అసలు విషయం బయటపెట్టిన బన్నీ వాస్

ఓ సినిమా థియేటర్లలో రిలీజైన తర్వాత ఎన్ని రోజులకు ఓటీటీకి ఇవ్వాలి. దీనిపై ఇప్పటికే 2-3 సార్లు రూల్స్ మార్చారు. ప్రస్తుతం ఏ రూల్ అమల్లో ఉందనేది కూడా నిర్మాతలకు అనవసరం. వాళ్లే రూల్స్…

ఓ సినిమా థియేటర్లలో రిలీజైన తర్వాత ఎన్ని రోజులకు ఓటీటీకి ఇవ్వాలి. దీనిపై ఇప్పటికే 2-3 సార్లు రూల్స్ మార్చారు. ప్రస్తుతం ఏ రూల్ అమల్లో ఉందనేది కూడా నిర్మాతలకు అనవసరం. వాళ్లే రూల్స్ పెడతారు, వాళ్లే దాన్ని తుంగలో తొక్కుతారు. గట్టిగా అడిగితే “ఇది యాపారం” అంటారు.

ఓటీటీ నుంచి వచ్చే డబ్బు కోసం నిర్మాతలు ఈ పని చేస్తున్నారనేది అందరికీ తెలిసిందే. విడుదలకు ముందే ఓటీటీ వాడు ప్రొడ్యూసర్ కు సినిమాను బట్టి 30 నుంచి 60 శాతం వరకు డబ్బు ఇచ్చేస్తున్నాడు. దీంతో నిర్మాతలు ఎగబడుతున్నారు.

అయితే దీనికి చెక్ పెట్టడం కుదరదా? టాలీవుడ్ లో అసాధ్యం అంటున్నాడు నిర్మాత బన్నీ వాసు. అల్లు అరవింద్, సురేష్ బాబు, దిల్ రాజు లాంటి పెద్దలు చెప్పినంత మాత్రాన మిగతా నిర్మాతలెవ్వరూ ఆగరని.. ఎవరి లాభం వాళ్లు చూసుకుంటారని ఓపెన్ గా చెబుతున్నాడు.

“నిర్మాత రూల్స్ కు విరుద్ధంగా చేస్తే మా వైపు నుంచి థియేటర్లు దొరకవు అనే భయాన్ని ఎగ్జిబిటర్లు క్రియేట్ చేయాలి. ఎగ్జిబిటర్ల నుంచి లాక్ ఉండాలి. అలా జరక్కపోతే నిర్మాతలు ఆగరు. హిందీలో ఈ రూల్ చాలా గట్టిగా ఉంది. అక్కడ పీవీఆర్, ఐనాక్స్ వాళ్లు గట్టి రూల్స్ పెట్టుకున్నారు. 8 వారాల్లోపు ఓటీటీకి సినిమా ఇస్తే ఒక పర్సంటేజీ ఉంది, 8 వారాల తర్వాత ఓటీటీకి సినిమా ఇస్తే ఎక్కువ పర్సంటేజీ ఉంది. దీంతో అక్కడ ఎగ్జిబిటర్లు, నిర్మాతలు ఓ అవగాహనతో ముందుకెళ్తున్నారు. ఇక్కడ టాలీవుడ్ లో అది సాధ్యం కాదు. ఎందుకంటే, ఇక్కడ నిర్మాతలే ఎగ్జిబిటర్లు. నిర్మాతలే డిస్ట్రిబ్యూటర్లు. కాబట్టి అలాంటి రూల్స్ పెడితే ఓటీటీ ఆదాయం తగ్గిపోతుందని పెట్టరు. ఫలితంగా టాలీవుడ్ ఓటీటీ సంస్థల చేతిలోకి వెళ్లిపోయింది. ఇప్పుడు వాళ్లు డిక్టేట్ చేస్తున్నారు.”

ఇలా అసలు విషయాన్ని బయటపెట్టాడు బన్నీ వాస్. ఒకే నిర్మాత పెద్ద సినిమా తీసినప్పుడు 8 వారాల లాక్-ఇన్ పీరియడ్ కు సినిమాను ఓటీటీకిస్తాడు. ఎందుకంటే, అతడికి థియేటర్ నుంచి ఎక్కువ ఆదాయం వస్తుంది కాబట్టి. అదే నిర్మాత ఓ చిన్న సినిమా తీస్తే 3 వారాలకే ఓటీటీకి ఇచ్చేస్తాడు. ఎందుకంటే, అక్కడ థియేటర్ కంటే ఓటీటీ నుంచి ఎక్కువ ఆదాయం వస్తుంది కాబట్టి.

ఈ లెక్క మారాలంటున్నాడు బన్నీ వాసు. ఆ రోజుకు ఏది లాభదాయకమైతే అటు వెళ్లిపోయే కల్చర్ నుంచి బయటకు రావాలని.. అప్పుడే టాలీవుడ్ కూడా ఓటీటీ చేతుల నుంచి బయటకొస్తుందని చెబుతున్నాడు.

2 Replies to “అసలు విషయం బయటపెట్టిన బన్నీ వాస్”

  1. వీళ్ళు సినిమాలు థియేటర్ లోనే చూడమంటారు, కాని కిల్ హిందీ సినిమా OTT లోకి వచ్చిన తర్వాత నే రీమేక్ కోసం ఎంక్వయిరీ లు మొదలుపెట్టారు.

Comments are closed.