ఎమ్బీయస్‌ : తూర్పున చీట్‌ ఫండ్స్‌

అసాం, ఒడిశాలలో నిధులు సేకరించిన రోజ్‌ వ్యాలీ గ్రూపు చైర్మన్‌ గౌతమ్‌ కుండును బుధవారం అరెస్టు చేశారు. కితం ఏడాది శారదా స్కాము కుంభకోణం బయటకు వచ్చేవరకు తూర్పు రాష్ట్రాలైన త్రిపుర, అసాం, పశ్చిమ…

అసాం, ఒడిశాలలో నిధులు సేకరించిన రోజ్‌ వ్యాలీ గ్రూపు చైర్మన్‌ గౌతమ్‌ కుండును బుధవారం అరెస్టు చేశారు. కితం ఏడాది శారదా స్కాము కుంభకోణం బయటకు వచ్చేవరకు తూర్పు రాష్ట్రాలైన త్రిపుర, అసాం, పశ్చిమ బెంగాల్‌, ఒడిశాలలో చిట్‌ ఫండ్స్‌, ఫైనాన్స్‌ కంపెనీల పేరుతో 8 ఏళ్లలో 194 కంపెనీలు కోటి మంది ప్రజల నుంచి రూ. 60 వేల కోట్ల దాకా సేకరించి మోసగించారని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ అంటోంది. మనదేశంలో కావలసినన్ని బ్యాంకులు లేవు. లక్షమంది జనాభాకు చైనాలో 24 బ్యాంకులుండగా మన దేశంలో 11 మాత్రమే వున్నాయి. దేశంలో 35% మంది మాత్రమే బ్యాంకు ఖాతాలు కలిగి వున్నారు. బ్యాంకులున్నా బ్యాంకింగ్‌ సౌకర్యాలు, సేవలు తృప్తికరంగా వుండకపోవడంతో మధ్యతరగతి, పేద ప్రజలు అధిక వడ్డీకి ఆశపడి వీటిలో డబ్బు మదుపు పెడుతున్నారు. బలమైన ఆర్థికవనరులు కలిగిన బ్యాంకులు ఎక్కువలో ఎక్కువ 10% వడ్డీ మాత్రమే యివ్వగలుగుతుండగా యివి 15%-24% వడ్డీ యిస్తూ, పైగా తెచ్చిన డిపాజిట్‌లో 20% కమిషన్‌ ఏజంట్లకు ఎలా యివ్వగలుగుతున్నాయన్న ఆలోచనే వీరికి వుండటం లేదు. మాట యిచ్చిన ప్రకారం వీరికి వడ్డీ యివ్వాలంటే వారు 50% లాభం వచ్చే వ్యాపారం ఏదైనా చేయగలగాలి. అలాటి వ్యాపారం ఏముంటుంది? ఇలా ఆలోచించడానికి ఏజంట్లు వ్యవధి యివ్వరు. తమకు వచ్చే కమిషన్‌కు ఆశపడి వాళ్లు డిపాజిటర్లను ఊదరగొట్టేస్తారు. కొన్ని సందర్భాల్లో ఏజంట్లు తమ మాయలో తామే పడి, తమకు వచ్చిన కమిషన్‌, యింట్లో డబ్బు కూడా డిపాజిట్‌గా పెడతారు. కంపెనీ దివాలా తీసిన తర్వాత డిపాజిటర్లకు తేరగా దొరికేది ఏజంటు మాత్రమే. వారి చేతిలో అతను చావుదెబ్బలు తింటూ వుంటాడు. హతాశులై ఆత్మహత్యలు చేసుకున్న డిపాజిటర్ల సంఖ్య యీ నాలుగు రాష్ట్రాలలో కలిపి 106! సిబిఐ ఒడిశాలో 44 కేసులను, బెంగాల్‌లో 13 కేసులను బుక్‌ చేసింది. 46 మందిని అరెస్టు చేసింది.

థాబ్దాలుగా అనేక ఫైనాన్స్‌ కంపెనీలు బోర్డు తిప్పేస్తున్నా కొత్తవాటిల్లో వీళ్లు అంత తెలివితక్కువగా ఎలా డబ్బు కడుతున్నారన్న సందేహం రావడం సహజం. ఈ కంపెనీలందరిదీ ఒకటే ఫార్ములా. మొదట అనేక వూళ్లల్లో ఒకేసారి బ్రాంచీలు తెరిచేస్తారు. ఎడాపెడా ఏజంట్లను నియమిస్తారు. డిపాజిట్‌ చేసినవారికి అధిక వడ్డీ యిస్తామని చెపుతూ మొట్టమొదటి వందమంది డిపాజిటర్లకు భూమి యిస్తామనో, హాలీడే ట్రిప్‌ యిస్తామనో చెప్తారు. అంతేకాదు, కొత్త మెంబరును చేర్పిస్తే దానిపై కమిషన్‌ యిస్తామని కూడా చెప్తారు. ఇలా ఆ కంపెనీ విస్తరిస్తూ పోతుంది. బ్యాంకులైతే తమ వ్యాపారపు లావాదేవీల్లో వచ్చిన లాభం నుంచి వడ్డీ చెల్లిస్తాయి. ఈ కంపెనీలు వ్యాపారం చేసేదేమీ వుండదు కాబట్టి డిపాజిట్లు చెల్లింపవలసిన సమయం వచ్చేసరికి కొత్త డిపాజిటర్లు కట్టిన డబ్బులోంచి పాతవాళ్లకు యిస్తూ వుంటారు. చాలా కేసుల్లో డబ్బు వెనక్కి యివ్వరు. 'వడ్డీతో సహా రెన్యూ చేసుకోండి. వడ్డీ మీద వడ్డీ వచ్చి ఇంకో రెండేళ్లు పోయేసరికి యింకా బోల్డంత వస్తుంది' అని ఏజంట్ల చేత చెప్పిస్తారు. ఆ విధంగా కంపెనీలోంచి డబ్బు బయటకు పోకుండా చూస్తారు. మరీ ఎవరైనా మొండికేస్తే డబ్బు యిచ్చేసి 'చూశావా, మామీద నమ్మకం లేక ఎంత వడ్డీ పోగొట్టుకుంటున్నావో' అంటారు. అలాటి సందర్భాల్లో వాళ్లు నాలిక కరుచుకుని మళ్లీ డిపాజిట్టు చేస్తూ వుంటారు కూడా. ఇలా అంతా కాగితాలపైనే నడుస్తుంది.  ప్రమోటర్లు ఈ కంపెనీ నడుపుతూనే డబ్బు బయటకు లాగేసి, తమ పేర నడిచే వేర్వేరు వ్యాపారాల్లో పెట్టేస్తూ వుంటారు. ఆస్తులు సమకూర్చుకుంటారు. కంపెనీ పేర యాడ్స్‌ గుప్పిస్తూ, ఈవెంట్స్‌ నిర్వహిస్తూ ప్రచారంపై చాలా ఖర్చుపెడతారు. ఎప్పటికో అప్పటికి కొత్త డిపాజిటర్ల కంటె పాత డిపాజిటర్ల సంఖ్య ఎక్కువ అవుతుంది. అప్పుడిక క్యాష్‌ ఫ్లోకు యిబ్బంది వస్తుంది. ఎవరైనా ఒక్క పాత డిపాజిటరుకు డబ్బు చెల్లించకపోతే చాలు, అందరూ ఆందోళనకు గురై, డబ్బిచ్చేయమని ఒక్కుమ్మడిగా మీద పడతారు. అలా పడితే మహామహా బ్యాంకులే తట్టుకోలేవు. ఇక యీ కంపెనీల మాట చెప్పనే అక్కరలేదు. వెంటనే ప్రమోటర్లు ఆసుపత్రి పాలవడమో, ఆత్మహత్యా ప్రయత్నం చేయడమో, జైలుకి వెళ్లి కూర్చోవడమో చేస్తారు. డిపాజిటర్లు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపడతారు. ప్రభుత్వం మోసగాళ్ల కొమ్ము కాస్తోందని ఆరోపిస్తారు. సిబిఐకి అప్పగించమంటారు. 

ఇదంతా జరుగుతూంటే వీరిని నియంత్రించవలసిన ఆర్‌బిఐ, సెబి వంటి సంస్థలు ఏం చేస్తున్నాయన్న సందేహం వస్తుంది. వీళ్లు 'ఆర్‌బిఐ చేత ఆమోదించబడినది' అని పోస్టర్లు వేసి గోడ కతికించినా, కరపత్రాలు పంచినా ఆర్‌బిఐ ఉలకదు, పలకదు. ఆ విధంగా వీళ్లు అధికారులను మేనేజ్‌ చేస్తారు. ఈ మోసగాళ్లలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రభుత్వాధికారులు, బ్యాంకు అధికారులు వుంటున్నారు. కంపెనీలు తమ డిపాజిట్లపై చిన్న అక్షరాల్లో ఆర్‌బిఐ రూల్సు వర్తించవని రాస్తాయి. వాటిని చదివేవారు ఎవరూ వుండరు. అంతా అయిపోయాక అప్పుడు యీ సంస్థలు రంగంలోకి దిగుతాయి. సిబిఐ పట్టుకున్న  చేపల్లో కొన్నిటిని పరికిస్తే వీటి వ్యవహారంపై ఒక అవగాహన కలుగుతుంది. అసాం, ఒడిశాలలో పెట్టిన రోజ్‌ వ్యాలీ గ్రూపు రియల్‌ ఎస్టేటు, హోటళ్లు, టేకు ప్లాంట్లు వ్యాపారం చేస్తున్నామంటూ 2006-14 మధ్య సేకరించిన డిపాజిట్లు రూ.15 వేల కోట్లు. దానిలో యిన్వెస్టర్లకు, ఏజంట్లకు తిరిగి యిచ్చిన మొత్తం కేవలం రూ. 20 కోట్లు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ (ఇడి) ఫ్రీజ్‌ చేసిన లిక్విడ్‌ ఎసెట్స్‌ (క్యాష్‌ వంటివి) విలువ రూ.300 కోట్లు. తక్కిన కోట్లు ఏమైనట్లు? అలాగే  ఒడిశాకు చెందిన సీషోర్‌ గ్రూప్‌ – కిరాణా వ్యాపారంలో ఫ్రాంచైజీ వ్యాపారం. ఆరోగ్యం, పర్యటన, కోఆపరేటివ్‌ రంగాలలో ఒడిశా ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి ఎంఓయులు చేసుకోవడంతో ప్రజల విశ్వాసం చూరగొంది. 2008-13 మధ్య సేకరించిన మొత్తం రూ.1500 కోట్లు. ఇన్వెస్టర్లకు తిరిగి యిచ్చినది రూ.10 కోట్లు! ఒడిశాకే చెందిన అర్థ తత్వ గ్రూపు ఇన్సూరెన్సు, హౌసింగ్‌ వగైరా వ్యాపారం అంటూ 2010-12 మధ్య సేకరించినది రూ.500 కోట్లు, తిరిగి యిచ్చినది రూ.30 లక్షలు! బెంగాల్‌కు చెందిన ఎంపిఎస్‌ గ్రీనరీ డెవలపర్స్‌ ప్లాంటేషన్‌ బిజినెస్‌ అంటూ 2010-13 మధ్య సేకరించినది రూ.500 కోట్లు, తిరిగి యిచ్చినది రూ.25 లక్షలు! ఒడిశాకే చెందిన మైక్రో ఫైనాన్స్‌ లిమిటెడ్‌ 2007-10 మధ్య రూ.500 కోట్లు సేకరించి రూ.20 లక్షలు తిరిగి యిచ్చింది. 

ఒడిశాలో చాలా మోసాలు జరగడానికి కారణం ఒకటుంది. సెల్ఫ్‌హెల్ప్‌ (స్వయంసహాయక) కోఆపరేటివ్‌ యాక్ట్‌ అని ఒడిశా ప్రభుత్వం 2001లో చేసి, సహకార పద్ధతిలో ఋణం తెచ్చుకునేందుకు దోహదపడ్డాననుకుంది. ఎందుకంటే చిట్‌ఫండ్‌లో వున్న సౌకర్యం ఏమిటంటే డబ్బు దాచుకున్న ప్రజలే అవసరం బట్టి దానిలోంచే అప్పు తీసుకుంటారు. వాళ్లే ఋణదాతలు, వాళ్లే ఋణగ్రస్తులు. 50 మంది సమూహంగా ఏర్పడి ఒకరి అవసరాలకు మరొకరు వుపయోగపడతారు. కానీ చట్టంలో లోపాలను వుపయోగించుకుని 979 కంపెనీలు పుట్టుకుని వచ్చి ప్రజల్ని దోచాయి. దాంతో ఆ చట్టాన్ని రద్దు చేశారు. ఇవి చూసి దేశంలోని చిట్‌ఫండ్‌ కంపెనీలన్నీ చీటింగ్‌ కంపెనీలనుకోవడం పొరబాటు. చిట్‌ ఫండ్‌ రంగం 10 వేల కంపెనీలతో ఏటా రూ. 35వేల కోట్ల బిజినెస్‌ చేస్తుంది. అన్నిటికంటె పెద్దది 1969లో స్థాపించిన కేరళ ప్రభుత్వం నడిపే కెఎస్‌ఎఫ్‌ఇ (కేరళ స్టేట్‌ ఫైనాన్షియల్‌ ఎంటర్‌ప్రైజెస్‌)! 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (మార్చి 2015)

[email protected]