Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ : హుదూద్‌ పాఠాలు - 3

ఇక చెట్లు నాటడం గురించి చెప్పాలంటే తీరప్రాంతాల్లోనే కాదు అన్నిచోట్లా చెట్లు కొట్టేసి అనర్థం తెచ్చుకుంటున్నాం. తక్కిన చోట్ల వాతావరణంలో వేడి పెరిగి అవస్థపడుతున్నాం. కానీ తీరప్రాంతాల్లో అయితే చెట్లు చాలా అవసరం పెనుగాలులు అడ్డుకుంటాయి. 2004 సునామీ సమయంలో తీరప్రాంత రక్షణపై సమీక్షించగా వన సంరక్షణ సక్రమంగా లేదని తెలిసింది. 1971లో వనాలు పెంచేందుకు శ్రీకాకుళం జిల్లాలో 20 వేల ఎకరాలిస్తే సగానికి పైగా అన్యాక్రాంతం అయిపోయింది. తక్కిన జిల్లాల్లోనూ అంతేట. తీరం వెంట వున్న పరిశ్రమలు 20% మేరకు చెట్లు నాటాలని నిబంధనలున్నాయి. వాళ్లు పాటించలేదు. అందుకనే గాలి ఉధృతాన్ని ఆపలేకపోయారు. వీళ్లంతా నష్టపరిహారం కోసం అడుగుతారు. 'నిబంధనలు వ్యతిరేకంగా కట్టారు కాబట్టి మీరు అనుభవించాల్సిందే, పరిహారం గిరిహారం జాన్తానై' అంటే అమానుషంగా వుంటుంది. పైగా వాళ్లు 'వ్యతిరేకం అయితే మీరు ఎలా కట్టనిచ్చారు? పన్నులెలా వసూలు చేశారు?' అని తగులుకున్నారంటే ప్రభుత్వాధికారుల వద్ద సమాధానం లేదు. ఇప్పుడు 10 లక్షల చెట్లు కూలాయిట. ఇన్ని మళ్లీ ఎప్పటికి నాటగలరు? స్టీల్‌ ఫ్యాక్టరీ వంటి ప్రభుత్వ సంస్థల ఆవరణలో చెట్లు నాటారు కానీ శాస్త్రీయంగా నాటలేదట. త్వరగా ఎదిగి వచ్చే రకాలు నాటారు. తీరప్రాంతాల్లో వేయవలసిన సరుగుడు, తాడి వంటివి వేసి వుంటే ప్రమాదం తగ్గేది. 

సముద్రతీరం కోతకు గురైన కొద్దీ భూమిపైకి చొచ్చుకుని వచ్చే ప్రమాదం పెరుగుతుంది. పారిశ్రామిక వ్యర్థాలను సముద్రంలోకి వదిలేయడం ద్వారా తీరం కోతకు గురవుతోంది. ఏ మేరకు అంటే ఏటా 10 కి.మీ. మేరకట! ఇవాళ వైజాగ్‌లో జరిగినదే తక్కిన చోట్లా జరుగుతోంది, యింకా జరుగుతుంది. ఇవన్నీ ఎవరు పర్యవేక్షించాలి? జిల్లా కలక్టరు, అర్బన్‌ అథారిటీలాటివి ఎలాగూ వుంటాయి. ఇవి కాకుండా సుప్రీంకోర్టు ఆదేశాలకు మేరకు 1996లో జాతీయ, రాష్ట్రస్థాయిల్లో తీర ప్రాంత నిర్వహణ (కోస్టల్‌ జోన్‌ మేనేజ్‌మెంట్‌) అథారిటీలను ఏర్పాటు చేశారు. ఎన్టీయార్‌ ముఖ్యమంత్రిగా వుండగా మన రాష్ట్రంలో ఏర్పడింది. సిఆర్‌జడ్‌ పర్యవేక్షణ కూడా దాని బాధ్యతే. అప్పణ్నుంచి అవి ఎంత బాగా పనిచేశాయో, చేస్తున్నాయో యిప్పుడు అందరికీ తెలిసి వచ్చింది. 

కోస్తా ప్రాంతాల్లో తీవ్రమైన గాలులు వచ్చే ప్రమాదం వుంది కాబట్టి అక్కడ నిర్మాణాలు వేరేగా వుండాలి. కానీ ఎవరూ వాటి గురించి పట్టించుకోలేదు. తీరంలో హోర్డింగులు అనుమతించి వుండకూడదు. భవనాల అద్దాల అమరికలో కూడా జాగ్రత్తలు పాటించాలి. రెండో అంతస్తులో వాడిన అద్దాలకు, ఐదో అంతస్తులో వాడిన అద్దాలకు తేడా వుండాలి. అవేమీ పట్టించుకోకపోవడం చేత గాలికి అద్దాలు భళ్లున పగిలి పోయాయి. రాడార్‌ స్టేషన్‌కు కూడా మామూలు అద్దాలు పెట్టడం చేతనే అది పనిచేయడం మానేయడానికి అదో కారణమైందిట. భవనంలోకి వచ్చిన గాలి బయటకు వెళ్లే మార్గం చూపాలి. లేకపోతే కప్పు లేవదీసుకుని పోతుంది. అపార్టుమెంట్లు కట్టినపుడు యీ జాగ్రత్తలు ఎవరు తీసుకుంటున్నారు? వెంటిలేషనే సరిగ్గా వుండటం లేదు. 

ఇక కప్పు కాంక్రీట్‌తో వేయాలి. కానీ అనేక పెద్ద పెద్ద ఫ్యాక్టరీల దగ్గర్నుంచి రేకుల షెడ్లు వేశారు. అవి గాలికి లేచిపోయాయి. ఒక కొండ మీద నుంచి లేచిన రేకులు మరో కొండదాకా ప్రయాణించాయిట. మధ్యలో ఏ మనిషి మెడో తగిలి వుంటే శిశుపాలవధ అయిపోయి వుండేది. ఫార్మా సిటీలో నష్టం చాలా భారీగా జరిగింది. హైదరాబాదులో విస్తరణకు అనుమతి యివ్వకపోవడంతో ఏడెనిమిదేళ్లగా బల్క్‌ ఫార్మా వాళ్లు వైజాగ్‌కు విస్తరించారు. అక్కడ కూలింగ్‌ టవర్లు కట్టారు. స్థలం ఆదా చేద్దామని కూలింగ్‌ టవర్లు యూనిట్‌ పై భాగంలో ఏర్పాటు చేశారట. రియాక్టర్లు వున్న భవనాలపై చెట్లు కూలాయి.  రియాక్టర్లు కూలి షెడ్లపై పడ్డాయి. వాటికి కప్పుగా వేసినవి రేకులు. అవి కూలి షెడ్స్‌ నాశనం కావడంతో వాటిలో దాచిన రసాయనాలు, ముడిపదార్థాలు, తయారు చేసిన బల్క్‌ డ్రగ్స్‌ తడిసిపోయాయి. ఈ పనులు జరగకపోవడం అనేది గత పదేళ్ల కాంగ్రెస్‌ హయాం నిర్వాకమని చంద్రబాబు మనను నమ్మించాలని చూస్తున్నారు. ఒక్కో నిర్మాణం ఎప్పుడు జరిగిందో, ఒక్కో ఆక్రమణ ఎప్పుడు జరిగిందో ఆరాలు తీస్తే యిది గత పదేళ్లదే కాదనీ, అంతకు ముందు పదేళ్లదనీ, యిరవై ఏళ్ల దనీ, ముప్ఫయి ఏళ్లదనీ... గట్టిగా మాట్లాడితే తరతరాల పాపమని తేలుతుంది. 

తెరాస ప్రభుత్వం యిప్పుడు తమ లోపాలకు, తప్పులకూ బాబే కారణమని చెప్తూంటే బాబు ఖండిస్తున్నారా లేదా? తెలంగాణలో చెరువుల కాచ్‌మెంట్‌ ఏరియాల్లో కట్టిన ఆక్రమణల వివరాలు సేకరించి, వాటిని తొలగిస్తామంటున్నారు. తొలగించడం మాట ఎలా వున్నా, ఆరాలు తీస్తే ఎవరు ఆక్రమించారో చెపితే చాలు. పిడుగు పడినా అది ఆంధ్రుల పనే అంటూ వచ్చిన తెలంగాణ ఉద్యమకారులకు దురాక్రమణదారుల్లో ఎంతమంది ఎక్కడివారో తెలుస్తుంది. కనీస సౌకర్యాలు లేని కాలేజీలు నడిపి తెలంగాణ విద్యార్థులను ఆంధ్రులు దోచారంటూ హుంకరిస్తూ వచ్చిన హరీశ్‌రావు యిప్పుడు జెఎన్‌టియు గుర్తింపు రద్దు చేసిన కాలేజీల్లో తెలంగాణవారివి లేవని స్పష్టం చేయాలి. ఉన్నాయంటే దోపిడీదారులకు కుల, ప్రాంత భేదాలు లేవని ఒప్పుకోవాలి.  ఎప్పటికైనా కావలసినది - తప్పులు సరిదిద్దడం. ఫలానావారే దీనికి కారణం అంటూ అంటూ వేలెత్తి చూపడం మొదలుపెడితే తక్కిన మూడువేళ్లు మనను చూపుతాయి. 

చంద్రబాబు అంటున్నారు - ''గత పదేళ్లలో పరిపాలన వ్యవస్థ పూర్తిగా దెబ్బ తింది. పనిచేసే తత్వం పోయింది. మంచివాళ్లు, నిజాయితీపరులను కూడా పని చేయనీయకుండా ప్రభుత్వాలు అడ్డుకున్నాయి.'' అని. పాలనా వ్యవస్థ పూర్తిగా దెబ్బ తినిపోతే యిప్పుడు సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నవారెవరు? వీళ్లెక్కడి నుంచైనా దిగి వచ్చారా? పరరాష్ట్రం నుండి దిగుమతి చేసుకున్న వారు తప్ప ఆంధ్ర రాష్ట్ర ఉద్యోగులు ఎవరూ చేయటం లేదా? అక్రమంగా అనుమతులు యిచ్చినది కూడా యీ వ్యవస్థే. అది గత పదేళ్లగానే కాదు, గత 60 ఏళ్లగా యిస్తూనే వుంది. దానిలో టిడిపి పాలించిన కాలం కూడా కలిసే వుంది. (సశేషం)

 - ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (అక్టోబరు 2014)

[email protected]

Click Here For Part-1

Click Here For Part-2

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?