ఎమ్బీయస్‌ : సెజ్‌ల నుంచి నేర్చుకున్నదేమిటి? – 4

పరిశ్రమలు అభివృద్ధి కావాలంటే రాజధానిలో నైట్‌క్లబ్బులు వుండాలని గతంలో నేను రాసినట్లు కొందరు పాఠకులు ఆరోపించారు. నేను అప్పుడు రాసినదిది – ''ఈ మధ్యే గుజరాత్‌, రాజస్తాన్‌ తిరిగి వచ్చాను. గుజరాత్‌లో ఐటీ పరిశ్రమ…

పరిశ్రమలు అభివృద్ధి కావాలంటే రాజధానిలో నైట్‌క్లబ్బులు వుండాలని గతంలో నేను రాసినట్లు కొందరు పాఠకులు ఆరోపించారు. నేను అప్పుడు రాసినదిది – ''ఈ మధ్యే గుజరాత్‌, రాజస్తాన్‌ తిరిగి వచ్చాను. గుజరాత్‌లో ఐటీ పరిశ్రమ ఎందుకు రాలేదు? అని అహ్మదాబాద్‌లో పనిచేసే గుజరాతీ ఐటీ నిపుణున్ని అడిగాను. 'ఇక్కడ మద్యనిషేధం వుంది, నైట్‌ లైఫ్‌ లేదు. ఏ ఐటీ ఉద్యోగికి రావాలని వుంటుంది? వాళ్లలో చాలామంది సౌత్‌ ఇండియా వాళ్లే. అక్కడక్కడే బెంగుళూరు, పుణె, చెన్నయ్‌, హైదరాబాద్‌లలో ఉద్యోగాలు దొరుకుతున్నాయి. ఉద్యోగం మారాలన్నా మరో కంపెనీ అదే వూళ్లోనో, పక్కూళ్లోనో యింకోటి దొరుకుతోంది. ఇక్కడైతే ఒకటీ, అరా కంపెనీలు! మారడానికి వీల్లేక కొట్టుమిట్టులాడాలి.'' అన్నాడు. ముద్రా కమ్యూనికేషన్స్‌ను అహ్మదాబాద్‌లో స్థాపించేటప్పుడు పడిన కష్టాల గురించి ఎజి కృష్ణమూర్తి రాశారు. ఏడ్‌ ఏజన్సీలన్నీ బొంబాయిలోనే గూడు కట్టుకుని వున్నాయి. అక్కడ లైఫ్‌లో హుషారే వేరు. అహ్మదాబాద్‌లో, మందు పార్టీలు కూడా చేసుకోవడానికి వీల్లేదంటే ఒక్క యాడ్‌ నిపుణుడూ రాలేదట. వీళ్లే తయారుచేసుకున్నారు. ఎంత శ్రమ, ఎంత సమయం ఖర్చుపెట్టాలో వూహించుకోండి…'' దీనిలో నేను రాసినది నైట్‌ క్లబ్‌ కాదు, నైట్‌ లైఫ్‌. నైట్‌ బజార్‌ కూడా నైట్‌ లైఫ్‌లో భాగమే. ఐటీ గురించి రాసినది అన్ని యిండస్ట్రీలకు ఎలా అన్వయిస్తారు? ఐటీలో దక్షిణాది వాళ్లు ఎక్కువగా వున్నారన్న విషయం కూడా మేజర్‌ ఫ్యాక్టరే కదా. ప్రొహిబిషన్‌ వుందని, నైట్‌ లైఫ్‌ లేదని గుజరాత్‌లో పరిశ్రమలు రాకుండా పోయాయా? కష్టపడి నెలకొల్పినా ముద్రా కమ్యూనికేషన్స్‌ అహ్మదాబాద్‌లో నిలదొక్కుకోలేదా? నేను సెప్టెంబరులోని రాసిన వ్యాసాన్నే యింత దారుణంగా మిస్‌కోట్‌ చేసి పరిశ్రమలకు నైట్‌క్లబ్బులకు నేను ముడి పెట్టానని బుకాయిస్తే ఎలా? రాజధానిలో నైట్‌క్లబ్బులు కావలసివస్తే ప్రయివేటు పార్టీలు రకరకాల బజెట్‌లలో, రకరకాల అభిరుచుల్లో ఆ సౌకర్యాలు అందిస్తారు. ప్రభుత్వమే పూనుకుంటే డాన్సర్ల నియామకాల్లో కులాలవారీ రిజర్వేషన్లు, 371 (డి) నియమాలు అమలు చేసి రసికులను ఉసూరు మనిపిస్తారు. 

ఇక బాబుగారి అసెంబ్లీ ప్రసంగానికి వస్తే – ఈ రోజు దేశవిదేశాల్లో తెలుగువాళ్లు ఎవరైనా ఉద్యోగం చేస్తున్నారంటే అది నా చలవే అని బాబు చెప్పుకుంటున్నారు. అనవసరంగా ఇంజనీరింగు చదివి ఏ ఉద్యోగమూ రాక అల్లాడుతున్నవారి అవస్థ ఎవరి చలవో కూడా ఆయనే చెప్పాలి. ఆయన కన్వీనియంట్‌గా మర్చిపోతున్న విషయం ఏమిటంటే ఆయన పాలన చేస్తున్న కాలంలోనే వై2కె సమస్య వచ్చి, అనేకమంది భారతీయులకు సడన్‌గా అమెరికాలో ఉద్యోగాలు వచ్చాయి. ఇంజనీరింగు చదవని మామూలు గ్రాజువేట్లు సైతం ఓ కంప్యూటర్‌ కోర్సు చేసేసి, ఉద్యోగాలు సంపాదించుకోగలిగారు. ఆ అసాధారణ పరిస్థితి ఎల్లకాలం కొనసాగదు కదా. ప్రజ్ఞ వుంటేనే ఉద్యోగాలు వస్తున్నాయి. ప్రతిభావంతులను తయారుచేయాలంటే మొదట కాలేజీల్లో ప్రమాణాలు బాగుండాలి. ఇంజనీరింగు విషయంలో యింత ముందుచూపు ప్రదర్శించిన బాబు మెడిసిన్‌ విషయంలో ఎందుకు చూపలేదు? ఈ రోజు వైద్యుల కొరత వుంది, వైద్యవిద్య గరపే ఉపాధ్యాయుల కొరత వుంది. మెడికల్‌ కాలేజంటే చాలా ఎక్విప్‌మెంట్‌ కావాలి. పక్కన ఆసుపత్రి కట్టాలి. అదే యింజనీరింగు అంటే చవక. అనేకమంది రాజకీయ నాయకులు సడన్‌గా విద్యావ్యాపారంలోకి దిగి ఇంజనీరింగు పేరు చెప్పి రెండు అంతస్తుల భవంతిలో మూడు కంప్యూటర్లు చూపెడితే వారికీ అనుమతులు యిచ్చేశారు. బాబు తర్వాత వచ్చిన కాంగ్రెసు ప్రభుత్వం అదే పని మరింత జోరుగా చేసింది. అందరూ కలిసి రాష్ట్రంలో విద్యాప్రమాణాలు జార్చేశారు.  తెలంగాణలో జెఎన్‌టియు చేపట్టిన కసరత్తులో ఎన్ని కాలేజీలు పనికిమాలినవో తెలిసింది. ఏటా తయారయ్యి బయటకు వచ్చే ఇంజనీర్లలో ఇంజనీరు ఉద్యోగానికి తగినవారు 20% కూడా వుండటం లేదు. ఈ రోజు ఇంజనీరింగులో జరిగినది రేపు రాజధాని విషయంలో జరగదన్న హామీ ఏముంది? 

ఇప్పుడు కూడా మితంగా ప్లాన్‌ చేస్తే మేనేజబుల్‌ లెవెల్‌లో వుంటుంది. అతి చేస్తే, అలవి కాని పనులకు దిగితే కంట్రోల్‌ చేయలేరు. రాజధాని తలకాయ అనుకుంటే మొత్తం శరీరంలో దాని వాటా ఎంతో చూడండి. శిరస్సు మరీ భారంగా డిజైన్‌ చేస్తే శరీరం నేలకూలుతుంది. పరిశ్రమలు, జనజీవనం రాష్ట్రమంతటా పరుచుకున్న కేరళ, పంజాబ్‌, హరియాణాల తరహాలోనే కోస్తా ప్రాంతం వుంటుంది. ఏదీ పెద్ద నగరం కాదు, ఏదీ చిన్న పల్లె కాదు. దారి పొడుగునా జనావాసాలు కనబడతాయి. కొద్దిపాటి సౌకర్యాలుంటాయి. వాటిని మెరుగుపరిస్తే ఎక్కడివారు అక్కడే చక్కగా నివసించవచ్చు. ఆ మూడు రాష్ట్రాలకున్న రాజధాని ఏమంత పెద్దది? అదే మోడల్లో ఆంధ్ర రాజధాని కూడా వుండాలి. అప్పుడు అందరూ నగరానికి వచ్చిపడి దాన్ని కంపుకంపు చేయరు. ''తోడికోడళ్లు'' సినిమాలో కొసరాజు గారు రాసిన ''టౌను పక్కకెళ్లద్దురో డింగరీ'' పాట అద్భుతమైన ప్రబోధగీతం. నగరీకరణ వలన దుష్ఫలితాలను నాటుకునేట్లు చెప్తారాయన. నగరీకరణ పెరిగిన కొద్దీ అర్బన్‌ క్రైమ్‌ పెరుగుతుంది. స్థలాభావం, అందువలన ఆక్రమణలు, విరోధివర్గాల మధ్య కలహాలు, బెదరింపులు, కిడ్నాపులు, తుపాకీ సంస్కృతి, వీటిని కంట్రోలు చేయడానికి పోలీసులకు ఇన్నోవా వ్యాన్లు.. అనగా ప్రజలకు మరింత భారం! సిటీలో పోలీసింగ్‌ చాలా కష్టం. పక్కింటివాడెవడో ఎవరూ చెప్పలేరు. పట్టణాలు, గ్రామాల్లో కొత్తవారి కదలికలను గుర్తించడం సులభం. వ్యవసాయంపై ఆధారపడిన రాష్ట్రం, ఆంధ్ర. ఆగ్రో యిండస్ట్రీస్‌ను డెవలప్‌ చేసి ఏ వూరివాళ్లు అక్కడే వుండగలిగేట్లా చేయగలిగితే రాజధానిపై ఒత్తిడి తగ్గి మేన్‌టెనెన్స్‌ ఖర్చులో చాలా మిగులుతుంది. 'మీకేం ఖర్మ, ఢిల్లీని తలదన్నే రాజధాని కట్టుకోండి' అని మోదీ ఆఫర్‌ యిచ్చినా 'నో థ్యాంక్స్‌' అనాలి. ఎందుకంటే వెనకటికి ఓ రాజుగారు ఓ కవిపై కోపంతో ఏనుగు బహుమతిగా యిచ్చాట్ట. దాన్ని పోషించలేక కవి నానా అగచాట్లూ పడ్డాడు. రాజుగారి కానుక కాబట్టి అమ్మలేడు, దాన్ని చూపించి అడుక్కోలేడు. సంపాదించినదంతా ఏనుగు మేతకే సరిపోయేది. పెద్ద రాజధాని నిర్వహణకు తక్కిన జిల్లాలన్నిటినీ ఊడ్చి మరీ పెట్టవలసి వస్తుంది. అంతిమంగా రాష్ట్రం దివాలా తీస్తుంది.

ఈనాడు బాబు సిఆర్‌డిఏ బిల్లు ద్వారా అన్నీ చేతిలో తీసుకుని ఎన్నో బాధ్యతలు నెత్తిన వేసుకుంటున్నారు. ఆయన సమర్థుడని నమ్ముదామనుకున్నా ఆయన వారసులు భ్రష్టు పట్టిస్తారేమోనన్న భయం వేస్తుంది కదా. రాజధాని ప్రాంతమంతా ప్రభుత్వం చేతిలో వుంటుంది. అక్కడి నిర్మాణాలు, అనుమతులు, కాంట్రాక్టులు సర్వం ప్రభుత్వాధీనమే. తమవారనుకున్నవారికి కట్టబెట్టే అధికారాలు చేతిలో వున్నపుడు దుర్వినియోగం చేయాలన్న దురద పుడుతుంది. ఈ రోజు బాబు సింగపూర్‌ అంటున్నారు. రేపొచ్చేవారు మరో సివంగిపూర్‌ అనవచ్చు. సింగపూర్‌వాళ్లు మనకు ఉచితంగా ప్లాన్లు గీసి యిస్తారని బాబు చెప్పారు. సివంగిపూర్‌ వాళ్లు ఉచితంగా చేసిపెట్టడమే కాక, మన చేతిలో తృణమో, పణమో పెడతారని వచ్చేవాళ్లు చెప్పవచ్చు. అయినా ఎవరైనా ఉచితంగా ఎందుకు చేస్తారు? 'విరిగిన వేరుపై మూత్రం పోయరా, నత్రజని అంది అతుక్కుంటుందేమో' అంటే మేం పోయం అంటారు జనాలు, మొరార్జీ దేశాయి అనుయాయులు కాకపోయినా. (ఆయన స్వమూత్రపానం చేసేవాడని తెలియకపోతే జోకు పేలదు). వ్యర్థంగా పోయేదాని వలన యితరులు బాగుపడుతున్నారన్నా గిలగిల్లాడతారు. అలాటివాళ్లు మనకు వుచితంగా ప్లాన్లు గీసి యిస్తారా? సింగపూరు ప్రభుత్వానికి లోకోద్ధరణ తప్ప వేరే పనేమీ లేదా? ఇలా పరోపకారాలలో మునిగిపోతే వాళ్లు తమ ప్రజల్ని ఎప్పుడు పాలిస్తారట? ఎలా సేవిస్తారట? 'ఎవరికైనా కాంట్రాక్టు యిచ్చినపుడు పారదర్శకత పాటిస్తాం' అని చెప్తూన్న బాబు ప్లాను విషయంలోనే అంతర్జాతీయంగా టెండర్లు పిలవకుండా సింగపూరువాళ్లకు ఎందుకు అప్పగించారని అడుగుతారని, అబ్బే వాళ్లు ఉత్తుత్తినే చేసి పెడుతున్నారు, మనకు కాణీ ఖర్చు లేదు అని చెప్పడానికే యిదంతా. రమణగారు ఓ చోట అంటారు – 'చీప్‌ అండ్‌ బెస్ట్‌ అనే మాట ఉత్తినే వాడతాం కానీ అది ఒక ఆక్సీమొరాన్‌ (విరుద్ధపదాల కలయిక).  బెస్ట్‌గా వుంటే చీప్‌గా వుండదు, చీప్‌గా వుంటే బెస్ట్‌గా వుండదు' అని. ఈ విషయంలో చీప్‌ కూడా కాదు, ఏకంగా ఫ్రీయే! అది బెస్ట్‌గా ఎలా వుంటుంది? ఈస్టిండియా కంపెనీ రోజుల్నుంచి చూస్తున్నాం, యిలా తీపి కబుర్లు చెపుతూ వచ్చినవాళ్లు ఎలా కొంపలు ముంచడం కాదు, కొంపలు ఆక్రమించారో! (సశేషం)

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (డిసెంబరు 2014)