థియేటర్లలో ‘జైలర్ 2’ 800 కోట్లు కొట్టినప్పుడు, ఫస్ట్ డే ఫస్ట్ షో ఫోటోలు, విజిల్స్ వీడియోలు సోషల్ మీడియాలో తిరుగుతుంటే, టికెట్ రేట్లు, పార్కింగ్ ఫీజు, ఇంటర్వెల్ పాప్‌కార్న్ బిల్లు లెక్కేసుకుని “ఓటీటీలో చూద్దాంలే” అని సర్దుకున్న బ్యాచ్ ఒకటి ఉంది. ఆ ఓపికకు ఇప్పుడు ఫలితం దక్కింది.
ప్రైమ్ వీడియోలో తెలుగు డబ్బింగ్‌తో రజినీ ఇంటి హాల్లోకే నడుచుకుంటూ వచ్చేశాడు. టికెట్ ఖర్చు లేదు, పక్క సీట్లో ఫోన్ లైట్ వేసే వాడు లేడు. కానీ ఒక్కటే సమస్య, ఇంట్లో విజిల్ వేస్తే పక్కింటి ఆంటీ తలుపు తడుతుంది.
రిమోట్ చేతిలో పట్టుకుని రజినీ సినిమా చూడటం అనేది ఒక కొత్త అనుభవం. థియేటర్లో అయితే రజినీ కళ్లజోడు తిప్పగానే హాలంతా దద్దరిల్లుతుంది.
ఇంట్లో మాత్రం అదే సీన్‌కి, వంటింట్లోంచి “ఆ సౌండ్ కాస్త తగ్గించు” అనే అరుపు వినిపిస్తుంది. అనిరుధ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మోగినప్పుడల్లా వాల్యూమ్ బటన్‌తో ఒక చిన్న యుద్ధం చేయాల్సిందే. పెంచితే ఇంట్లోవాళ్లు తిడతారు, తగ్గిస్తే రజినీ ఎలివేషన్‌కి అవమానం.
ఫస్ట్ హాఫ్ మాత్రం సోఫాలోంచి కదలనివ్వదు. నెల్సన్ మార్క్ డార్క్ కామెడీ బాగా నవ్విస్తుంది. విద్యా బాలన్ సిగరెట్ పట్టుకుని ఎంట్రీ ఇచ్చినప్పుడు మాత్రం చాలామంది అప్రయత్నంగా రివైండ్ బటన్ నొక్కే ఉంటారు. ఓటీటీలో ఉన్న అసలైన సౌకర్యం అదే, నచ్చిన సీన్ మళ్లీ మళ్లీ చూసుకోవచ్చు.
సెకండ్ హాఫ్‌కి వచ్చేసరికి మాత్రం ఓటీటీ ప్రేక్షకుడి అసలు స్వభావం బయటపడుతుంది. ఎవరు ఎవరిని కిడ్నాప్ చేశారో అర్థం కాక ఒకసారి పాజ్ నొక్కి గూగుల్‌లో కథ వెతకాల్సి వస్తుంది. పేలుళ్లు, తుపాకులు ఎక్కువైనప్పుడు బొటనవేలు దానంతటదే ‘10 సెకన్లు ముందుకు’ బటన్ మీదకు వెళ్లిపోతుంది.
థియేటర్లో అయితే ఆ సాగదీత భరించాల్సిందే, ఇంట్లో మాత్రం ఆ అవసరం లేదు. బహుశా థియేటర్‌లో చూసినవాళ్ల కంటే ఓటీటీలో చూస్తున్నవాళ్లకే ఈ సినిమా ఇంకాస్త వేగంగా అనిపిస్తుందేమో. దానికి క్రెడిట్ నెల్సన్‌ది కాదు, రిమోట్‌ది.
మధ్యలో వినాయకన్ వచ్చి డాన్స్ చేసే సీన్ చూసినప్పుడు, పక్కన కూర్చున్నవాళ్లు “ఇది ఎందుకొచ్చింది?” అని అడిగితే చెప్పడానికి సమాధానం ఉండదు. థియేటర్‌లో అయితే ఆ ప్రశ్న అరుపుల్లో కలిసిపోతుంది. ఇంట్లో మాత్రం ఆ నిశ్శబ్దం చాలా స్పష్టంగా వినిపిస్తుంది.
పెద్ద స్టార్ల అతిథి పాత్రలు వచ్చినప్పుడు కూడా ఇదే పరిస్థితి. థియేటర్లో విజిల్స్ పడే చోట, ఇంట్లో “ఓ.. అతను కూడా ఉన్నాడా” అనే చిన్న ఆశ్చర్యంతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది.
అసలు విషయం ఏంటంటే, ‘జైలర్ 2’ లాంటి సినిమాలు థియేటర్ కోసమే పుట్టాయి. వెయ్యి మంది కలిసి అరిస్తేనే ఆ ఎలివేషన్లకు అర్థం ఉంటుంది. అదే సన్నివేశాలు చిన్న స్క్రీన్ మీద, ఒంటరిగా చూస్తే కాస్త చప్పగా అనిపించడం సహజం. థియేటర్ వాతావరణాన్ని తీసేస్తే, మిగిలేది ఒక సాదాసీదా కథ, దాని చుట్టూ రజినీ స్టైల్, అనిరుధ్ సంగీతం మాత్రమే.
మొత్తంగా థియేటర్ మిస్సయినవాళ్లకు ‘జైలర్ 2’ ఇంట్లో దొరికిన డిస్కౌంట్ సేల్ లాంటిది. ఒరిజినల్ ఎక్స్‌పీరియన్స్ కాకపోయినా, తక్కువ ఖర్చులో రజినీ పండగ. హెడ్‌ఫోన్స్ పెట్టుకుని, లైట్లు ఆపేసి, ఫార్వర్డ్ బటన్ మీద వేలు పెట్టుకుని చూస్తే, వీకెండ్ టైంపాస్‌కి లోటు ఉండదు.

Naadi 75″ tv so njoyed
11″ TV ke ekkuva raa నువ్వు..