ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి పోలవరం ప్రాజెక్టు ఎంత కీలకంగా అందరూ పరిగణిస్తూ ఉంటారో తెలంగాణ విషయంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు కూడా అంతే ప్రాధాన్యం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక్కటీ అనుకున్న స్థాయిలో పూర్తయితే తెలంగాణ సస్యశ్యామలం అవుతుందనే ప్రచారం విస్తృతంగా ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టుతో ముడిపెట్టి యావత్ తెలంగాణ రైతాంగానికి సాగునీరు అందించడంలోనూ, అనేక ప్రాంతాలకు తాగునీరు అందించడానికి కేసీఆర్ సర్కారు అనేక హామీలను గుప్పించింది కూడా.
ఇలాంటి నేపథ్యంలో తాజాగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలిపేస్తూ వచ్చిన ఉత్తర్వులు దీనికి ప్రతిబంధకంగా మారుతున్నాయి. కేంద్రం నుంచి ప్రాజెక్టుకు అవసరమైన అన్ని అనుమతులు వచ్చాక గానీ.. నిర్మాణాలు చేపట్టడానికి వీల్లేదనేది ఉత్తర్వుల్లోని సారాంశం. ఇలాంటి సంక్లిష్ట సమయంలో.. తెలంగాణ కలల ప్రాజెక్టును సాకారం చేయడానికి.. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఇప్పటికైసా స్పందిస్తుందా.. వీరికి అవసరమైన అన్ని అనుమతులను సత్వరం స్పందిస్తుందా? అనేది ఇప్పుడు కీలక చర్చనీయాంశంగా మారింది.
ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రగతికి పోలవరం లాగానే.. తెలంగాణకు కాళేశ్వరం అని అంతా అంటూ ఉంటారు. పోలవరంను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి.. ఖర్చు మొత్తం కేంద్రం భరిస్తున్నట్లే కాళేశ్వరాన్ని కూడా జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలంటూ తెరాస ప్రభుత్వం చాలా కాలంగా పోరాడుతోంది. భాజపా కేంద్ర మంత్రిగా చేసిన దత్తాత్రేయ కూడా ఇందుకోసం పలుమార్లు కేంద్రంలో పెద్దలకు విజ్ఞప్తి చేశారు. అయినా అతీగతీ లేదు. జాతీయ ప్రాజెక్టు చేసే ప్రతిపాదన గురించి ఎవ్వరూ పట్టించుకోలేదు. అయినా దీని ప్రాధాన్యం దృష్ట్యా టీ సర్కారు పనులు మాత్రం కొనసాగిస్తూనే ఉంది.
ఈ నేపథ్యంలో ఇప్పుడు అసలు పనులకే బ్రేక్ పడిన పరిస్థితి ఏర్పడింది. పర్యావరణ, ఇతర అనుమతులు లేకుండానే ప్రాజెక్టు నిర్మిస్తున్నారంటూ దాఖలైన పిటిషన్ ను పురస్కరించుకుని.. జాతీయ హరిత న్యాయస్థానం ఈ పనులపై స్టే విధించింది. దీంతో పనులు పూర్తిగా ఆపేయాల్సిన పరిస్థితి. హయతుద్దీన్ అనే వ్యక్తి ఈ పిటిషన్ దాఖలు చేశారు. అనుమతులన్నీ వచ్చే వరకు ఎలాంటి నిర్మాణాలు చేయడానికి వీల్లేదు, అన్ని అనుమతులూ వచ్చాక మళ్లీ మమ్మల్ని సంప్రదిస్తే.. పరిశీలించి ఏం చేయాలో చెబుతాం అని న్యాయస్థానం పేర్కొంది.
అయితే తెలంగాణ ప్రజలు ఇప్పటికైనా కేంద్రం స్పందిస్తుందా అని కోరుకుంటున్నారు. కాళేశ్వరానికి అవసరమైన అన్ని అనుమతులను సత్వరం ఇచ్చేస్తే గనుక పనులు అనుకున్నట్లుగా పూర్తవుతాయని భావిస్తున్నారు. తెలంగాణలో రాజకీయంగా తమకు మైలేజీ కావాలని.. ప్రస్తుతం ఉన్న దశకంటె ఒక మెట్టు పైకి ఎదగాలని.. ఎట్ లీస్టు ప్రధాన ప్రతిపక్షం స్థాయికి ఎదగాలని కలలు కంటున్న కేంద్రంలోని భారతీయజనతా పార్టీ సర్కారు.. తమ ఘనతను చాటుకోవడానికైనా కాళేశ్వరానికి అనుమతులు ఇచ్చి.. ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు.