Advertisement

Advertisement


Home > Movies - Interviews

ఈ జోరు..ఈ బజ్ ఊహించలేదు..మెగాస్టార్

ఈ జోరు..ఈ బజ్ ఊహించలేదు..మెగాస్టార్

ఎక్కడ చూసినా ఇప్పుడు మెగా మేనియా..ఓ సినిమా ముందు రోజు అభిమానులు, సినిమా ప్రేక్షకులు ఇంతలా ఊగిపోవడం చాలా అరుదుగా జరుగుతుంటుంది.

పండుగ ముందు రోజు రాత్రి చిన్నపిల్లల హడావుడిలా వుంది మెగా ఫ్యాన్స్ వ్యవహారం. తెల్లవారితే బాస్ ఈజ్ బ్యాక్..కానీ ముందు రోజే వారి జోష్ అపరిమితంగా వుంది. ఆ జోష్, ఆ ఆనందం, మెగాస్టార్ చిరంజీవి కళ్లల్లో కూడా స్పష్టంగా కనిపిస్తోంది. తాను కూడా ఊహించనంత స్వాగతం ప్రేక్షకుల నుంచి లభిస్తున్నట్లు ఆయన భావిస్తున్నారు.

ఆ ఆనందాన్ని, ఉత్సాహాన్ని 'గ్రేట్ ఆంధ్ర' తో ప్రత్యేకంగా పంచుకున్నారు. ఆయన ప్రేక్షకుల ముందుకు ఖైదీ నెంబర్ 150 గా రావడానికి అతి కొద్ది గంటల ముందు ఆయన 'గ్రేట్ ఆంధ్ర'తో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఆ మాటలు..ఆ ముచ్చట్లు

బ్రూస్ లీ విడుదలైన మర్నాడు..ఖైదీ నెంబర్ 150 విడుదలకు ముందు రోజు..అప్పుడెలా? ఇప్పుడెలా?

అప్పుడు కూడా నన్ను బాగానే రిసీవ్ చేసుకున్నారు. సినిమా సబ్జెక్ట్ కొంచెం తేడా వచ్చింది అనుకోవాలి. ఇక ఇప్పుడంటారా? అస్సలు ఊహించని రేంజ్ ఆదరణ కనిపిస్తోంది. నన్ను చూడడానికి కొందరయినా ఉత్సాహంగా వుంటారని తెలుసు కానీ, ఈ రేంజ్ లో ఎదురుచూస్తారని అనుకోలేదు. ఎందుకంటే ఇప్పుడున్న ప్రేక్షకులు అంటే యంగ్ జనరేషన్ అంతా నేను సినిమాలు చేస్తున్నప్పటికి అయిదు నుంచి పదేళ్ల లోపు వారు. వాళ్లంతా ఇప్పుడు నన్ను ఇష్టపడతారా? అనుకున్నాను.కానీ మొన్న మీటింగ్ కు వచ్చిన జనాన్ని చూసాక అర్థం అయింది. పద్దెనిమిది ఏళ్లు, ఇరవై ఏళ్ల కుర్రాళ్లు వేలాదిగా వచ్చారు. అప్పుడు ధైర్యం వచ్చింది. 

ఇంతటి ఊహించని ఉత్సాహానికి కారణం కేవలం మీ మేకోవర్ అని అనుకోవచ్చా?

వైనాట్. అలా అనుకుంటే, నా ఏడాది శ్రమ ఫలించినట్లే.  వాస్తవానికి అందరూ అనేది అదే. అప్పటి చిరంజీవినే చూస్తున్నాం అని.

అమితాబ్, ఎన్టీఆర్, ఏఎన్నార్ వయసు మీద పడ్డాక, గ్యాప్ ఇచ్చి సినిమాలు చేసినపుడు వయసుకు తగ్గ పాత్రలు చూసుకున్నారు. మీరు పాత్రకు తగ్గట్టు వయసును తగ్గించినట్లున్నారు

అవునా..పగ్గం వేసి వెనక్కు లాగేశా..దానికి కారణం నేనేదో యంగ్ కా కనిపించాలని మాత్రమే కాదు. నా అభిమానులు తొమ్మిది పదేళ్ల తరువాత నన్ను తెరపై చూసుకోవాలని అనుకుంటున్నపుడు, వాళ్లు ఏ విధంగా చూడాలని అనుకుంటారో ఊహించగలను కాబట్టి. అందుకే ఈ మేకోవర్. 

ఇప్పుడు సినిమా రేంజ్ ఎలా వుందనుకుంటున్నారు.

నేను అనుకోవడం కాదు. డిస్ట్రిబ్యూటర్లు చెబుతున్నారు. సినిమా మా థియేటర్ కు ఇవ్వండి అంటే మా థియేటర్ ఇవ్వండి అని ఎగ్జిబిటర్లు డిమాండ్ చేస్తున్నారట. నైజాం సునీల్ అయితే బిపీ పెరిగిపోయి, ఫోన్ స్విచాఫ్ చేసేసారట. 

ఈ సినిమా విషయంలో మీరు కాంటెపరరీ టెక్నీషియన్ల కన్నా, మీతో గతంలో పని చేసిన వారినే ఎక్కువ నమ్ముకున్నట్లుంది. 

వాళ్లతో చేయడం నాకు కంఫర్టబుల్ గా వుంటుందని మాత్రమే. అంతే తప్ప మరోటి కాదు. 

ఈ సబ్జెక్ట్ మీ కన్నా ముందు మరి కొందరు హీరోల దగ్గరకు వెళ్లింది కదా?

అవున్ కళ్యాణ్ ను, ఎన్టీఆర్ ను అప్రోచ్ అయ్యారు. వాళ్లెందుకో ఆసక్తి చూపించలేదు. నాకు ఎవరో చెప్పారు. మంచి డెప్త్ వున్న సబ్జెక్ట్. అన్ని విధాలా బాగుంటుంది. చేద్దాం అని అనుకున్నా.

ప్రభుత్వంపై విమర్శలు చేయాల్సి వస్తుందనే పవన్, ఎన్టీఆర్ వద్దనుకున్నారని అనుకోవాలా?

ఏక్ట్యువల్ గా నేను కూడా ఈ సినిమాలో ప్రభుత్వంపై విమర్శలేమీ చేయలేదు. కార్పొరేట్ కంపెనీలు నీటి వనరులున్న భూములను పరిశ్రమలకు తీసుకోవడం తగదనే విషయం చెప్పాం అంతే. 

కానీ తమిళ వెర్షన్ లో రాజకీయపరమైన విమర్శలు కాస్త ఎక్కువగానే వుంటాయి కదా

అవును. అప్పుడే కదా, జయలలిత కు విజయ్ పై కోపం వచ్చిందని, ఆ తరువాత ఏదో జరిగిందని వార్తలు వచ్చాయి.

మీరు ఇప్పుడు ప్రతిపక్షంలో వున్నారు. మరి ప్రభుత్వంపై విమర్శలు చేసే అవకాశాన్ని ఎందుకు వదలుకున్నారు ఈ సినిమాలో

రాజకీయం వేరు. సినిమా వేరు. నేను ఈ సినిమాను సినిమాగానే చూపించాలనుకున్నా.

తొమ్మిదేళ్ల తరువాత హీరోయిన్ పక్కన నిల్చున్నపుడు, అది కూడా కాజల్ లాంటి యంగ్ హీరోయిన్ పక్కన..ఎలా అనిపించింది

మీరు నమ్మరు. ఫస్ట్ షాట్ ఆ అమ్మాయితో చేసినపుడు భుజంపై చేయి వేయాల్సి వచ్చింది. కానీ ఆమె భుజానికి కాస్త పైకి వుంచాను చేయి. మర్నాడు స్టిల్స్, రష్ నా భార్య చూసి, చేయి ఏమిటి? అలా పెట్టారు? అని అడిగింది. చేయి వేద్దామంటే చరణ్, బన్నీ గుర్తుకు వచ్చారు అని చెప్పా. కానీ పాపం, ఆ అమ్మాయి చాలా కోపరేట్ చేసింది. ఒక విధంగా చెప్పాలంటే ఆ అమ్మాయితో చేసిన సీన్లలో నేను కొత్తగా చేసినట్లు అనిపిస్తే, ఆ అమ్మాయి అనుభవంతో నటించినట్లు అనిపించింది. పైగా అసలు ముందుగా నేను- ఆ అమ్మాయి మ్యాచ్ అవుతామా? కామా అన్న అనుమానం ఒకటి. 

డ్యాన్స్ లు, ఫైట్ల విషయంలో కేర్ తీసుకున్నారా?

మరీ విరగదీసేయ లేదు. నా స్టయిల్ ఎలా వుంటుందో అలాగే చేసానంతే. ఎక్కువైతే ఎక్కువ అంటారేమో? తక్కువైతే తక్కువ అంటారేమో అని మాత్రం జాగ్రత్త పడ్డాను.

ఈ సినిమాలో నటించడం కన్నా, సినిమా కు ప్రిపేర్ కావడం, సినిమా పూర్తయిన తరువాత బజ్ తీసుకురావడానికే ఎక్కువ శ్రమ పడినట్లున్నారు.

నిజమే. నటించడం అన్నది చకచకా జరిగిపోయింది. కానీ మీరన్నట్లు పబ్లిసిటీ మాత్రం ఎంత చేస్తున్నా చరణ్ ఇంకా చాలదంటున్నాడు. ఈ చానెళ్లు..ఇవన్నీ, పాపం అందరూ అడుగుతున్నారు. వాళ్ల కోసమైనా అయిదేసి నిమషాలు మచ్చట్లు పెడుతున్నా.

సినిమా బాహుబలి రికార్డులు దాటుతుందా?

నేను అలాంటివి ఏవీ అనుకోలేదు.

కానీ సినిమా అమ్మినపుడు బాహుబలి ఫిగర్స్ దృష్టిలో పెట్టుకుని అమ్మారని టాక్.

అదేం కాదు. ఈ సినిమా అంచనా మేరకు ఈ సినిమాను మార్కెట్ చేసాం. ఈస్ట్ లో అనుకుంటా బాహుబలిని క్రాస్ చేసిందని చెప్పారు. షో లు, ఇతరత్రా వ్యవహారాల్లో దాటిందని అంటే వినడమే. నాకు అటు దృష్టి లేదు. పైగా ఇప్పుడు ఓవర్ సీస్ మార్కెట్. అప్పట్లో ఇంతలా లేదు. చాలా విస్తృతి పెరిగింది.

తొమ్మిది పదేళ్ల తరువాత ఒక సినిమా అంటే ఇంత ఆనందపడుతున్నారు. మరి రాజకీయాల్లో వుండగా మనసు ఇటు లాగలేదా? ఒక్క సినిమా చేయాలని అనిపించలేదా?

ఎన్నోసార్లు అనిపించింది. కానీ ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా, పనులు, ఆ వ్యవహారాలు. అందుకే అనిపించినా ఊరుకోక తప్పలేదు. ఇప్పుడు గ్యాప్ దొరికింది.

ప్రజారాజ్యం విషయంలో కన్నా సమైక్య ఆంధ్ర పోరాటంలో బాగా దెబ్బతిన్నారేమో?

గెలుపు ఓటముల సంగతి అలా వుంచండి. సమైక్య ఆంధ్ర విషయంలో, మఖ్యంగా హైదరాబాద్ ను యుటి చేయమనే విషయంలో అందరితో కలిసి నా శక్తి కొద్దీ ప్రయత్నించాను. కానీ కుదరలేదు. అయితే దాని కన్నా కూడా, మాపై చేసిన ప్రచారం, మేమేదో చాతగాని వాళ్లుగా, ఇళ్లకు చీరలు,గాజులు పంపించి, అశోక్ బాబు లాంటి వాళ్లు చేసిన కామెంట్లు..చాలా అంటే చాలా బాధనిపించింది. 

అంద బాదకు కారణమైన పార్టీలో ఇంకా మరి ఎందుకున్నారు

ఏం వున్నాం..సైలెంట్ గా వుండిపోయాను.

కనీసం ఇప్పటి ప్రభుత్వాల పనులపై కామెంట్ లో, విమర్శలో చేసి, మళ్లీ మీరు ప్రజల్లోకి రావచ్చుగా

లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి నా దృష్టి అంతా సినిమాల మీదే.

మళ్లీ రాజకీయంగా చైతన్యం ఎప్పుడు

సమయం రావాలి. ఇప్పటికిలా కానివ్వనీండి.

మేకోవర్ వల్ల వచ్చిన చరిష్మాతో 150 వ సినిమా ఓకె. మరి 151కి? 

దానికి ఈ మేకోవర్ సరిపోదు. పక్కగా సరైన సబ్జెక్ట్ తో రావాల్సిందే. అవసరం అయితే ఓల్డ్ గెటప్ అన్నా వేయాల్సిందే. కానీ ప్రయోగాలు చేయాలంటే మాత్రం ఆపద్భాంధవుడు, రుద్రవీణ గుర్తువచ్చి కొంచెం టెన్షన్.

పత్రికలు, టీవీ లేనా? వెబ్ సైట్లు కూడా చూస్తుంటారా?

చూడడం అంటే, నా గురించి, నా సినిమా గురించి వచ్చిన వార్తలు, పాజిటివ్, నెగిటివ్ రెండూ కూడా మా వాళ్లు చూపిస్తుంటారు. చూడండి గ్రేట్ ఆంధ్ర వాళ్లు ఇలా రాసారు. ఇలా సజెస్ట్ చేసారు అని. అప్పుడ మాత్రం ఆసక్తిగా చదువుతుంటాను. మంచి సజెషన్స్ , నిర్మాణత్మక విమర్శలు వుంటాయి గ్రేట్ ఆంధ్రలో. అది నాకు నచ్చుతుంది. 

థాంక్యూ

థాంక్యూ..మీక్కూడా

విఎస్ఎన్ మూర్తి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?