Advertisement

Advertisement


Home > Movies - Movie News

బాలు...మనుష్యులందు మహర్షి

బాలు...మనుష్యులందు మహర్షి

ఒక మనిషి మరణం తరువాత కూడా బతకడం అంటే ఇదేనేమో?  ఘనత వహించిన కళాకారులకు మీడియా ఘన నివాళి అర్పించడం అన్నది ఎప్పుడూ జరిగేదే. ఘంటసాల మరణించినపుడు మీడియా ఏ మేరకు ఘన నివాళి అర్పించింది అన్నది ఈ జనరేషన్ కు తెలియదు. పైగా ఇన్ని రకాల మాధ్యమాలు ఆ రోజు లేవు. 

ఎన్టీఆర్ మరణించినపుడు విజువల్ మీడియా అద్భుత రీతిలో వీడ్కోలు పలికింది. మళ్లీ అంతటి వీడ్కోలు వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అందించారు. అయితే ఎన్టీఆర్, వైఎస్ విషయంలో కొందరైనా స్పందించకుండా మౌనంగా వుండిపోయే అవకాశం వుందేమో. కానీ ఇప్పుడు ఎస్పీబీ కి అంతకు మించిన ఘనమైన నివాళి, ఘనమైన వీడ్కోలు మీడియా మాత్రమే కాదు, యావత్ సామాజిక మాధ్యమాలు అందించాయి.

ఇక ప్రింట్, విజువల్, వెబ్ మీడియాలు అయితే చెెప్పనక్కరలేదు. పేజీలకు పేజీలు, గంటలకు గంటలు ఆయనకే అంకితం ఇచ్చాయి. ఈ ఒక్క రోజు రొచ్చు రాజకీయ వార్తలను లోపలకు ఎక్కడికో గెంటేసాయి.

వాట్సాప్ లో హోరెత్తిపోయింది. ఫేస్ బుక్ బావురు మంది. ట్విట్టర్ తల్లడిల్లిపోయింది. వాట్సాప్ వాడే ప్రతి తెలుగువాడి స్టేటస్ లో బాలు కొలువై కూర్చున్నారు. కామన్ మాన్ నుంచి సెలబ్రిటీ ల వరకు స్పందించని వారు లేరు. బాలు గొంత కొన్ని దశాబ్దాలుగా ప్రతి తెలుగు ఇంట మాత్రమే కాదు, దాదాపు 16 భాషలకుచెందిన వారి ఇళ్లలో మారుమోగింది. ఇప్పుడు ఆ పాటల రీసౌండ్ దేశం అంతటా ధ్వనించింది. 

కానీ బాలు సినిమా హీరో కాదు. రాజకీయ నాయకుడు కాదు. ఒక గాయకుడు. ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి. అలాంటి వ్యక్తి ఇంతటి అభిమాన సమూహాన్ని సంపాదించుకోవడం అన్నది అసమాన్య విషయం. కుల, మత, వర్గ, రాజకీయ, ప్రాంతీయ ఇంకా..ఇంకా...అనేకానేక బేధాలకు అతీతంగా జనం నివాళులు అర్పించడం అన్నది బాలు చేసుకున్న పూర్వజన్మ సుకృతం. ఇలాంటి జన్మ వందకోట్లలో ఒకరికో ఇద్దరికో వస్తుంది.

ఇదే కదా ఇదే కదా జీవితం...ముగింపులేనిదై సదా సాగదా..మనుష్యులందు నీ కథ మహర్షిలాగ మారదా? 

అని అంటే ఇదేనేమో?

వి.రాజా

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?