ఉత్తర తెలంగాణలోని 5 జిల్లాల్లో తెరాస ఊపేసింది. 54 సీట్లలో 44 సీట్లు (అంటే 81.5%) గెలుచుకుంది. దక్షిణ తెలంగాణలోని 3 జిల్లాల్లో 36 కి 14 మాత్రమే (38.8%). అది కూడా మెహబూబ్‌నగర్‌లోని 14 సీట్లలో 50% సీట్లు గెలుచుకుంది కాబట్టి! హైదరాబాదు, రంగారెడ్డి జిల్లాలకు వచ్చేసరికి 29 సీట్లకు 5 మాత్రమే గెలిచి 17%తో తృప్తి పడవలసి వచ్చింది. ఎక్కడ 81, ఎక్కడ 17! దాదాపుగా అంకె తిరగబడింది. కాంగ్రెసుకు వచ్చిన 21 సీట్లలో మూడింట రెండు వంతుల సీట్లు (14) యీ దక్షిణ తెలంగాణలోనే వచ్చాయి. అక్కడ ఓట్లూ, సీట్లూ తెరాసతో సమానంగా వచ్చాయి. హైదరాబాదు, రంగారెడ్డి జిల్లాలకు వచ్చేసరికి యీ రెండిటికి కలిపి 7 వస్తే టిడిపి-బిజెపి కూటమికి వీళ్లకంటె రెట్టింపు, కరక్టుగా చెప్పాలంటే 15 వచ్చాయి. దీని అర్థం తెరాసకు దక్షిణ తెలంగాణలో కాంగ్రెసు సమాన ప్రత్యర్థి అయితే, రంగారెడ్డి, హైదరాబాదుల్లో టిడిపి-బిజెపి అనేక రెట్లు బలమైన ప్రత్యర్థి అన్నమాట. తెరాస బలమంతా సగం సీట్లున్న ఆ 5 ఉత్తర తెలంగాణ జిల్లాలలోనే వుంది. ఆ తర్వాత మెహబూబ్‌నగర్, నల్గొండలలో 50% వుంది. మూడోవంతు సీట్లున్న తక్కిన మూడు జిల్లాలలో 15% సీట్లు మాత్రమే తెచ్చుకోలిగిందంటే అక్కడ చాలా వీక్‌గా వుందన్నమాట.
కాంగ్రెసు ఘోరంగా దెబ్బ తినడానికి కారణం ఏమిటని వాళ్లు విశ్లేషించుకుని రెడ్డి కులానికి నాయకత్వం అప్పగించకపోవడం అని తేల్చారు. పొన్నాల లక్ష్మయ్య 'రెడ్డి' అయినా, జానారెడ్డిని పిసిసి అధ్యకక్షుణ్ని చేసినా యింతకంటె మెరుగైన ఫలితం వచ్చేదనుకోను. తెలంగాణలో కాంగ్రెసు ఎప్పుడో కూలబడివుంది. 2004లో చంద్రబాబుపై వ్యతిరేకత కారణంగా వీళ్లు నెగ్గారు. 2009లో వైయస్ వీళ్లను భుజాన మోసి విజయతీరాలకు తీసుకుని వచ్చాడు. వీళ్లు తమ నియోజకవర్గానికి చేసింది తక్కువ. మీడియా సమావేశాలు పెట్టి 'తెలంగాణకు ఏమీ మేలు జరగలేదు. ఆంధ్రులు మాకు అన్యాయం చేశారు. మమ్మల్ని దోచుకున్నారు.' అంటూ ప్రకటనలు యివ్వడం తప్ప! ఈ భాష తెరాసకు చెల్లుతుంది. ఎందుకంటే అది ప్రతిపక్షంలో వుంది కాబట్టి! అధికారంలో వున్న కాంగ్రెసు తెరాస వాదనలను గణాంకాల సహాయంతో ఖండిస్తూ, తమ ప్రభుత్వాన్ని వెనకవేసుకుని రావాలి కానీ, వాళ్లన్నదాన్నే వీళ్లు రిపీట్ చేస్తే ఎలా? అది విన్నవాళ్లు 'అన్యాయం జరిగినది నిజమే అయితే మీరేం చేస్తున్నారు?' అనే సహజమైన ప్రశ్న వేస్తారు. దానికి సమాధానం కెసియార్ చెప్పారు – కాంగ్రెసు వాళ్లు శుంఠలు అని. (ఇది చాలా చిన్న పదం. ఆయన చాలా ఘోరంగా తిట్టాడు) ఒక్క కాంగ్రెసు నాయకుడైనా దాన్ని ఖండించలేదు. కెసియార్ తమల్ని పూచికపుల్లల్లా తీసిపారేసి ప్రజల దృష్టిలో చులకన చేస్తున్నాడన్న గ్రహింపే రాలేదు వాళ్లకు. తమ తిట్లకు ఆంధ్ర నాయకుల నుండి చిన్న స్పందన వచ్చినా వాళ్లపై విరుచుకు పడ్డారు కానీ కెసియార్‌ను పన్నెత్తి మాట అనలేదు.
ఎందుకు? ఎందుకంటే కెసియార్ అంతిమంగా కాంగ్రెసులో చేరతాడనీ, కాంగ్రెసు సంస్థాబలం, కెసియార్ యిమేజి బలం రెండూ కలిసి వచ్చి తాము తిరిగి ఎన్నికవుతామనీ వాళ్లు కలలు కన్నారు. అందువలన కాంగ్రెసు వాళ్లలో చాలామంది తెరాస భాషే మాట్లాడారు. తెరాసతో మంతనాలు సలిపారు. తెరాసకు తొత్తులుగా వ్యవహరించారు. కెసియార్‌పై లేవని నోరు తమ పార్టీ ముఖ్యమంత్రులపై మాత్రం లేచేది. తమ పార్టీ నాయకులనే అనునిత్యం తిట్టేవారు. ఈ క్రమంలో వాళ్లు ప్రజల దృష్టిలో నాయకులుగా గుర్తింపు కోల్పోయారు. చివరకు కెసియార్ కాంగ్రెసులో చేరలేదు సరికదా, కాంగ్రెసును, దాన్ని అంటిపెట్టుకున్నవారినీ ప్రజాద్రోహులుగా చిత్రీకరించారు. ప్రజలు దాన్ని నమ్మారు. అందుకనే ఉద్యమం బలంగా వున్నచోట కాంగ్రెసును మట్టికరిపించారు. 54 సీట్లు వుంటే 10% అంటే 5 సీట్లు వచ్చాయి. తెరాస కంటె 19% ఓట్లు తక్కువ వచ్చాయి. పోనీ ఉద్యమం లేని హైదరాబాదు, రంగారెడ్డి జిల్లాల్లో గెలిచిందా అంటే అదీ లేదు. 29 సీట్లలో 7% అంటే రెండే రెండు వచ్చాయి. ఓట్లు చూడబోతే 18%. దక్షిణ తెలంగాణలో మాత్రమే తెరాసతో సమానంగా సీట్లు, ఓట్లు తెచ్చుకుని కాస్త నిలబడింది. ఓటమి తప్పించుకున్న కాంగ్రెసు ఎంపీలిద్దరూ – గుత్తా, నంది ఎల్లయ్య అక్కడివారే. గుత్తా ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నా కాస్త పెద్దమనిషి తరహా నిలబెట్టుకున్నారు. నంది ఎల్లయ్య ఎప్పుడూ యాక్టివ్‌గా లేరు.
ఉద్యమంలో సాటి తెలుగువారిపై నోరు పారేసుకుని ఉద్దండులమైపోయాం అనుకున్న పేపర్ టైగర్స్ – పొన్నం, మధు యాష్కీ, కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డి, సిరిసిల్ల రాజయ్య, బలరాం నాయక్, వివేక్, అంజన్ కుమార్ యాదవ్, సర్వే సత్యనారాయణ, అంతెందుకు తనే తెలంగాణ యిప్పించానని చెప్పుకున్న జయపాల్ రెడ్డితో సహా – అందరూ ఎగిరిపోయారు. ఎమ్మెల్యేలుగా నిలబడిన వి హనుమంతరావు, విజయశాంతి, దామోదర రాజనరసింహ, గండ్ర వెంకటరమణారెడ్డి యిత్యాదులకు కూడా యిదే గతి. ఎవరికి వారు తాము సిఎం కాండిడేటు అనుకున్నారు. ఎన్నికల వేళ వచ్చేసరికి పక్క నియోజకవర్గానికైనా వెళ్లి ప్రచారం చేసే సాహసం చేయలేకపోయారు. పిసిసి అధ్యకక్షుడు కూడా ఓడిపోయారంటే ఏమిటర్థం? దామోదర రాజనరసింహ ఉపముఖ్యమంత్రిగా వుండి, పాలన అడ్డుకుంటూనే వున్నారు. సిఎంతో బహిరంగంగా కలహించారు. తెలంగాణ యిస్తున్నాం కాబట్టి తమదే అధికారం, తనదే సిఎం పదవి అనుకుని అహంకరించారు. చివరకు రాజకీయాల్లో చాలాకాలంగా చురుగ్గా లేని బాబూ మోహన్ చేతిలో భంగపాటు చెందారు.
వీళ్లంతా తమ పార్టీని తామే బలహీన పరుచుకుంటున్నామన్న స్పృహ కోల్పోయారు. ఆంధ్ర నాయకులను ధిక్కరిస్తే, అవమానిస్తే హీరోలమై పోతాం అనుకున్నారు. అదే దృక్పథంతో పార్లమెంటు సాక్షిగా సాటి తెలుగువారిని పట్టుకుని కొట్టినవారు, సోనియా కనుసైగలతో పార్లమెంటులో అల్లర్లు సృష్టించి అవిశ్వాసాన్ని అడ్డుకున్నవారు మట్టి కరిచారు. కాంగ్రెసు వారే కాదు, నామా నాగేశ్వరరావు, రాథోడ్ వంటి టిడిపి నాయకులకూ అదే గతి పట్టింది. బాగా నోరు పారేసుకున్న నాగం జనార్దనరెడ్డికి ఓటమి గుణపాఠం నేర్పి వుండాలి. ఆయన పార్టీ దేశంలో అత్యధిక స్థానాలు గెలుచుకున్న సందర్భంలో కూడా ఆయన గెలవలేదు. (సశేషం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (జూన్ 2014)