మొన్నటిదాకా కశ్మీరు ముఖ్యమంత్రిగా ఉన్న మెహబూబా తండ్రి ముఫ్తీ మహమ్మద్ సయీద్ మహా కుటిలుడు. నేషనల్ కాన్ఫరెన్సు (ఎన్‌సి)లో ఉంటూ దానిలోంచి జిఎం సాదిక్ వర్గం విడిగా వచ్చేసినపుడు అతని అనుచరుడిగా మారాడు. 1960లో అది మళ్లీ ఎన్‌సిలో విలీనమైంది. 1964లో సాదిక్ ముఖ్యమంత్రి అయినపుడు యితను ఉపముఖ్యమంత్రి అయ్యాడు. 1965లో ఎన్‌సి కాంగ్రెసులో విలీనమైనప్పుడు అతను కాంగ్రెసు నాయకుడయ్యాడు. 1982లో షేక్ పోయిన తర్వాత జరిగిన 1983 అసెంబ్లీ ఎన్నికలలో షేక్ కొడుకు ఫరూఖ్ అబ్దుల్లా ఎన్‌సి తరఫున ముఖ్యమంత్రిగా కొనసాగగా 1984 జులైలో రాజీవ్ గాంధీ (అప్పటికింకా అతను ప్రధాని కాలేదు) సాయంతో ముఫ్తీ ఆ ప్రభుత్వాన్ని పడగొట్టాడు. తను ముఖ్యమంత్రి చేస్తాడని ఆశ పడ్డాడు కానీ ఇందిరా గాంధీ కలగజేసుకుని ఫరూఖ్ బావగారు, ఎన్‌సిలోంచి బయటకు వెళ్లి అవామీ ఎన్‌సి పేర పార్టీ పెట్టుకున్న జిఎం షాను గద్దెపై కూర్చోబెట్టింది. అది ముఫ్తీని మండించింది.
1984 అక్టోబరులో ఇందిర హత్య తర్వాత రాజీవ్ ప్రధాని అయ్యాడు. జిఎం షా తమమాట వినటంలేదని అనుకుని, 1986 మార్చిలో అతని ప్రభుత్వాన్ని రద్దుచేశాడు. అప్పుడైనా తను ముఖ్యమంత్రి అవుతానని ఆశ పెట్టుకున్న ముఫ్తీ ఆశలు వమ్ము చేస్తూ అతన్ని రాజ్యసభ సభ్యుణ్ని చేసి కేంద్రంలో టూరిజం మంత్రిని చేసి, కశ్మీరు నుంచి తప్పించి వేశాడు. రాష్ట్రంలో ఆర్నెల్ల గవర్నరు పాలన, ఆ తర్వాత రెణ్నెళ్ల రాష్ట్రపతి పాలన పెట్టి, దరిమిలా ఫరూఖ్‌తో రాజీ పడి, ఒప్పందం చేసుకుని 1986 నవంబరులో అతన్ని తీసుకుని వచ్చి ముఖ్యమంత్రిని చేసి నాలుగు నెలల తర్వాత 1987 మార్చిలో ఎన్నికలు నిర్వహించమన్నాడు. ఆ ఎన్నికలలో జరిగిన దాని గురించే విపులంగా చెప్తాను.
కశ్మీరుపై కేంద్ర పట్టు పోకుండా ఉండాలనే ఉద్దేశంతో ఎన్‌సితో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళదామని రాజీవ్ అంటే ముఫ్తీ పడనిచ్చాడు కాదు. విడివిడిగా పోటీ చేయాల్సి వచ్చింది. ఆ ఎన్నికలలో కాంగ్రెస్, ఎన్‌సిలతో బాటు పోటీ చేసిన మరొక పార్టీ ముస్లిమ్ యునైటెడ్ ఫ్రంట్ (ఎంయుఎఫ్). ఇక్కడే ముస్లిమ్ ఫ్యాక్టర్ గురించి కాస్త చెప్పాలి. 1975లో కేంద్రంతో కుదిరిన ఒప్పందం ప్రకారం షేక్ అబ్దుల్లా కశ్మీరును భారత్‌లో విలీనం చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాడు. కానీ దానికి ప్రజల సంపూర్ణామోదం లేదు. అది గ్రహించి, షేక్‌ను బలహీనపర్చడానికి కొందరు నాయకులు జమాతే ఇస్లామీ కశ్మీర్, పీపుల్స్ లీగ్, జెకెఎల్‌ఎఫ్ సంస్థలు ప్రారంభించి, ఇస్లాం పేర ప్రజలను రెచ్చగొట్టసాగారు.
1980ల నుంచి ఇస్లాం పేర రాజకీయాలు ప్రబలాయి. రష్యా తమను ఆక్రమించడంతో (1979-89) ఆఫ్గన్లు ఇస్లాం పేర తాలిబన్లగా మారి, ఎదిరించసాగారు. పాక్ ద్వారా అమెరికా సాయపడడంతో వారికి కొన్నిసార్లు విజయం సిద్ధిస్తోంది కూడా. ఇరాన్ పాలకుడిగా షా నియంతగా వ్యవహరించడంతో, ఖొమైనీ అనే మతరాజకీయవాది ఇరాన్‌కు తిరిగివచ్చి, ప్రజల మద్దతుతో 1979లో అతన్ని పదభ్రష్టుణ్ని చేయగలిగాడు. 1980ల నుంచి శిఖ్కులు తమ మతం పేర పంజాబ్‌లో భారత ప్రభుత్వాన్ని చిక్కుల్లో పడవేస్తున్నారు. ఈ ప్రయత్నానికి పాక్ సాయపడుతోంది. బంగ్లాదేశ్ ఆవిర్భావానికి ప్రతీకారంగా, ఇండియా నుంచి కశ్మీరును విడగొట్టడానికి పాక్ నిధులు అందించసాగింది. తాలిబన్ల పేరుతో దానికి అమెరికా నుండి డబ్బు వచ్చిపడుతోంది మరి. (కశ్మీరులో పాక్ ప్రమేయం గురించి పాక్ ఆక్రమిత కశ్మీర్ గురించి రాసినప్పుడు రాస్తాను) అందువలన కశ్మీరు ప్రభుత్వ వ్యతిరేకులకు ఇస్లాం పేరు చెప్పి ప్రజలను రెచ్చగొట్టడానికి అవకాశం ఉందని తోచి ఆ దిశగా సాగారు. వాళ్లను ఎదుర్కోవడానికి అప్పణ్నుంచి షేక్ తనూ ఇస్లాం రాజకీయాలు నడపసాగాడు. 1981లలోనే 2500 గ్రామాలకు ఆది నుంచి ఉన్న పేర్లు మార్చి ఇస్లామిక్ పేర్లు పెట్టాడు. మసీదుల్లో మతపరమైన ఉపన్యాసాలు యివ్వసాగాడు. కశ్మీరీ పండిట్లను ''ముఖబీర్'' (గూఢాచారులు ఇన్‌ఫార్మర్లు – కేంద్రానికి రహస్యంగా సమాచారం అందించేవారు) అని పిలవసాగాడు.
కశ్మీరీ బ్రాహ్మణులైన పండిట్ల పట్ల సాధారణ కశ్మీరు ముస్లిముకు అసూయ ఉన్నమాట చారిత్రక వాస్తవం. కశ్మీరును హిందూ రాజులే పాలిస్తూ వచ్చేవారు కాబట్టి ప్రభుత్వోద్యోగులలో పండిట్లు అధిక సంఖ్యలో ఉండేవారు. పేద ముస్లిం రైతుల నుంచి ముక్కు పిండి పన్నులు వసూలు చేయడంతో వారి పట్ల వీరికి ఆగ్రహం ఉండేది. ఉద్యోగులలో అవినీతి, వారిపై పౌరులకు కోపం అనేవి ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాస్తవాలు. ఆ ఉద్యోగులు ఒకే కులస్తులైతే (ఉదా. బ్రాహ్మణులు, కాయస్తులు…) ఆ కోపం ఆ కులంపై కూడా ప్రసరిస్తుంది. పండిట్ల విషయానికి వస్తే వాళ్లు రైతులను బెల్లించి, బెదిరించి వారి భూములు రాయించుకునేవారుట కూడా. ఒక దశలో కశ్మీరులో 30% భూమి పండిట్ల పేరనే ఉండేదిట. హరి సింగ్ దిగిపోయాక పండిట్లు జమ్మూకు, యితర ప్రాంతాలకు వలస వెళ్లసాగారు. కొందరు లోయలోనే ఉండిపోయారు. ఇస్లాం పేర రెచ్చగొట్టదలచేవారికి వారు వ్హిపింగ్ బాయ్‌లా కనబడేవారు. పండిట్లను భారత్‌కు ప్రతినిథులుగా భావించేవారు. అందుకే షేక్ వాళ్లను ముఖబీర్లని అనడం!
1984 నాటికి కశ్మీరులో టెర్రరిజం ఉచ్చస్థాయిలో ఉంది. ఆ ఏడాది ఫిబ్రవరిలో జెకెఎల్‌ఎఫ్ నాయకుడు మఖ్బూల్ భట్‌ను ఉరి తీసినపుడు కశ్మీరు లోయలో ఇండియాకు వ్యతిరేకంగా ఉధృతంగా జరిగిన నిరసన ప్రదర్శనలలో కశ్మీరీ యువత బహుళంగా పాల్గొన్నారు. ఇది గమనించి, ఉగ్రవాదం ద్వారా కాకుండా ప్రజాస్వామ్యయుతంగా జరిగే ఎన్నికలలో బాహాటంగా పాల్గొని, అధికారాన్ని కైవసం చేసుకోవాలనే ఆలోచనతో యీ సంస్థలన్నీ పైన చెప్పిన ముస్లిం యునైటెడ్ ఫ్రంట్‌గా ఏర్పడి 1987 ఎన్నికలలో పాల్గొన్నాయి. దానికి వస్తున్న స్పందన చూసి, అది ఎన్నికలలో నెగ్గుతుందని అందరూ అనుకోసాగారు. తనకు ముఖ్యమంత్రి ఛాన్సు పోయిందని కుములుతున్న ముఫ్తీ అది చూసి డబుల్ గేమ్ ఆడాడు. పైకి కాంగ్రెసుకు ప్రచారం చేస్తూన్నట్లు కనబడుతూనే ముస్లిం ఫ్రంట్‌కు ఓట్లేయమని ప్రజలకు సూచించాడు. వాళ్ల ఎన్నికల గుర్తయిన పెన్నును చేత్తో పట్టుకుని ప్రచారం చేస్తూ, ముస్లిం ఫ్రంట్ అని సూచించడానికి ఆంగికంగా గడ్డాన్ని సూచించేవాడు.
తను ముస్లిము పక్షపాతినని చూపుకోవడానికి అతనికి దొరికిన పావులు – పండిట్లు. బాబ్రీ మసీదు వివాదం కోర్టులో నడుస్తూండగానే 1986లో రాజీవ్ గాంధీ అయోధ్యలో రామాలయం తాళాలు తెరిపించడంతో, దేశంలో కొన్ని చోట్ల నిరసనలు వెలువడ్డాయి. కశ్మీరులో తక్కిన చోట్ల ప్రశాంతంగా ఉన్నా, ముఫ్తీ సొంత జిల్లా అనంతనాగ్‌లో మాత్రం హింసాత్మక ఘటనలు జరిగి, అనేక దేవాలయాలను ధ్వంసం చేశారు, పండిట్ల యిళ్లపై దాడి చేశారు. వీటి వెనుక ముఫ్తీ హస్తం ఉందన్న సంగతి కాంగ్రెసు నియమించిన విచారణ కమిటీలో తేలిందట కానీ, దాన్ని బయట పెట్టలేదట. ఈ ఎన్నికలలో ముఫ్తీ చేస్తున్న నమ్మకద్రోహం తెలియరాగానే, రాజీవ్‌కు భయం పట్టుకుంది – ఫ్రంట్ నెగ్గేస్తుందని! అందువలన ఫరూఖ్ సాయంతో ఎన్నికలను రిగ్ చేయించాడు.
ఏం చేసినా ఫ్రంట్‌కు 15-20 సీట్లు వస్తున్నాయని తెలియగానే ఫరూఖ్ ప్రభుత్వం జాతి వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నారంటూ ముస్లిం ఫ్రంట్ నాయకులను అరెస్టు చేయసాగింది. కర్ఫ్యూ లాటిది విధించి, ప్రజలెవ్వరికీ విషయాలు తెలియకుండా చూసింది. అలాయిలా చేసి మొత్తానికి వాళ్లకు నాలుగు వచ్చాయని డిక్లేర్ చేశారు. ఫ్రంట్‌కు చెందిన ముహమ్మద్ యూసుఫ్ షా అనే అతని విషయంలో మరీ అన్యాయం జరిగింది. కౌంటింగు జరుగుతూండగానే అతని ప్రత్యర్థి ఓడిపోతున్నానని గ్రహించి, యింటికి వెళ్లిపోయాడు. అయితే పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకు, ఫలితాలు తారుమారు చేసి, షా ఓడిపోయినట్లు ప్రకటించి, ప్రత్యర్థి గెలిచినట్లు ప్రకటించారు.
దెబ్బకి యూసుఫ్ షాకి ప్రజాస్వామ్య వ్యవస్థపై నమ్మకం పోయింది. తన పేరు సయీద్ సలాహాద్దున్‌గా మార్చుకుని, హిజ్‌బుల్ ముజాహిదీన్‌కు నాయకుడిగా ఎదిగాడు. అతని ఎన్నికల మేనేజరు యాసిన్ మాలిక్, జెకెఎల్‌ఎఫ్‌కు నాయకుడిగా ఎదిగాడు. వీళ్లిలా మారడానికి కారణం ఎవరు? 1993లో ''ఇండియా టుడే'' ప్రతినిథి హరీందర్ బవేజా ఫరూఖ్‌ను ఇంటర్వ్యూ చేస్తూ ''1987 ఎన్నికలు రిగ్ అయ్యాయా?'' అని అడిగాడు. ''అయిన మాట వాస్తవం. కానీ చేయించింది నేను కాదు.'' అన్నాడు. అంటే కేంద్ర ప్రభుత్వమే చేసిందన్నమాట. ఇలా తిమ్మిని బెమ్మిని చేసి, 1987లో ఎన్‌సికి 40 వచ్చేట్లు చేసి (వెన్నుపోట్ల కారణంగా కాంగ్రెసుకు 26 వచ్చాయి) ఫరూఖ్‌కు లాభం చేకూర్చింది. తాము చెప్పినట్లలా ఆడమంది.
''బందిపోటు'' సినిమా గుర్తు తెచ్చుకోండి. కుంటి రాజుగారు, దుష్ట సేనాపతి. బాధలు పడే ప్రజలు, న్యాయం కోసం సక్రమ మార్గాల్లో పోరాడి, అది దక్కని ఓ రైతు యువకుడు బందిపోటుగా మారతాడు. అతని ఆచూకీ చెప్పమని సేనాని ప్రజలను ఎంత హింసించినా వారు నోరు విప్పరు. ఎందుకంటే రాజుగారు వాళ్లకు చేస్తున్న మేలేమిటో, అసలాయన మంచివాడో, దుష్టుడో తెలియదు. మంచివాడైతే యీ దుష్టసేనానిని ఎందుకు కొనసాగిస్తున్నాడు? ఈ సినారియోలో మీరు ఎవరితో ఐడెంటిఫై అవుతారు? కుంటి రాజుతోనా, దుష్ట సేనానితోనా? బాధిత ప్రజలతోనా? ప్రజలతో అయితే… కశ్మీరు ప్రజలు ఉగ్రవాదాన్ని ఎందుకు సహిస్తున్నారో అర్థమవుతుంది.
నిజానికి ఉగ్రవాదం వలన భారీగా నష్టపోతున్నది వాళ్లే. శాంతి ఉంటేనే టూరిస్టులు వస్తారు. వాళ్లు తయారు చేసే వస్తువులు అమ్ముడుపోతాయి. చేసే హస్తకళాకారులకు, అమ్మే వ్యాపారులకు కడుపు నిండుతుంది. కశ్మీరు అనగానే రాళ్లు విసిరే కుర్రవాళ్లే గుర్తుకు రాకూడదు. మధ్యవయస్కులు, ముసలీ, ముతకా, మహిళలు, బాలబాలికలు, రైతులు, ఉద్యోగులు, కార్మికులు.. యిలా వందలాది వర్గాలుంటాయి. ఉగ్రవాదం వలన వాళ్లకు జీవనోపాధి పోతోంది, ప్రాణాలకే ముప్పు వాటిల్లుతోంది. నిరాశానిస్పృహలతో తరుణవయస్కులైన యువకులు ఉగ్రవాదంవైపు మళ్లుతున్నారు, లేదా సానుభూతిపరులవుతున్నారు. కొందరు అమాయకులు పోలీసుల బారిన పడి జైళ్లలో మగ్గుతున్నారు. సంపాదించే వాడు లేడు, సంపాదన వచ్చే మార్గమూ లేదు.
అందువలన కశ్మీరీయులే కాదు, ఏ ప్రజలూ ఉగ్రవాదాన్ని పోషించరు. వాళ్లకు కావలసినది శాంతి. ఏదోలా ఈ ఉగ్రవాదాన్ని అరికట్టి, శాంతిని ప్రసాదించవలసిన కేంద్రం తన బాధ్యత నెరవేరుస్తోందా? లేదే! తన రాజకీయక్రీడల కారణంగా రాష్ట్రంలో ఎప్పుడూ అస్థిరత నెలకొనేట్లు చేస్తూ వచ్చింది. 1980ల నుంచి ఇస్లాం పేరిట ఉగ్రవాదం వ్యాపిస్తున్నపుడు దాన్ని కౌంటర్ చేయడానికి ప్రజల్లో విశ్వాసం నెలకొనేలా వ్యవస్థలను పటిష్టం చేయాలి. కానీ 1984లో, 1987లో చేసినదేమిటి? తలచుకుంటే భగ్గుమనదా? ఇంత మతలబు చేసి ముఖ్యమంత్రిని చేసిన ఫరూఖ్‌ను పదవిలో ఉండనిచ్చిందా? అబ్బే, 1990 జనవరి కల్లా ప్రభుత్వం రద్దు చేసి 6 నెలలు గవర్నరు పాలన, ఆరేళ్లు రాష్ట్రపతి పాలన పెట్టి 1996 అక్టోబరు వరకు ప్రజాప్రభుత్వం ఏర్పడకుండా చేసింది.
ఎందుకలా? అంటే 1989 నవంబరు ఎన్నికలలో రాజీవ్ ఓడిపోయాడు. కాంగ్రెసులోంచి బయటకు వచ్చి జనతా దళ్ పార్టీ పెట్టిన విపి సింగ్ నేషనల్ ఫ్రంట్ తరఫున ప్రధాని అయ్యాడు. 1987 నుంచి అతనితో అంటకాగుతున్న ముఫ్తీ, కేంద్ర హోం మంత్రి అయిపోయి, తన పాత శత్రువు ఫరూఖ్ మీద కసి తీర్చుకున్నాడు. విపి సింగ్‌తో చెప్పి అతని ప్రభుత్వాన్ని రద్దు చేయించాడు. అది జరగగానే అత్యంత హేయంగా, దుర్మార్గంగా పండిట్లపై ఉగ్రవాదుల దాడి జరిగింది. 1990 జనవరి 19 రాత్రి లోయ వదిలిపెట్టి వెళ్లమని హిందువులను, శిఖ్కులకు లౌడ్ స్పీకర్ల ద్వారా హెచ్చరికలు చేశారు. వారం తిరక్కుండా వాళ్లపై దాడులు జరిగాయి. మానభంగాలు, హత్యలు, దోపిడీలు విరివిగా జరిగాయి.
ఎంతమంది పండిట్లు కశ్మీరు విడిచి పారిపోయారన్నది సరైన సంఖ్య లేదు. టీవీ చర్చల్లో కొందరు 4 లక్షలంటారు, మరి కొందరు 5 లక్షలంటారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం 62 వేల హిందూ, శిఖ్కు కుటుంబాలు తమను కశ్మీరీ శరణార్థులుగా నమోదు చేసుకున్నారు. ఇది కశ్మీరీయులందరూ తల వంచుకోవలసిన సందర్భంగా మారింది. వేదికపై మాట్లాడే ప్రతి కశ్మీరీ నాయకుడు దీనిని ఖండిస్తాడు. పండిట్లు తమ నివాసాలకు తిరిగి వచ్చినపుడే 'కశ్మీరియత్' నిలబడినట్లని ప్రకటనలు చేస్తారు. కానీ ఆచరణలో జరుగుతున్నది శూన్యం. ప్రస్తుతం కశ్మీరులో హిందువుల ప్రాణాలకే కాదు, ముస్లిముల ప్రాణాలకు కూడా గ్యారంటీ లేదు. వీళ్లు తిరిగి వెళ్లే పరిస్థితి ఎప్పటికైనా వస్తుందో రాదో చెప్పలేని విధంగా పరిణామాలు తయారయ్యాయి.
భారతచరిత్రలో ఓ మచ్చగా మిగిలిన యీ సంఘటన గురించి టీవీ చర్చల్లో ప్రస్తావించేటప్పుడు బిజెపి వారు కాంగ్రెసు వారిని 'అప్పుడు మీరేం చేశారు?' అని అడుగుతూంటారు. నిజానికి అప్పుడు కేంద్రంలో ఉన్నది కాంగ్రెసు సర్కారు కాదు. నేషనల్ ఫ్రంట్ ప్రభుత. దానికి బయటి నుండి మద్దతు యిస్తున్నది బిజెపి. కమ్యూనిస్టులు మరో పక్క కొమ్ము కాశారు. దానికి బదులుగా జనతా దళ్ కేరళలో కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని లోపల నుంచి, రాజస్థాన్‌లో బిజెపి ప్రభుత్వాన్ని బయట నుంచి సమర్థించింది. కొంతకాలానికి నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వానికి బిజెపి తన మద్దతు ఉపసంహరించింది. ఎప్పుడు? ఈ పండిట్ల ఘటన జరగగానే కాదు, రథయాత్ర చేస్తూ అయోధ్య చేరబోతున్న ఆడ్వాణీని విపి సింగ్ ఆదేశాలపై లాలూ యాదవ్ 1990 అక్టోబరులో సమస్తిపూర్‌లో అరెస్టు చేసినప్పుడు మాత్రమే!
తను కేంద్రమంత్రిగా ఉంటూ, తన నియోజకవర్గంలోనే పండిట్లపై దాడి జరిగినందుకు ముఫ్తీ సిగ్గు పడలేదు, పదవికి రాజీనామా చేయలేదు. అంతేకాదు, అతను కేంద్రమంత్రి అయిన ఐదు రోజులకే అతని కూతురు రుబైయాను జెకెఎల్‌ఎఫ్ వారు కిడ్నాప్ చేసి, తమ సంస్థకు చెందిన 13 మంది ఉగ్రవాదులను విడిచి పెట్టమని డిమాండ్ చేశారు. ఫరూఖ్ వాళ్లకు లొంగనక్కరలేదని వాదించాడు. కానీ ముఫ్తీ తన కూతురికి హాని కలుగుతుందని విపి సింగ్‌ను అడలగొట్టి, ఆ 13 మందిని విడిపించాడు. అది నిజమైన కిడ్నాపో, లేక ఖైదులో ఉన్న ఉగ్రవాదులకు ముఫ్తీ చేసిన సాయమో యిప్పటికీ తెలియదు. అలాటి ముఫ్తీతో మోదీ-అమిత్ హయాంలోని బిజెపి చేతులు కలిపి కశ్మీరులో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పరచింది. ఇదీ వీళ్ల చిత్తశుద్ధి!
పాఠకులు కొంతమంది పాతపురాణం చెప్పేబదులు పరిష్కారమేమిటో రాయమని అంటున్నారు. అది నేనే చెప్పనక్కరలేదు, మీరూ చెప్పవచ్చు – సమస్య పూర్వాపరాలు తెలుసుకుంటే! మనం చెప్పినా వినేవాడు ఎవడూ లేడు. అయినా ప్రస్తుత చర్యకు కేరింతలు కొట్టాలో లేదో మనకు మనం ఒక అవగాహన తెచ్చుకుంటే చాలు. నేను చెప్తున్నదాని బట్టి మీ కర్థమై ఉంటుంది – కశ్మీరు సమస్యను కేంద్రప్రభుత్వం నానారకాలుగా భ్రష్టు పట్టించి, కంపుకంపు చేసింది. కేంద్రాన్ని పాలించిన పార్టీలన్నీ – కాంగ్రెసు, బిజెపి, నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్, వాటిల్లో భాగస్వామ్యం ఉన్న పార్టీలు, వాటికి బయట నుంచి మద్దతిచ్చిన పార్టీలు అన్నీ బాధ్యులే. వాళ్లతో బాటు వాళ్లకు ఓట్లేసిన మనమూ బాధ్యులమే. మనను కొల్లగొట్టి కశ్మీరులో నిధులు కుమ్మరిస్తున్నా, కశ్మీరు ప్రజల హక్కులు హరిస్తున్నా, కిమ్మనకుండా కూర్చుని, ఏ ఎన్నికలలోనూ దాన్ని ఒక అంశంగా చూడని పౌరులందరమూ బాధ్యులమే.
ప్రజాభిప్రాయ సేకరణపై నేను లేవనెత్తిన అంశంపై కొందరు తెలంగాణ యిచ్చే విషయంలో ఆంధ్రులను అడగలేదు కదా, యిప్పుడు కశ్మీరు వాళ్లని ఎందుకు అడగాలి? అని అడిగారు. తెలంగాణ యివ్వడానికి ముందు కేంద్రం సమావేశాలు జరిపి అన్ని పార్టీల అభిప్రాయాలూ సేకరించింది. ఆంధ్ర ప్రజలకు ప్రాతినిథ్యం వహించే పార్టీలన్నీ రెండు నాలులతో మాట్లాడాయి (సిపిఎం తప్ప). కశ్మీరు విషయంలో పార్టీ ప్రతినిథులతో కూడా మాట్లాడలేదు. తెలంగాణది రాష్ట్రం నుంచి విడిపోయే సమస్య, కశ్మీరుది దేశం నుంచి విడిపోయే సమస్య అని కొందరు అన్నారు. ఏదైనా ప్రజాభిప్రాయమే. పైగా మెజారిటీ కశ్మీరీయులు దేశం నుంచి విడిపోదామనుకుంటున్నారని ముందే ఎలా తీర్మానించగలం? అసలంటూ అడిగి చూడాలి కదా! దానికే వణికితే ఎలా అన్నదే నా ప్రశ్న. చంద్రబాబు తన పాలన పట్ల 82% మంది ఆనందంగా ఉన్నారని అనుకున్నారు. అనుకుని ఊరుకోకుండా ఎన్నికలు నిర్వహించారు. వాస్తవం బయటపడింది. ఎన్నికలే నిర్వహించకపోతే అది బయటపడేదా?
ప్లెబిసైట్ జరపాలా అంటూ ఆవేశపడిన పాఠకులు గుర్తించాలి – ఆ వ్యాసంలోనే స్పష్టంగా రాశాను – '…భారత ప్రభుత్వం ఎన్నడూ ఆ సాహసం చేయలేదు. ఈ రోజు నిర్వహిస్తే ఉగ్రవాదుల ప్రభావానికి లోనై భారత్ నుండి విడిపోతా మంటారు అని వాదిస్తారేమో, 1947 నుండి యీ డిమాండు ఉంది. అప్పణ్నుంచి భారత్ తిరస్కరిస్తూనే ఉంది. అక్కడే మన లొసుగు బయటపడింది.' అని. అసలక్కడ మనం స్వేచ్ఛగా ఎన్నికలే జరగనీయలేదు. ఈ వ్యాసంలో కొన్ని ఉదాహరణలు యిచ్చాను. ప్లెబిసైటు అనేది యిప్పుడు పరిష్కారం కానే కాదు. ఆ రేవు దాటి వచ్చేశాం. కశ్మీరు లోయలో ఉన్నవారి నమ్మకాన్ని పూర్తిగా పోగొట్టుకున్నాం. ఇవాళ మోదీ ప్రభుత్వం సాహసం చేసి ఒక చర్య చేపట్టింది. దాని పర్యవసానాలు ఊహించి, దాన్ని సమర్థించడమో, వ్యతిరేకించడమో, హెచ్చరికలు చెప్పడమో అనే చిన్న బాధ్యతనైనా నిర్వర్తిద్దాం. దాని కోసం కొంత జ్ఞానం సముపార్జించుకోవడం అవసరం. దానికి తీరిక, ఓపిక లేదనేవారికి ఓ దణ్ణం. చరిత్ర ఏమీ తెలుసుకోకుండానే సైన్యం ద్వారా అన్నీ పరిష్కరించవచ్చని అనుకునేవారికి రెండు దణ్ణాలు. (సశేషం) (ఫోటో – ఫరూఖ్ అబ్దుల్లా, ముఫ్తీ మహమ్మద్ సయీద్)
-ఎమ్బీయస్ ప్రసాద్ (ఆగస్టు 2019)
[email protected]