కపిలముని : కేసీఆర్ ధీరుడా? సైంధవుడా?

కేసీఆర్… స్వతహాగా ఆయనకున్న బిరుదు ‘మాటల మరాఠీ’ ప్రస్తుతం ఆయన కోరుకుంటున్న బిరుదు ‘తెలంగాణ జాతిపిత’ Advertisement అవును సుదీర్ఘకాలంగా… పోరాటం 60 ఏళ్లది అని అందరూ చెబుతుంటారు. అందులో 12ఏళ్ల పోరాటం.. బుడ్డదే…

కేసీఆర్…
స్వతహాగా ఆయనకున్న బిరుదు ‘మాటల మరాఠీ’
ప్రస్తుతం ఆయన కోరుకుంటున్న బిరుదు ‘తెలంగాణ జాతిపిత’

అవును సుదీర్ఘకాలంగా… పోరాటం 60 ఏళ్లది అని అందరూ చెబుతుంటారు. అందులో 12ఏళ్ల పోరాటం.. బుడ్డదే కదా? అని డౌట్లు రాకూడదు! 

సుదీర్ఘకాలంగా పోరాడుతూ వస్తున్న కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం సాకారం అవుతుందని అనుకుంటున్న శుభవేళ.. తనేం కోరుకుంటున్నారు! కనీసం తను గానీ, తన కుటుంబం గానీ ముఖ్యమంత్రి కావాలని కూడా కోరుకోవడం లేదు అని బాహాటంగా అంటారు. కానీ ఉన్న పదవులన్నీ తన కుటుంబానికి కోరుకోవడం వల్లనే కాంగ్రెస్‌తో బేరాల ప్రక్రియ స్తంభించిపోయినట్లు రాజకీయ వర్గాలు గుసగుసలు వినిపిస్తుంటాయి. దళితుడినే ముఖ్యమంత్రిని చేస్తానని ఆయన మాటలు చెబుతుంటారు… పార్టీ తరఫున ఓ భారీ బహిరంగ సభ పెడితే దళితుడికి కనీసం మాట్లాడే ఛాన్సు కూడా ఇవ్వలేదని ఆయన చేతలు నిరూపిస్తుంటాయి. తనది పన్నెండేళ్ల పోరాటం అని అంటారు. కానీ ఉద్యమం జరిగిన ప్రతిసందర్భంలోనూ ఆయన ఫాం హౌస్‌లోనో, ఢిల్లీ గల్లీల్లోనో ఉండిపోయారే తప్ప.. ఏనాడో రోడ్డెక్కింది లేదు. అయితే.. తెలంగాణ కోసం జరిగిన ఆత్మహత్యలు, అలా అని తాము అభివర్ణించిన చావులు, విద్యార్థి పోరాటాలు, లాఠీచార్జిలు ఇవన్నీ కూడా ఆయనేక అనుకోని వరాల్లా కలిసి వచ్చాయి. అన్నిటినీ ఆయన అనువుగా వాడుకున్నారు. తీరా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ స్వప్రయోజనాల కోసం రాష్ట్రం ఇవ్వదలచుకుంటూ ఉంటే… అదేదో తాను సాధించిన ఘనత కింద టముకు వేసుకోవడానిక తన గణాలనంతా పురమాయించేస్తున్నారు. అన్నింటినీ మించి.. ‘తెలంగాణ జాతిపిత’ అనిపించుకోవాలనే ఉలాటపడిపోతున్నారు.

అయితే ఇప్పుడు తాజా పరిస్థితిని గమనిస్తోంటే కరడుగట్టిన తెలంగాణ వాదుల్లోనే రకరకాల అనుమానాలు రేగుతున్నాయి. ఇక్కడ ప్రజల కళ్లు నెమ్మదిగా తెరచుకుంటున్నాయి. రాష్ట్రం వచ్చేస్తున్నదని అనుకుంటున్న వేళ.. ‘ఉద్యమ పార్టీ’(!)కి ఉన్న ముసుగు పొరలు తొలగిపోతున్నాయి. ఈ సంగతుల్ని గులాబీదళం కూడా గమనిస్తూనే ఉంది. తెలంగాణ సాకారం అయిపోతే తెరాస అస్తిత్వం ప్రశ్నార్థకం అవుతుందనే భయం ఒకవైపు. దానికి ‘పునర్నిర్మాణ బాధ్యత’ అనే మందు రాసేశారు కేసీఆర్. అయితే తాజాగా పునర్నిర్మాణంలో భాగంగా.. చేస్తున్న  డిమాండ్లు లేదా సీమాంధ్రుల విషయంలో చేస్తున్న హెచ్చరికలు ఇవన్నీ గమనిస్తున్న వారు.. కేసీఆర్ తీరుతో జడుసుకుంటున్నారు. కేసీఆర్ ‘పునర్మిర్మాణ యజ్ఞం’ ఏకంగా.. రాష్ట్రం ఏర్పడకుండానే అడ్డుపడుతుందేమో అని, సైంధవపాత్ర పోషిస్తుందేమోనని భయపడుతున్నారు. చాలా చాలా మంది ఆరోపిస్తున్నట్లు ‘తెలంగాణ రాష్ట్ర రావడం కేసీఆర్‌కే ఇష్టంలేదు’ అనే మాటలకు ఆచరణ రూపంగానే ఆయన ప్రస్తుత ప్రవర్తన, డిమాండ్లు ఉంటున్నాయని ఆశ్చర్యంగా గమనిస్తున్నారు. 

ఏ పనిలోనూ సార్వజనీనమైన మంచి ఉండదు. సార్వజనీనమైన చెడు కూడా ఉండదు. అయితే ఒకే పనిని రెండు రకాలుగా పరిగణించే రెండు వర్గాల మధ్య వ్యత్యాసం చాలా ఉంటుంది. ఫరెగ్జాంపుల్… కేసీఆర్‌ను హీరోగా ఎంచే తెలంగాణకు, విలన్‌గా పరిగణించే సీమాంధ్రకు మధ్య వ్యత్యాసం ఉన్నట్లు. అయితే ఇక్కడ తమాషా ఏంటంటే… తన గురించి రెండు ప్రాంతాల ప్రజలు రెండు రకాలుగా అనుకుంటే ఎవ్వరూ చింతించాల్సిన అవసరం లేదు. అయితే.. ఎటూ తాము ఒక ప్రాంతాన్నే ప్రయారిటీగా ఎంచుకుంటారు గనుక.. వారికి వచ్చే నష్టం కూడా ఉండదు! అయితే తాము ఎంచుకునే ఒకే ప్రాంతానికే చెందిన ప్రజలు తనను రెండు రకాలుగాచూస్తూ ఉంటే ఎవ్వరికైనా అది మింగుడుపడని వ్యవహారం అవుతుంది. 

తాను ‘తెలంగాణ జాతిపిత’ కావాలనేది కేసీఆర్ కోరికే కావొచ్చు గాక! కానీ.. రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ముందుకు సాగుతున్న కొద్దీ.. రాష్ట్రం వచ్చేయబోతున్నదన్న ఉత్సాహంలో కేసీఆర్ చేస్తున్న ప్రకటనలు, ప్రదర్శిస్తున్న దూకుడు, చాణక్యం, కౌటిల్యం ఇవన్నీ.. ఆ ప్రాంత ప్రజల్లోనే రకరకాల అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఒక్క తెలంగాణ ప్రాంతంలోనే ఆయనను హీరోగా ఎంచే వర్గం తగ్గిపోతూ ఉందన్నమాట వాస్తవం. 

కేసీఆర్ యావత్తు తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు తాను ఒక కేంద్రీకృత ఉద్యమ రూపంగా నిలిచాడా.. లేదా, తాను సంకల్పించిన అధికార మార్గాన్ని ప్రజలందరి మెదళ్లలోకి ఉద్యమం రూపంలో చొప్పించారా? అనేది పాత సంగతి. అయితే రాష్ట్ర సాధన ఉద్యమ లక్ష్యాలను, ఇతరులు చేసే పోరాటాలను, ఎవరో చేసిన త్యాగాలను… రాజకీయ అధికార ప్రాప్తికి  తాను నిచ్చెనమెట్లుగా వాడుకుంటూ పరమపదసోపాన పటంలో పైపైకి ఎగబాకిన కేసీఆర్ అధికార ప్రాప్తికి శాశ్వతత్వం కల్పించుకోవడానికి ‘పునర్నిర్మాణం’ అనే కవచం తొడుగుతున్నట్లు అనుమానించే వారు పెరుగుతున్నారు. తెలంగాణలో ఉన్న సీమాంధ్ర ప్రజల గురించి గానీ, ఆ ప్రాంతానికి దక్కవలసిన వాటాల విషయంలో గానీ, సగంలో ఉన్న కొన్ని పనులు ప్రాజెక్టుల విషయంలో గానీ… ఆయన చేస్తున్న ప్రకటనలు… ఇవన్నీ గమనిస్తున్న తెలంగాణ ప్రజలకు ‘రాష్ట్ర ఏర్పాటు ఆగిపోవాలనే చాటుమాటు లక్ష్యం కేసీఆర్ మదిలో లేదు కదా..?’ అనే కొత్త అనుమానం కలుగుతున్నది. 

ఇది కేసీఆర్ అప్రమత్తమై తన తీరును దారిని తాను సమీక్షించుకోవాల్సిన సమయం. ఇప్పటిదాకా ఆయన ఎన్ని నిచ్చెనలైనా ఎక్కిఉండవచ్చు గాక… కానీ ప్రజల్లో ఇప్పుడు మొలెకత్తుతున్న అనుమానం పెరిగి పెద్దది అయిందంటే గనుక.. చివరి అంచెలో ఉండే మహాభుజంగం దొరకబుచ్చుకుని ఆయనను మళ్లీ పరమపదసోపాన పటపు ఒకటవ గడికి తీసుకువచ్చేస్తుంది. ఎందుకంటే ఆయన తెలంగాణ కోసం చేస్తున్న ప్రయత్నాలు అన్నీ.. అచ్చం పరమపద సోపానపటంలాగానే… ఒక నిచ్చెన రెండు పాముల చందంగా సాగుతున్నాయి. 

‘విలీన’ షాక్ చిన్నది కాదు!

‘ప్రయోజనం అనుద్దిశ్య న మందోపి ప్రవర్తతే’ అంటాడు శతకకారుడు. అలాంటిది ఒక రాజకీయ పార్టీ ప్రయోజనం ఆశించని పని చేస్తుందని ఊహించలేం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ద్వారా కాంగ్రెస్ కూడా ఆ ప్రాంతంలో తమకు సురుచిరము, సుస్థిరము అయిన స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కోరుకున్నది. అలా కాంగ్రెస్‌ను ప్రేరేపించినది కూడా కేసీఆరే. ఆమధ్య చాలారోజుల పాటు ఢిల్లీలో తిష్ట వేసి తిరిగివచ్చిన కేసీఆర్.. ‘పార్టీని కలిపేయమన్నారు. కలిపేస్తనన్నా.. అయినా ఇవ్వలే’ దంటూ కాంగ్రెసుపై నిప్పులు చెరిగారు. తీరా కాంగ్రెసు స్పష్టమైన ప్రకటన చేసిన రోజునే విలీన ఆశలను కూడా సిగ్గులేకుండా బయటపెట్టుకుంది. కేసీఆర్ విలీనం చేస్తాడని ఆశిస్తున్నట్లు జులై 30న దిగ్విజయసింగ్ ప్రకటించారు.

కానీ ఎటూ పబ్బం గడచిపోయింది అని కేసీఆర్ అనుకున్నారు. పైగా తన కొడుక్కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని, కూతురుకు కేంద్ర మంత్రి పదవి ఇవ్వాలని ఇలా రకరకాల డిమాండ్లను వినిపించి కేసీఆర్ గతంలోనే కాంగ్రెసును బెదరగొట్టారని కూడా వార్తలు వచ్చాయి. అవన్నీ ఒప్పుకోకుండా.. లబ్ధి ఏదో తామే పొందడానికి కాంగ్రెస్ విభజన ప్రస్తావన తేగానే, విలీన హామీ విషయంలో ఆయన గరిట తిరగేశారు. ‘తెలంగాణ పునర్నిర్మాణం’ అనే పాటను తెరమీదకు తెచ్చారు. కాంగ్రెస్ కు పరిస్థితి అర్థమైంది. కేసీఆర్ విలీన హామీతో తమతో ‘ఆడుకున్నాడని’.. తాము పప్పుసుద్దల్లాగా తప్పులో కాలేశామని.. నూటపాతికేళ్ల అనుభవం గల పార్టీకి ఆలస్యంగా అర్థమైంది. 

తెలంగాణ ఏర్పాటు విషయంలో తమ చిత్తశుద్ధిని అనుమానించే పరిస్థితి రాకుండానే.. ఇప్పుడు కేసీఆర్ యుక్తికి చెక్ పెట్టే పనిలో ఉంది. 

జీవోఎంకు నివేదిక పెద్ద కామెడీ

విభజన విధివిధానాలను తేల్చడానికి కేంద్రం ఏర్పాటుచేసిన మంత్రుల కమిటీకి తెరాస ఇచ్చిన నివేదిక ఓ పెద్ద కామెడీ. కేసీఆర్ భజన చేసే వీర తెలంగాణ వాదులు కూడా అందులోని డిమాండ్లను చూసి గొంతెమ్మ కోరికలు అంటూ నవ్వుతున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ ప్రాజెక్టులకు కూడా జాతీయ  ెదా, అదే సమయంలో పోలవరం ప్రాజెక్టులో డిజైన్ మార్పు, హైదరాబాదుపై సర్వాధికారాలు మావే కేంద్రం మరియు గవర్నరు చేతిలో ఏమీ ఉండడానికి లేదు, ఉమ్మడి రాజధాని పర్లేదు కానీ రెండేళ్లలోగా సీమాంధ్రుల రాజధానిని నిర్మించి పంపేయాలి, ఇన్నాళ్లుగా దోపిడీకి గురైనందుకు గాను నాలుగు లక్షల కోట్ల రూపాయల పైచిలుకు పాే్యకజీని తెలంగాణ ప్రాంతానికి ప్రకటించాలి. 

ఈ కోరికలు వినగానే కేంద్రానికి ‘ప్రాణంబుల్ ఠావుల్దప్పెను, ధైర్యము విలోలంబయ్యె’ అన్నట్లుగా గుండె జారిపోయి ఉంటుందనుకోవచ్చు. 

వ్యాపారాలే కాదు.. ప్రగతి మీదా కక్షేనా?

కేసీఆర్ ప్రభృతులు నిత్యం దుమ్మెత్తిపోస్తూ ఉండే సీమాంధ్రకు చెందిన వ్యాపారులు హైదరాబాదులో అనేకులు ఉన్నారు. లగడపాటి రాజగోపాల్ కూడా వారిలో ఒకరనడంలో సందేహం లేదు. వీరందరూ తెలంగాణ ఆస్తుల్ని , ఇక్కడి ప్రజల సంపదను దోచేసుకుంటున్నారంటూ తెరాస విమర్శిస్తూ ఉంటుంది. వ్యాపారాల గురించి వారికి తోచినట్లుగా విమర్శించుకోవడానికి వారికి హక్కుంటుంది. కానీ మెట్రో రైలు వంటి అభివృద్ధి పనులను కూడా విమర్శించడం అంటే తెరాస ఉద్దేశ్యాలను అనుమానించాల్సిన పరిస్థితి. 

మెట్రో ప్లాన్, డిజైన్‌లో లోపాలు ఉంటే గనుక.. పనులు మొదలై ఇన్నాళ్లు గడిచేవరకు తెరాస మౌన ప్రేక్షక పాత్ర ఎందుకు పోషించినట్లు? మెట్రో ప్రాజెక్టు పూర్తయ్యాక తెలంగాణ రాష్ట్రం వచ్చే పరిస్థితి ఉంటే అప్పుడేం చేస్తారు. ఎల్ అండ్ టీ పనుల్ని వందకోట్ల ముడుపులకు ముడిపెట్టడంతోనే.. కేసీఆర్ బేరాలకు తెరతీస్తున్నాడనే విమర్శలు సర్వత్రా వ్యాపించేశాయి. మెట్రో విమర్శలపై తమ చిత్తశుద్ధిని నిరూపించుకునే అవకాశం కూడా వారికి లేదు. ఎందుకంటే అలాంటిది ఉంటే గనుక.. ఇన్నాళ్లూ కిమ్మనకుండా ఉండేవాళ్లే కాదు. 

హైద్రాబాద్‌పై అసూయముద్ర

కేసీఆర్ హైదరాబాదు తమ తెలంగాణ గుండెకాయ అంటూ ఎన్నికబుర్లు అయినా చెప్పవచ్చు గాక.. అయితే.. హైదరాబాదులో ఆయన పార్టీకి కాలూనడానికి కూడా జాగా లేదన్నది వాస్తవం. నగరంలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా తనకంటూ కొంత స్థానం ఇక్కడ సంపాదించుకోవడం కూడా అసాధ్యం అని కేసీఆర్‌కు తెలిసిపోయింది. అందుకే ఆయన హైదరాబాదు మీద పగబట్టినట్లు ఇక్కడి అభివృద్ధిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారనే ప్రచారం కూడా మొదలైంది. మెట్రో పనులపై విమర్శలతో ఆయన కొరివితో గోక్కున్నారనే చెప్పాలి. హైద్రాబాద్ సీట్లు ఎటూ తమకు రావు గనుక.. ఇక్కడ వీలైనంత రభస చేయాలని ఆయన అనుకున్నట్లు ప్రజలు భావిస్తున్నారు. 

ఈ మెట్రో వ్యవహారంలో హైదరాబాదులో పట్టు ఉన్న ఎంఐఎంపై కూడా బురద చల్లాలనేది కేసీఆర్ వ్యూహం కావొచ్చు. మొజాంజాహి మార్కెట్ తదితర ప్రాంతాల్లో మెట్రో చారిత్రకర సంపదను మరుగు పరిచేస్తుందనే సంగతిని తాను భుజానికెత్తుకోవడం ద్వారా, సదరు నిజాం కాలం నాటి చారిత్రక వారసత్వ సంపద గురించి ఎంఐఎం దృష్టి సారించలేదని పరోక్షంగా వారిమీదకు ఆపాదించడం కేసీఆర్ వ్యూహం కావొచ్చు. కానీ ఆ వ్యూహాలు ఫలించే పరిస్థితి లేదు గానీ.. ఇప్పుడు తెలంగాణ ఇస్తే ఇలాంటి నగర అభివృద్ధి పనులను కేసీఆర్ అడ్డుకుంటాడనే భయం కేంద్రంలో కలగడానికి మాత్రం ఆయన కారకులు అయ్యారు. 

కిరణ్ మీద బురద చల్లితే ఏమొస్తుంది!

కేంద్రం లోని కాంగ్రెస్ సర్కారు ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ రాష్ట్రం ఇవ్వదలచుకున్నదనేది ఖరారు. రాష్ట్రం ఇవ్వకముందే కేంద్ర ప్రభుత్వం పతనం అయిపోతే తప్ప.. ఇందులో భిన్నాభిప్రాయం లేదు. అలాంటప్పుడు కాంగ్రెసులోని ఎవ్వరూ దీన్ని అడ్డుకోగలగడం కూడా అసాధ్యం. పనిగట్టుకుని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డిని తెలంగాణ పాలిట విలన్‌గా అభివర్ణిస్తూ.. నిత్యం తిట్టిపోయడం కూడా కేసీఆర్ చేజేతులా వేసుకుంటున్న మైనస్ మార్కులు అని చెప్పాలి.  జగన్ సమైక్య శంఖారావం సభ విషయంలో అది వీడ్కోలు సభ అని దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్న తెరాస నాయకులు, కేసీఆర్ దళం.. కిరణ్ విషయంలో ఎందుకు ఆ సహనం పాటించలేకపోతున్నారో అర్థం కాదు. 

ఈ తిట్లన్నీ ఉమ్మడిగా కాంగ్రెస్‌ను తిడుతున్న తిట్లుగా మారి.. కేంద్రం ఇంత చేస్తున్నా.. రాష్ట్రం ఇస్తున్నా కేసీఆర్ నోటి దూషణలు తప్పడం లేదనే వెరపునకు వచ్చినా ఆశ్చర్యం లేదు.

మసకబారుతున్న ధీ(హీ)రోదాత్త ఇమేజి

పోరాటం జరిగినంత కాలమూ కేసీఆర్ కు హీరో ఇమేజి ఉన్న మాట వాస్తవం. అయితే అది కూడా ఆయన స్వయంగా పోరాడి సాధించుకున్న ఇమేజి కాదు. ఆయన వందిమాగధులందరూ పొగడి కట్టబెట్టిన ఇమేజి..! అయితే విజయం దక్కిన తర్వాత.. పోరాటానికి విలువ ఏముంటుంది. ఓ చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. ‘‘మా ఊళ్లో జూనియర్ కాలేజీ కావాలి అంటూ ఓ కుర్రాడు దీక్ష చేశాడనుకుందాం. ప్రభుత్వం స్పందించి ఇచ్చేసింది. కుర్రాడి దీక్ష వలనే కాలేజీ వచ్చింది కదాని అతణ్ని ఊరేక పాస్ చేయరు కదా! పరీక్ష బాగా రాస్తే మాత్రమే పాస్ చేస్తారు’’ కేసీఆర్ పరిస్థితి కూడా అదే! చెప్పుకోడానికి రెండు రాజీనామాలు, నిరాహార దీక్షలు తప్ప మరొకటి లేకపోయినా.. కేసీఆర్ తన తన ఘనతే అని చాటించుకోగలరు. ఆయన పోరాటం వలన రాష్ట్రం వచ్చిందని ఆయన మరియు ఆయన వందిమాగధులు భావించవచ్చు గాక! కానీ, నెగ్గడానికి అది సరిపోదు.

కేసీఆర్ లేది ఇతర తెవాదులు అరవయ్యేళ్ల ఆకాంక్ష, పోరాటం అని తెలంగాణ లక్ష్యం గురించి అయు:గణన చేస్తుంటారు. మరి అంతసుదీర్ఘ పోరాటంలో కేసీఆర్ పాత్ర ఎంత. పట్టుమని పన్నెండేళ్లే. కేసీఆర్ కోరుకుంటున్నట్లుగా తెలంగాణ సాధన అనేది అయిదుగురు అథ్లెట్లు ఉన్న రిలే రన్నింగ్ రేస్ లాంటిది అని అనుకుంటే.. ‘బేటన్’ (అంచెల్లో పరుగెత్తే అథ్లెట్లు ఒకరి తర్వాత ఒకరు అందించుకునే కర్ర)ను చివరిగా అందుకున్న అథ్లెట్ తాను అయినందుకు తనొక్కడినే విజేతగా ప్రకటించమని కేసీఆర్ అడిగితే ఎలా కుదురుతుంది?

అందుకే తాను చివరి అంచెలో ఉన్న పోరుయోధుడిని గనుక.. తన సమక్షంలో రాష్ట్రం వస్తున్నది గనుక.. ప్రజలంతా తననే నవధీరుడిగా గుర్తించాలని కేసీఆర్ ఆకాంక్షిస్తే.. అది ఈడేరకపోవచ్చు. అందరితో ఒకడిగా ఆయన కూడా పోరుసీమలో నిలవాల్సిందే. అంతకంటె ముందు.. తెలంగాణ ఎన్నికల ఒకవేళ ఏర్పడకపోతే గనుక.. అంది కేసీఆర్ వల్లనే అని ప్రజలు ‘సైంధవుడి’గా గుర్తించకముందే ఆయన నిదుర మేల్కోవాలి. తనను తన పోరాటాన్ని సంస్కరించుకుని ముందుకు సాగాలి.

కపిలముని

[email protected]