ప్రశాంత్ కిషోర్.. సెల్ఫ్ మార్కెటింగ్

బన్నీని ప్రశాంత్ కిషోర్ కలిసిన విషయం వాస్తవమేనని, కానీ బన్నీకి రాజకీయాల ఆలోచన అస్సలు లేదని, ఇది పూర్తిగా కాకతాళీయంగా జరిగిందని వెల్లడించాయి.

మార్కెటింగ్ విద్య తెలిసిన వాడు ఎదుటివారికి మార్కెటింగ్ సలహాలు ఇవ్వడమే కాకుండా, తనను తాను మార్కెట్ చేసుకోవడం ఎలా అనేది కూడా చూసుకుంటాడు. ఎన్నికల టెక్నిక్‌లలో ఔపాసన పట్టిన మొనగాడు అనే పేరు సంపాదించుకున్న ప్రశాంత్ కిషోర్ ఈ సెల్ఫ్ మార్కెటింగ్ లో సిద్ధహస్తుడు. ఎప్పుడు ఎక్కడ కనిపించాలో, ఎలా లీకులు ఇవ్వాలో, ఎలా ఫోటోలు వదలాలో ఆయనకు బాగా తెలుసు. గెలుపు గుర్రం పక్కన నిల్చుని ఫోటో తీయించుకుని, తన వల్లే గెలిచిందనే ఫీల్ కలిగించగలడు.

ఈ మధ్య ప్రశాంత్ కిషోర్ పేరు అంతగా వార్తల్లోకి రాలేదు. పైగా, శకునం చెప్పిన బల్లి కుడితి తొట్టిలో పడిందన్నట్లుగా, బీహార్‌లో పోటీ చేసిన అతగాడి అభ్యర్థులు దారుణంగా ఓడిపోయారు. ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్‌కు అంత బజ్ లేదు. ఇలాంటి టైమ్‌లో ఉన్నట్టుండి ఓ గాసిప్ బయటకు వచ్చింది. ప్రశాంత్ కిషోర్-బన్నీ కలిశారని, కొన్నాళ్లు ప్రజాసేవ, ఆ తర్వాత రాజకీయాలు… అదీ బన్నీ టార్గెట్ అంటూ కథలు వండేశారు. దీంతో ఇది పూర్తిగా అబద్ధం… ఫేక్ అంటూ బన్నీ టీమ్ ఖండన చేసింది.

కానీ కొన్ని వర్గాలు మాత్రం బన్నీని ప్రశాంత్ కిషోర్ కలిసిన విషయం వాస్తవమేనని, కానీ బన్నీకి రాజకీయాల ఆలోచన అస్సలు లేదని, ఇది పూర్తిగా కాకతాళీయంగా జరిగిందని వెల్లడించాయి.

ఇక్కడే ప్రశాంత్ కిషోర్ మీద అనుమానం వస్తోంది. 2024 ఎన్నికల ముందు ఎయిర్‌పోర్ట్‌లో చంద్రబాబును కలిశారు. అది కూడా కాకతాళీయమే. కానీ ఆ సమయంలో ప్రశాంత్ కిషోర్ వ్యూహరచన చేస్తున్నారని వార్తలు వచ్చాయి. నిజానికి చంద్రబాబుకు వ్యూహరచన వేరే వాళ్లు చేయక్కర్లేదు. ఆయనే అతి పెద్ద వ్యూహకర్త. ప్రశాంత్ కిషోర్‌కు తెలుగు మీడియాతో మంచి సంబంధాలు ఉన్నాయి. అప్పట్లో ఆయనే లీకులు ఇచ్చి ఉంటారనే అనుమానాలు కూడా ఉన్నాయి.

ఇప్పుడు కూడా ఢిల్లీ వచ్చిన బన్నీని కావాలని ఒక మూలలో కలిసి, ఒకసారి షేక్ హ్యాండ్ ఇచ్చి ఉండొచ్చు. కానీ బన్నీ తెలివైన వాడు; ఇలాంటివి పెద్దగా ఎంటర్‌టైన్ చేయడు. కానీ ప్రశాంత్ కిషోర్ అంతకంటే తెలివైన వాడు. అందుకే తన తెలుగు మీడియాలోని పాత పరిచయాలను ఉపయోగించి, లీకులు ఇచ్చి ఉండవచ్చు. దాంతో వార్తలు గుప్పుమన్నాయి.

బన్నీ ఇప్పుడు నేషనల్ క్రేజ్ ఉన్న హీరో. అందుకే ప్రశాంత్ కిషోర్ దృష్టి అతని మీద పడిందేమో. అంతకన్నా మరేం లేదు. కానీ బన్నీ అంత సులువుగా బుట్టలో పడే రకం కాదు. పది మంది ప్రశాంత్ కిషోర్‌లు కూడా బన్నీ మేనేజ్‌మెంట్‌ను మేనేజ్ చేయలేరు.

5 Replies to “ప్రశాంత్ కిషోర్.. సెల్ఫ్ మార్కెటింగ్”

Comments are closed.