cloudfront

Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ : హుదూద్‌ పాఠాలు - 2

మొట్టమొదటగా చూడవలసినది - తుపానుల విషయంలో ఆంధ్ర రాష్ట్రం ఎంత వల్నరబుల్‌గా వుంది, ఎన్ని ప్రాంతాలు నష్టపోయే అవకాశం వుంది అనేది. ప్రపంచవ్యాప్తంగా వచ్చే తుపాన్లలో 18% బంగాళాఖాతం నుండే వస్తాయి. ఆంధ్రకు 960 కిమీ.ల తీరం వుంది. అంటే ఎంతగా రిస్క్‌కు ఎక్స్‌పోజ్‌ అయిందో చూడండి. 100 ఏళ్లలో 103 తుపాన్లు వచ్చాయి. 1891 నుంచి వచ్చిన తీవ్రమైన 75 టిలో 23 నెల్లూరు జిల్లాను, 16 కృష్ణాను, 11 తూర్పు గోదావరిని, 11 శ్రీకాకుళంను, 7 విశాఖను, 5 ప్రకాశంను, 2 గుంటూరును దెబ్బ తీశాయి. గత 37 ఏళ్లలో 60 రకరకాల ప్రకృతి బీభత్సాలు రాష్ట్రాన్ని దెబ్బ కొట్టాయి. ఏడాదికి మూడుసార్లు వచ్చిన సందర్భాలు కూడా వున్నాయి. వీటి వలన జరిగే ప్రాణనష్టం ఎలాగూ వుంటుంది. 

ఆర్థికంగా యివి రాష్ట్రాన్ని ఎలా దెబ్బ తీస్తాయో తెలుసుకుంటే గుండె బేజారై పోతుంది. 2010లో లైలా కలిగించిన నష్టం కారణంగా మన రాష్ట్రపు అభివృద్ధి రేటు (గ్రోత్‌ రేటు)లో 2% తగ్గిపోయిందని ప్రపంచబ్యాంకు అంచనా వేసింది. అంటే ఎన్నో ప్రణాళికలు వేసి, మరెన్నో ప్రోత్సాహకాలు యిచ్చి కష్టపడి, గ్రోత్‌ రేట్‌ పెంచితే దానిలో 2% యిలా తుడిచిపెట్టుకుపోతే యిక లాభం ఏమిటుంటుంది? ప్రకృతి అలా మనతో ఆడుకుంటూ వుంటే మనమేం చేస్తాం అనుకోకూడదు. టీకా వేయించుకుంటే రోగం రాదు, మందుల ఖరీదు తప్పుతుంది. ఇలాటి వైపరీత్యాల విషయంలో దాని నిష్పత్తి 1:7ట. అంటే ఒక రూపాయి ఖర్చు పెట్టి మనం దానికి సిద్ధపడితే 7 రూ.లు మిగులుతాయన్నమాట. ఆంధ్ర రాష్ట్రానికి యీ స్థాయిలో రిస్కు వుంది కాబట్టి అన్నిటికంటె ఎక్కువగా ప్రిపేర్‌ అయి వుండాలి.

విపత్తు నిర్వహణ మొత్తాన్ని రెండు 'పి'లు, మూడు 'ఆర్‌'లుగా అభివర్ణించవచ్చంటారు నిపుణులు. విపత్తు జరిగేముందు కావలసినవి - ప్రివెన్షన్‌, ప్రిపేర్‌డ్‌నెస్‌ (నివారణ, సన్నద్ధతకై ప్రణాళిక) అవి రెండు 'పి'లు. ఇక జరిగాక కావలసినవి - రెస్క్యూ, రిలీఫ్‌, రిహేబిలిటేషన్‌/రికవరీ (రక్షణ, సహాయం, పునరావాసం/మానసిక స్థయిర్యాన్ని తిరిగి పొందడం) అవి మూడు 'ఆర్‌'లు! వీటిలో ఏవి ఎంతవరకు జరిగాయో చూద్దాం. ప్రివెన్షన్‌ - యీ విభాగంలో ప్రభుత్వానికి, చాలా తక్కువ మార్కులు పడతాయి. ప్రస్తుత ఆంధ్ర ప్రభుత్వాన్ని మాత్రమే అనటం లేదు. గత ప్రభుత్వాలను కూడా. చంద్రబాబుగారు గత ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా యిది జరిగింది అంటున్నపుడు ఆయన దృష్టిలో 'గత ప్రభుత్వం' అంటే గత పదేళ్లగా వున్న కాంగ్రెసు ప్రభుత్వం అనే కావచ్చు. అంతకుముందు ప్రభుత్వాలను కూడా లెక్కలోకి తీసుకోవాల్సిందే. ఎందుకంటే యిది ఒకనాటి పాపం కాదు. 

గోదావరి, కృష్ణా జిల్లాల్లో రొయ్యల చెరువుల్లో 20% సిఆర్‌జడ్‌ పరిధిలోనే తవ్వేశారు. వాటిని పెట్టడానికి మడ అడవులను పెకలించేశారు. షోర్‌ ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీ అని వుంది. ఒడ్డు నుంచి 50 మీ. వరకు మడ అడవులు పెంచడం దాని బాధ్యత. ఇప్పుడు ప్రతీవాళ్లూ మడ అడవుల ప్రాధాన్యత గురించి చెప్పేవాళ్లే. శ్రీకాకుళం నుండి నెల్లూరు వరకు తీరం వెంబడి మడ అడవులు, సరుగుడు చెట్లు యిన్నాళ్లూ కాస్తో కూస్తో కాపాడుతూ వచ్చాయి. ప్రకృతే తనను తాను రక్షించుకోవడానికి కొండలు, చెట్లు వంటి కొన్ని ఏర్పాట్లు చేసుకుంది. కర్ణుడి సహజకవచాన్ని ఇంద్రుడు పీక్కుని పట్టుకుపోయినట్లు, మనం అలాటి కవచాలను పీకేసి, భవన నిర్మాణాల్లో రాళ్లకోసం కొండలు తవ్వేసి, చెట్లను కూల్చేసి యిళ్లు, దుకాణాలు కట్టేసుకుంటున్నాం. మనలను మనమే ప్రమాదంలోకి నెట్టుకుంటున్నాం.  తమాషా ఏమిటంటే యిదంతా అభివృద్ధిలో భాగమని మనల్ని మనం బుకాయించుకుంటున్నాం. ఇప్పుడు వైజాగ్‌ మళ్లీ సాధారణ స్థాయికి రావాలంటే ఓ పదేళ్లు పడుతుందనుకుంటే మనం సాధించినది ప్రగతా? తిరోగతా? (సశేషం) 

 ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (అక్టోబరు 2014)

mbsprasad@gmail.com

Click Here For Part-1

లవ్ స్టొరీ లకు ఇక గుడ్ బై

వైఎస్సార్ కారు నడిపాను

 


×