cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Interviews

పవన్ చెప్పింది ఒకటి చేసింది ఒకటి

పవన్ చెప్పింది ఒకటి చేసింది ఒకటి

పీవీపీ... అంటే చాలు.. చాలా తక్కువ సమయంలో చకచకా సినిమాలు తీసిన నిర్మాత కళ్లముందుకు వస్తారు. ఇది సినిమా అభిమానుల సంగతి.. పవన్ జనసేనకు కనిపించని ఆక్సిజన్‌లా వున్న వైనం గుర్తుకువస్తుంది. ఆ వెంటనే విజయవాడ ఎంపీ టికెట్ కోసం ప్రయత్నించారన్న వార్తలు చకచకా కదుల్తాయి. ఇది వర్తమాన రాజకీయాలను పరిశీలించేవారి వైనం.. జగన్‌తో నేస్తం.. సాక్షిలో పెట్టుబడులు, భూముల వ్యవహారం ఇలాంటివి కూడా మరుపురానివే..

కానీ పీవీపీ వ్యక్తిగతం వేరు.. ఆయన మనసులో వున్న భావనలు వేరు.. ఆయన ఆలోచనలు వేరు.. వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని ఒంటి చేత్తో నిర్మించిన సమర్థత సొంతమైన ఆయన మాటల్లో మాత్రం భావుకతే వినిపిస్తుంది. భావోద్వేగాలు ధ్వనిస్తాయి..

భారతీయ వ్యాపార, రాజకీయ, క్రీడ, సినిమా రంగాల్లోని మహా మహులతో పరిచయం. అయినా కొత్తగా ఎవరైనా పలకరిస్తే చాలు.. ఒదిగి మరీ మాట్లాడే మనస్తత్వం. సమాజానికి ఏదైనా చేయాలి.. సమానత్వం కొంతయినా సాధించాలి ఆవేశం... అదే సమయంలో మన సంస్కృతి.. సంప్రదాయాలు, పద్దతులు, అనురాగాలు, అభిమానులు రాను రాను కనుమరగైపోతున్నాయనే బాధ.. ఇలా రకరకాల భావనలు కలిస్తే... అది పీవీపీ.. పొట్లూరి వరప్రసాద్.. లక్షన్నర అప్పుతో విదేశాల్లో చదువుకోవడానికి వెళ్లి, బలమైన వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్వహించి, వందల కోట్లతో తిరిగి వచ్చిన వ్యక్తి. కొద్దిసేపు ఆయనతో ‘గ్రేట్ ఆంధ్ర’ ముచ్చటించింది. ఆయన అంతరంగాన్ని తెలుసుకునే ప్రయత్నం చేసింది. ఆ విషయాలే ఈ కథనం.

పీవీపీ ప్రస్థానం ఎలా మొదలయింది.. ఎక్కడి నుంచి ఇక్కడకు చేరింది.?

అందరిలాగే అల్లరి కుర్రాడినే.. విజయవాడలో పక్కా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. పెద్ద ఆశలు, ఆశయాలు ఏమీ వుండేవి కాదు కానీ, ఇంటర్‌లోకి వచ్చాక.. మాత్రం ఏదయినా సాధించాలి ఎప్పటికైనా అన్న చిన్న ఆలోచన వుండేది. పైగా కొంచెం రాడికల్ వ్యవహారం నాది. ఓసారి స్కూలులో నాతో పాటు వున్న కొంతమంది పిల్లలను పరీక్షలు రాయనివ్వలేదు. వాళ్లు ఫెయిలయితే స్కూలుకు బ్యాడ్ నేమ్ వస్తుందని అన్నమాట. నేను స్కూల్ లీడర్‌ను. ఏదో మాట్లాడే అకేషన్ వచ్చింది. అంతే... ఈ కుర్రాళ్లకు మద్దుతుగా ఉపన్యాసం.. వాళ్లు పాస్ అవుతారో, ఫెయిలవుతారో మీరెవరు డిసైడ్ చేయడానికి.. ముందు రాయనివ్వండి అంటూ. అంతే పెద్ద సంచలనం.. టీచర్లంతా స్కూలు బాయకాట్..ఇలా వుండేది మన వ్యవహారం. ఇంజనీరింగ్ చదివాను.. అమెరికా వెళ్లాలన్నది పెద్ద పట్టుదల.. గజనీలా ప్రయత్నించాను.. వీసా రాలేదు.. ఎవరో చెప్పారు ఆస్ట్రేలియా అయితే ఈజీ అని. దాంతో లక్షన్నర అప్పు చేసి ఆస్ట్రేలియాలో చదువు కొసం వెళ్లిపోయాను. 

సో.. అలా సాధించారన్నమాట లక్ష్యం.?

కాదు.. ఆస్ట్రేలియా వెళ్లాక తెలిసింది. ఫీజు కట్టడం ఒక్క రోజు ఆలస్యం అయినా ఇంటికే అని. పార్ట్ టైమ్ జాబ్ కావాలి.. ఎలా? ఆఖరికి దొరికింది. ఏమిటది.. టాయిలెట్ క్లీనింగ్.. ముందు చాలా బాధపడ్డాను.. ఏడ్చాను.. ఇంట్లో ఎలా పెరిగానో గుర్తుకు వచ్చింది. ఎంత మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా ముద్దుగానే పెరిగాను. దేనికీ లోటు లేకుండానే పెరిగాను. కానీ.. టాయిలెట్ క్లీనింగ్.. నా పట్టుదలే నెగ్గింది.. తొమ్మిది నెలలు అలాగే పనిచేసా.. ఆఖరికి షెల్ కంపెనీలో కూడా అదేపని. ఇప్పటికీ నా ఇంట్లో ఆ రోజు వాడిన షెల్ కంపెనీ టీ షర్ట్ పదిలంగా వుంది. ఎంత ఎదిగినా ఆ రోజులు మర్చిపోకుండా. 

మరి అమెరికా ఎలా వెళ్లారు?

ఆస్ట్రేలియా వెళ్లినా, అమెరికా వెళ్లాలన్న పట్టుదల పోలేదు.. చాలా సార్లు ట్రయ్ చేసా. ఆఖరికి కాన్సలేట్‌కు ఓ లేఖ రాసా.. ఎక్కడో తగిలింది. అమెరికా చేరిపోయాను. 

సో.. అక్కడ ఇక ఈజీ అయిందా పని?

ఈజీ అని కాదు కానీ, అమెరికా పద్దతి బాగుంటుంది. నా తపన అంతా అదే ఇక్కడ కూడా అలా రావాలని, ఎదగడానికి అందరికీ సమాన అవకాశాలు వుంటాయి అక్కడ. కులం, మతం, ప్రాంతం లాంటి లెక్కలు వుండవు. అలా వుండి వుంటే నేనుకానీ, మనవాళ్లు ఎవరైనా కానీ అంతలా ఎదిగి వుండలేరు.  అందువల్ల త్వరలోనే రకరకాల ఉద్యోగాలు చేసాను,.కంపెనీ పెట్టాను. అమ్మాను..అలా మరో మజిలీ యూరప్ చేరాను.

ఎందుకలా? మీ గమ్యం..అమెరికానేగా?

నిజమ..కానీ ప్రపంచం చూడాలన్నది అంతకన్నా అసలు లక్ష్యం. అందుకే వెళ్లాను. అక్కడ మంచి ఫైనాన్స్ కన్సల్టెన్సీ లాంటి కంపెనీ పెట్టాను. క్రిసిల్ లాంటి పెద్ద కంపెనీ టేకోవర్ చేసింది. పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించాను.. అదిగో అప్పుడు వచ్చాను ఇండియాకు. 

ఇండియా ఎందుకు రావాలనుకున్నారు? అంత ప్రయాసపడి వెళ్లారుగా?

నిజమే.. కానీ యుఎస్ వదిలేయాలని రాలేదు.. ఇక్కడ కూడా ఏదైనా సాధించాలి.. ఏదైనా చేయాలి అన్న ఆశతో.

కానీ ఇక్కడకు వచ్చాక మరిన్ని ఇబ్బందులు పడ్డట్లున్నారు?

నిజమే.. ఇక్కడకు వచ్చేదాకా అమెరికా పద్దతులే తెలుసు. మోసం అన్నది పరిచయం లేదు. తొలిసారి ఇక్కడకు వచ్చాక మోసపోయాను.. తెలుసుకునే సరికే ఆరోపణల ఊబిలోకి దిగిపోయాను.

వైఎస్ జగన్‌తో మీ లావాదేవీలేనా?

జగన్‌తో నా లావాదేవీలేమీ లేవు. నేను కొన్ని భూములు కొన్నాను. ఆ విషయంలో మోసపోయాను. కానీ వైఎస్ హయాంలో లబ్దిపొందానన్న ఆరొపణలు వచ్చాయి. నేను సిబిఐ అధికారులకు ఒకటే చెప్పాను. వైఎస్ ప్రభుత్వం చేత ఒక్క చిన్న లబ్ది పొందినట్లు చిన్న నోట్ చూపించినా నేను ఓకె అంటాను అని. ఏమాత్రం లబ్ధి పొందలేదు. 

మరి సాక్షిలో పెట్టుబడులు?

కేవలం వ్యాపార దృక్పధంతోనే పెట్టుబడులు పెట్టా తప్ప మరేం కాదు. వైఎస్ మరణించిన తరువాత కూడా సాక్షిలో పెట్టుబడులు పెట్టా..

మరి ఇప్పుడు ఆ పెట్టుబడులకు తగిన లాభం వుందా?

వైనాట్.. ఇప్పుడు మంచిగానే వుంది.

జగన్‌తో స్నేహం కేవలం సాక్షిలో పెట్టుబడుల వరేకనా? లేక ఇంకా అంతకు మించి ఏమన్నా వుందా?

నిజానికి జగన్ కన్నా ముందు వైఎస్‌తోనే పరిచయం. ఆయన రూమ్ మేట్ ఒకరితో బాంధవ్యం.. మామా అని పిలిచేవాడిని. అదే బాంధవ్యం వైఎస్‌తో. అలాంటి మనిషిని మళ్లీ చూడలేం.. మాట ఇస్తే.. దాని కోసం నిలబడిపోయే వ్యక్తిత్వం. అలా.. జగన్ కూడా పరిచయం అయ్యారు. బావా బావా అనుకునేంత సాన్నిహిత్యం.

మరి అంత సాన్నిహిత్యం వుండి 2014లో ఎందుకు దూరం అయ్యారు? ఆయన పార్టీ టికెట్ పై విజయవాడ నుంచి ఎందుకు పోటీ చేయలేదు?

చేద్దామని.. చేయలా వద్దా అని ఇలా డైలమా.. అలాంటి సమయంలో చిన్న తేడా.. అందుకే దూరమయ్యా. నాకు ఒకటే అలవాటు, ఎవరి పద్దతి అయినా, మాట అయినా నచ్చకపోతే, సైలెంట్‌గా పక్కకు జరిగిపోతా?

మరి పవన్ కళ్యాణ్.. జనసేన అనుభవాలేమిటి?

కళ్యాణ్ నాకు యూరప్ నుంచి తెలుసు.. చేగువేరా అంటే నాకు ఇష్టం.. అతనికీ ఇష్టం. సమానత్వం వుండాలి అనేది నా లక్ష్యం. అతనూ అదే అనేవాడు. అలా కలిసింది ఇద్దరికీ.

మరి జనసేన?

ఓసారి అతనే అన్నాడు.. ఓ నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్ పెడదాం అనుకుంటున్నా అని. దాంతో నేను కూడా సై అన్నాను. 

ఏ మేరకు సహాయం చేసారు.?

మద్దతు.. మాట.. చేత.. ఇలా చేతనయినంత.

ఇదంతా కేవలం విజయవాడ ఎంపీ సీటును దృష్టిలో పెట్టుకుని చేసారని. మీ కోసం, మీ టికెట్ కోసం పవన్ ఎంతో ప్రయత్నించారని, కానీ రాలేదని..?

అవన్నీ జనానికి చేరవేసిన వార్తలు. కానీ నేను ప్రయత్నించలేదన్నది నాకే తెలుసు. ఎన్నికల వేళ ఈ రాష్ర్టంలోనే లేనని నాకే తెలుసు. 

మరి జనసేనకు ఎందుకు దూరం అయ్యారు.?

పవన్ మాకు అంటే నాకు మరి కొందరికి చెప్పింది ఒకటి.. జరిగింది మరొకటి. ఆయన ఓ నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేద్దాం అని చెప్పారు. కానీ స్టార్ట్ చేసిన కొద్ది రోజుల్లోనే పోలిటికల్ టర్న్ తీసుకున్నారు. అది నాకు, మరి కొందరికి నచ్చలేదు. సైలెంట్‌గా పక్కకు వచ్చేసాం. ముందే చెప్పాగా నాకు నచ్చకపోతే పక్కకు వచ్చేస్తా అంతే.

పవన్‌కు పెట్టుబడి పెట్టారని, ఫైనాన్స్ చేసారని వార్తలు.. వదంతులు వున్నాయి.?

దానికీ జనసేనకు సంబంధం లేదు.. అదంతా సినిమా రంగంలో నా పెట్టుబడులు. అన్నీ సెటిల్ అయిపోయినట్లే.

ఒక విధంగా పవన్ మీద మీరు పెట్టుకున్న ఆశలు నెరవేరనట్లేనా?

ఆశలు పెట్టుకోవడం కాదు.. సమానత్వం సాధించగల ఓ నాన్ పొలిటికల్ ప్లాట్ ఫారమ్ అన్నది అనుకున్నా.. కాలేదు. కానీ ఎప్పటికైనా సాధిస్తాను. 

పవన్‌తో సినిమా చేస్తారా?

లేదు.. చేయను.

అదేంటీ అలా అనేసారు.?

ఏది ఇష్టమైతే అదే చేస్తాను.. నాకు ఇష్టం లేని పని చేయమన్నా చేయలేను. 

పోనీ ఎన్నికలు అయ్యాక చంద్రబాబును కలవాల్సిందిగా? ఆంధ్రకు పెట్టుబడులు ఆయన ఆహ్వానిస్తున్నారుగా.?

నాకు ఇండియాలో కొన్ని చేదు అనుభవాలు వచ్చాక.. ఒక కీలక నిర్ణయం తీసుకున్నా. నేనే కాదు. నా కుటుంబ సభ్యులు కూడా. ఇకపై ప్రభుత్వంతో లింక్ వున్న ఏ బిజినెస్ చేయము. ప్రభుత్వంతో అవసరం పడే ఏ వ్యాపారం చేయము. మా డబ్బులతో మేము చేయగలిగిన వ్యాపారం చేస్తాను. అంతే. ఇక్కడ ప్రభుత్వంతో పని అంటే చాలా తలకాయనొప్పులు.. ఎందరికొ ఒదగాలి. అది నా జీవితంలో చేయను. అందుకే ఈ సినిమారంగంలోకి వచ్చాను. ఇక్కడ నా డబ్బులు.. నా సినిమా.. నా ఇష్టం. అంతే.

కానీ ఇక్కడ మరీ ఇగో సమస్యలు వుంటాయిగా.. ఒదిగి వుండాలిగా నిర్మాత అంటే.?

నేను నా స్టయిల్‌లోనే సినిమాలు చేస్తాను. నచ్చినవారితోనే చేస్తాను. 

అందుకేనా.. ఇలాంటి పట్టుదల వల్లేనా తొలి సినిమాతోనే రవితేజతో తగాయిదా? శృతిహాసన్ వ్యవహారం.?

అదేమీ పెద్ద ఇస్యూ కాదు. నేను కోటి రూపాయిలు ఇస్తా అన్నా.. ముందుగానే చెక్ వేయడం వల్ల సమస్య అంతే. ఇప్పటికి ఆయన నాతో టచ్‌లో వున్నారు. ఇక శృతి హాసన్ అంటారా.. నాకు మాట అంటే మాటే. అడ్వాన్స్ తీసుకుని మాట మార్చారు.. అందుకే కేసు దాకా వెళ్లాం.. ఆమె దిగివచ్చారు. అన్నీ వదిలేసాం.

కానీ ఇలా అయితే ఇండస్ట్రీలో కష్టం ఏమో? 

కష్టం ఏముంది? లైక్ మైండ్ పీపుల్ ఎందరొ వున్నారు. 

కానీ సినిమా రంగంలో మీరు పోగొట్టుకున్నదే ఎక్కువేమో?

మరీ ఎక్కవ కాదు. ఒక్క వర్ణ విషయంలోనే లాస్ ఎక్కువ. 

మహేష్‌తో ఎలా వుంది? 

ఈ సినిమా చేసారని చెప్పడం లేదు. కానీ సినిమా అంటే చాలా చాలా తపన వున్న వ్యక్తి. నాకే ఆశ్చర్యం వేసేది ఒక్కోసారి. అతని డెడికేషన్ చూసి. 

బ్రహ్మొత్సవం ఎలా వచ్చింది.. ఎలా వుంటుంది?

అద్భుతంగా వచ్చింది. తొలిసారి సినిమా విడుదలకు ముందే మా సంస్థకు లాభాలు ఇచ్చిన సినిమా. అంతకు మించి మారిపొతున్న మానవ సంబంధాల గురించి చెప్పే సినిమా. అసలు ఎక్కడకు వెళ్తున్నాం మనం.. మనిషికి మనిషికి మధ్య సంబంధాలు తగ్గిపోతున్నాయి అన్నదే నా బాధ. అందుకే ఈ దిశగా కొన్ని మంచి సినిమాలు  తీయాలనుకుంటున్నాను.

ఇండియాకు వచ్చిన ఇన్నేళ్ల తరువాత ఎందుకు వచ్చాను అని ఎప్పుడయినా అనిపించిందా?

నిజానికి నా జీవితంలో బ్యాడ్ పిరియడ్ ఇక్కడే. చాలా నష్టపోయాను.. చాలా నేర్చుకున్నాను.

మరి అలాంటపుడు మళ్లీ వెనక్కు వెళ్లిపోయావని అనిపించలేదా?

లేదు.. రెండు కారణాలు.. ఒకటి ఇప్పటికే ఇక్కడ పెట్టిన పెట్టుబడులు.. రెండవది ఎందుకు సాధించలేననే పంతం.

అన్ని బంధాలు విడిపోతే, మళ్లీ వెళ్లిపోతారా?

లేదు.. నా జన్మభూమికి ఏదైనా చేయాలి. విజయవాడలో మాల్ కట్టడం వెనుక రీజన్ అదే. ఆ ఊరికి మంచి మాల్ వుండాలని. 

అంటే మళ్లీ రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం వుందా? ఎమ్మెల్యే అవుతారా?

చెప్పలేను. ఎమ్మెల్యే మాత్రం కాను..

అంటే ఎంపీ పైనే మీ గురి అన్నమాట..!

అవును అనను కాదు అనను. కానీ ప్రజల్లో అసమానతలు తొలగించేందుకు కొంతయినా చేయాలన్నదే నా తపన. నా పిల్లలు ఏ స్కూల్‌లో చదువుతున్నారో, నా డ్రయివర్ పిల్లలు అదే స్కూల్‌లో. అది నా పద్దతి. 

పోగొట్టుకున్నది పోగా.. ఏ మేరకు మిగిలింది?

ప్రపంచంలోనే అత్యంత ఆస్తిపరుడిని నేను.. నా ఆస్తి ఏమిటి అంటారా? నా భార్య, పిల్లలు, నా అన్నదమ్ముడి కుటుంబం.. ప్రపంచంలోనే బెస్ట్ సోల్స్ వీరు. అంతకన్నా ఆస్తి ఏం కావాలి నాకు?

కంప్యూటర్.. ఫైనాన్స్.. స్పోర్ట్స్.. రియల్ ఎస్టేట్.. మీడియా.. ఎంటర్ టైన్ మెంట్.. ఇలా అన్ని రంగాల్లో కాలు పెట్టారు.. మీకు సంతృప్తి ఎక్కడ దొరికింది.?

విదేశాల్లో వుండగా ఫైనాన్స్ కన్సెల్టెన్సీ పెట్టా.. యంగ్ ఎనర్జిటిక్.. ఎంబిఎ కుర్రాళ్లు.. వాళ్లతో పనిచయడాన్ని ఇప్పటికీ నేను మరిచిపోలేను. 

ఖాళీ టైమ్ వుంటుందా.. ఏం చేస్తారు?

నాకు చదవడం అంటే ఇష్టం.. విపరీతంగా చదువుతాను.. అన్ని రకాలు. తెలుగులో ఎన్నో చదివాను.. ఇంగ్లీష్‌లో చదువుతున్నా.. చదివాక నాకు కొందరు లైక్ మైండ్ పీపుల్ వున్నారు.. నా భార్య, మా టీచర్ ఇలా.. వెంటనే వాళ్లతో షేర్ చేసుకుంటా నా భావాలు. బై లక్.. నేను మంచి ఇంగ్లీష్ మాట్లాడగలను.. రాయగలను.

మరి మీ భావాలు పబ్లిక్‌తో షేర్ చేసుకోవాలని అనిపించలేదా?

ఆ దిశగా ఆలోచించలేదు. కానీ నా భావాలకు తగ్గ సినిమాలు మాత్రం చేయాలని వుంది. అందులో భాగామే ఊపిరి.. బ్రహ్మోత్సవం.. ఇంకా త్వరలో రాబోయేవి.

చివరిగా... మీకు ఎక్కడ సెటిల్ కావాలని వుంది.. ఇండియాలోనా.. అమెరికాలోనా?

అమెరికా పద్దతులు, వ్యాపారం తెలిసిన వారికి ఇక్కడ ఇబ్బందిగా వుంటుంది. అయితే నాకు పర్సనల్‌గా యూరప్ నచ్చుతుంది. ఒక విధంగా అది ఇప్పటికే నా రెండో ఊరు. అక్కడే సెటిల్ అవుతానేమో?

చివరిగా ఏమైనా?

బ్రహ్మోత్సవం చూడండి.. మనం మరచిపోతున్న మానవ విలువలను గమనించండి.. అంతే.

విఎస్‌ఎన్ మూర్తి