లవ్‌లెటర్‌ టు ‘భారతరత్న’ : అయ్యా మేమున్నాం…

ప్రియమైన సిఎన్‌ రావుగారూ…  Advertisement మీరు చాలా గొప్ప శాస్త్రవేత్త. ఈ విషయం యావత్‌ భారతజాతి గట్టిగా విశ్వసిస్తోంది. ఈ విషయంలో ఎలాంటి భేదాభిప్రాయలు మాలో లేవు. మీరు చాలా గొప్ప శాస్త్ర పరిశోధనలు…

ప్రియమైన సిఎన్‌ రావుగారూ… 

మీరు చాలా గొప్ప శాస్త్రవేత్త. ఈ విషయం యావత్‌ భారతజాతి గట్టిగా విశ్వసిస్తోంది. ఈ విషయంలో ఎలాంటి భేదాభిప్రాయలు మాలో లేవు. మీరు చాలా గొప్ప శాస్త్ర పరిశోధనలు సాగించిన మహోన్నత శాస్త్రవేత్తలు. ఈ విషయాన్ని గుర్తించే భారత ప్రభుత్వం కూడా మీకు భారతరత్న పురస్కారాన్ని ప్రకటించి మిమ్మల్ని గౌరవించింది. ఇలాంటి మీరు భారతదేశంలో పరిశోధనలను సాగించడానికి అంబానీ, టాటాల వంటివారు ముందుకు రావాలని కోరడం సముచితంగా లేదు. 

ఏ విషయాన్నైనా వ్యాపార దృష్టితో చూసే అంబానీల వంటివారు తమకు ఎలాంటి ప్రయోజనాన్ని చేకూర్చలేని మీరుచేసే పరిశోధనలకు చేయూతనందిస్తారా…? ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి విషయాలకు అంబానీ వంటివారు దన్నుగా నిలిచిన సందర్భాలు ఏవైనా ఉన్నాయా…? ఆయన ఏమైనా దానంగా ఇస్తే దేవుడికి మాత్రమే ఇస్తారు. ఎందుకంటే వారిద్దరికీ మధ్య ఇచ్చిపుచ్చుకోవడాలు ఉంటాయి కాబట్టి. ఈయన ఆయనకు కొంత మొత్తంలో డబ్బు హుండీలో వేస్తే… దానికి బదులుగా ఆయన చాలా పెద్ద మొత్తంలోనే ఈయనకు మేలు చేకూర్చి ఉంటారు. అంతకుమించి ఈయన ఆయనకు ఉదారంగా ఇచ్చేది కూడా ఉండదు. అలాంటి అంబానీని పరిశోధనలకు సాయం అందించాల్సిందిగా మీరు దేబిరించడం మీ హోదాకు తగింది కాదు. మీరు నిజంగా పరిశోధనలు సాగించాలనుకుంటే మేమంతా మీకు అండగా ఉంటాం. మీరు మమ్మల్ని మరిచిపోయినట్టున్నారు. భారతీయులమైన మేమంతా మీకు తోడుగా ఉంటాం. 

మీరు చాలా నిజాయితీ గలిగిన శాస్త్రవేత్తగా మేమంతా మిమ్మల్ని విశ్వసిస్తున్నాం. మిమ్మల్ని నమ్మలేకపోవడానికి మీరేమీ రాజకీయ నాయకులు కాదుకదా… కాబట్టి మీ పరిశోధనలను, వాటివల్ల ఒనగూరే ప్రయోజనాలను మేమంతా నమ్ముతున్నాం. నిజంగా పరిశోధనలను సాగించాలనునే చిత్తశుద్ధి మీలో ఉంటే ఇందుకోసం మీరు ప్రత్యేకంగా ఒక ఆర్గనైజేషన్‌ను ఏర్పాటు చేయండి. దీనికి తోచిన విరాళాలను అందించాల్సిందిగా మీరు ప్రజలకు పిలుపునివ్వండి. మీ పిలుపునకు స్పందించేందుకు ఇక్కడ యావత్‌ భారతజాతి సిద్ధంగా ఉంది. 

సగర్వంగా చెప్పుకోవడానికి  మొత్తం వందకోట్ల మంది భారతీయులు ఉన్న జాతి మనది. మీ పరిశోధనలకు తమ సహకారం అందించడానికి ముందుకు రాలేరా. కనీసం సగం మంది వస్తారని అనుకుందాం. పోనీ.. పది మందిలో ఒక్కరు స్పందించాలని కోరుకుందాం. తప్పకుండా ఆ మాత్రం జరుగుతుంది. ఎందుకంటే ఓ మంచి శాస్త్రవేత్తగా మీకున్న క్రెడిబిలిటీ అది! ఎందుకంటే.. ఈ జాతిని భవిష్యత్తులోనూ శాస్త్రపరిశోదనల్లో ప్రపంచానికి తలమానికంగా తీర్చగలరని మీమీద ఉన్న నమ్మకం అది! మీ పిలుపునందుకుని దేశంలోని ఒక్కో పౌరుడు ఒక్కో రూపాయిని వేసినాకూడా నెలకు వంద కోట్ల వరకూ నిధులు పోగవుతాయి.  లేదా కనిష్టంగా మనం అనుకున్నట్లు పదిమందిలో ఒక్కడు స్పందించినా.. ఆ ఒక్కడూ పది రూపాయల వంతున వేసినా.. ఒక్కొక్క నెలకు వంద కోట్ల రూపాయల నిధులు. మీ పరిశోధనలకు ఈ నిధులు సరిపోతాయనే భావిస్తున్నాం. అలాకాకుండా మీరు పెద్ద పెద్ద కంపెనీలు ముందుకు రావాలని అడుక్కోవడం బాగాలేదు. మీరు కోరుకున్నట్టు పెద్ద పెద్ద కంపెనీలు ఇచ్చే ముష్టికన్నా ఇలాంటి ఆశావహ, ఆత్మవిశ్వాసభారతం ఎక్కువ మొత్తమే వస్తుందని చెప్పవచ్చు. 

మనదేశానికి సంబంధించి ఎలాంటి మీ అంతటి మేధోపరమైన ఉత్పాదనల మీద.. ఈ వ్యాపారాత్మక కంపెనీల ముద్ర లేకుండా ఉండేలా చూడండి. మీరు కోరినట్లు రిలయన్స్‌ టాటా లాంటి సంస్థలు ఇవ్వగానే శాస్త్ర పరిశోధన పూర్తి కాదు కద! అందుకు అనివార్యంగా మీ మేధోశక్తి కూడా తోడు కావాల్సిందే. నిజానికి వారిచ్చే కోట్లకన్నా ఇదే ఎక్కువ మరి అలాంటప్పుడు.. మీ మేథోజనితమైన జాతి సంపద మీద ఒకటిరెండు కంపెనీలు బ్రాండింగ్‌ లేకుండా చూడండి. ఏదైనా సరే భారతజాతికి సంబంధించినదిగా ప్రపంచానికి పరిచయం చేయండి. ఇది టాటా బ్రాండు, ఇది అంబానీ బ్రాండు అంటూ మనదేశానికి సంబంధించిన మేధస్సుపై వారి బ్రాండు ముద్ర లేకుండా ఇది భారతదేశానికి సంబంధించిన బ్రాండు అనే ముద్రను ఉండేలా చూడండి. అంతగా శాస్త్ర పరిశోధనల ముచ్చట వారికి ఉంటే.. ప్రజలతో పాటూ వారూ విరివిగా విరాళాలు ఇవ్వవచ్చు. అంతే. 

మీ పరిశోధనలకు మేమంతా దన్నుగా ఉంటాం. అలాంటి దిశగా మీరు ఆలోచించండి. మీకు మేము తోడుంటాం. ఈ జాతి తోడుంటుంది. ఈ జాతి గొడ్డుపోలేదు. ఈ జాతిలో విశ్వాసం, స్ఫూర్తి, ఆశాదీప్తి ఇంకా చచ్చిపోలేదు. ఈ విషయాన్ని మీరు గుర్తించి, ఇకనైనా పెద్ద పెద్ద కంపెనీలు పరిశోధనలకు సహాయం అందిచేందుకు ముందుకు రావాలని దేబిరించడం మానేయండి. మేము మీకు మా తోడందిస్తామనే విషయాన్ని గుర్తించండి చాలు. క్రియాశీల, ఆచరణశీల, నిర్మాణాత్మక ప్రతిపాదనల్ని రూపొందించండి. బాగుంటుంది. 

-ప్రేమతో మీ 

కపిలముని

[email protected]