ఎమ్బీయస్‌ : రేవంత్‌ రెడ్డి పాపం ఏమిటి?

తెలంగాణ ఎసెంబ్లీ వార్తల్లో రోజూ కనబడే పేరు రేవంత్‌ రెడ్డి. మళ్లీ న్యూస్‌ కొత్తగా ఏమీ వుండదు. 'రేవంత్‌ మాట్లాడబోయేడు. క్షమాపణ చెప్పేదాకా మాట్లాడనివ్వమని తెరాస సభ్యులు గోల చేశారు. ఆయన క్షమాపణ చెప్పలేదు.…

తెలంగాణ ఎసెంబ్లీ వార్తల్లో రోజూ కనబడే పేరు రేవంత్‌ రెడ్డి. మళ్లీ న్యూస్‌ కొత్తగా ఏమీ వుండదు. 'రేవంత్‌ మాట్లాడబోయేడు. క్షమాపణ చెప్పేదాకా మాట్లాడనివ్వమని తెరాస సభ్యులు గోల చేశారు. ఆయన క్షమాపణ చెప్పలేదు. వీళ్లు మాట్లాడనీయలేదు.' ఇలా ఎన్నాళ్లు? ఎన్నేళ్లు? మాట్లాడనివ్వకపోతే యిక ప్రజాప్రతినిథులను అసెంబ్లీకి పంపించడం దేనికి? అధికార పార్టీ 'టాకింగ్‌ టామ్‌' వంటి సాఫ్ట్‌వేరు ఒకటి పెట్టుకుంటే సరి. మనం ఏమంటే అదే రిపీట్‌ చేస్తూ వుంటుంది. సభ ఏకగ్రీవంగా ఆమోదించింది అని చెప్పేసుకోవచ్చు –  మొన్న ఎన్టీయార్‌ పేరు మార్పు తీర్మానంలా! 'మేం ఒక పక్కనుంచి తీర్మానానికి అభ్యంతరం పెడుతూంటే అది ఏకగ్రీవం ఎలా అయింది అని టిడిపి, బిజెపి అంటున్నా అధికారపక్షం వినలేదు – మీరూ మనుష్యులేనా? మీదీ అభిప్రాయమేనా? అన్నట్టు తీసిపారేశారు. 

తెలంగాణ వచ్చేవరకు మనమంతా ఒక్కటి, అలాయ్‌-బలాయ్‌, అందరం కలిసికట్టుగా ఆంధ్రులతో పోట్లాడదాం అంటూ వచ్చిన తెరాస నాయకులు తెలంగాణ వచ్చేక తమ పార్టీవారు తప్ప తక్కినవారు తెలంగాణవారు కాదన్నట్లే ప్రవర్తిస్తున్నారు. టీవీ చర్చల్లో గతంలో ఆంధ్ర-తెలంగాణ నాయకులు ఎలా కాట్లాడుకునేవారో, యిప్పుడు తెలంగాణ-తెలంగాణ నాయకులు అదే తీరులో కాట్లాడుకుంటున్నారు. ఋణమాఫీ దగ్గర్నుంచి ఏ విషయంపై ప్రశ్నించినా తెలంగాణ ద్రోహి అనేస్తున్నారు. రాష్ట్రం వచ్చినా ఇంకా ఎంతకాలం ఆంధ్రవాళ్ల పల్లకీ మోస్తారు అంటున్నారు, మోయడానికి యిక్కడ పల్లకీ ఏమీ లేదని తెలిసినా! తాము చెప్పే కబుర్లు సందేహించినా చాలు, వాళ్లు ఆంధ్రులకు తొత్తులు అనే ముద్ర కొట్టేస్తున్నారు. ఉద్యోగాలు రావన్న భయంతో విద్యార్థులు ఆందోళన చేస్తే ఆంధ్రులే చేయించారంటారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఆంధ్రులు మాయమాటలు చెప్పి వారి ఆత్మస్థయిర్యాన్ని దిగజార్చారంటారు. ఇలా ఎంతకాలం? రేవంత్‌ రెడ్డి కూడా తెలంగాణవాదే. ఉద్యమసమయంలో ఆయనా ఆంధ్రులపై తీవ్రపదజాలాన్ని ఉపయోగించాడు. అయినా యిప్పటి తెలంగాణ పాలకుల దృష్టిలో ఆయన ఆంధ్రభృత్యుడు. విద్యుత్‌ విషయంలో మీ స్టేటుమెంటుకు, ఆంధ్రప్రభుత్వం స్టేటుమెంటుకు తేడా వచ్చిందేమిటి? ఏది నిజమో శ్వేతపత్రం ప్రకటించండి అని అడిగినందుకు ఆయన్ను తిట్టి పోశారు. 

విద్యుత్‌ కొరతకు కారణం పొరుగురాష్ట్రం. వాళ్లు మన వాటాకు రావలసినంత విద్యుత్‌ వాళ్లు యివ్వలేదు అని తెరాస మంత్రులు చెప్తున్నారు. అది తప్పు, మేం యివ్వాల్సినంతా యిచ్చాం అని ఆంధ్ర మంత్రి చెప్పారు. ఏది నిజమో అన్న సందేహం ప్రజలకు రావడం సహజమే కదా. మేం చెప్పినది నమ్మకపోతే నువ్వు ద్రోహివే అంటే ఎలా? 'మీరు సకాలంలో విద్యుత్‌ కొనలేదేం అని అడిగితే సమాధానం చెప్పం. న్యాయంగానైనా, అన్యాయంగానైనా యింకా ఎక్కువ విద్యుత్‌ యిచ్చి తీరాల్సిందేనని మేం అంటున్నాం. విద్యుత్‌ కొరతకు పక్కరాష్ట్రం కారణమని చెప్పి చేతులు దులుపుకుంటున్నాం. నువ్వు మాకు తాళం వేయాల్సిందే, లేకపోతే తిన్నింటి వాసాలు లెక్కపెట్టేవాడివంటాం' అంటే ఎలా? 'మన దేశపు సరిహద్దులు మీరు సరిగ్గా కాపాడటం లేదు, ముందుచూపుతో ఆయుధాలు కొనలేదు, మనకు రావలసిన నిధుల కంటె ఎక్కువ కావాలని అడిగి పాకిస్తాన్‌తో గిల్లికజ్జం పెట్టుకుంటున్నారు' అని ఎత్తిచూపితే సరైన సమాధానం చెప్పకుండా 'నువ్వు దేశద్రోహివి' అంటే ఎలా? 'చట్టప్రకారం రావలసిన వాటా మనకు రాకపోతే మా అందర్నీ తీసుకెళ్లి ఢిల్లీలో ఆందోళన చేయండి, మేమంతా వస్తాం' అని ప్రతిపక్షాలు ఆఫర్‌ చేస్తున్నా దాన్ని పాలకపక్షం తీసుకోవడం లేదంటే అర్థమేమిటి? వారు చెప్పే కబుర్లు కేంద్ర కమిటీ వద్ద, కోర్టుల్లోను చెల్లవనేగా! ఆంధ్రోళ్లు కక్షసాధిస్తున్నారు, అందుకే మీకు కోతలు అని అమాయకప్రజలను బుకాయించినంత సులభం కాదు కదా, కోర్టులను కన్విన్స్‌ చేయడం!

రేవంత్‌ రెడ్డి చేసిన మహాపరాధం ఏమిటి? సమగ్రసర్వేలో లోపాలున్నమాట నిజమేనా అని అడగడం. అంత ఖర్చు పెట్టి, అంత హంగామా చేసి, ప్రపంచం యిప్పటిదాకా కనని, వినని సర్వే అని ప్రచారం చేసుకున్న సర్వేలో ఆయన దృష్టికి వచ్చిన ఒక లోపాన్ని ఎత్తి చూపాడు. ఒక వార్తాపత్రికలో వచ్చిన వార్తను ఆధారం చేసుకుని ఆరోపణ చేశాడు. ఆయనేమీ అధికారంలో లేడు కదా, అధికారంలో వున్నా ఆ శాఖకు సంబంధించిన ఫైళ్లు ఆయన వద్దకు వస్తే తప్ప నిర్ధారణగా ఏమీ తెలియదు కదా.  రేవంత్‌ తన ఆరోపణకు సాక్ష్యాధారాలు చూపాలట. చూపగలిగితే ఏకంగా కేసే వేసేవాడు. కెబిఆర్‌ పార్కు కిడ్నాప్‌ యత్నం తర్వాత తెరాస ఎమ్మెల్యే ఒకాయన హైదరాబాదులో శాంతిభద్రతల సమస్య సృష్టించి పారిశ్రామికవేత్తలను తరిమివేసే ప్రయత్నంలో ఆంధ్ర ప్రభుత్వం ఆయుధాలను తెలంగాణలోకి దింపుతోందని ఆరోపించారు. దానికి సాక్ష్యం చూపారా? అది ఒక వ్యక్తి చేసిన పనా? లేక వెనక్కాల వుండి ప్రభుత్వం చేయించిందా? అనే విషయంలో ఆయనకు ఆధారాలున్నాయా? అసెంబ్లీలో యివన్నీ మామూలే అనుకుని అందరూ వూరుకుంటారు. 

లోకంలో రాజకీయనాయకులందరూ అవలంబించే పద్ధతే యిది. ఆరోపణ చేసి నిజాలు రాబడదామని చూస్తారు. ఫలానా హౌసింగ్‌ సొసైటీలో రూ. 100 కోట్ల అక్రమాలు జరిగాయి అంటారు. దానికి సమాధానంగా మంత్రిగారు అబ్బే 100 ఎక్కడ మేం యీ మధ్యేగా అధికారంలోకి వచ్చాం, దానిలో సగమే, అదైనా అధికారుల అవినీతి వలన జరిగింది. ఇంకా లోతుగా వెళ్లి విచారణ చేయిద్దామని భూమి పుట్టిన దగ్గర్నుంచీ వున్న హౌసింగ్‌ సొసైటీలన్నిటి కార్యకలాపాలన్నిటినీ సమీక్షించమని కమిటీ వేస్తున్నాం అంటారు. అంత పెద్ద పని కావడంతో అది ఎప్పటికీ పూర్తి కాదు, వీళ్ల పాలెంతో తెలియదు. తెరాసవారు ప్రతిపక్షంలో వున్నపుడు యిలాటి ఆరోపణలు వేలాదిగా చేశారు. అధికారులను మాత్రమే శిక్షిద్దామని కచ్చితంగా అనుకున్న సందర్భాల్లో అధికారపార్టీ సభ్యులు కూడా యిలాటి ప్రశ్నలు లేవనెత్తుతారు 'ఇది నిజమేనా?' అని. ప్రజాస్వామ్యంలో యిలాటి వెసులుబాటు కల్పించడానికే అసెంబ్లీలో, పార్లమెంటులో ప్రశ్నలడిగేవారికి యిమ్యూనిటీ కల్పించారు. వీటిపై వారిని కోర్టుకి యీడ్వడానికి వీల్లేదు. ఒక ప్రజాప్రతినిథిగా రేవంత్‌ తన హక్కును ఉపయోగించుకున్నారు.  

ఆ మాత్రానికి ఆయనపై రకరకాలుగా విరుచుకుపడ్డాడు. ఆయన కవిత పేరు చెప్పకుండా నిజామాబాద్‌ ఎంపీ అని వూరుకున్నాడు. తెరాస ఎమ్మెల్యేలు – అందునా కొండా సురేఖ – అదిగో ఆడకూతుర్ని అవమానించాడు అంటూ విరుచుకు పడిపోయారు. ఆరోపణ చేస్తే అవమానించినట్లేనా? జయలలితపై ఆరోపణలున్నాయి, మాయావతిపై వున్నాయి, మమతా బెనర్జీపై వున్నాయి. మరి వారిని కూడా ఏమీ అనకూడదా? కెసియార్‌ సోనియాను అనరాని మాటలన్నారు. ఇదేమిటంటే తెలంగాణ భాష యిదే అని బుకాయించారు. అలాటి భాష రేవంత్‌ వుపయోగించనే లేదు. అయినా కవితకు వ్యక్తిగతంగా అవమానం జరిగినట్లు వీళ్లు కలరింగు యిచ్చి క్షమాపణ చెప్పాలని పట్టుబడుతున్నారు. ఆయనేదైనా అసభ్యంగా మాట్లాడి వుంటే స్పీకరు రికార్డులోంచి తొలగించి వుండేవాడు కదా. ఆరోపణ చేయడమే క్షమాపణ చెప్పేటంత నేరమైతే ఆ నేరం చేయని ప్రజాప్రతినిథి ఒక్కడైనా వున్నాడా? తెరాస వాళ్లు యీ అంశాన్ని ప్రజల ముందుకు కాని, కోర్టుకు కాని, కేంద్ర సంస్థలకు ముందు కానీ తేలేరు. అందుకే రేవంత్‌ క్షమాపణ చెప్పాలని గోల చేయడం తప్ప మరేమీ చేయటం లేదు. అది తప్ప వారికి యింకేమీ రానట్టుంది. సభలో మెజారిటీ వుంది కాబట్టి చెల్లిపోతోంది. టి-మేధావులు కలలు గన్న ప్రజాస్వామ్య తెలంగాణ యిది కాదనుకుంటా! 

రేవంత్‌ లేవనెత్తిన అంశం వలన ఒక విషయం తెలియవచ్చింది. కవితగారి పేరు హైదరాబాదులో నమోదు కాలేదు, మంచిదే. కానీ కవిత గారి ఆఫీసు విడుదల చేసిన ప్రకటన ప్రకారం ఆవిడ పేరు నవీపేట మండల్‌లోని పోతంగల్‌ గ్రామంలో వాళ్ల మావగారి యింట్లో సభ్యురాలిగా నమోదైంది. అదీ – యిన్‌ ఆబ్సెన్షియా! 'అత్యవసర పనులు వలన నేను యింట్లో వుండటం లేదు' అని ఆమె లేఖ రాసి మావగారికి యిస్తే నమోదు చేసే అధికారి దాన్ని ఆమోదించారు. సర్వే విధివిధానాల్లో యీ వెసులుబాటు వున్నట్టు ఎప్పుడూ ప్రకటించలేదు. ఇతర రాష్ట్రాలలో, యితర దేశాల్లో ఎక్కడ వున్నా సరే ఆ రోజు వచ్చి తీరాల్సిందే, ఆసుపత్రిలో వున్న రోగులను సైతం డిశ్చార్జి అయి వచ్చి యింట్లో హాజరుగా వుండాల్సిందే. వచ్చిన అధికారి స్వయంగా మనుష్యులనే కాదు, కిచెన్‌లోకి వెళ్లి గ్యాసు స్టవ్‌కు వున్న పొయ్యిల సంఖ్య కూడా లెక్కపెట్టాలి అని మనలాటి వాళ్లందరినీ హడలగొట్టారు. దాంతో వేలాది రూపాయలు, సెలవులు ఖర్చు పెట్టుకుని  పరాయి వూళ్ల నుంచి అనేకమంది వచ్చారు. కవితగారికి యిచ్చిన మినహాయింపు మన కెందుకు యివ్వలేదు? సమన్యాయం జరగలేదని తేలలేదా? ఇది సర్వేలో లోపం కాదా? రేవంత్‌ లేవనెత్తకపోతే యీ విషయం ఎవరికైనా తెలిసేదా? ఈ ప్రశ్న అడిగినంత మాత్రాన రేవంత్‌ యిక ఎప్పటికీ అసెంబ్లీలో నోరు విప్పడానికి లేదా? అంతటి ముఖ్యమైన నాయకుడు తన స్పందన తెలియచేయకుండానే యీ రోజు బజెట్‌ కూడా పాసయిపోయింది. ఇది నోరు నొక్కడం కిందకు రాదా? 

రేవంత్‌ నోరు విప్పకపోతేనేం, టిడిపి సభానాయకుడు ఎర్రబెల్లి దయాకరరావు వున్నారుగా అనవచ్చు. ఎర్రబెల్లిపై 'లీడర్‌ యిన్‌ ట్రాన్సిట్‌' ముద్ర పడింది. ఆయన జిల్లాలో తెలంగాణ భావన ఎక్కువ కాబట్టి, కడియం శ్రీహరి, ఎర్రబెల్లి చంద్రబాబుపై ఒత్తిడి చేసి తెలంగాణకు అనుకూల లేఖ యిప్పించారు. కాగల కార్యం జరిగాక ఆయన దూకేశాడు. ఈయనా యీ మధ్య దూకబోయాడు కానీ కడియం అడ్డుపడ్డారట. మైహోం విషయంలో ఎర్రబెల్లికి, రేవంత్‌కు మాట కలవటం లేదు. మై హోం లింకో, వరంగల్‌ లింకో తెలియదు కానీ ఎర్రబెల్లి తెరాస పట్ల మెత్తమెత్తగానే వ్యవహరిస్తున్నారు. రేవంత్‌కు ఆ బాధ లేదు. ఆయన తెరాసనుంచి టిడిపికి వచ్చిన నాయకుడు. వాళ్ల జిల్లాలో తెరాసకు అంత బలం లేదు. తెలంగాణ భావనే తక్కువ. తెరాసపై ఉత్తర తెలంగాణ పార్టీ ముద్ర వేసి వారి ఆధిపత్యం సహించం అంటూ మెహబూబ్‌ నగర్‌ నాయకులందరూ గళం విప్పుతున్నారు. బతకమ్మను మాపై రుద్దకండి, మిషన్‌ కాకతీయ అని మా దగ్గర అనకండి అంటున్నారు. అందువలన రేవంత్‌కు తెరాస విషయంలో రాజీ పడవలసిన అవసరం లేదు. కాంగ్రెసు పార్టీ వారు ఫిరాయింపులతో దడిసిపోయి తెరాస పట్ల సాఫ్ట్‌ పెడలింగ్‌ చేస్తున్నారు. వారిలో భట్టి విక్రమార్క ఒక్కరే కాస్త వెలిగారు.  తెరాస రేవంత్‌ను కార్నర్‌ చేయడానికి చాలా చిన్న విషయం ఎన్నుకుని ఓవరాక్షన్‌ చేయడం వలన  ప్రస్తుతం ఆయన ఒక్కడే ప్రతినాయకుడిగా, తెరాస తప్పులను ఎత్తిచూపించే ఏకవీరుడిగా భాసిస్తున్నాడు. 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (నవంబరు 2014)

[email protected]