థియేటర్లలో ‘దాయరా’ రిలీజైనప్పుడు, పోస్టర్ మీద కరీనా కపూర్, పృథ్వీరాజ్ పేర్లు ఉన్నా జనం హాల్ వైపు కన్నెత్తి చూడలేదు.
ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లోకి రాగానే, ఓటీటీలో పృథ్వీరాజ్‌కి ఉన్న క్రేజ్ నేపథ్యంలో ప్లే బటన్ నొక్కొచ్చు! తెలుగు ఆడియో లేకపోవడంతో సబ్‌టైటిల్స్ చదువుతూ చూడాల్సి వస్తుంది.
సినిమా మొదలైన పది నిమిషాలకే ఒక డౌట్ మొదలవుతుంది. “ఇదేదో ఎక్కడో చూసినట్టుందే?” అవును, చూసిందే. మూడేళ్ల కిందట వచ్చిన మలయాళ సినిమా ‘జనగణమన’. అది కూడా హైదరాబాద్ దిశ కేసు, ఆ తర్వాత జరిగిన ఎన్కౌంటర్ నేపథ్యంలోనే వచ్చిన సినిమా.
అదీ, ఇదీ రెండూ అడిగేది ఒకే ప్రశ్న, తుపాకీతో వచ్చేది జస్టిస్నా, లేక కోర్టులో వచ్చేదా? కానీ ఇక్కడే అసలు ఫన్ ఉంది. ‘జనగణమన’లో ఎన్కౌంటర్ చేసి హీరో అయిన పోలీస్ సూరజ్ వెంజరమూడు అయితే, ఆ ఎన్కౌంటర్ని కోర్టులో చీల్చి చెండాడిన లాయర్ పృథ్వీరాజ్. ‘దాయరా’లో మాత్రం పృథ్వీరాజ్ సైడ్ మార్చేసి, తానే ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ డీసీపీ రమణ్ కుమార్ అయిపోయాడు.
అతన్ని విచారించే ఆఫీసర్ అజూనీ కోహ్లీగా కరీనా వస్తుంది. ఒకే డిబేట్లో రెండు వైపులా ఆర్గ్యూ చేసిన ఘనత మాత్రం పృథ్వీరాజ్కే దక్కుతుంది. ఇంకో రెండేళ్లలో అదే కేసులో జడ్జిగా కూడా వస్తాడేమో చూడాలి.
‘దాయరా’ అంటే హిందీలో సర్కిల్ అని అర్థం. డైరెక్టర్ మేఘనా గుల్జార్ ఆ టైటిల్‌ని చాలా సిన్సియర్‌గా తీసుకున్నట్టుంది. కథ ఒక పాయింట్ దగ్గర మొదలై, రౌండ్ రౌండ్ తిరిగి, మళ్లీ అదే పాయింట్ దగ్గరికి వచ్చి ఆగుతుంది. మధ్యలో ప్రేక్షకుడికి కళ్లు తిరగడం ఫ్రీ బోనస్.
‘జనగణమన’ ఇదే ప్రశ్నను కోర్టు హాల్లో ఒక్కో ట్విస్ట్‌తో, గూస్బంప్స్ తెప్పించే డైలాగులతో అడిగితే, ‘దాయరా’ అదే ప్రశ్నను ఒక ఆఫీస్ మీటింగ్‌లా, ఫైల్స్ తిప్పుతూ అడుగుతుంది. అక్కడ ప్రతి సీన్ ఒక పంచ్, ఇక్కడ ప్రతి సీన్ ఒక పాజ్.
పృథ్వీరాజ్ కోసమే చూసినవాళ్లకు మాత్రం డిసప్పాయింట్మెంట్ లేదు. గడ్డం, ఖాకీ యూనిఫాం, కళ్లలో కోపం.. ఈ మనిషి ఫ్రేమ్‌లో నిలబడితే చాలు స్క్రీన్ నిండిపోతుంది. చాలామంది క్రిటిక్స్ కూడా సినిమాలో బెస్ట్ అతనే అన్నారు. అతను స్క్రీన్ మీద ఉన్నంతసేపూ వేలు రిమోట్‌కి దూరంగానే ఉంటుంది.
కెమెరా అతని నుంచి పక్కకు తిరిగిన ప్రతిసారీ మాత్రం, బొటనవేలు ఆటోమేటిక్‌గా స్కిప్ బటన్ వైపు జారిపోతుంది. ఓటీటీ ప్రేక్షకుడి లెక్కలో ఈ సినిమా రెండే భాగాలు. పృథ్వీరాజ్ సీన్లు, ఫార్వర్డ్ చేయాల్సిన సీన్లు. కరీనా కపూర్ ఒక సీరియస్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా కనిపిస్తుంది.
ఫస్ట్ హాఫ్ మాత్రం బాగానే గ్రిప్‌తో సాగుతుంది. రెండు టైమ్లైన్లు, రెండు ఇన్వెస్టిగేషన్లు, ఇద్దరు ఆఫీసర్ల మధ్య ఈగో క్లాష్.. ఇవన్నీ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి. ఇంటర్వెల్ తర్వాత మాత్రం సినిమా ఒక గవర్నమెంట్ ఆఫీస్ ఫైల్ లాగా ఒక్క అంగుళం కూడా కదలదు.
సేమ్ ఆర్గ్యుమెంట్, సేమ్ క్వశ్చన్, సేమ్ లుక్. ఆ గ్యాప్‌లో ఫోన్ చెక్ చేసుకోవచ్చు, టీ పెట్టుకోవచ్చు, వాట్సాప్ గ్రూప్‌లో రెండు ఫార్వర్డ్ మెసేజ్‌లు పంపొచ్చు. తిరిగొచ్చి చూసినా కథ ఎక్కడ పాజ్ చేశామో అక్కడే వెయిట్ చేస్తుంటుంది.
లాస్ట్ అరగంటలో మాత్రం సినిమా నిద్ర లేస్తుంది. క్లైమాక్స్ బలంగా ఉందని, అదే సినిమాను సేవ్ చేసిందని కొందరు క్రిటిక్స్ రాశారు. అంటే రెండు గంటల పేషెన్స్‌కి చివర్లో ఒక చిన్న గిఫ్ట్ ఉంటుంది.
కానీ ‘జనగణమన’ క్లైమాక్స్ చూసినవాళ్లకు మాత్రం ఆ గిఫ్ట్ కూడా చిన్నదిగానే అనిపిస్తుంది. అక్కడ క్లైమాక్స్ ఒక బాంబ్ బ్లాస్ట్ అయితే, ఇక్కడ అది దీపావళి తర్వాత మిగిలిపోయిన తడిసిన చిచ్చుబుడ్డి.
మొత్తంగా ‘దాయరా’ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్‌తో మొదలై, సర్కిల్లో తిరిగి తిరిగి అలసిపోయిన సినిమా. కథలోని విషయం సీరియస్‌దే, కానీ చెప్పిన తీరే సాగదీసింది. ‘జనగణమన’ చూసినవాళ్లకు ఇది ఒక స్లో మోషన్ రీ-రన్. చూడనివాళ్లకు మాత్రం ఒక సలహా, ముందు అది చూడండి.
