55 ఏళ్ల తన జీవితంలో.. సుమారు యాభయ్యేళ్లపాటూ సినీరంగంలోనే ఉన్న అపురూపమైన నటి శ్రీదేవి. ఆమె పోషించిన పాత్ర లేదు. సినీ పరిశ్రమలో ఉండే హెచ్చుతగ్గులు అన్నీ ఆమెకు స్వానుభవాలే. అయితే ఇంత సుదీర్ఘ అనుభవం… దేశవ్యాప్త క్రేజ్ ఉన్న శ్రీదేవి తన జీవితంలో చాలా బలంగా అనుకున్న ఒక్క కోరిక మాత్రం తీరకుండానే కన్నుమూయడం ఆమె అభిమానుల్ని బాధించే అంశం.
శ్రీదేవి తన నట వారసురాలిగా.. కూతురు జాన్వీ హీరోయిన్ అయితే వెండితెర మీద చూడాలని అనుకున్నది. కొన్ని సంవత్సరాలనుంచి శ్రీదేవి కూతురిని హీరోయిన్ చేసే ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఆమె కోరిక ఇంకా నెరవేరలేదు. జాన్వీ తొలిచిత్రం షూటింగ్ లో ఉండగానే ఆమె కన్ను మూసింది.
జీవితమంతా.. అశాంతి…
శ్రీదేవి జీవితం మొత్తం అశాంతి మధ్యనే కడతేరిపోయిందని ఎరిగిన వారు అంటుంటారు. సినీ జీవితం వైభవ దశలోనే ఉన్నప్పటికీ.. ఆమె వ్యక్తిగత జీవితంలో పలుమార్లు ఆమెకు ఎదురుదెబ్బలే తగిలాయి. చిన్నప్పటినుంచి బాలనటిగా సంపాదన ప్రారంభించినా.. ఆమె ఏం మిగలబెట్టిందో ఎంత ఆస్తులు ఉన్నాయో.. ఎంతో పోయాయో.. ఏమైపోయాయో ఎవ్వరికీ అర్థంకాని సంగతి.
తెలిసినంత వరకూ ఆమె చెల్లెలు శ్రీలతతో తగాదాల కారణంగా.. ఆమె నానా గొడవ చేయడంతో ఆమెకు చాలా ఆస్తులను ఇచ్చేయాల్సి వచ్చింది. అలా ఓ ఎదురుదెబ్బ. తల్లి అనారోగ్యం, ఆమె మరణం కూడా అప్పట్లో శ్రీదేవిని బాగా కుంగదీసిన అంశాలు. శ్రీదేవి సినీజీవితం హీరోయిన్ గా టాప్ గేర్ లో ఉన్నప్పుడే ఆమె ఎవరిని పెళ్లి చేసుకుంటుందా.. అని ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూస్తున్న సమయంలో ఆమె అనూహ్యంగా బోనీ కపూర్ ను పెళ్లి చేసుకుంది.
ఆ తర్వాతి పరిణామాల్లో బోనీ కపూర్ కు లెక్కకు మిక్కిలిగా ఉన్న అప్పులన్నీ ఆమె మెడకు చుట్టుకున్నాయి. తాను చిన్నతనం నుంచి నటిస్తూనే, కోట్లకు కోట్లు సంపాదిస్తూనే ఉన్నప్పటికీ.. ఎప్పటికీ ప్రశాంతత గానీ, ఆర్థికపరంగా నిలకడ- నిశ్చింత దక్కని జీవితంగా శ్రీదేవి ప్రస్థానం మిగిలిపోయింది.
కూతురిని హీరోయిన్ చేయాలని అనుకున్న తరువాత… మీడియా వారి కుటుంబం వెంట పడిందనే చెప్పాలి. శ్రీదేవి కూతురు అనే ఒకే హోదా పుణ్యమాని .. సినీరంగంలో అడుగు కూడా పెట్టని జాన్వీ మీద అప్పుడే విపరీతంగా పుకార్లు కూడా వ్యాపించడం మొదలైంది. ఇలా.. ప్రతిదశలోనూ ఏదో ఒక అశాంతి మధ్యనే శ్రీదేవి జీవిస్తూ వచ్చింది. ఎట్టకేలకు వివాహ వేడుకలో పాల్గొన్న తరువాత.. గుండెపోటుతోనే.. ఐహిక బంధాలకు, సమస్యలకు కూడా ఒకేసారి దూరమైపోయింది.
-కపిలముని