ఎమ్బీయస్‌ : హుదూద్‌ పాఠాలు – 4

ఇక ప్రిపేర్‌డ్‌నెస్‌ గురించి చెప్పుకోవాలంటే – సైన్సు, టెక్నాలజీకి థ్యాంక్స్‌ చెప్పుకోవాలి. గతంలో 100 కి.మీ. అటూ యిటూగా వస్తుంది అని చెప్పేవారు. ఇప్పుడు ఫలానా చోట నుండి తీరం దాటుతుంది అని చెప్పారు.…

ఇక ప్రిపేర్‌డ్‌నెస్‌ గురించి చెప్పుకోవాలంటే – సైన్సు, టెక్నాలజీకి థ్యాంక్స్‌ చెప్పుకోవాలి. గతంలో 100 కి.మీ. అటూ యిటూగా వస్తుంది అని చెప్పేవారు. ఇప్పుడు ఫలానా చోట నుండి తీరం దాటుతుంది అని చెప్పారు. వారం రోజుల ముందు నుంచే హెచ్చరిస్తూ వచ్చారు. రెండు రోజుల క్రితం ఫలానా చోట, ఫలానా వేగంతో అని చెప్పారు. పదేళ్ల కృషి ఫలితంగా ఎన్‌డిఆర్‌ఎఫ్‌ దళాలు ముందే సన్నద్ధమయ్యాయి. ప్రభుత్వయంత్రాంగం కూడా కదిలింది. సాధ్యమైనంత చేసింది. అయితే జనసమ్మర్దం విపరీతంగా వుండే నగరప్రాంతంలో యీ స్థాయి తుపాను రావడంతో దాన్ని ఎలా తట్టుకోవాలో కొన్ని విషయాల్లో వూహించలేకపోయారు. పెట్రోలు, డీజిల్‌, మంచి నీళ్లు, పాలు ముందే స్టోర్‌ చేసి పెట్టుకోవాలని యిప్పుడు అర్థమైంది. ప్రస్తుతం వున్న విద్యుత్‌ సరఫరా విధానం మారాలని కూడా అర్థమైంది. ఇంకా చాలా చాలా వాటిల్లో చేసిన పొరపాట్లు తెలిసి వచ్చాయి. ఇబ్బంది ఎక్కడ వస్తోందంటే యీ అనుభవాలు వచ్చేసారి ప్రమాదానికి వుపయోగపడటం లేదు. ఎందుకంటే రికార్డు మేన్‌టేన్‌ చేయడం లేదు. ఒక తుపానును ఎదుర్కోవడంలో లోటుపాట్ల గురించి, కీడుమేలుల గురించి చర్చించి వదిలేస్తున్నారు. భవిష్యత్తు కార్యాచరణ గురించి మాన్యువల్‌ తయారు చేయటం లేదు. చంద్రబాబు యిప్పుడంటున్నారు – విపత్తులపై మాన్యువల్‌ రూపొందించేందుకు కేంద్రం, రాష్ట్రం వేర్వేరుగా కమిటీలు వేస్తాం అని. కొత్తగా కమిటీలు అక్కరలేదు. దీని గురించి ఎప్పుడూ చెప్తూనే వుంటారు. ఎప్పటికప్పుడే పరగడుపు అయిపోతోంది. 

ఈ విషయంలో మనం ఒడిశాను చూసి నేర్చుకోవాలి. 1999 నాటి ఒడిశా సూపర్‌ సైక్లోన్‌లో 10 వేలమంది పోయారు. 14 ఏళ్ల తర్వాత అంతే తీవ్రతతో పైలిన్‌ తాకితే పోయినవాళ్లు 21 మంది మాత్రమే! అప్పుడు 10 లక్షల మందిని – కొందర్ని బలవంతంగా – తరలించారు. పైలిన్‌ విషయంలో ఒడిశా చేసినదాన్ని యుఎన్‌ఓ కూడా మెచ్చుకుంది. 1999లో మన దగ్గర సాయం తీసుకుంది, యిప్పుడు హుదూద్‌ విషయంలో మనకు సాయం చేసే స్థాయికి చేరుకుని ఋణం తీర్చుకుంది. ఒడిశా ప్రభుత్వం రాష్ట్రస్థాయిలో డిజాస్టర్‌ ఫోర్స్‌ ఏర్పాటు చేసుకుంది. ప్రజలను బాగా ఎడ్యుకేట్‌ చేసింది. ప్రజలు కూడా ప్రభుత్వం చేసే హెచ్చరికలు  చెవిన పెడుతున్నారు. జాలర్లు వేటకు వెళ్లడం లేదు. మొన్న హుదూద్‌ తమపై పడుతుందేమో అనుకోగానే ఒడిశా అధికారులు చెట్ల కొమ్మలు నరికేశారు, హోర్డింగులు, వీధి బల్బులు తీసేశారు, కరంటు తీసేసి, ప్రజలకు టార్చిలైట్లు యిచ్చారు, టెట్రా పాలపాకెట్లు, బిస్కట్లు నిలవ చేశారు, బంగాళాదుంపలు, ఉల్లిపాయలు నిలవ చేశారు, మందులు కూడా. రేడియా ద్వారా అందరికీ తెలియపరిచి జాగ్రత్తగా వుండమన్నారు. వారితో పోలిస్తే మన ప్రభుత్వం అంత చేయలేదన్న సంగతి ఒప్పుకోవాల్సిందే. మనం మొదటి దశలో ఒడిశా స్థాయిని చేరుకోవాలి. 

బాబుతో యీ మాట అంటే కోపం వస్తుంది. ఆయనది అంతర్జాతీయ స్థాయి. శాన్‌ఫ్రాన్సిస్కోతో పోలిక తెస్తారు. దెబ్బతిన్న చెట్లను బాగు చేయించడానికి సింగపూర్‌ నిపుణులను పిలుస్తారట. భారతీయులెవరికీ అంత టాలెంట్‌ లేదా? నిపుణులకేముంది సలహాలు చెప్తారు. అమలు చేయాల్సిన చిత్తశుద్ధి ప్రభుత్వానికి, ప్రజలకు వుండాలి. క్షేత్రస్థాయి వాస్తవాలను పరిగణనలోకి తీసుకోకుండా బాబు ''తుపాన్లు కూడా అసూయపడే స్థాయిలో కొత్త విశాఖ కడతాం. దాని పేరు కూడా 'న్యూ విశాఖ', 'ప్రౌడ్‌ విశాఖ..' యిలా ఏ పేరు బాగుంటే దాన్ని పెడతాం. నగరంలో టవర్లు లేకుండా విద్యుత్‌ సరఫరా ఎలా చేయాలనేది ఆలోచిస్తాం.'' అంటూ ప్రకటిస్తున్నారు. ఎందుకీ గొప్ప కబుర్లు? ఇవేమీ చెప్పకపోయినా బాబు చేతనైనంత చేస్తున్నారని ప్రజలు భావిస్తున్నారు. ఆ గుడ్‌విల్‌ అలా వుంచుకుంటే బాగుంటుంది. ఇలాటి మాటలు చెపితే రేపు వెక్కిరింతకు గురి కావడం తప్ప ప్రయోజనం వుందా? ఇప్పటికే కెసియార్‌ 'బంగారు తెలంగాణ' గురించి ప్రజలంతా వేళాకోళం చేస్తున్నారు. వైజాగ్‌ను పునర్నిర్మించడం అంత సులభమైన పనేం కాదు. ఘటనానంతర చర్యలో రెస్క్యూ, రిలీఫ్‌, రిహేబిలిటేషన్‌/రికవరీ వున్నాయి. మొదటిది రక్షణ. ప్రాణరక్షణ బాగానే చేశారు. ఆస్తులరక్షణలో మాత్రం విఫలమయ్యారు. ఎవరూ వూహించనంత భీకరంగా తుపాను వచ్చింది. అసలు ఎవరి ఆస్తి వారే కాపాడుకోలేక పోయారు. గాలి ఉధృతానికి తలుపులు ఎగిరిపోయాయి. 

రిలీఫ్‌ విషయానికి వస్తే అనేక రకాలుగా రిలీఫ్‌ కార్యక్రమాలు సాగుతున్నాయి. అన్నిటికన్న ముఖ్యమైనది విద్యుత్‌గా తేలింది. అది లేకపోబట్టి అన్ని పనులూ స్తంభించిపోయాయి. సెల్‌ఫోన్లు చార్జింగ్‌ లేక మూగబోయాయి. సహజంగా వాటి వినియోగం పడిపోయింది. అది సెల్‌ఫోన్‌ ఆపరేటర్ల తప్పంటూ బాబు వాళ్లపై విరుచుకుపడ్డారు – అదీ బహిరంగంగా.  పక్కన వున్న సునీల్‌ మిట్టల్‌కు ఏం చెప్పాలో తెలియలేదు. బియస్‌ఎన్‌ఎల్‌ వారు సమావేశాలకు రాకుండా కుంటిసాకులు చెప్తున్నారంటూ మండిపడ్డారు. సెల్‌ టవర్లు ఎన్ని కూలిపోయాయో ఏమో కాస్త ఆలోచించాలి కదా. ఈ గాలికి అవి నిలుస్తాయా? ఎక్కడో మూలగా వున్నవి బతికి వుంటాయి. ఇప్పుడు విద్యుత్‌ స్తంభాలే వున్నాయి. 60% విద్యుత్‌ స్తంభాలు, అంటే 40 వేలు కూలాయి. మంగళవారం రాత్రికల్లా విద్యుత్‌ పునరుద్ధరిస్తాం అన్నారు బాబు. కానీ ఆదివారం దాకా వచ్చినట్లు లేదు – అది కూడా ఇతర జిల్లాల నుంచి, రాష్ట్రాలనుంచి కూడా మనుష్యుల్ని తెప్పించి పెట్టిస్తూంటే వారం రోజులకు 50% తిరిగి పెట్టగలిగారు. ఒక్కో ఎలక్ట్రిక్‌ పోల్‌కు 7 వేలు ఖర్చు అవుతోందిట. సెల్‌ఫోను ఆపరేటర్లు యీ స్థాయిలో చేయగలరా? చేయించగలరా? సెల్‌ఫోన్లు లేకపోవడం చేత కమ్యూనికేషన్‌ తెగిపోయింది. లాండ్‌లైన్ల వాడకం బాగా తగ్గిపోయి, సెల్‌ఫోన్‌ లేకపోతే ఎవరు ఎక్కడ వున్నారో, ఏం చేస్తున్నారో తెలియని అయోమయస్థితిలో పడ్డారు. ఇలాటి సమయాల్లో ప్రజలు ఎవరు కనబడితే వారిని తిడదామని చూస్తారు. పాలకులు కూడా అలా చేస్తే ఎలా? సానునయంగా మాట్లాడి పరిస్థితి చక్కదిద్దాలి. పబ్లిగ్గా పరువు తీయడం మొదలుపెడితే గ్యాలరీ ప్రేక్షకుల చప్పట్లు పడవచ్చేమో కానీ కార్యం సిద్ధించదు. 

రిలీఫ్‌కై అందరూ విరాళాలు యిస్తున్నారు. ఈ మూడ్‌ కొద్దికాలమే వుంటుంది. అసలైన పని రిహేబిలిటేషన్‌ (పునరావాసం). దానికి అనుబంధంగా రికవరీ (అంటే మానసిక స్థయిర్యం తిరిగి పొందడం) కూడా వస్తుంది. ఈ పని సాగుతూండగానే యింకో ఉపద్రవమో, మరో కార్యక్రమమో ముంచుకు వస్తుంది. ఇది వెనకపడుతుంది. ఈ రోజు చెపుతున్న జాగ్రత్తలు అవీ మరుపున పడతాయి. షరా మామూలుగా అతిక్రమణలు, నిర్లక్ష్యాలు జరుగుతాయి. (సశేషం) 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (అక్టోబరు 2014)

[email protected]

Click Here For Part-1

Click Here For Part-2

Click Here For Part-3