చంద్రబాబు అరెస్టు కావడం కాదు కానీ బయట ఉన్న టిడిపి నాయకత్వం చాలా పొరపాట్లు చేస్తోందని నాకనిపిస్తోంది. దీనిపై ‘‘టిడిపి క్రైసిస్ మేనేజ్‌మెంట్’’ అనే పేర ఒక వ్యాసం రాశాను. ఇంతలోనే బాబు జైల్లో అనారోగ్యం పాలయ్యారని, ఉక్క, చెమట కారణంగా డీహైడ్రేషన్ అవుతోందని, దీర్ఘకాలిక చర్మవ్యాధికి చాలా ఏళ్లగా తీసుకుంటున్న ప్రత్యేక చికిత్స అందక స్కిన్ ఎలర్జీలతో బాధపడుతున్నారని, 5 కిలోలు బరువు తగ్గారని, మరో రెండు తగ్గితే కిడ్నీలు డేమేజి అయిపోతాయని.. యిలా ఎన్నో చెప్పేస్తున్నారు. తల్లీకొడుకూ ములాఖత్‌లో చూసి వచ్చాక బయటకు వచ్చి ఏమీ చెప్పలేదు కానీ ప్రభుత్వ డాక్టర్లు మాత్రం ఎసి లేకపోతే ఆయన ఉండలేరని చెప్పారు. ఎసిబి కోర్టు ఎసిని అనుమతించింది. అంటే ఆ మేరకు ఆయన ఆరోగ్యం సున్నితమని తేటతెల్లమై పోయింది. ఒక పార్టీ అధినేత అనారోగ్యం గురించి యింత పబ్లిగ్గా చర్చకు పెట్టడం తెలివితక్కువ స్ట్రాటజీ అని నా ఉద్దేశం. ఏ యాగీ చేయకుండా చల్లగా మెడికల్ రికమెండేషన్‌తో ఎసి పెట్టించేసుకొని ఉంటే పోయేది.
అరెస్టయిన దగ్గర్నుంచి కోటిన్నర, 73 అనే రెండు అంకెలు విచ్చలవిడిగా వాడేస్తున్నారు. లూథ్రా వంటి లాయర్ల ఫీజు రోజుకి కోటిన్నర అని సర్వత్రా వినబడుతోంది. ఈ కేసు మాట ఎలా ఉన్నా ఆ అంకె నిజమేనా అంటూ లూథ్రాకు ఐటీ వాళ్ల నుంచి నోటీసు రావడం మాత్రం ఖాయం. ఇక రెండోది బాబు వయసు. ఇన్నాళ్లూ బాబు 50ల్లో పుట్టారు. 70 ప్లస్ అని వేగ్‌గా గుర్తు తప్ప కరక్టు వయసు గురించి ఎవరూ పట్టించుకోలేదు. మామూలు మనుషుల విషయంలోనూ అదే జరుగుతుంది. ఏ హార్ట్ ఎటాకో, సర్జరీయో అంటే అప్పుడు వయసెంత? అని అడుగుతారు తప్ప లేకపోతే మామూలుగా కనబడే వ్యక్తి వయసు గురించి పనిగట్టుకుని ఆలోచించరు. బాబు అరెస్టు కాగానే బాబు ప్రతికక్షులు 73 ఏళ్ల వయసులో ఎన్టీయార్‌కు మనోక్షోభ కలిగించాడు, తనూ 73 ఏళ్ల వయసులో మనోక్షోభకు గురయ్యాడు, పొయెటిక్ జస్టిస్ జరిగింది అంటూ వాట్సాప్‌లు వచ్చాయి. ఓహో 73యా! అనుకున్నాను.
ఇక ఆ తర్వాత బాబు అభిమానులు ఆ 73ని మరవనివ్వటం లేదు. 73 ఏళ్ల వృద్ధుడికి యీ అవస్థా? 73 ఏళ్ల వాణ్ని అరెస్టు చేస్తారా? 73 ఏళ్లాయనను యిన్నాళ్లు జైల్లో పెడతారా? అంటూ 24 గంటలూ అదే జపం. ఇన్నాళ్లూ చెంగుచెంగున పాదయాత్రలు, బస్సు యాత్రలూ చేస్తూ వచ్చిన బాబుని హఠాత్తుగా ముదుసలి వగ్గు చేసేశారు. అమిత్ షా కూడా 73 ఏళ్ల వయసున్న బాబుని అరెస్టు చేశారా అని ఆశ్చర్యపడ్డారని లోకేశ్ చెప్పేస్తున్నాడు. 73 ఏళ్లంటే మరీ అంత ఎక్కువా? మోదీ వయసు కూడా 73 యేగా! బాబు కంటె 5 నెలలే చిన్న! బాబు ఓ చిన్న రాష్ట్రంలో తిరుగుతూ ఉంటే, ఆయన దేశదేశాలు చుట్టబెడుతున్నాడు. దేశంలో రాష్ట్రాలన్నీ కలయతిరుగుతున్నాడు. పొద్దున్న హిమాచల్‌లో వంతెన ప్రారంభం, మధ్యాహ్నం మధ్యప్రదేశ్‌లో స్మారకస్తూపం ఆవిష్కరణ, సాయంత్రం కేరళలో బహిరంగసభ. అరెస్టంటారా? హరియాణా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్ చౌటాలా 78వ ఏట అరెస్టయి పదేళ్లు జైల్లో ఉన్నాడు.
రాజ్యం కానీయండి, పార్టీ కానీయండి, కార్పోరేట్ కానీయండి అధినేత ఆరోగ్యంగా, చురుగ్గా ఉండడానికి చాలా ప్రయత్నిస్తాడు. అడపాదడపా అస్వస్థతకు గురైనా అంతా సవ్యంగానే ఉన్నట్లు బిల్డప్ యిస్తారు. లేకపోతే సంస్థకు చాలా నష్టం వాటిల్లుతుంది. ఉదాహరణకి అంబానీకో, అదానీకో హార్ట్ ఎటాక్ వచ్చినట్లు (అలా జరగకూడదనే ఆశిద్దాం) న్యూస్ వచ్చిందనుకోండి. తక్షణం వాళ్ల కంపెనీల షేర్లు క్రిందకు పడతాయి. వారి స్థానంలో తాత్కాలికంగానైనా వచ్చేవాడు ఏపాటి సమర్థుడో తెలియదు కదాన్న భయం. సినిమా తారల విషయంలో చూస్తున్నాం, జబ్బుల గురించి ఎన్నాళ్లు దాస్తున్నారో!
పాతకాలం రాజులు తమ అనారోగ్యాన్ని ఎంతలా దాచి పెట్టేవారంటే, చనిపోయిన కొన్ని రోజుల దాకా ఆంతరంగికులు ఆ వార్తను వెల్లడించేవారు కాదు. ఎందుకంటే రాజుగారి కొడుకులందరూ వివిధ ప్రాంతాల నుంచి వచ్చి తమలో తాము తర్జనభర్జన పడి, లేదా ఒకరితో మరొకరు తలపడి వారసుడెవరో తేల్చుకున్నాకే ప్రకటన వెలువడేది. లేకపోతే యీలోగా కొందరు సామంత రాజులు తిరగబడి స్వాతంత్ర్యం ప్రకటించుకుంటారని భయం. ‘‘పొన్నియన్ సెల్వన్’’ సినిమాలో చూసే ఉంటారు. సుందర పాండ్యన్ జబ్బు పడగానే సేనాపతి, అతని తమ్ముడు కలిసి అతని చుట్టూ రక్షణ వలయం పేర, దడి కట్టేసి, ఆత్మీయులెవరినీ రానివ్వరు. రాజు అస్వస్థుడని తెలియగానే పొరుగురాజ్యపు కుట్రదారులు అంతఃపురంలో చొరబడి, దాడికి సన్నద్ధమౌతూ ఉంటారు.
రాజు జీర్ణశక్తిపై దేశభద్రత ఆధారపడి ఉంటుందని ఒక సామెత ఉంది. రాజు శారీరకంగా. మానసికంగా ఆరోగ్యంగా ఉన్నపుడే రాజ్యం సురక్షితం, యుద్ధాల్లో గెలవగలడు అనే భావన ఉంది. ఈ విషయమై నేనొక ఆర్టికల్ చదివాను. వ్యాసకర్త నెపోలియన్ ఆరోగ్యానికి, యుద్ధంలో గెలుపోటములకు ఉన్న లింకు చెప్పారు. యుద్ధంలోనే కాదు, యుద్ధానంతర చర్చల్లో కూడా ఆరోగ్యం ప్రధాన పాత్ర వహిస్తుందన్నారు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత మిత్రపక్షాలు సమావేశం అయినపుడు బ్రిటన్ ప్రధాని చర్చిల్‌కు 71 ఏళ్లు, అమెరికా అధ్యక్షుడు రూజ్వెల్ట్‌కు 67. రష్యా అధినేత స్టాలిన్‌కు 63 మాత్రమే. పైగా తక్కిన యిద్దరి కంటె ఆరోగ్యంగా ఉన్నాడు. అందుకని చర్చల్లో కమ్యూనిస్టు బ్లాక్‌కు ఎక్కువ దేశాలు వచ్చేట్లు చూసుకోగలిగాడని కూడా రాశారు. దేశాధినేతలే కాదు, కంపెనీ నడిపేవారు కూడా ఆరోగ్యంగా ఉండి తీరాలి. ఓ సినిమాలో కామెడీగా చూపించారు. ఎండీ బ్రహ్మానందానికి మూలశంక సమస్య ఉంటుంది. ఉద్యోగుల మీద, కస్టమర్ల మీద అందరి మీదా చికాకు పడుతూ ఉంటాడు. అలాటి పరిస్థితుల్లో వ్యాపారం బాగా ఎలా సాగుతుంది?
మనిషన్నాక ఏవో కొన్ని రోగాలు తప్పవు. వయసు మీరిన కొద్దీ అవి ప్రకోపిస్తాయి. వెంటనే కొడుకులు సైతం తిరగబడతారు. సింహాసనం మాకిచ్చేసి మూల కూర్చో అంటారు. వాళ్లకు తల్లులు సపోర్టు చేస్తారు. అంతఃపుర కుట్రలు చేస్తారు. విషప్రయోగాలు చేస్తారు. వీళ్లందరి కంటె ముందు మంత్రులు, సేనాపతులు కుట్ర చేస్తారు. ఇవన్నీ అన్ని దేశాల చరిత్రలలో కనబడతాయి. కమ్యూనిస్టు రష్యాలో అధినేతలు అధినేతలు వయసు వచ్చినా, అనారోగ్యం పాలైనా గద్దె దిగరు. దిగితే తమ వారసుడు తననేం చేస్తాడోనని భయం. ఆంతరంగికులను చుట్టూ పెట్టుకుని కథ నడిపిస్తూంటారు. జనంలోకి పెద్దగా రారు. అందువలన ఆయన పని అయిపోయిందని, చచ్చిపోయాడని కూడా పుకార్లు వచ్చేస్తూంటాయి. అవి అబద్ధం అని చెప్పడానికి ఏ ఆర్నెల్లకో ఓ సారి తన భవంతి బాల్కనీలోంచి జనాలకు చేతులు ఊపి, ఆ ఫోటోలకు మీడియాలో విస్తృత ప్రచారం కల్పిస్తారు.
ఇప్పటికీ చూడండి, పుటిన్ చన్నీళ్లలో యీత కొట్టాడు. ఇంతెత్తు నుంచి దూకాడు వంటి వార్తలు వస్తుంటాయి. దేశపాలనకూ, దీనికీ సంబంధం ఏమిటి? ఫిట్‌గా ఉన్నాడు, తిరగబడితే తాట తీస్తాడు అని ప్రత్యర్థులకు వార్నింగు యివ్వడానికే యిదంతా. జబ్బార్ పటేల్ దర్శకత్వంలో మరాఠీలో ‘‘సింహాసన్’’ (1979) అనే సినిమా వచ్చింది. ముఖ్యమంత్రికి అనారోగ్యం అని తెలియగానే ఆ కుర్చీకై ఆశపడేవాళ్లందరూ ఒకరితో మరొకరు తలపడతారు. ఒకరినొకరు బలహీన పరచుకుంటారు. చివర్లో తెలుస్తుంది. ముఖ్యమంత్రి అనారోగ్యమంటూ నాటకం ఆడి, చుట్టూ ఉన్నవారిలో ఎవరు నమ్మకస్తులో, ఎవరు కుట్రదారులో తెలుసుకుని తన ప్రతికక్షుల ఆట కట్టించి, గతంలో కంటె బలవంతుడవుతాడు.
జిన్నా అనే వ్యక్తి ఆరోగ్యంపై దేశవిభజన అనే అతి ముఖ్యమైన విషయం ఆధారపడిందని ‘‘ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్’’లో రాశారు. అతనికి ప్రాణాంతకమైన క్షయ వ్యాధి ఉంది. పాకిస్తాన్ సాధించిన తర్వాత 13 నెలలే బతికాడు. ఆ విషయం ముందే తెలిస్తే విభజనకు ఒప్పుకోకుండా కాంగ్రెసు నాయకులు సాగదీసేవారని ఆ పుస్తక రచయితలు రాశారు. స్వాతంత్ర్యం రావడానిక ముందు ముస్లిం లీగ్‌తో ఏర్పరచిన మధ్యంతర సంకీర్ణ ప్రభుత్వంలో జిన్నా కాంగ్రెసు నాయకులు నెహ్రూ, పటేల్, రాజేంద్ర ప్రసాద్, రాజాజీ యిత్యాదులను చాలా చికాకు పెట్టేవాడు. అతనితో వేగలేక అతను అడుగుతున్న పాకిస్తాన్ యిచ్చేస్తే పోయె కదా అనుకున్నారు కాంగ్రెసు నాయకులు.
కానీ గాంధీజీ ససేమిరా అన్నారు. కావాలంటే జిన్నాకు ప్రధాని పదవి యిచ్చి ఊరోకుబెట్టండి తప్ప, దేశాన్ని చీల్చడానికి వీల్లేదని పట్టుబట్టారు. గాంధీజీ సూచన కాంగ్రెసు నాయకులకు నచ్చలేదు. జిన్నా కొరకరాని కొయ్యగా ఉన్నాడు. అతని మాట ముస్లిం రాజకీయ నాయకులందరూ వింటున్నారు. సామాన్య ముస్లిము పౌరుడు ఏమనుకున్నా అతని మాటకు విలువేముంది అనుకుని గాంధీ మాట తోసిపుచ్చి, పాకిస్తాన్‌కు ఒప్పుకున్నారు. జిన్నా బతికేది మరొక్క ఏడాది మాత్రమే అని తెలిస్తే ఎలాగోలా బండి లాగిస్తూ ఓపిక పట్టేవారు. జిన్నా లేకపోతే ముస్లిం నాయకులకు అంతటి నాయకుడు మరోడు లేడు. ఈ విషయాలు తెలిసే జిన్నా తన క్షయ సంగతి ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడ్డాడు. పార్టీ అధినేత లక్ష్యసిద్ధికై తన అనారోగ్యాన్ని గుట్టుగా ఉంచాలని యీ ఉదంతం ఎత్తి చూపుతోంది.
ఇవన్నీ తెలిసే బాబు తను యూత్‌ఫుల్ అని చెప్పుకునేవారు. జగన్ యిటీవల ఆయన వయసు గుర్తు చేస్తూ పెద్దాయన, ముసలాయన అంటూ ఉంటే దాన్ని కౌంటర్ చేయడానికి బాబు తన సభల్లో ‘‘నేను మీకంటె యంగ్, తమ్ముళ్లూ’’ అని అనేవారు. ‘అన్‌స్టాపబుల్’లో బాలకృష్ణతో నీకంటె ఎక్కువ రొమాంటిక్ అని చెప్పుకున్నారు. చురుగ్గా ఉండేవారు, ఆహార నియమాలు పాటిస్తూ ఫిట్‌గా ఉండేవారు. ఆరడుగుల మనిషి బరువు 66 కిలోలు మాత్రమే అంటే ఎంత మంచి ఫిజిక్కో చూడండి. అందుకే అలవకుండా పాదయాత్రలు చేస్తారు, బస్సుల్లో నిద్ర పోతారు, గంటల తరబడి కూర్చుంటారు, కూర్చున్నంత సేపూ మాట్లాడుతూనే ఉంటారు. ఆయనకు గుండెపోటు రావడం, శస్త్రచికిత్స జరగడం ఏమీ లేవు. దురదృష్టవశాత్తూ చర్మవ్యాధి ఉన్నా అది ఆయన ఓపిక హరించేదైతే కాదు. ఇటీవలి దాకా లోకేశ్ స్థూలకాయంతో ఉండేవాడు. పాదయాత్రకు ముందే తగ్గాడు. కానీ బాబు ఎప్పుడూ షార్ప్‌గా, స్మార్ట్‌గా కనబడేవారు.
అందుకే టిడిపి అభిమానులు ‘బాబు తర్వాత ఎవరు?’ అని ఆలోచించడానికి కూడా యిష్టపడరు. 2024లో టిడిపి గెలవకపోతే 2029 నాటికి పార్టీ ఔట్, ఆ పాటికి బాబు 79 ఏళ్ల ముసలివారై పోతారు అని వైసిపి వారే కాదు, విశ్లేషకులు అన్నా టిడిపి వారికి కోపం వచ్చేది, కరుణానిధి లేడా? ఆడ్వాణీ లేడా? అని కోప్పడేవారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కి 52 ఏళ్లు. అయినా యూత్ ఐకాన్ గానే ఉన్నాడు. సినిమాల్లో రొమాన్సు చేస్తున్నాడు. జగన్‌కు 50 ఏళ్లు. 16 నెలలు జైల్లో ఉన్నా శారీరకంగా, మానసికంగా చెక్కు చెదరనట్లు చూపించుకున్నాడు. వాళ్లకు ప్రతిగా టిడిపి చూపుతున్నది లోకేశ్‌ను కాదు, బాబును. అందువలన బాబుకి యూత్‌ఫుల్ యిమేజి అవసరముంది. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌కూ 70 ఏళ్లు. విగ్ పెట్టుకుని ఆ యిమేజి మేనేజ్ చేస్తున్నాడు. ఇది కరక్టు స్ట్రాటజీ.
కానీ అరెస్టయిన దగ్గర్నుంచి ఆ స్ట్రాటజీ గాలి కెగిరింది. ఆయన ముసలివాడు, వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నాడు, రోగాలతో సతమత మవుతున్నాడు. ఈ వయసులో యిలా అరెస్టు చేయకూడదు అంటున్నారు. అవినీతికి పాల్పడలేదు కాబట్టి అరెస్టు చేయకూడదు, గవర్నరు అనుమతి తీసుకోలేదు కేసు కొట్టేయాలి, యిలాటి ఆర్గ్యుమెంట్స్ ఎన్నయినా చేయవచ్చు. కానీ వయసు, అనారోగ్యం పేరు చెప్పి సానుభూతి సంపాదించాలని చూడడం సరైన పద్ధతి కాదు. ‘దోమలపై దండయాత్ర’ అని టిడిపి హయాంలో ఓ కార్యక్రమం చేపట్టినపుడు కర్నూలులో ఓ సెంటర్లో చంద్రబాబు కటౌట్ పెద్దది పెట్టారని బుగ్గన అసెంబ్లీలో చెప్పారు. బాహుబలి గెటప్, శిరస్త్రాణం, చేతిలో కత్తి, కత్తి చివర దోమ! అది ఒకరకంగా అతి, యిప్పుడు లోలకాన్ని పూర్తిగా మరోవైపుకి తిప్పి పెరుమాళ్లలా చూపిస్తున్నారు. పాత సినిమాల్లో కుక్కిమంచంలో కూర్చుని ఖళ్‌ఖళ్‌మని దగ్గుతూ ‘గుండెల మీద కుంపటిలా ఎదిగిన ఆడపిల్ల..’ డైలాగులు చెప్పే పాత్రలను పెరుమాళ్లు అనే నటుడు వేసేవారు. తర్వాతి రోజుల్లో కాకరాలకు ఆ పాత్రలు వచ్చాయి, దగ్గు కాస్త తగ్గింది.
ఈ యిమేజి చేసే డామేజి వీళ్లు ఊహించటం లేదు. ఎమ్జీయార్‌కి 67 ఏళ్ల వయసులో కిడ్నీలు ఫెయిలయ్యాయి. 1984 అక్టోబరులో చికిత్స కోసం అమెరికా వెళ్లాడు. డిసెంబరులో అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. ప్రతిపక్షంలో ఉన్న డిఎంకె అమెరికాలో ఎమ్జీయార్ చనిపోయాడని, ఆ విషయం చెప్పకుండా యిక్కడ ఎడిఎంకె వాళ్లు ఓట్ల కోసం నాటకం ఆడుతున్నారని ప్రచారం మొదలుపెట్టింది. ఆ ప్రచారాన్ని తిప్పికొట్టడానికి ఎమ్జీయార్ సహచరుడు ఆర్‌ఎం వీరప్పన్ ఆసుపత్రి బెడ్‌పై ఎమ్జీయార్ బతికే ఉన్నారు, డాక్టర్లతో సరదాగా మాట్లాడుతున్నారు చూడండి అంటూ ఒక ఫోటో విడుదల చేశాడు. అది చూసి అందరూ నిర్ఘాంతపోయారు. ఎందుకంటే ఎమ్జీయార్ వృద్ధాప్యం ముంచుకుని వస్తున్నా తెర మీద ఎప్పుడూ యువకుడిలా కనబడేవాడు. ముసలి పాత్రలు వేసేవాడు కాదు. ఓ యిద్దరు హీరోయిన్లను పెట్టుకునేవాడు. బయటి జీవితంలో కూడా తన బట్టతలను ఫర్ క్యాప్‌తో కవర్ చేసేవాడు, తన మొద్దు కళ్లద్దాలను గాగుల్స్‌తో కవర్ చేసేవాడు. చేతులు కనబడకుండా ఎప్పుడూ ఫుల్‌హేండ్స్ వేసేవాడు. (చనిపోయాక కూడా అదే డ్రెస్‌తో ఖననం చేశారు) పబ్లిక్ ఫంక్షన్లలో చాలా చురుగ్గా, బలంగా ఉన్నట్లు బిల్డప్ యిచ్చేవాడు. అలా హీమ్యాన్‌గా ముద్ర వేయించుకున్న ఎమ్జీయార్ ఒక్కసారిగా బట్టతలతో, మొద్దు కళ్లద్దాలతో ఆస్పత్రి బెడ్ మీద దీనంగా కనబడడంతో ప్రజలు కంగు తిన్నారు. క్షేమంగా తిరిగి వచ్చి, ముఖ్యమంత్రి పగ్గాలు పట్టి, మరో మూడేళ్లకు చనిపోయాడు.
ఎవరిదాకానో ఎందుకు, ఎన్టీయార్‌ను గుర్తు చేసుకోండి. 1994 ఎన్నికల నాటికి ఆయన అరోగ్య పరిస్థితి బాగా లేదు. కుడిచేయి బొత్తిగా లేచేది కాదు. శారీరకంగా దుర్బలుడు కావడంతోనే లక్ష్మీపార్వతిని చేరదీశారు. అయినా ఎన్నికల ప్రచారంలో కొత్త పెళ్లికొడుకునంటూ తయారై, పూలరంగడిలా లక్ష్మీపార్వతితో కలిసి స్టేజి మీద డాన్సులు చేసి, ప్రజల్ని ఆకట్టుకుని, బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిచారు. రోగిష్టిగా కనబడితే ప్రజలు ఓట్లేసేవారా? అధినేతను ఎప్పుడూ బలవంతుడిగా, ఆరోగ్యవంతుడిగా చూపించాలి. మిమ్మల్ని రక్షిస్తాను, మీ తరఫున పోరాడతాను అని హామీ యిచ్చే ప్రజానాయకుడు తనే నీరసంగా కనబడితే ప్రజలేం నమ్ముతారు? పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకులు ‘వయసు మీరి పోతే రిటైరై యింట్లో కూర్చోవాలి, యువకులకు, ఆరోగ్యవంతులకు పార్టీ అప్పగించాలి’ అని సణుక్కుంటారు.
చంద్రబాబు జైల్లో పడిన దగ్గర్నుంచి దోమలు, ఫ్యాన్లు తిరక్కపోవడాలు, వాటర్‌ట్యాంకులు కడగకపోవడాలు, చెమట, ఉక్క, డీహైడ్రేషన్, స్కిన్ ఎలర్జీ.. యిలాటివి చెప్తే సామాన్య ప్రజలు చలించిపోతారని టిడిపి వారు ఎందుకనుకుంటున్నారో తెలియదు. సాధారణ ప్రజల్లో కోట్లాదిమందికి కనీసావసరాలే తీరటం లేదు. నెల్లాళ్లకే మీరు భరించలేక పోతున్నారు, పుట్టినప్పటి నుంచి మేం యింతకు మించిన అవస్థలు పడుతున్నాం అనుకుంటారు. 5 కిలోల బరువు తగ్గారని కుటుంబ సభ్యులంటే, ఒక కిలో పెరిగారని గవర్నమెంటు డాక్టరు అన్నారు. రేపు న్యాయమూర్తి ఎవరైనా వర్చువల్‌గా అడిగితే బాబు ఏం చెప్తారో చూడాలి. ఏం చెప్పినా, దోమలు కుడుతున్నాయి లాటివి ఆయన చెప్పరు. ఎందుకంటే ఆయన పరిణతి చెందిన నాయకుడు, పబ్లిక్ యిమేజి కాపాడుకోవడంలో ఉచితానుచితాలు తెలిసినవాడు. బయటకు వచ్చాక ‘ఇటువంటి వంద జైళ్లయినా నా చిత్త స్థయిర్యాన్ని, మీ పట్ల నా అంకితభావాన్ని దెబ్బ తీయలేవు’ అని స్టేటుమెంటు యివ్వగలడు. ప్రస్తుతం పార్టీ వ్యవహారాలు చూస్తున్న వాళ్లకు యీ తెలివితేటలు లేకపోవడంతోనే వస్తోంది చిక్కు.
– ఎమ్బీయస్ ప్రసాద్ (అక్టోబరు 2023)