లవ్‌లెటర్‌ 2 జగన్‌! స్పీడందుకోవాలమ్మా…!!

డియర్‌ జగన్‌ బాబూ! Advertisement రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి నీవంతు ప్రయత్నం నువ్వు అలుపెరగకుండా చేస్తా ఉంటే.. చాలా ముచ్చట వేస్తున్నాది. ఇప్పటిదాకా కాళ్లకి విమానాలు కట్టుకోని, కోర్టు వారినుంచి పర్మిషన్లు పుట్టించుకుంటా… దేశంలో…

డియర్‌ జగన్‌ బాబూ!

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి నీవంతు ప్రయత్నం నువ్వు అలుపెరగకుండా చేస్తా ఉంటే.. చాలా ముచ్చట వేస్తున్నాది. ఇప్పటిదాకా కాళ్లకి విమానాలు కట్టుకోని, కోర్టు వారినుంచి పర్మిషన్లు పుట్టించుకుంటా… దేశంలో ఉండే శానా శానా ఇంపార్టెంటు రాష్ట్రాలన్నీ తిరిగేశావు.. శానామంది నాయకుల్ని కలిసినావు. కొందరు నీమాటకు జై కొడతాంటే మరి కొందరు ‘నై పొమ్మంటున్నారు’. సరే ఏదైతే అదౌతాది లెమ్మనుకుని ఆ సెంద్రబాబు కుప్పం నిండా సమైక్యం అంటూ గర్జించి సూపించినావు. అక్కడితో యాత్రను మడతెట్టేసి.. పోయినావు. ఇదంతా బాగానే ఉండాది గానీ జగన్‌బాబూ.. నువ్వు ఇంకా కాస్త స్పీడందుకోవాలని అనిపిస్తాండాది. గేరు మార్చకుంటే నీబండి గమ్యం అందుకునే లోగా.. రాష్ట్రం రెండు ముక్కలు అయిపోవడం గూడా ఖరారుగా కనిపిస్తాండాది. 

జగన్‌ బాబూ! నాకొక్క డౌటు! మన స్టేటు రెండు ముక్కలు అయిపోకుండా ఉండేదానికి రాజ్జాంగంలో మూడో ఆర్టికలును కరెక్షన్లు జేసేసి చక్కబెట్టేస్తే చాలు అని నువ్వంటాండావు. దానివల్ల.. మూడింట రెండొంతుల మంది ఓట్లేస్తే తప్ప రాష్ట్రాల్ని ముక్కలు కింద నరికెయ్యడం కుదర్దనేది నీ మాట. అంతకాడికి నాక్కూడా సక్కంగానే అర్తమయినాది. ఆ మూడో ఆర్టికలు ను మార్చాలని నువ్వు పట్టుబడతన్నావు.. దేశంలో జనాన్ని కలిసి నీమాటకు అనుకూలంగా వాళ్ల మాట కూడా తీసుకుంటానే ఉన్నావు. ఇదంతా ఓకే. 

అయితే ఒక పక్క తెలంగాణోళ్ల బిల్లు విల్లులోంచి వదిలేసిన బాణంలాగా ఒక్కొక్క మజిలా దాటుకుంటా వచ్చేస్తా ఉండాది.. ఇక నువ్వు చేసిన పెయత్నాలన్నీ.. ఎప్పుటికి  దాన్ని అడ్డుకోవాల. మూడో ఆర్టికలును విష్ణు చక్రంలాగా అడ్డాం పెట్టి.. తెలంగాణకు బ్రేకులు వెయ్యాలన్న నీ కోరిక తీరాలంటే గనుక.. ఆ బిల్లు వచ్చే ముందే.. దీన్ని సవరించడానికి నువ్వు పెయత్నం జెయ్యాల. మరి అటేపేమో బిల్లొచ్చేస్తన్నాది.. ఇక్కడ మీ పక్షాన.. ఇప్పుటి దాకా.. ఒక్క అడుగు కూడా ముందుకు పడ్డంలే!

తెలంగాణ బిల్లు సభ ఎదటకి వచ్చేలోగా.. తమరే మూడో ఆర్టికలును సవరించడం గురించి బిల్లు బెట్టి.. దాని మీద చర్చ బెట్టేయాలి గదా! దాన్ని సవరించడమో.. లేపోతే, దాని మానాన్న దాని వొదిలెయ్యడమో ఏదోటి తేలిపోవాల గదా.. కానీ మీరు ముందడుగే ఎయ్యకుండా ఇంచా మంతనాలు సాగిస్తా ఉంటిరి? ఏంటి లాభం? ముందు మీరు సభలో మూడో ఆర్టికలు సవరించడానికి బిల్లు పెట్టాల..! దాని మీద చర్చ జరిగేలాగా, నిర్ణయం వచ్చేలాగా చూడాల! ఇదంతా కూడా తెలంగాణ బిల్లు పార్లమెంటుకు వొచ్చేలోగా జరిగిపోవాల…! కనీసం మీ బిల్లు చర్చ జరగకుండా ఆగిపోయినా కూడా.. దానికి దీనికి లింకుండాది కాబట్టి.. ఆ లింకును బట్టి అప్పుడు తెలంగాణ బిల్లు కూడా ఆగిపోయే పరిస్తితి వొస్తాది అంతే తప్ప.. మీరు ఇంకా నాయకుల్ని మాత్రమే కలుసుకుంటా గడిపేస్తా ఉంటే.. మూడో ఆర్టికలు సవరిద్దాం సవరిద్దాం అని చెప్పుకుంటా తిరగతానే ఉంటే.. పిల్లి మెడలో గంట కట్టేదెవరని? తమరు చెప్పే సదరు సవరణకు ప్రెవేటు బిల్లు మాదిరిగా అయిన ప్రవేశపెట్టేది ఎవరని?

అందుకే జగన్‌బాబూ.. తమరు మరింత శ్రద్ధగా పూనుకోవాల! గేరు మార్చాల!! కాస్త స్పీడు పెంచి బండిని ముందుకు ఉరికించాల. ఏదైనా సాదించదలచుకుంటే దాన్ని గభాల్న తేల్చేయాల.. నాన్చతా టూరింగు టాకీసులాగా స్టేట్లంతా తిరగతా పొద్దులు గడిపేస్తే పెయోజనం ఏటుంటాది? రవ్వంత ఆలోచించండి!!

ప్రేమతో

కపిలముని]

[email protected]