బేరంలో భారం!

పాతికకు తగ్గేది లేదంటున్న భాజపా గతిలేని స్థితిలో నారా చంద్రబాబు పార్టీ మనుగడపై మల్లగుల్లాలు కాంగ్రెస్‌నుంచి భాజపాలోకి ‘కులవలస’ Advertisement ‘పాయింట్‌ ఆఫ్‌ నో రిటర్న్‌’… ప్రస్థానంలో ఇక వెనక్కు తిరగడానికి అవకాశం కూడా…

పాతికకు తగ్గేది లేదంటున్న భాజపా
గతిలేని స్థితిలో నారా చంద్రబాబు
పార్టీ మనుగడపై మల్లగుల్లాలు
కాంగ్రెస్‌నుంచి భాజపాలోకి ‘కులవలస’

‘పాయింట్‌ ఆఫ్‌ నో రిటర్న్‌’…
ప్రస్థానంలో ఇక వెనక్కు తిరగడానికి అవకాశం కూడా లేని పాయింట్‌. చావోరేవో, ముందడుగే తప్పనిసరి అని తెలిపే పరిస్థితి ఇది. వర్తమాన రాజకీయాల్లో తెలుగుదేశం- భాజపాల పొత్తులు దాదాపు ఇక్కడి వరకు వచ్చేశాయి. ఇరు పార్టీలు బహిరంగ ప్రకటన రూపంలో ఏమీ చేయలేదు గానీ.. ఇంచుమించుగా ‘పొత్తు’ పొడిచినట్లే భావించాలి. భాజపాతో పెట్టుకుంటున్నందుకు వామపక్షాలు తెదేపాను ఈసడించడమూ మొదలైపోయింది. తతిమ్మా అన్ని పార్టీలూ ఈ రెండింటినీ జట్టుగానే తమ మాటల్లో వ్యవహరించడం జరుగుతోంది. ఇక తెదేపా వెనక్కు మళ్లడం అసాధ్యం… అవ్విధముగా..అలాంటి ‘పాయింట్‌ ఆఫ్‌ నో రిటర్న్‌’ చేరువయ్యాక…

పొత్తులు కుదరడంలో తమ జిత్తులను రుచిచూపిస్తోంది భాజపా. పొత్తు కావాలంటే.. తెదేపా ఏం చేయాలో టర్మ్స్‌ నిర్దేశిస్తోంది. రాష్ట్రంలో పాతిక ఎంపీ సీట్లు తమకు కేటాయిస్తేనే పొత్తుబాట అంటోంది. అసెంబ్లీ బరిని మీరే ఏలుకోండి అని ఛాన్సిస్తోంది. 42సీట్లున్న రాష్ట్రంలో 25 భాజపాకు ఇవ్వడం అంటే.. అది ఎంతటి ఆత్మహత్యాసదృశమో.. సుదీర్ఘానుభవం ఉన్న చంద్రబాబుకు తెలియని సంగతి కాదు. అయితే, ఆయన కాదనగల, తూచ్‌ అనగల స్థితిలో లేరు. కేవలం బేరం ఆడగలరు అంతే! కానీ ఆ బేరం ఆయనకు పెను భారంగా మారబోతోంది. ఎన్నికలు పూర్తయ్యే సమయానికి తెదేపాకు అంతో ఇంతో మిగిలిన అస్తిత్వం భాజపాకు బలంగా మారి.. భాజపాకు రాష్ట్రంలో ఉన్న బలహీన పరిస్థితులు తెదేపాకు అంటురోగంగా ప్రాప్తించే పరిస్థితి కనిపిస్తోంది. 

తెదేపా-భాజపాల పొత్తు సంక్లిష్టతపై గ్రేటాంధ్ర విశ్లేషణ.

xxxxxxxxxxxxxx

ముందుగా ఒక ఫోటోను గుర్తు చేసుకుందాం. శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ ప్రమాణ స్వీకార వేదిక మీద మోడీ చేతులు పైకెత్తి విజయచిహ్నాలతో సభికులకు అభివాదం చేస్తోంటే.. ఆయనకు ఒకవైపున భాజపా జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాధ్‌సింగ్‌.. మరోవైపు తెదేపా అధ్యక్షుడు చంద్రబాబునాయుడు. ఇలాంటి ఫోటో ఏం సంకేతాలు ఇస్తుంది? ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదుగానీ.. మోడీ పేరు మీద సాగబోతున్న పోరాటంలో.. ఆయనకు అండదండలుగా రాజ్‌నాధ్‌సింగ్‌తో సమానమైన ప్రాధాన్యం చంద్రబాబుకు కూడా ఉన్నదని.. సంకేతమాత్రంగా తెలుస్తుంది. ఇలాంటి చిన్నెలు చంద్రబాబునాయుడుకు చాలా బాగా తెలుసు. ఇలాంటి వేదికల మీద నుంచి తనను తాను ఎన్డీయే కూటమిలో, మోడీ యొక్క సేనాపతుల్లో రాజ్‌నాధ్‌ స్థాయి నాయకుడిగా ఎస్టాబ్లిష్‌ చేసుకోవడానికి చంద్రబాబు తహతహలాడుతున్నారనేది నిజం. ఈ ఫోటోను పక్కన పెట్టి కొన్నినెలల కిందటి ఫ్లాష్‌బ్యాక్‌ ఘటనలోకి వెళ్లాలి.

అప్పట్లో చంద్రబాబునాయుడు పాదయాత్రలో ఉన్నారు. ప్రత్యేకించి అప్పటికి నరేంద్రమోడీ భాజపా తరఫున ప్రధానమంత్రి అభ్యర్థి కాదు. అయితే నాయన గుజరాత్‌ ముఖ్యమంత్రిగా మరోసారి తిరుగులేని అసామాన్యమైన మెజారిటీతో గెలుపొందారు. తనకు దేశవ్యాప్త ఇమేజి, అనుబంధాలు అవసరం అని అప్పటికే స్పష్టత ఉన్న నరేంద్రమోడీ.. అన్ని రాష్ట్రాల్లోని కాంగ్రెసేతర ప్రముఖులకు ప్రత్యేక ఆహ్వానాలు పంపారు. పాదయాత్రా ప్రస్థానంలో ఉన్న చంద్రబాబునాయుడు.. మోడీ మీద మతవాద ముద్ర వేసి.. ఆ కార్యక్రమానికి వెళ్లకుండా దాదాపు బహిష్కరించారు. బావమరిది బాలకృష్ణ ప్రమాణ స్వీకారానికి వెళ్లడానికి ఉత్సాహం చూపించినప్పటికీ.. చంద్రబాబు స్వయంగా ఆయనకు కూడా బ్రేకులు వేశారు. మోడీ ముద్ర తమకు భారమో లాభమో అప్పటికి ఆయనకు స్పష్టత లేదు. అందుకని దూరం పెట్టారు. 

కానీ కొన్ని నెలల్లోనే పరిస్థితి మారిపోయింది. మోడీ ప్రాభవం దేశాన్ని ఎలా ఊపేయబోతున్నదో ఆయన అర్థం చేసుకున్నారు. మూడో ఫ్రంట్‌ అని, తాను చక్రం తిప్పుతానని అంటూ కూర్చుంటే మొదటికే మోసం వస్తుందని గ్రహించారు. మోడీ అనే పదానికి తన సొంత రాష్ట్రంలో కూడా కొన్ని ఓట్లు ఉన్నాయని… ఆ మేరకు ఆ లబ్ధిని తన చేజారనివ్వకూడదని కూడా యన ఫిక్సయ్యారు. హఠాత్తుగా ప్లేటు ఫిరాయించి.. ఆయన ‘మోడీ నాకు ఎప్పటినుంచో స్నేహితుడు’ అనే ట్యాగ్‌లైన్‌తో జై భాజపా బాటలోకి వచ్చారు. 

మామూలుగా అయితే.. ఇలాంటి పొత్తుల విషయంలో బాబు ఎన్నడూ తాను టర్మ్స్‌ డిసైడ్‌ చేసే స్థితిలో ఉంటారు. కానీ ఈ దఫా ఆయనకు ఆ పరిస్థితి లేదు. శాసించే స్థితిలో లేకుండా ఆశించే స్థితికి దిగజారారు. భాజపా ఏది ఇస్తే అది తీసుకోవాల్సిన పరిస్థితి. అంతకు మించి మార్గం లేదు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో తానై దేహీ మని నిల్చున్న సమయాన పొత్తు బేరం చంద్రబాబుకు భారంగా మారే పరిస్థితి కనిపిస్తోంది. 

పొత్తు లేక పొద్దు గడవదని…

రాబోయే ఎన్నికలకు సంబంధించి చంద్రబాబుకు క్లారిటీ వచ్చింది. రెండు కళ్లు అంటూ గో.పి. సిద్ధాంతాన్ని పాటించినందుకు ఆయన రెండు ప్రాంతాలకూ కాని వ్యక్తి అయిపోయారు. అయితే సామాజిక వర్గాలు కులాల మీద ఆధారపడిన స్పష్టమైన ఓటుబ్యాంకు మాత్రం తెలుగుదేశానికి స్థిరంగా ఉంది. పైగా రాబోయే ఎన్నికల్లో సామాజిక వర్గాల పరంగా ఓటు బ్యాంకులు చాలా స్పష్టమైన చీలికతో పార్టీలను బలపరిచే అవకాశం ఉంది. కులాల దామాషా ముందు మరో అంశమేదీ నిలిచే అవకాశమూ లేదు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఏకపక్షంగా విజయమే కట్టబెట్టేంత మెజారిటీగా తనకు మద్దతిచ్చే కులం ఏ నియోజకవర్గంలోనూ లేదన్నది ఆయనకు ఎరుకే. తన అమ్ముల పొదిలో కొన్ని ఓట్లున్నాయి. కానీ అవి విజయానికి సరిపోయేవి కాదు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో.. ‘తనవి కాని’ కొన్ని కొత్త ఓట్లను కొన్నింటినైనా రాబట్టుకోవడమే ఆయన ముందున్న ఏకైక ప్రత్యామ్నాయం. 

ఇన్ని లెక్కలు వేసుకున్న తర్వాతనే చంద్రబాబు పొత్తులకు సిద్ధపడ్డారు. అప్పటిదాకా భాజపాతో కలిసి నడవడం గురించి వేచిచూసే ధోరణి పాటించిన చంద్రబాబు.. తన దీన స్థితి గురించి క్లారిటీ వచ్చినతర్వాత వేగిరపడ్డారు. ఇతర కారణాలు చూపించుకుంటూ హస్తిన పర్యటనలు సాగించి.. భాజపా పెద్దలతో తెరవెనుక మంతనాలు సాగించారు. క్షేత్రస్థాయిలో రాష్ట్ర భాజపాలో తెదేపాతో పొత్తు పట్ల ఏకగ్రీవంగా వ్యతిరేకాభిప్రాయం ఉన్నప్పటికీ హస్తినబంధాల ద్వారా చక్రం తిప్పగలిగారు. మాట ఖరారుచేసుకోగలిగారు. అయితే రాష్ట్ర పార్టీనుంచి వస్తున్న వ్యతిరేకత వెల్లువ పొడవని పొత్తులకు బ్రేకులు వేసేస్తుందనే వెరపు ఆయనకు లేకపోలేదు. అందుకే .. పొత్తు గురించి బహిరంగ ప్రచారం వచ్చేసేలాగా… శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ ప్రమాణ స్వీకారానికి ఆగమేఘాల మీద వెళ్లి.. భాజపా నేతల సరసన చిరునవ్వులు చిందిస్తూ ఫోటోలు దిగారు. అక్కడితో పొత్తులకు బహిరంగంగా కర్చీఫ్‌ వేయడం పూర్తయింది. ఇప్పుడు తమ రెండు పార్టీల పొత్తు అనేది భారతదేశపు చారిత్రక అవసరం అన్నట్లుగా పార్టీ నాయకుల ద్వారా ప్రజల్లోకి చొప్పించే ప్రయత్నమూ చేస్తున్నారు. 

ఎటూ రాష్ట్రంలో ప్రతిచోటా తమకంటూ కొన్ని ఓట్లు తప్ప సీట్లు అంతగా ఉండని భాజపా ‘మెట్టు’గా వాడుకోవడం వలన.. లబ్ధి ఉంటుందని చంద్రబాబు ఆశించారు. తీరా పొత్తు అనే పుకారు బహిరంగ రహస్యంగా మారిన తర్వాత.. ఇక చంద్రబాబు పాయింట్‌ ఆఫ్‌ నో రిటర్న్‌ వరకు వచ్చేసిన తర్వాత.. భాజపా తన వ్యూహాచతురతను ఇప్పుడు ప్రదర్శిస్తోంది. 

‘పాతిక’ దగ్గర గిరి గీసేశారు…

‘డిమాండ్‌ – సప్లయి’ అనేది ఆర్థిక సిద్ధాంతం మాత్రమే కాదు. రాజకీయాలకు కూడా వర్తించే జీవన వేదం. ఇప్పుడు ‘డిమాండ్‌’ తమకు ఉన్నదని భాజపాకు తెలుసు. అందుకే వారు ‘సప్లయి’లో కోత పెట్టారు. ఢిల్లీ వర్గాలనుంచి గ్రేటాంధ్ర ప్రతినిధికి తెలుస్తున్న విశ్వసనీయ సమచారం ప్రకారం.. రాష్ట్రంలో 42 ఎంపీ స్థానాలు ఉంటే.. తమకు కనీసం పాతిక స్థానాలు కేటాయిస్తే తప్ప పొత్తులకు జై కొట్టలేం అని భాజపా పట్టుపడుతున్నట్లు సమాచారం. తెలంగాణ కల సాకారం కావడంలో తాము కూడా కీలక భాగస్వాములే అని చాటుకుంటున్న భాజపా.. ఆ ప్రాంతంలో ఉన్న 17 స్థానాల్లో ఏకంగా 14-15 సీట్లు అడుగుతున్నట్లు సమాచారం. ఈ విషయంలో వారు రాజీ పడడం లేదు. తెదేపా బలం ఇక్కడ నామమాత్రమేనని.. కనీసం తమకు ఎక్కువ సీట్లు ఇస్తే.. తెలంగాణ అనుకూల వాదనతో గెలవగలం అని వారు బాబుకు నచ్చజెబుతున్నారు. తెలుగుదేశానికి మల్కాజ్‌గిరి, ఖమ్మం, కోరుకుంటే మరోటి ఏదైనా .. గరిష్టంగా మూడుస్థానాల వరకు ఇవ్వడానికి వారు బేరం పెడుతున్నట్లు తెలుస్తోంది. వీటిలో అప్పటి స్థితిగతుల్ని బట్టి.. రాష్ట్రంలో ఎటూ గద్దె ఎక్కే పరిస్థితి లేదు గనుక.. మల్కాజ్‌గిరి లేదా ఖమ్మం నుంచి చంద్రబాబు స్వయంగా బరిలోకి ఎంపీ బరిలోకి రావచ్చుననే ప్రచారం కూడా ఉంది. అలాగే సీమాంధ్రలోని 25 స్థానాల్లో తమకు 10 సీట్లు కావాలని భాజపా కోరుతోంది. అంటే మొత్తంగా రాష్ట్రంలో వారు 25 ఎంపీ సీట్లు అడుగుతున్నారు. చంద్రబాబుకు గొంతులో పచ్చివెలక్కాయ లాంటి పరిస్థితి ఇది. తోసిపుచ్చలేడు.. తూచ్‌ అనలేడు.. అమోదించలేడు. సంకటస్థితిలో ఆయన కొట్టుమిట్టాడుతున్నారు. 

భాజపా మాత్రం పెద్దగా రాజీపడే మూడ్‌లో లేదు. చంద్రబాబు గట్టిగా ప్రయత్నిస్తే గనుక.. మహా అయితే వారు 20 స్థానాలవరకు తగ్గవచ్చు.  కానీ ఒకప్పుడు రాష్ట్రంలో ఏలుబడి సాగించిన పార్టీగా.. తెలుగుదేశం 3-4 స్థానాలకు మించి ఈ రాష్ట్రంలో ఎప్పుడూ గెలిచి ఎరగని భాజపాకు ఏకంగా 20 సీట్లు కట్టబెట్టడం అంటే ఆ బేరం చాలా పెద్ద భారం. 

తెదేపాకు ఆత్మహత్యాసదృశం…

భాజపాతో కుదుర్చుకుంటున్న డీల్‌ తెలుగుదేశం పార్టీకి ఆత్మహత్యాసదృశం అవుతుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. బయటపడకపోయినా చంద్రబాబు మదిలో ఉన్న విషయం కూడా అదే! ఈ రాష్ట్రంలో ఇదివరలో కూడా ఈ రెండు పార్టీల మధ్య పొత్తులు ఉన్నాయి. అయితే అప్పుడు చంద్రబాబు చెప్పింది వినే స్థితిలో వారున్నారు. ఇప్పుడు వారు చెప్పింది వినాల్సిన స్థితిలో చంద్రబాబు ఉన్నారు. అప్పట్లో భాజపాకు ఈ రాష్ట్రంలో సొంత బలం కూడా ప్రస్తుతానికంటె మెరుగ్గానే ఉండేది. దాన్నే ఇప్పుడు పార్టీ నాయకులు తమ వాదనగా చెబుతున్నారు. చంద్రబాబు పొత్తుల వల్లనే భాజపా ప్రాభవం ఈ రాష్ట్రంలో కోలుకోలేనంతగా దెబ్బతిన్నదని, దాన్ని తిరిగి నిలబెట్టవలసిన బాధ్యత కూడా బాబుదేనని వారు వాదిస్తున్నారు. దానికి చంద్రబాబు వద్ద జవాబు లేదు. 

వారు అడిగినన్ని సీట్లు ఇచ్చేసి ఒప్పుకుంటే పార్టీ క్యాడర్‌ నీరుగారిపోతుందనేది ఆయన భయం. అయితే.. తమకు ఎంపీ స్థానాలు ఇచ్చే చోట్ల గరిష్టంగా ఎమ్మెల్యే స్థానాల్ని తెదేపాకే ఉంచుకోవచ్చునని తద్వారా క్యాడర్‌ను కాపాడుకోవచ్చునని భాజపా మధ్యేమార్గాన్ని ప్రతిపాదిస్తోంది. పైగా ఉభయతారకంగా.. ఎమ్మెల్యే బరిలో రాష్ట్రంలోని గరిష్ట స్థానాల్ని తెలుగుదేశమే ఉంచుకోవచ్చునని ఆఫర్‌ చేస్తోంది. 

అయితే ఇలాంటి ప్రతిపాదన కూడా తెలుగుదేశానికి ప్రమాదకరమే. ఎందుకంటే ఎంపీ-ఎమ్మెల్యే రెండు ఎన్నికలూ ఒకేసారి జరుగుతున్నప్పుడు.. తటస్థ ఓటర్లలో ‘మోడీ మేనియా’కు లోబడిన వారు.. ఎంపీ విషయంలో ఈ కూటమికి ఓట్లు వేసి.. ఎమ్మెల్యేలకు మరో పార్టీని ఎంచుకునే ప్రమాదం ఎన్నటికీ ఉంటుంది. మోడీని ప్రధానిగా కోరుకుంటున్న ప్రతి వ్యక్తి రాష్ట్రంలో చంద్రబాబును ముఖ్యమంత్రిగా కోరుకోవాలనే నిబంధన ఏమీ ఉండదు. మోడీ మేనియాతో తాను లబ్ధి పొందాలని కలగంటున్న చంద్రబాబు ఆలోచన బ్యాక్‌ఫైర్‌ అయినా కూడా ఆశ్చర్యం లేదు. అంటే మోడీ మేనియా ఎంపీ సీట్లలో మాత్రమే పాజిటివ్‌గా పనిచేసేత ఆయనకు దక్కేది ఉండదు. 

కాంగ్రెస్‌ ఎంపీల వలసలు భాజపాలోకేనా?

కేంద్రప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం పెట్టి .. కాంగ్రెస్‌ అధిష్ఠానం వారి ఆగ్రహావేశాలకు గురైన ఆరుగురు సీమాంధ్ర కాంగ్రెస్‌ ఎంపీలు కూడా వచ్చే ఎన్నికల సమయానికి భాజపాతీర్థం పుచ్చుకుంటారనే ప్రచారం జరుగుతోంది. వారందరితోనూ మంతనాలు సాగుతున్న నేపథ్యంలోనే భాజపా భారీ స్థాయిలో ఎంపీ సీట్లను అడుగుతున్నట్లు కూడా సమాచారం. వారి వాదన సమైక్యరాష్ట్రమే అయినా.. ‘సీమాంధ్ర ఆందోళనల పరిష్కారం తర్వాతే తెలంగాణ’ అనే కొత్త విధానాన్ని భుజానికెత్తుకునే షరతు మీద వారు భాజపాలో చేరుతారని విశ్వసనీయ సమాచారం. ఈ జాబితాలో ఆరుగురు ధిక్కార ఎంపీలు లగడపాటి రాజగోపాల్‌, రాయపాటి సాంబశివరావు, హర్షకుమార్‌, సాయిప్రతాప్‌, సబ్బం హరి, ఉండవిల్లి అరుణ్‌కుమార్‌ ఉన్నారు. కాంగ్రెస్‌ పార్టీని నమ్ముకుంటే సీమాంధ్రలో ఎటూ బోణీ ఉండదు కాబట్టి.. కాంగ్రెసులోని ఒక సామాజిక వర్గానికి చెందిన కేంద్ర మంత్రులు కూడా కొందరు భాజపా లో చేరి వేర్వేరు చోట్ల నుంచి బరిలోకి దిగుతారని ప్రచారం జరుగుతోంది. వీరిలో రాయపాటి సాంబశివరావు తన గుంటూరు స్థానం వదలి సామాజిక వర్గ సమీకరణాల పరంగా మరింత బలంగా ఉన్న నరసరావు పేట నుంచి బరిలో ఉంటారని కూడా చెప్పుకుంటున్నారు. ఇది కూడా తెదేపాకు నష్టదాయకమే. 

వాస్తవానికి వారికి తెదేపా తప్ప వేరే ప్రత్యామ్నాయం లేని పరిస్థితి. అయితే భాజపాకు పొత్తుల్లో ఎక్కువ ఎంపీ సీట్లు కేటాయించడం వల్ల మాత్రమే వారు అటువైపు వెళ్తారు. ఆ ఒప్పందం లేకుంటే.. వారు బహుశా తెదేపా వైపే వచ్చి ఉండేవాళ్లేమో. ఇలాంటి నేపథ్యంలో.. చంద్రబాబునాయుడు భాజపాతో పొత్తుల్ని కాలదన్ను కోకుండా తన పార్టీని కాపాడుకునే మార్గం ఏమిటా అని తీవ్రస్థాయిలో మల్లగుల్లాలు పడుతున్నారు. 

తలచినదే జరిగేనా…

‘విన్‌-విన్‌’ అనేది ఒక ఒప్పందం కుదుర్చుకోవడంలోని ఆదర్శనీయమైన నీతి. అయితే చంద్రబాబు అంతటి ఫెయిర్‌- స్వచ్ఛమైన డీల్‌ లకు ఎన్నడూ మొగ్గు చూపించరు. రాష్ట్రంలో తన పార్టీకి ఒక మోస్తరు బలం ఉన్నది కాబట్టి.. భాజపాకు కొన్ని ఓట్లు ఉన్నాయి కాబట్టి.. వాడుకుని గెలుద్దాం అని ఆయన అనుకున్నారు. అంటే, ‘యూజ్‌-విన్‌’ అనే నీతిని ఆయన కొత్తగా సిద్ధాంతీకరించారు. అయితే భాజపా వెర్రివెంగళాయి పార్టీ కాదు. విడివిడిగా ఉభయులూ దయనీయ స్థితిలోనే ఉన్నారని వారికి తెలుసు. అయితే గియితే తెలంగాణలో తమకే కాస్త మన్నన జాస్తి అని కూడా వారికి తెలుసు. అందుకే వారు భారీగా ఎంపీ సీట్లకు బేరం పెట్టారు. అసెంబ్లీలో ఎటూ తాము గద్దక్కేంత పరిస్థితి ఉండదు గనుక.. అత్యాశకు పోకుండా.. అసెంబ్లీని చంద్రబాబు ఏలుబడికే వదిలేసి.. కేంద్రంలో అధికారం దక్కించుకోవడానికి అవసరమైన ఎంపీ సీట్ల వరకు ఫోకస్‌ పెట్టారు. చంద్రబాబు కాదనలేరు. వారు అడిగినన్ని ఇస్తే పరువు పోతుంది. ఇవ్వకుంటే సీట్లు పోతాయి అన్నట్లుగా ఉంది పరిస్థితి. ‘యూజ్‌-విన్‌’ వ్యూహంతో ఈ గేమ్‌ ప్రారంభించిన చంద్రబాబునాయుడు చివరకు ‘లూజ్‌-విన్‌’ వరకు రావాల్సి వచ్చింది. 

ఆయనకు ప్రస్తుతానికి మిగిలిన వ్యూహం మాత్రమే ‘లూజ్‌-విన్‌’!
అంతిమ ఫలితం ‘లూజ్‌ – ….’ ఏమౌతుందో చెప్పలేం!!
‘‘తలచినదే జరిగినదా దైవం ఎందులకు…
జరిగినదే తలచితివా.. శాంతి లేదు నీకు…’’
బాబూ.. శాంతి లేదు నీకు!!

– కపిలముని

[email protected]