ఆంధ్రలో వాలంటీర్ల వ్యవస్థ అంశం విచిత్రంగా మారింది. వాలంటీరు వ్యవస్థ పెట్టిన దగ్గర్నుంచి దాన్ని తెగ తూలనాడిన బాబు యిప్పుడు కొనసాగిస్తామంటున్నారు. పవన్ దాన్ని అమ్మాయిలను అక్రమ రవాణా చేసే బ్యాచ్‌గా చిత్రీకరించారు. ‘30 వేల పై చిలుకు అమ్మాయిలను వాలంటీర్లు రవాణా చేసేశారు, యీ విషయాన్ని తమరు ప్రజలకు చెప్పి కళ్లు తెరిపించాలి’ అని సెంట్రల్ ఏజన్సీలు తనను కోరాయని చెప్పారు. ఏజన్సీలు యిలా కూడా చేస్తాయా అని ఆశ్చర్యపడే వంతు మనదైంది. ఈ వ్యవస్థ పెట్టే ముందు అదృశ్యమైన యువతులు ఎందరు, తర్వాత ఎందరు, వారిలో ఎందరు దొరికారు, యిలాటి కేసులు ఎందుకు పెడతారు.. యిత్యాది విషయాలన్నీ చర్చకు వచ్చాయి. మాయమై పోయిన అమ్మాయిల కుటుంబాలకు జనసేనాపతి అందించిన సహాయం ఏమైనా ఉందా, వాళ్ల తరఫున కేసులు పెట్టారా అంటే అదీ కనబడటం లేదు. పోనీ వాళ్లను వెతికి పట్టి కుటుంబాలకు చేర్చండి అని జనసైనికులకు పిలుపు నిచ్చారా అంటే అదీ లేదు.
ఈ స్టేటుమెంటుపై వాలంటీర్లు భగ్గుమన్నారు. పవన్ దిష్టిబొమ్మలు తగల బెట్టారు. వెంటనే తెలుగు మీడియాలో వాలంటీర్లపై కథనాలు వెలువడ్డాయి. అక్రమ రవాణా చేస్తున్నారని కాదు, పెన్షనర్ల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారని, మరోటని.. యిలాగే తప్ప డబ్బులు కొట్టేశారని కాదు. పోలీసులైనా, వైద్యులైనా, టీచర్లయినా, ఏ వృత్తిలోనైనా ఓ పది శాతం ‘బాడ్ ఎగ్స్’ ఉండడం సహజమే, వారిని సరిదిద్దాలి, వీలు పడకపోతే శిక్షించాలి తప్ప మొత్తం వ్యవస్థను తప్పు పడితే ఎలా అని కొందరు ప్రశ్నించారు. పవన్ అప్పుడేమీ మాట్లాడలేదు కానీ యీ మధ్య ‘మీలో కొందర్ని అన్నాను’ అంటూ తన స్టేటుమెంటును క్వాలిఫై చేశారు. ఈ ముక్క అప్పుడే అని ఉంటే యింత రగడ, వాలంటీర్లకు మనోక్షోభ ఉండేది కాదు. పవన్ ‘కొందరు’ సవరణ చేయడంతో పాటు సంక్షేమ పథకాలు, వాలంటీర్ల పారితోషికాలు వగైరాల గురించి మాట్లాడుతూ యిప్పుడిస్తున్న దాని కంటె పదో, పరకో ఎక్కువే యిస్తాం తప్ప తీసివేయం అన్నారు.
ఈయన పదో, పరకో దగ్గర ఆగారు కానీ బాబు మాత్రం ఏకంగా పదివేలనేశారు. కూటమిలో మూడో భాగస్వామి బిజెపి అయితే దీని గురించి మౌనం పాటించింది. గతంలో తిట్టనూ లేదు, యిప్పుడు రెట్టింపు చేయనూ లేదు. కూటమి మానిఫెస్టో అంటూ వస్తే యీ పారితోషికం అంకెల్లో ఏది నికరమో తేలుతుంది. రాష్ట్రానికి సంబంధించి మానిఫెస్టో వస్తుంది అన్న పురంధేశ్వరి యిప్పుడు ‘అబ్బే జాతీయ మేనిఫెస్టోయే చాలు, రాష్ట్రానికి విడిగా అక్కరలేదను కుంటున్నారు మా పైవాళ్లు’ అన్నారు. వాళ్లకేం పోయింది, ఎలా అయినా అనుకోగలరు. రాష్ట్ర ప్రజలైతే ఎదురు చూస్తారు కదా. 2018లో ఏ అంశాలపై విభేదించి, కలహించి బాబు ఎన్‌డిఏలోంచి బయటకు వచ్చేశారో, ఆ అంశాలపై యిప్పుడు బిజెపి నుంచి బాబు రాబట్టిన హామీలేమిటి అన్న కుతూహలం ప్రజల్లో ఉంది కదా!
కేసుల భయం గురించి చేతులు కలిపారా, కేంద్ర ఎన్‌డిఏలో మంత్రి పదవుల కోసం కలిశారా అనే సంగతి పార్టీకి సంబంధించిన విషయం. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడానికి కలిశాం అంటున్నారు కాబట్టి అవేమిటో తెలుసుకుందామనే ఆసక్తి ఆంధ్ర ఓటర్లకుంది. కూటమిలో చేరడం మోదీ గారికి యిష్టం లేదన్న ప్రచారానికి ఫుల్‌స్టాపు పెడుతూ మోదీ గారు చిలకలూరి పేట సభకు రావడంతో ఆశలు మోసులు వేశాయి. కానీ మోదీ గారు రాష్ట్రం గురించి ఏ హామీ యివ్వలేదు. ఎంతసేపూ ఎన్‌డిఏ యీసారి నాలుగు వందలు దాటాలి అనే నాలుగు సార్లు చెప్పి వెళ్లారు. డబుల్ యింజన్ సర్కార్ అన్నారు. రాష్ట్ర యింజను కదలాలంటే, కదిలించాలంటే యింధనంగా ప్రత్యేక హోదా కల్పిస్తాం, వైజాగ్ స్టీలు ప్లాంట్ అలాగే ఉంచుతాం, రైల్వే జోను యిస్తాం లేదా మరోటి యిస్తాం అనే ఆశ కల్పించలేదు.
ఎన్నికల వేళ నాయకులు యిప్పటిదాకా చేసినవి చెప్పి, యికపై ఏం చేయబోతారో ప్రకటించి ఓటర్లను ఆకర్షిస్తారు. కానీ మోదీ గారు యిప్పటిదాకా యిచ్చిన విద్యాసంస్థల పేర్లు ఏకరువు పెట్టారు. అవి పెట్టడం వలన తమకు కలిగిన మేలు ఏమిటో అర్థం కాక సభలోని వారు తికమక పడ్డారు. రోడ్లు అవీ వేశామని, కేంద్ర నిధులతో పథకాలు అమలు చేశామని చెపితే ‘జగన్ హయాంలో అభివృద్ధి జరిగిందని, పథకాలన్నీ సవ్యంగా అమలయ్యాయనీ చెప్తాడేమిటీయన’ అని టిడిపి వారు కళవెళ పడ్డారు. ‘మేం యిచ్చిన నిధులు స్వాహా చేసేశాడు’ అనో కనీసం స్థానిక బిజెపి నాయకుల్లా ‘కేంద్ర నిధులతో నడిచే పథకాలపై తన ఫోటో వేసేసుకున్నాడు’ అనో ఆరోపించి ఉంటే వాళ్లు కొంతైనా ఆనందించేవారు.
మోదీ ప్రసంగం ఎలా ఉండాలో మనం డిజైన్ చేయలేం. కానీ స్థానిక బిజెపి వాళ్లయినా ఏవో ఒకటి హామీలివ్వాలి కదా. ప్రస్తుతం ప్రభుత్వంలోని లోపాలు ఎత్తి చూపడం ఎలాగూ చేస్తారు. దానితో పాటు మేం వస్తే ఫలానా విషయంలో దున్నేస్తాం, పొడిచేస్తాం అని చెప్పాలి కదా! అది కూడా నోటిమాటగా కాకుండా మేనిఫెస్టోలో పెట్టాలి కదా! (తర్వాత వెబ్‌సైట్‌లోంచి ఎలా మాయం చేయాలో నేర్చుకోవచ్చు) విడి మేనిఫెస్టో లేనప్పుడు మూడు పార్టీలు కలిసి కామన్ మినిమమ్ ప్రోగ్రాం అంటూ ముందుకు తేవాలి. విడివిడిగా పోటీ చేసినప్పుడు మేనిఫెస్టోలు సరిపోతాయి కానీ మూడు భిన్నమైన పార్టీలు కలిసినప్పుడు ఉమ్మడి ప్రణాళికను ముందు పెట్టాలి. లేకపోతే ‘నేను పదివేలు యిద్దామనుకున్నా కానీ బిజెపి ఒప్పుకోలేదు కాబట్టి, పదే యిచ్చాను’ అనగలడు ‘కాబోయే’ ముఖ్యమంత్రి. ‘ఆ విషయం గురించి మేము ముందుగా చర్చించలేదు, యిక్కడ యిస్తే వేరే రాష్ట్రంలోనూ యివ్వాల్సి వస్తుంది’ అంటూ బిజెపి తప్పుకోవచ్చు.
‘డబ్బు పరంగా పదివేలు యివ్వడానికి నాకు అభ్యంతరం లేదు కానీ, సిద్ధాంతపరంగా దీన్ని వ్యతిరేకిస్తాను. నేను సినిమారంగంలో ఎలా అయితే సొంత కాళ్లపై నిలబడ్డానో, కష్టపడి సొంతంగా ఎదిగానో అలాగే వాళ్లూ ఎదగాలి. ‘చేపని యివ్వకూడదు, చేపలు పట్టడం నేర్పించాలి’ అని బైబిల్‌లో (!?) చెప్పినట్లు..’ అని పవన్ అడ్డు పడవచ్చు. అందువలన వాలంటీర్లకు పదివేల జీతం హామీని బాబు ఉమ్మడి ప్రకటనలో పెట్టేదాకా దానికి విలువ ఉండదు. కూటమి గెలిస్తే ఆయనే ముఖ్యమంత్రి అనే దానిలో సందేహం లేదు. కానీ ఏదైనా సాకు చెప్పవచ్చు. ‘ఖజానా కొల్లగొట్టేస్తున్నాడు, జీతాలు యివ్వలేక అప్పుల మీద బతుకుతున్నాడు. ఏప్రిల్ నెలకు పెన్షన్లు యివ్వడానికి కూడా డబ్బు లేదు’ అని యిప్పుడు ఆరోపిస్తున్న వాళ్లే, ప్రభుత్వంలోకి వచ్చాక ‘ఖజానా యింత బోసి పోయిందని మేమనుకోలేదు. మేమిచ్చిన హామీల అమలుకి సమయం పడుతుంది.’ అనగల సమర్థులు.
చంద్రబాబు ఏక్‌దమ్ పదివేలు అనడం అనుమానస్పదంగా ఉంది. ఏడాదేడాది వెయ్యేసి చొప్పున పెంచుతూ పోయి 5వ ఏడాది కల్లా పదివేలు చేస్తాను అంటే కాస్త నమ్మకం చిక్కుతుంది. పెన్షన్ పెంపు కూడా బాబు నాలుగేళ్లూ గడిపేసి, చివర్లో వెయ్యి పెంచారు. దీన్నీ అలా చేయవచ్చేమో అనే శంక ఉంటుంది కదా! ఎందుకంటే యిది అసలే దండగమారి వ్యవస్థ అని బాబు అభిప్రాయం. మొన్న ఏప్రిల్ పెన్షన్ల సమయంలో గ్రామ సచివాలయాల ద్వారా పంపిణీ జరిగింది. హఠాత్తుగా నిర్ణయం తీసుకున్నారు కాబట్టి గలభా అయింది. ముందే ప్లాను చేసి ఉంటే నాలుగు రోజుల కేలండరు పెట్టుకుని ఒకటో తారీకున యిన్ని గ్రామాలు, రెండున యిన్ని.. అనుకుంటూ స్టేగర్ చేయవచ్చు. ఈ నెల 4న పెన్షన్ వచ్చినవాళ్లకి పై నెల కూడా 4నే యిస్తే, అదే వాళ్ల పాలిట ఒకటో తారీకు ఔతుంది.
వాలంటీర్లు పెన్షన్‌తో పాటు చేసే విధులకు కూడా ఏవేవో ఉపాయాలు కనిపెట్ట లేకపోరు. అసలు గ్రామ సచివాలయాలే దండగ అని టిడిపి వాళ్లు అంటూ ఉన్నారు. వాళ్లకి పనీపాటా లేదు. వాళ్లనే వాలంటీర్లలా యింటింటికి వెళ్లి పెన్షన్లు యిమ్మంటే సరి అని కూడా అన్నారు. టిడిపి హయాంలో ప్రభుత్వ స్కూళ్లనే ఎత్తివేసి, కాస్త దూరంలో ఉన్న స్కూళ్లతో మెర్జ్ చేశారు. అలా గ్రామ సచివాలయాల సంఖ్య కూడా సగానికి సగం తగ్గించినా ఆశ్చర్యం లేదు. ఇదంతా తప్పని నేననటం లేదు. టిడిపి ఆలోచనా ధోరణి యీ తీరుగా ఉంటుందని మాత్రమే చెప్తున్నాను. బాబు గారిదంతా కాస్ట్ కటింగ్, ఔట్‌సోర్సింగ్, కార్పోరేట్ వ్యవహారం. ఏం చేసినా గ్రాండ్‌గా కనబడుతూ, ఓటరును ఆకాశంలో విహరింప చేయాలి. జగన్ ‘నేలబారు’ ఆలోచనలంటే ఆయనకు చికాకు. అమ్మ ఒడి ఒక పిల్లాడికే అని జగన్ అంటే, ఒకడేం ఖర్మ డజన్లు కనండి అని బాబు నినాదమిచ్చారు. ఏదైనా పెద్ద స్థాయి కావాలాయనకు. ఇప్పుడు కంటూ కూర్చుని వాళ్లు స్కూలుకి వెళ్లే వయసు వచ్చేవరకూ టిడిపి ప్రభుత్వం ఉండాలి మరి!
అలాగే వాలంటీర్లకు 5 వేలు జీతమంటే చిచ్ఛీ అన్నారు. ఐఏఎస్‌లకు వెళ్లాల్సిన కుర్రాళ్లను యిలా చిన్న ఉద్యోగాల్లో కట్టి పడేయడం వాళ్ల భవిష్యత్తును నాశనం చేయడమే అన్నారు. ఐఏఎస్ స్టాండర్డున్న కుర్రాళ్లకు పదివేలు కూడా తక్కువ జీతమే అని బాబుగారికి తోచలేదేమో! ఆయన ఎప్పుడు మాట్లాడినా యింట్లోనే కూర్చుని నెలకు లక్షా, రెండు లక్షల జీతం సంపాదించే ఉద్యోగాల గురించే మాట్లాడతారు. అంత సామర్థ్యం ఉన్నవాళ్లు జనాభాలో ఎంతమంది ఉంటారో నాకు తెలియ దనుకోండి. బాబుగారికి మాత్రం ఎటు చూసినా డబ్బుతో కళకళ లాడేవారే కనబడతారు. తనకు సంపద సృష్టించడం తెలుసంటారు. 14 ఏళ్ల తన పాలనలో ఎడాపెడా సృష్టించేసి ఉంటే యిప్పుడు ఆంధ్ర వీధుల్లో రత్నమాణిక్యాలు గంపల్లో పోసి అమ్ముతూండాలి. రెండున్నర లక్షల మంది యువతీయువకులు 5 వేల జీతానికి సిద్ధపడ్డారంటేనే తెలుస్తోంది, 2019 వరకు తన పాలనలో బాబు ఎంత సంపద సృష్టించి పంచారో!
వాలంటీరు వ్యవస్థ మంచిదా కాదా మీరు పరిశోధించి రాయండి అని ఒకరిద్దరు పాఠకులు నన్నడిగారు. నాకంత ఓపిక లేదు కానీ బాబుగారి శిష్యుడు రేవంత్ వాలంటీరు వ్యవస్థను తెలంగాణలో కూడా పెడతా నంటున్నారంటే దానిలో ఎంతో కొంత మేలు ఉన్నట్లేగా! గురువు బాబు కూడా వ్యవస్థను కొనసాగించడమే కాక జీతాలు రెట్టింపు చేస్తానన్నారంటే ఆయనకీ మంచి కనబడ్డట్టే కదా! ఈ వ్యవస్థ చౌక కూడా. ప్రజా ప్రతినిథి వెళ్లి కలవకపోయినా ప్రభుత్వం తరఫున నెలనెలా వీళ్లు వెళ్లడం చేత సామాన్యుడికి ఊరట కలుగుతోం దనుకోవాలి. రాజకీయ ప్రయోజనాల కోసమే, సమాచార సేకరణ కోసమే యీ వ్యవస్థ నడిపారు అంటే నేను నమ్మను. అదే అయితే ఎన్నికలకు ఏడాది ముందు నియమించి, ఎన్నికలు కాగానే తీసేయవచ్చు. ఐదేళ్లూ పోషించ వలసిన అవసరం లేదు. సమాచారం కనుక్కోవడం ఎంత సులభమో, ఫోన్లు ట్యాప్ చేయడం ఎంత సులభమో వేరే చెప్పనక్కరలేదు.
వాలంటీరు వ్యవస్థ ప్రజలకు ఉపయోగ పడుతోందని, అది కొనసాగాలని ప్రజలు కోరుకుంటున్నారనీ ఆఖరి నిమిషంలో బాబుకి తోచడం వలననే యీ పదివేల ప్రకటన వెలువడిందని అనుకోవాలి. దురదృష్ట మేమిటంటే, అన్నీ ఆయనకు ఆలస్యంగా తోస్తున్నాయి. అమ్మ ఒడి పథకం పెట్టినపుడు అమ్మ ఒడి – నాన్నకు బుడ్డి అని ఎద్దేవా చేశారు టిడిపి వారు. ఒక పిల్లాడి పేర ఒక బుడ్డి వస్తే, మరి అరడజను మందికి ఎన్ని వస్తాయి? నాన్నకు పీపా అనాలి కదా. అలా అనకుండా మేమూ కంటిన్యూ చేస్తాం, యింకా ఉధృతంగా చేస్తామంటున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం పెడతానన్నపుడూ అంతే తెలుగు చచ్చిపోతోందని నానా హంగామా చేసేశారు. తమ హయాంలో కొన్ని స్కూళ్లలో అది ప్రవేశపెట్టామన్న మాట, దాన్ని సాక్షి పత్రిక వ్యతిరేకించిం దన్నమాట మర్చిపోయారు.
పవన్ కళ్యాణ్ ఐతే మరీనూ, చదువుల తల్లి సరస్వతి చచ్పిపోయింది అంటూ ట్విటర్‌లో పోస్టు చేశారు. సిలబస్‌లో తెలుగు ఒక సబ్జక్టుగా కంటిన్యూ అవుతూనే, మీడియం మాత్రం తెలుగు నుంచి ఇంగ్లీషుకి మారినంత మాత్రాన సరస్వతీదేవి మరణిస్తుందా? వార్నీ! జగన్ క్రైస్తవుడు కాబట్టి తెలుగుని చంపేస్తున్నాడని (యిదెక్కడి లాజిక్కో ఆయనకే తెలియాలి) ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ శోకన్నాలు పెట్టారు. పిల్లల్నీ, మనవల్ని ఇంగ్లీషు మీడియంలో చదివించే ప్రతీ వాళ్లూ వచ్చి తెలుగు చచ్చిపోతోందంటూ హాహాకారాలు చేశారు. ఏరీ వాళ్లందరూ? ‘ఏవి తల్లీ నిరుడు కురిసిన హిమసమూహములు?’ అన్నట్లు వీళ్లెవరూ యిప్పుడు కిక్కురుమనటం లేదెందుకు? ‘మేం అధికారం లోకి రాగానే పెట్టబోయే మొదటి సంతకం ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీషు మీడియాన్ని తుంగలో తొక్కి, తెలుగు మీడియంకే పట్టం కడతాం’ అని సభల్లో చెప్పరెందుకు? సరస్వతీ దేవికి మళ్లీ ప్రాణం పోస్తామని పవన్ శపథం చేయరెందుకు?
ఎందుకంటే సామాన్య ప్రజలు ఇంగ్లీషు మీడియమే కోరుకున్నారు. ప్రభుత్వ స్కూళ్లు కళకళ లాడుతున్నాయి. కొన్ని ‘నో వేకెన్సీ’ బోర్డులు కూడా పెడుతున్నాయట. బాబు మళ్లీ అధికారంలోకి వస్తే వీటి పని పట్టి, జనాల చేత మళ్లీ నారాయణమంత్రం పఠింప చేయవచ్చు. అది వేరే విషయం. ఎన్నికల ముందు మాత్రం ఆ ముక్క చెప్పలేక పోతున్నారు కదా! ఎందుకు? ప్రజల మనసులో ఏముందో బాబుకి అర్థమైంది కనుక. ఆ అర్థం కావడం కాస్త ఆలస్యంగా అయింది. కలల బేహారి ఐన బాబు బిగ్, బిగ్గర్, బిగ్గస్ట్ ఫార్ములా నమ్ముకుంటే జగన్ ‘స్మాల్ యీజ్ బ్యూటిఫుల్’ ఫార్ములాను నమ్ముకుని కాస్తకాస్తగా ఎక్కువ మందికి పంచుతున్నాడు. టిడిపి వాళ్లు అలా పంచడం తప్పంటారు. అదే నోటితో అంతేనా పంచడం? అంటారు. అసలీ పంచుడు కార్యక్రమం మొదలైంది టిడిపి వ్యవస్థాపకుడు ఎన్టీయార్‌తోనే! బాబు కూడా సంక్షేమ పథకాలతోనే ప్రజల్ని ఆకర్షించారు. జగన్ పాలనలో డోసు పెరిగిందంతే. ఆ పెంపుతో విస్తృతి పెరిగింది. వివిధ రంగాలకు పాకింది. లబ్ధిదారులు పెరిగారు.
ఈ సూత్రాన్ని బాబు ఆలస్యంగా గుర్తించారు. అందుకే ఇంగ్లీషు మీడియంపై మౌనంగా ఉన్నారు. జగన్ ఫ్యామిలీ డాక్టరు స్కీము పెట్టినపుడు డాక్టర్లు ఎక్కణ్నుంచి వస్తారంటూ టిడిపి వారు ఎద్దేవా చేశారు. ఎలా నడుస్తోందో తెలియదు కానీ, టిడిపి వారు ఏమీ వ్యాఖ్యానించటం లేదు కాబట్టి బాగానే నడుస్తోందను కోవాలి. దాన్నీ ఎత్తివేయక పోవచ్చు. అలాగే వాలంటీరు వ్యవస్థను, గ్రామ సచివాలయ వ్యవస్థను కూడా కొనసాగిస్తే కొనసాగించ వచ్చు. వాలంటీర్ల పారితోషికాలు పదివేలు కాకపోయినా ఒక వెయ్యి అయినా పెంచవచ్చు. అయితే యిక్కడే ఓ క్యాచ్ ఉంది. వాలంటీరు వ్యవస్థను కొనసాగించ వచ్చు తప్ప యీ వాలంటీర్లనే కొనసాగించక పోవచ్చు. ఈ మర్మాన్ని గమనించే ప్రస్తుత వాలంటీర్లు రాజీనామాలు చేస్తున్నారు. ఇప్పటిదాకా 44 వేల మంది చేశారని విన్నాను. మొత్తం రెండున్నర లక్షల మంది ఉంటే వారిలో 18శాతం మంది రాజీనామాలు చేశారన్నమాట. ఐదువేల జీతమే తక్కువనుకుంటే అది కూడా వదులుకుంటున్నారంటే ఆశ్చర్యంగా లేదా?
వాలంటీర్ల వలన రాజకీయంగా చాలా ఉపయోగం ఉందని బాబు గమనించారు. అందువలన అధికారంలోకి వస్తే ఆ వ్యవస్థను కొనసాగిస్తారు. గతంలో జన్మభూమి కమిటీలు ఓటమికి ఒక కారణమయ్యాయి. కానీ వాలంటీర్లు వాళ్ల కంటె భిన్నమైన వాళ్లు. ప్రజలకు చేరువైన వాళ్లు. అందువలన యీ పదవి ఉండాలి. అయితే దానిలో పాత వాళ్లు ఉంటే ఎలా? వాళ్లు వైసిపి వాళ్లని తామే ముద్ర వేశారు. ఇప్పటికీ ధర్మాన వాలంటీర్లంతా మా వాళ్లే అంటున్నారు. అలాటి వాళ్లని ఉద్యోగాల్లో కొనసాగించడమే కాక, రెట్టింపు జీతాలు కూడా యివ్వడమంటే ఎంత తెలివి తక్కువ పని? తమ పార్టీ కార్యకర్తలు గగ్గోలు పెట్టరా? అందుకని బాబు అధికారంలోకి వస్తే ‘వాలంటీరు వ్యవస్థను సరిదిద్దుతాం. ఉన్నవాళ్లందరికీ ఉద్వాసన చెప్పి, కొత్తగా రిక్రూట్‌మెంటు నిర్వహిస్తాం. పాత వాళ్లు కూడా అప్లయి చేసుకోవచ్చు. హెచ్చు జీతం యిస్తున్నాం కాబట్టి అర్హతలను లెక్కలోకి తీసుకుంటాం.’ అని మెలిక పెట్టి కొత్తవాళ్లను తీసుకుంటారు. వాళ్లు తమకు విధేయులుగా ఉంటారని టిడిపి ఆశ. ఉంటారో లేదో కాలమే చెప్పాలి. అవి జన్మభూమి కమిటీ 2.0లుగా మారితే మాత్రం ప్రమాదమే.
ఇక్కడ పాతకాలం నాటి ఉదంతం ఒకటి చెప్తాను. ఆంధ్రకేసరి ప్రకాశం గారు ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి 1946 ఏప్రిల్ నుంచి 1947 మార్చి వరకు ముఖ్యమంత్రిగా పని చేశారు. 11 నెలల్లోనే గొప్ప గొప్ప పనులు చేశారు. అయినా కళా వెంకట్రావు వంటి ఆయన ప్రత్యర్థులు తమిళ నాయకులతో చేతులు కలిపి ఆయనపై అవిశ్వాస తీర్మానం పెట్టి పదవీభ్రష్టుణ్ని చేశారు. ప్రకాశం గారు తన పదవీకాలంలో ధాన్య సేకరణకై 20 వేల గ్రామ ఆహార సంఘాలను ఏర్పాటు చేశారు. అవి మల్టీపర్పస్ కోఆపరేటివ్ సంఘాలుగా పని చేసి చాలా మంచి పేరు తెచ్చుకున్నాయి. ప్రకాశం గారు గద్దె దిగగానే వాటన్నిటినీ రద్దు చేసింది కొత్త ప్రభుత్వం. అప్పుడు కళా వెంకట్రావును ఒక మిత్రుడు అడిగారట – ‘ప్రకాశం అంటే నీకు పడదు సరే, కానీ అవేం చేశాయ్? బాగా నడుస్తున్నాయి కదా!’ అని. వెంకట్రావు ‘అవెక్కడికి పోవు, మళ్లీ వస్తాయి. పాతవన్నీ ప్రకాశం మనుషులతో నిండి పోయాయి. కొత్త వాటిల్లో మనవాళ్లుంటారు.’ అని జవాబిచ్చారట.
రాజకీయాలు యిలా ఉంటాయి. బాబు వస్తే వాలంటీర్లు ఉంటారు. కానీ ప్రస్తుత వాలంటీర్లు కొనసాగే అవకాశం తక్కువ. ప్రభుత్వం మారగానే స్కీములకు కొత్త పేర్లు వస్తాయి చూడండి. అలాగే యిదీనూ! ఇది గ్రహించి వాలంటీర్లలో నిజమైన వైసిపి అభిమానులు రాజీనామాలు చేస్తున్నారను కోవాలి. వాలంటీరు ఉద్యోగంలో కొనసాగితే సస్పెన్షన్ కాబట్టి జీతమూ రాదు, తమ అభిమాన పార్టీకి పని చేయడానికి వీలూ ఉండదు. రాజీనామా చేసేస్తే వైసిపి వాళ్లని పార్టీ కార్యకర్తలుగా నియమించి ఐదు వేల కంటె ఎక్కువ జీతం యివ్వవచ్చు. వారిని పోలింగు ఏజంట్లుగా వాడుకోవచ్చు. మాజీ వాలంటీర్లు పోలింగు ఏజంట్లగా ఉండకూడదు అని ఎవరైనా కేసు వేస్తే అది వ్యక్తి స్వేచ్ఛకు భంగం అని లాయర్లు వాదించవచ్చు. ఎందుకంటే యిప్పుడు వాళ్లకు ఏ ఉద్యోగమూ లేదు. ప్రభుత్వోద్యోగుల్లో ఉంటూ ఎన్నికల సమయంలో సెలవు పెట్టి రాజకీయ పార్టీలకు పని చేయడం చూస్తున్న యీ రోజుల్లో పారితోషికంపై పని చేసే ఉద్యోగాన్ని వదులుకునే వారిపై ఆంక్షలు ఎలా విధించగలరు?
రాజీనామా చేసే వారి సంఖ్య ఏ 50 వేలకో చేరిందంటే వీళ్లంతా వైసిపి అభిమానులే, వైసిపి కోసం పని చేసేవారే అని నిర్ధారించు కోవచ్చు. వీళ్లు రంగంలో ఉంటే వైసిపికి పెద్ద బెటాలియన్ కలిసి వచ్చి మేలు కలగడం ఖాయం. ఆ భయంతోనే ‘వాలంటీర్లూ, రాజీనామాలు చేయకండి’ అని బాబు కోరే పరిస్థితి వచ్చి పడింది. ఇది ఒక పెద్ద అభాసం. నిన్నటిదాకా వాలంటీర్లను అన్ని రకాలుగా తిట్టి, సకల విధాల ఆరోపణలూ చేసి, యిప్పుడు వాళ్లని బుజ్జగించడం చూస్తూంటే ఇదెక్కడి ఖర్మ, బాబూ అనిపిస్తోంది. ఇప్పుడు పవన్ కూడా యీ పల్లవి అందుకుంటే అంత కంటె వినవేడుక మరొకటి ఉండదు.
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఏప్రిల్ 2024)