బడ్జెట్ లో మోడీ సర్కారు ఆంధ్రప్రదేశ్ ను వంచించిన దరిమిలా ఒక శుభ సంకేతం కూడా కనిపిస్తోంది. ఎటొచ్చీ తెలుగుదేశం పార్టీ మోడీ సర్కారు మీద ప్రస్తుతం అలకపూని ఉంది. రాష్ట్రం హక్కుల కోసం అమీతుమీ తేల్చుకునే ఉద్దేశంతో ఉంది. అయితే సందట్లో సడేమియా అన్నట్లుగా.. ప్రత్యేకహోదా ను సాధించుకోవడానికి కూడా అవకాశం ఇంకా మిగిలే ఉన్నదని.. డోర్లు మూసుకుపోలేదని.. అవకాశాలు సజీవంగా ఉన్నాయని నిపుణులు సూచిస్తున్నారు.
కేంద్రం చేసే సాయం విషయంలో వారివి మాయమాటలు తప్ప మరొకటి కాదని ఇంత విపులంగా అర్థమైన తర్వాత.. ప్యాకేజీ గట్రా పనికిరాని మాటలను నమ్మడం దండగ అని.. తమకు విభజన చట్టం ఏదైతే చెబుతోందో.. అదే ప్రత్యేకహోదాను ఇచ్చి తీరాల్సిందేనని రాష్ట్రప్రభుత్వం పట్టుబట్టడానికి అవకాశం ఉన్నదని పలువురు విశ్లేషిస్తున్నారు. ఈ సందర్భంగా.. ప్రత్యేకహోదా అసాధ్యం అని ఏ కారణాల ఆధారంగా కేంద్రం ఎగ్గొట్టిందో వారు ప్రస్తావిస్తున్నారు.
జీఎస్టీ వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా అనేది దేశంలో ఎక్కడా ఉండబోదంటూ.. ఏ రాష్ట్రానికీ వర్తించబోదంటూ… గతంలో కేంద్రప్రభుత్వం , ఏపీ సర్కారుకు మాయ మాటలు చెప్పింది. అందువలన ప్రత్యేకహోదా కు బదులుగా , ప్రత్యేక ప్యాకేజీ ఇస్తాం అంటూ కబుర్లు చెప్పారు. అయితే ఇవాళ.. జీఎస్టీ వచ్చిన తర్వాత కూడా కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేకహోదా కొనసాగుతున్నట్లుగా కళ్లముందు వాస్తవాలు కనిపిస్తున్నాయి.
ప్రధానితో మంగళవారం నాడు భేటీ అయినప్పుడు తెదేపా కేంద్రమంత్రి సుజనా చౌదరి ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పారు కూడా! మరి ఆ క్లారిటీ తెలుగుదేశానికి ఉన్నప్పుడు.. ప్యాకేజీ కి తూచ్ అని ఎందుకు అనడంలేదు. మాకు ప్రత్యేకహోదా మాత్రమే కావాలి. ఇప్పటిదాకా మీరు ఎటూ పైసా విదిలించని.. ప్రత్యేక ప్యాకేజీని మీ వద్దే పెట్టుకోండి అని ఎందుకు పట్టుపట్టడం లేదు…? అనే ప్రశ్నలు ప్రజల మదిలో మెదలుతున్నాయి.
ఎటూ రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇచ్చి తీరాల్సిందేనని రాష్ట్రంలో విపక్ష పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ తొలినుంచి ఇప్పటిదాకా ఒకే మాట చెబుతోంది. పవన్ కల్యాణ్ లాంటి వారు కూడా తొలుత ప్రత్యేకహోదా అంశాన్ని లేవనెత్తి తర్వాత చప్పబడిపోయారు గానీ.. నిజంగా ఆ అవకాశం ఉన్నదని , ఉద్యమం రాజుకుంటే.. ఆయన కూడా చేతులు కలుపుతారు.
ఇలాంటి సమయంలో తెలుగుదేశం కూడా.. మాకు హోదా కావాల్సిందే అని పట్టు బడితే.. సాధించుకోవడం కొద్దిగా కష్టంమీద అయినా కుదురుతుందని పలువురు అంటున్నారు. ఒకసారి హోదా, దాని ద్వారా వెసులుబాటులు, ప్రయోజనాలు వచ్చాయంటే గనుక.. ఇక పారిశ్రామికీకరణ కోసం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ దేశాలు పట్టుకు తిరగాల్సిన అవసరం ఎంతమాత్రమూ ఉండదని, ఏపీ వైపు ప్రపంచ పారిశ్రామిక దిగ్గజ సంస్థలన్నీ పరుగెత్తుకుంటూ వస్తాయని.. నూటికి నూరుశాతం ఉపాధి కల్పనలు కూడా సాధ్యమవుతాయని.. అభివృద్ధిలో తిరుగులేని స్థాయికి వెళుతుందని పలువురు అంటున్నారు.
మరి ఆ దిశగా చంద్రబాబునాయుడు పునరుత్తేజితం అవుతారో లేదో చూడాలి. ఆయన భేషజాలకు పోకుండా, హోదా వద్దని ఒప్పుకున్నందుకు పశ్చాత్తాపాన్ని బహిరంగంగా వ్యక్తం చేసి.. ప్యాకేజీని కాలదన్ని పోరాటానికి దిగితే గనుక.. రాష్ట్రానికి మేలు చేసిన వారవుతారని ప్రజలు అంటున్నారు.