సినిమా పరిశ్రమలో చాలా కాలంగా సంక్షోభం సాగుతోంది. డిజిటల్ కంటెంట్ ప్రొవైడర్ ఛార్జీలను వ్యతిరేకిస్తూ.. రెండు తెలుగురాష్ట్రాల్లోనూ సినిమా హాళ్లు శుక్రవారం నుంచి మూతపడనున్నాయి. భారీగా ఉన్నవారి ఛార్జీలను భరించలేక, సుదీర్ఘకాలం సాగించిన చర్చల్లో వారు దిగిరాకపోవడంతో.. ఏకంగా సినిమా హాళ్లనే మూసివేస్తున్నట్లు ఎఫ్‌డీసీ ఛైర్మన్ అంబికాకృష్ణ చెప్పారు.
నిజం చెప్పాలంటే సినిమా రంగానికి తడిసి మోపెడై భారంగా మారే వ్యవహారాలు చాలానే ఉంటాయి. కాకపోతే.. ఒకసారి లాభాలు, ఒకసారి నష్టాలు మారుతూ వస్తుంటాయి గనుక.. ఎవ్వరూ పెద్దగా పట్టించుకోరు. కానీ చాలా వరకు చిన్న సినిమాలు కుదేలై నిర్మాతలు ఆర్థికంగా సర్వనాశనం అయిపోతుండడానికి ఇలాంటి పైకి కనిపించని ఆర్థిక భారాలే కీలక కారణం. వాటికి వ్యతిరేకంగా ఎన్నడూ నిర్దిష్టమైన పోరాటాలు జరిగింది లేదు.
తాజాగా నిర్మాతలకు, ప్రదర్శనలు చేసే థియేటర్ యజమానులకు ప్రత్యక్షంగా కనిపించే ప్రభావం కావడంతో తొలుత డిజిటల్ కంటెంట్ ప్రొవైడర్ సర్వీసుల మీద పోరాటం ప్రకటించారు. ప్రస్తుతానికి సినిమా థియేటర్లు ఇవాళ్టి నుంచి మూత పడనున్నాయి.
ఒకవైపు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విద్యార్థులకు పరీక్షలసీజన్ మొదలైపోయింది. ఇప్పటికే పలు తరగతుల విద్యార్థులకు పరీక్షలు జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో చాలా కీలక సినిమాలు కూడా విడుదలను పరీక్షల తర్వాతి సమ్మర్ సీజన్ కు ప్లాన్ చేసుకుంటున్నాయి. ఇలాంటప్పుడు తల్లిదండ్రులు పరీక్షలు అయ్యే దాకా సినిమా థియేటర్లు ఓపెన్ కాకపోతేనే మంచిదని కోరుకుంటే తప్పేముంది.
పరిశ్రమలో ఇదొక్కటేనా?
అయినా సినీ పరిశ్రమలో చిన్న నిర్మాతలను కుదేలు చేసేస్తున్నది కేవలం డిజిటల్ ప్రొవైడర్ల వ్యవహారం ఒక్కటే కాదని.. పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. నిజంగా పరిశ్రమ మేలు కోరుకునే వారే ఉంటే గనుక.. చిన్న నిర్మాతలను నాశనం చేస్తున్న ఇంకా అనేకానేక అంశాలపై పోరాటాలు సాగాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.