వుంటేనే ఆధునిక తరహాలో రాజధాని కట్టవచ్చు. బ్రిటిషువాళ్లు పాత ఢిల్లీని అలాగే వదిలేసి, కొత్త ఢిల్లీ కట్టారు. చండీగఢ్‌ కొత్త తరహాలో సెక్టార్లగా కట్టారు. ఇప్పటికే జనసాంద్రత వున్న ప్రాంతాలైతే సివిక్‌ ఎమినిటీస్‌ సరిపోవు. మురుగునీరు సమస్య, అనేక చోట్ల ఓపెన్‌ డ్రయినేజీ. ఇరుకువీధులను విశాలం చేయాలంటే స్థానికులు అడ్డుకుంటారు. ప్రతీవాడూ మా ప్రాంతం డెవలప్‌ కావాలి, మా స్థలాలకు రేట్లు రావాలి, మా యిల్లు మాత్రం ముట్టుకోవద్దు, కావాలంటే పక్కవాడిల్లు లేక ఎదుటివాడిల్లు కొట్టేసి రోడ్డు వెడల్పు చేయండి అంటాడు. కోర్టు కెళతానని బెదిరిస్తాడు. వాళ్లందరికీ నష్టపరిహారాలివ్వడం మొదలుపెడితే, తడిసి మోపెడు అవుతుంది. అంత డబ్బు కొత్త రాష్ట్రం దగ్గర వుందా? 

విభజన అంతా గందరగోళం చేసేశారు. ఏ ఉద్యోగి ఎక్కడివాడో నికరంగా తేలడానికి ఐదారు నెలలు పడుతుందట. ఫైళ్ల మార్పిడి ఎప్పటికవుతుందో తెలియదు. రికార్డు టైములో విభజన చేసేశాం అని గవర్నరు సలహాదారు జబ్బలు చరుచుకుంటున్నారు. ఏదీ తేల్చలేదు. అన్నీ పెండింగే. కమలనాథన్‌ కమిటీ ఉద్యోగుల పంపకాల మార్గదర్శక సూత్రాలు కూడా యివ్వలేదు. అప్పుడేం ఏం జరిగింది? గవర్నరుగారు కొన్ని వివాదాస్పద విషయాలపై నిర్ణయాలు వాయిదా వేసి యిద్దరు ముఖ్యమంత్రులు కూర్చుని మాట్లాడుకోవాలి అనేశారు. ఇద్దరూ కలిసి కూర్చునే ఘట్టం కంటికేమైనా ఆనుతోందా? కెసియార్‌ కత్తులు నూరుతున్నారు. తన ప్రమాణస్వీకారానికి బాబును పిలవలేదేం అంటే కమ్యూనికేషన్‌ గ్యాప్‌ అన్నారు. బాబు ప్రమాణస్వీకారానికి రానంటున్నారు. ఇప్పణ్నుంచే యీ రగడ ఏమిటంటే పోలవరం మండలాల బదిలీ విషయం ఎత్తుతున్నారు. అది ఒప్పందంలో భాగమే కదా అంటే వినటం లేదు. 'అన్నదమ్ముల్లా విడిపోయి కలిసి వుందాం' అనే స్లోగన్‌ ఎంత బోగస్సో తెలుస్తోందా?

ఆంధ్ర, తెలంగాణ కలిసి పనిచేస్తే రెండూ బాగుపడతాయి. లేకపోతే యిక్కట్లే. తెలంగాణలో అయితే వున్నది కాపాడుకుంటే చాలు. సన్నాసాడి పెళ్లికి జుట్టు దగ్గర్నుంచి అరువే అన్నట్టు ఆంధ్రకు అడుక్కోవడానికి చిప్ప కూడా యింకోళ్లు యివ్వాలి. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు భారీగా నిధులు కావాలి. రెవెన్యూలో పదివేల కోట్ల లోటు అని బాబు స్వయంగా చెప్పారు. విద్యుత్‌ మిగులు వుంటుందేమో, పరిశ్రమలు తీసుకుని రావచ్చు అనుకుంటే తక్కినవన్నీ జనాభా ప్రాతిపదికన విభజించి, విద్యుదుత్పత్తిని మాత్రం వినియోగం ప్రాతిపదికన పంచి, ఆంధ్రకు అన్యాయం చేశారు. ఒక్కోదానికి ఒక్కో కొలబద్ద. ఉద్యోగుల విభజనలో ఉద్యమనాయకుడు విఠల్‌గారిని తెలంగాణకు ఎలాట్‌ చేయడానికి రూల్సును వంచారు. విధానం యిదీ అని స్పష్టంగా విభజన బిల్లులో కాంగ్రెసు ఏమీ పొందుపర్చలేదు. వాటి గురించి యిప్పుడు సోనియాకు హఠాత్తుగా గుర్తుకు వచ్చి కేంద్రానికి ఓ లేఖ సంధించింది. 'జులై 30 న నిర్ణయం తీసుకుని ఆర్నెల్లపాటు ఏం చేశావ్‌? బిల్లు సమగ్రంగా చెయ్యవద్దని ఎవడు చెప్పాడు? సిగ్గులేదా యిప్పుడు అడగడానికి?' అని మోదీ జవాబు రాయలేడు. ''మీరూ మేమూ కుమ్మక్కయ్యే కదా యీ బిల్లు పాస్‌ చేసినది'' అని సోనియా చురక వేస్తుందని భయం.

ఈ భారం చాలనట్లు బాబు అలవికాని హామీల భారం నెత్తి కెక్కించుకున్నారు. కెసియార్‌ లక్షలోపు ఋణాలకు కాలపరిమితి పెడితేనే యివాళ తెలంగాణ అంతా నిరసనలు జరుగుతున్నాయి. ఆ హామీ నమ్మి ఓట్లేశాం, తెరాస దగా చేసింది అని రైతులు ఆక్రోశిస్తున్నారు. బాబు ఏం చేస్తాడో 8 వ తారీకున తెలుస్తుంది. ఏ మాత్రం తేడా వచ్చినా 'ఇది అమలు కానీ హామీ అని ముందే చెప్పాం' అంటూ వైకాపా ప్రదర్శనలు మొదలుపెట్టి రైతులను కూడవేస్తుంది. ఇక్కడ ప్రతిపక్షాలు రెండుగా చీలివున్నాయి. అక్కడ బలమైన ప్రతిపక్షం ఒక్కటే! బాబు ఏ మాత్రం మాట తప్పినా రైతులను ఆకట్టుకోవడానికి బిజెపి 'మేం నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తాం' అంటూ వాళ్లూ విడిగా ప్రదర్శనలు నిర్వహించినా ఆశ్చర్యపోను. 8వ తారీకు బాబు ప్రమాణస్వీకార ఉపన్యాసం తర్వాత ఏం జరుగుతుందో వేచి చూడాలి. ఆ రోజుకి సంతకం పెట్టేసి, జాతీయ నాయకులందర్నీ పంపించేశాక మర్నాడు వివరాలు, షరతులు వెల్లడిస్తారేమో!

 ఆవతరణోత్సవం నాడు చేయాల్సిన హంగామా అంతే 8 వ తారీకునే చేస్తారనుకుంటా. ప్రభుత్వ సంస్థల ప్రకటనలు, పార్టీ అభిమానుల శుభాకాంక్షలు, పత్రికల సప్లిమెంట్లు.. అన్నీ అవాళే. ఈ ఏడాది అలా గడిచిపోతుందనుకోండి. మరి వచ్చే ఏడాది నుంచి రాష్ట్ర అవతరణోత్సవం అని దేన్ని జరుపుకుంటారు?  మద్రాసు నుండి యిప్పుడున్న ప్రాంతం విడిపోయి ఆంధ్రరాష్ట్రంగా ఏర్పడిన అక్టోబరు 1, 1953 తేదీని అందరూ మర్చిపోయారు. అయినా అప్పటి ఆంధ్రరాష్ట్రంలోనుంచి భద్రాచలం రాములోరు వెళ్లిపోయారు. అందువలన ఆ తేదీ యిప్పటి రాష్ట్రానికి వర్తించదు. ఇక ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడిన నవంబరు 1, 1956 అయితే ఆ రాష్ట్రమే మరణించింది. అవశేషం మిగిలింది. గుండెకాయ లాటి రాజధాని పోయి, అస్తికలు మిగిలాయి – చెవుల్లో సాగరఘోషతో సహా! బాబుగారి పట్టాభిషేకం చేసుకుంటున్న జూన్‌ 8 యీ రాష్ట్ర ఆవిష్కరణ దినోత్సవం కాబట్టి సెలవు యివ్వాలి అని ఆనాటి వేదికపై పవన్‌ కళ్యాణ్‌ డిమాండ్‌ చేస్తే అది ఒప్పదు. ఎందుకంటే జూన్‌ 8 అనేది బాబు జాతకం ప్రకారం ఫిక్స్‌ చేసిన ముహూర్తం. దానికీి రాష్ట్రావతరణకూ సంబంధం లేదు. 

ఈ సందర్భంగా ఆంధ్రరాష్ట్రం ఏర్పడిన నాటి ఉదంతం గుర్తుకు వస్తోంది. 1953 అక్టోబరు 1 న ఆంధ్రరాష్ట్ర అవతరణ ముహూర్తం పెట్టారు. ఆ రోజుకి ఒక వారం ముందు నుంచి, అక్టోబరు 1న గాక, ఒక రోజు ముందుకాని, ఒక రోజు తర్వాత కానీ ఉత్సవం జరపమని జ్యోతిష్కులూ, జ్యోతిషం తెలిసిన పెద్దలూ ముఖ్యమంత్రి ప్రకాశం గారికి ఉత్తరాల పైన ఉత్తరాలు రాయడం మొదలెట్టారు. లెక్కల సౌకర్యం కోసం 1 వ తేదీ పెట్టాం, అది మార్చితే లెక్కల యిబ్బందులు వస్తాయని ఉద్యోగులు అన్నారు. ప్రకాశం గారు రెండూ విని ''జ్యోతిష్కులు చెప్పిన అభ్యంతరాల ననుసరించి, రాజ్యాలు నడిపే కాలం కాదిది. అయినా జ్యోతిష్కులు చెప్పినదానిలో నాకు వ్యక్తిగతంగా నష్టం వస్తుందన్నారు తప్ప ఆంధ్రదేశ జాతకానికి నష్టం వస్తుందని లేదు కదా. ముహూర్తం మార్చకండి.'' అని చెప్పారు. ఇది చెప్పాక ఆ ముహూర్త ప్రభావం ఎలా వుందో కూడా చెప్పి తీరాలి. 13 నెలల్లోపునే 1954 నవంబరు 6 న, ప్రకాశం గారి ప్రభుత్వం అవిశ్వాసతీర్మానానికి గురై పడిపోయింది. ఆంధ్రరాష్ట్రం 1956 కల్లా దాని ఉనికిని పోగొట్టుకుంది. పోనీలే తెలంగాణను కలుపుకుని ఆంధ్రప్రదేశ్‌గా విస్తరించింది కదా అని వూరడిల్లితే దానికి షష్టిపూర్తి కూడా కాకుండానే సగం పోగొట్టుకుని గోచీపాతరాయుడిలా మిగిలింది. తెలంగాణలో కలవకుండా వున్నా ఈ పాటికి ఎంతో కొంత డెవలప్‌ అయ్యేది. బాబు ప్రకాశంగారి టైపు కాదు. తన జాతకాన్ని అనుసరించి జూన్‌ 8 ముహూర్తం పెట్టించారు. దీని ఫలాఫలాలు భవిష్యత్తు మాత్రమే చెప్పగలదు. 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జూన్‌ 2014)

[email protected]