అయ్యా ప్రధానమంత్రి శ్రీ మన్మోహన్ సింగ్ గారూ…
మీరు చాలా గొప్పవారు. అయితే ఒక దేశానికి ప్రధానమంత్రి హోదాలో ఉన్న మీరు అందరినీ ఒకే విధంగా పక్షపాత రహితంగా చూడాల్సి వుంది. అలావుండాల్సిన మీరు కేవలం ఒక పార్టీ విషయంలో పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారు. దీనికి కారణం ఏమై ఉంటుంది…? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయాలని కాంగ్రెస్ పార్టీ సంకల్పించింది. దీన్ని ఇటు రాష్ట్రంలోని కాంగ్రెస్ మినహా మిగిలిన పార్టీలన్నీ వ్యతిరేకించాయి. తెలుగుదేశం పార్టీ రెండు ప్రాంతాలకు సమన్యాయం జరగాలంటూ వాదన చేస్తోంది. రాష్ట్రంలోని పలు పార్టీలవారు మిమ్మల్ని కలిసి తమ సమైక్య వాదనలను వినిపించారు. అయితే సమైక్య వాదాన్ని గట్టిగా వినిపిస్తున్న వైకాపా అధినేత జగన్‌కు మాత్రం మీరు అప్పాయింట్‌మెంట్ ఇవ్వడంలేదు.
తాను బెయిలుపై విడుదలై బయటికి వచ్చిన తర్వాత ఢల్లీి వెళ్లడానికి కోర్టు వద్దనుండి అనుమతి పొందిన తర్వాత మిమ్మల్ని కలవడానికి అనుమతినివ్వాల్సిందిగా జగన్ అప్పుడే మీకు లేఖ రాసుకున్నారు. కానీ అప్పటినుండీ ఇప్పటి వరకూ ఆయన మిమ్మల్ని కలవడానికి మీరు అనుమతినివ్వడం లేదు. మీకు లేఖ రాసిన తర్వాత ఆయన రెండు పర్యాయాలు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. తనను కలవడానికి రాష్ట్రపతి అంతటివారు రెండుసార్లు జగన్‌కు అనుమతినిచ్చారు. రాష్ట్రం సమైక్యంగా ఉంచాల్సిన ఆవశ్యకతను గురించి జగన్ చెబుతున్న వాదనలను రాష్ట్రపతి విన్నారు. అయితే మీరు మాత్రం ఇంతవరకూ అనుమతినివ్వడంలేదు.
జగన్ మీ గౌరవ లోక్‌సభలో సభ్యుడు. ఆయనకు అపాయింట్‌మెంట్ తిరస్కరించడంలో మీరు ప్రత్యేకమైన నైతిక విలువలను పాటిస్తున్నారని అనుకోవాలా? లేదా, మాననీయ ప్రథమపౌరుడి హోదాలో ఉన్న ప్రణబ్‌దాదాకు ఆ మాత్రం విలువలు తెలియవని అనుకోవాలా?
ఇదంతా చూస్తుంటే మిమ్మల్ని ఎవరు కలవాలి, మీరు ఎవర్ని కలవాలి, ఎవరితో ఏం మాట్లాడాలి అనే విషయాలను కూడా ‘అమ్మ’ అంగీకారంతోనే జరుగుతున్నాయా అనే సందేహం కలుగుతోంది. మిమ్మల్ని కలవాలంటూ అనుమతి కోరుతూ మీకు జగన్ రాసిన లేఖను మీరు అమ్మకు పంపితే, అక్కడినుండీ మీరు కలుసుకోవచ్చునంటూ అమ్మ ఆమోదముద్ర పొందిన లేఖ మీకు వచ్చినట్టు లేదు. అందుకే మీరు జగన్‌ను కలవడానికి ఇప్పటి వరకూ అనుమతినివ్వడంలేదు` అని మాలోని వెర్రిజనం అనుకుంటున్నారు. అమ్మ ఆమోదం లేక కాదు అని అనుకుంటే రాష్ట్రపతి అంతటివారు రెండుసార్లు జగన్‌ను కలవడానికి అప్పాయింట్‌మెంట్ ఇచ్చారు. మీరు ఆయనకన్నా ప్రముఖులా…? ఆయనకన్నా మీరు మరీ బిజీగా ఉంటున్నారా…?
అసలు సమైక్య వాదం గురించి వాదనలను వినడానికి కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు అందరికీ అనుమతినివ్వలేదు అనుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి బద్ధవైరం ఉన్న తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలకు కూడా మిమ్మల్ని కలవడానికి మీరు అప్పాయింట్‌మెంట్ ఇచ్చారు. ఒక్క జగన్‌కు మాత్రం మిమ్మల్ని కలవడానికి ఇంతవరకూ అనుమతి ఇవ్వడంలేదు. ఎందుకో…? మీకు జగన్‌ను నేరుగా కలవడానికి భయమా…? లేక జగన్‌ను కలవడం మీకు ఇష్టం లేదా…? లేక అమ్మ ఆమోదం లభించలేదా…? ఏ విషయం కాస్త స్పష్టంగా చెబితే బాగుంటుందికదా…!
-ప్రేమతో మీ
కపిలముని