‘కాలాతీత వ్యక్తులు’ అనే ఒక్క నవలతో తెలుగుసాహిత్య చరిత్రలో తనకంటూ సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్న మంచి రచయిత్రి డాక్టర్ పి.శ్రీదేవి. ఆమె ‘రేవతి స్వయంవరం’ అనే కథ కూడా రాశారు.. ప్రేమ-పెళ్ళి గురించి సుదీర్ఘమైన చర్చ ఉంటుంది అందులో.
‘పరిచయం లేని వ్యక్తితో జీవితం ప్రారంభించే కంటే అదివరకే అర్ధంచేసుకున్న వ్యక్తితో జీవితం సుఖంగా ఉండదంటావా?’ అని రేవతికి గురువైన శాస్త్రి ప్రశ్నిస్తాడు. అందుకు ఆమె సమాధానం చెబుతుంది.
‘ప్రేమ అనేది ఒకరిసొత్తుగా ఒకచోట నిల్చిపోయేది కాదు. ఎత్తునున్న నీరు పల్లానికి ప్రవహించటం ఎంత సహజమో ఇష్టం కలిగిన ప్రతీ వ్యక్తియందూ ప్రేమ ప్రసరించటం అంత సహజం. ప్రేమించిన ప్రతీ వ్యక్తినీ వివాహం చేసుకోలేము. కానీ వివాహం చేసుకొనిన వ్యక్తిని ప్రేమించటం అంత కష్టం కాదనుకుంటాను’ అని నర్మగర్భంగా చెబుతుంది.
ప్రేమ అనే పదానికి మనం అనుకునే అనేక రకాల సంకుచిత అర్థాలు ఇందులో ఉండవు. ‘నేను నిన్న ప్రేమిస్తున్నాను.. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా’ లాంటి మాటలు కృతకంగా తోస్తాయనే వ్యక్తీకరణ కూడా ఉంటుంది అందులో.
ప్రేమ అనేది దానంతట అదే వ్యక్తం కావాలి అనే సూత్రీకరణ కూడా ఉంటుంది. ఇంతకీ చెప్పొచ్చేదేంటంటే.. ప్రేమ అనేది మనం సాధారణ అర్థంలో తీసుకుంటున్నది కాదు. మనం నచ్చిన వారిని ప్రేమించగలం.. కానీ.. వివాహబంధం మాత్రం ఒకరితోనే ఉంటుంది.. ఆ బంధం ముడిపడిన తర్వాతే వారిని ప్రేమిస్తాం.. ఆ బంధానికి మనం ఇచ్చే గౌరవం అది- అనే సూచన ఈ కథ తెలియజెబుతుంది. డెబ్భయ్యేళ్ల కిందటి కథ ఇది. ఇవాళ్టి సమాజానికి చాలా అవసరం కదా అనిపిస్తుంది మనకి.
అరవయ్యేళ్ల దాకా అన్యోన్యంగా దాంపత్యం నెరపిన వాళ్లు కూడా.. హఠాత్తుగా చిన్న చిన్న కారణాలకు విడిపోతున్నారు. అన్యోన్యత అనే పదమే తెలియకుండా నిత్యం కాట్లాడుకుంటూ ఉండే దంపతులు- విడిపోతే మనం ఆశ్చర్యపడం.
ఇలాంటి వైపరీత్యాలే కాదు.. వివాహం జరిగిన కొన్ని రోజులకు, మొదటి నెలలోనే విడాకుల నిర్ణయానికి వచ్చేస్తున్న దంపతులు కూడా వర్తమాన సమాజంలో పెరుగుతున్నారు.
ఎందుకిలా అవుతోంది?
‘వివాహం అంటే ఒక శాశ్వతమైన బంధం’ అనే భావనను మనిషిలో పాదుగొల్పడంలో మన సమాజం విఫలమౌతోంది. దాని ఫలితంగానే.. వర్తమాన ప్రపంచంలో పెళ్లిళ్లు పెటాకులు కావడం అనేది.. చాలా సింపుల్ వ్యవహారంగా, పెచ్చుమీరుతున్న విచ్చలవిడి అలవాటుగా మారుతోంది.
ఆధునిక తరంలో ఈ జోరు మరింతగా పెరుగుతోంది. ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో వేర్వేరు నేపథ్యాల నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఒకే జీవితం గా కలిసి ముందుకు సాగడంలో తేడాలు రావడం చాలా సహజం.
ఆ తేడాలను ఎంతకాలం సహించగలుగుతున్నారు.. ఎంత లోతుగా ఎదుటివారిని అర్థం చేసుకోగలుగుతున్నారు.. అనే కోణాల్లో ఆయా వ్యక్తుల్లోని సహనశీలతను బట్టి వివాహ బంధాలు నిలబడడం- తెగిపోవడం జరుగుతూ ఉంటుంది.
ఇలా తెగుతున్న బంధాల వీక్ పాయింట్ వ్యక్తుల మానసిక చాంచల్యమే కారణమనే అభిప్రాయాలు పలువురిలో వ్యక్తమవుతున్నాయి.
ఆర్థిక స్వేచ్ఛపై నింద కరెక్టేనా?
ఈరోజుల్లో మగ- ఆడ ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. ఎవరి సంపాదన ప్యాకేజీలు వారికి ఉంటున్నాయి. బతుకుతెరువు కోసం ఒకరి మీద ఒకరు ఆధారపడాల్సిన పరిస్థితి ఉభయులకూ ఉండడం లేదు. ఇక వారు ఎందుకు జంకాలి.. అనే అభిప్రాయాలు కూడా వినవస్తుంటాయి.
నిజానికి వివాహాలు విచ్ఛిన్నం అవుతుండడానికి ఆర్థిక స్వేచ్ఛ ఒక్కటే కారణం కాదు. భర్తకంటె ఎక్కువ సంపాదిస్తూ ఉన్నత హోదాల్లో ఉండే భార్యలు కూడా.. ఎలాంటి దురహంకారాలు లేకుండా.. కలిసి మెలిసి జీవిస్తున్న ఉదాహరణలు మన సమాజంలోనే కొల్లలుగా కనిపిస్తాయి.
ఆమాటకొస్తే.. ఆర్థికస్వేచ్ఛ ఉండి కూడా.. కలిసి ఉండేవారి మధ్య ఉన్నదానిని మాత్రమే మనం ప్రేమ అని చెప్పగలం. ఎందుకంటే.. ఆర్థికంగా ఆధారపడి ఉండి.. ఆ భర్త/భార్యతో అన్యోన్యంగా బతుకుతూ ఉంటే దానిని ప్రేమగా నమ్మడానికి ప్రాతిపదిక ఏమిటి?
అలా భాగస్వామి అవసరం అసలే లేకుండా.. తన బతుకు తాను బతకగల సామర్థ్యం, స్థాయి ఉన్నప్పుడు కూడా కలిసి ఉంటేనే అది ప్రేమ అవుతుంది. కాబట్టి ఆర్థిక కారణాలకు అతీతంగా ఇతర కారణాలు ఇలా పెళ్లిళ్లు విడిపోవడాన్ని ప్రభావితం చేస్తున్నాయి. నిజానికి ఈ నిర్వచనం.. కేవలం దంపతులకు మాత్రమే కాదు.. అన్ని రకాల బంధాలకు కూడా సమానంగా వర్తిస్తుంది.
‘సర్దుబాటు’ పదం బూతుగా మారుతున్న వేళ
ఏ బంధం అయినా సరే.. ఇద్దరిలో సర్దుబాటు ధోరణి ఉన్నప్పుడు మాత్రమే స్థిరంగా ఉండగలుగుతుంది. అభిప్రాయాలు కలవడం లేదు.. అనే మాట మీద విడిపోయేవాళ్లు అనేకులు.
రెండు వేర్వేరు వాతావరణాల నుంచి వచ్చిన వారి మధ్య అభిప్రాయాలు అంత సులువుగా ఎలా కలుస్తాయి? సాధ్యమేనా? తగాదా వచ్చినప్పుడు, అభిప్రాయాలు కలవనప్పుడు విడిపోవడమే మంచిది కదా- అని వాదించే వారు కూడా తయారవుతున్నారు.
కలవని అభిప్రాయాలకు మధ్యేమార్గంగా ఒక సర్దుబాటు దారి ఉంటుందనే సంగతి మరచిపోతున్నారు. ఎందుకు సర్దుకోవాలి.. ఎందుకు అస్తిత్వాన్ని చంపుకోవాలి.. లాంటి పెద్దపెద్ద పదాలు కూడా ఈ దాంపత్యం అనే బంధంలోకి ప్రవేశిస్తుంటాయి.
అనుమానం హేయమైన హేతువు
భాగస్వామి మీద అనుమానం అనేది అత్యంత హేయమైన వ్యవహారం. సూటిగా చెప్పాలంటే.. అకారణంగానే భాగస్వామిని అనుమానించేది తమ మీద తమకు నమ్మకం లేని వారే. సమాన భాగస్వామిగా తమ పాత్రకు తాము న్యాయం చేయలేకపోతున్నామని లోలోన కుంచించుకుపోయేవాళ్లు.. ఆ ఆత్మన్యూనతను దాచుకోవడానికి అనుమానం అనే ముసుగు తగిలించుకుంటారు.
అలాగని నూటికి నూరుశాతం వివాహాల్లో అనుమానించాల్సిన తప్పులు ఏ ఒక్కరిలోనూ లేవు- అని తీర్మానించలేం. ఎందుకంటే.. అనుమానించడాన్ని మించి.. విచ్చలవిడితనంతో చెలరేగేవారు.. అలాంటి దారి తొక్కిన తర్వాత భాగస్వాముల్ని కూడా కడతేరుస్తున్నవారు మనకు సమాజంలో నిత్యం కనిపిస్తూనే ఉన్నారు.
వారి రూటే సెపరేటు!
సెలబ్రిటీల వివాహాలు మరొక ఎత్తు. వీరిలో చాలామందికి వివాహం కేవలం ఒక వేడుక మాత్రమే. వేడుక ముగిసిన వెంటనే అక్కడ చెత్తాచెదారాన్ని ఏరిపారేసినట్లుగా ఆ బంధాన్ని కూడా తృణీకారంగా చూడడం ఫ్యాషన్ అయిపోయిన సెలబ్రిటీలు, సంపన్నులు సమాజంలో పెరుగుతున్నారు.
వివాహ బంధం కోసం వేడుక నిర్వహించినట్లుగా వీరి వ్యవహారం ఉండదు.. వారు వేడుక చేసుకోవడానికి ఒక కారణం కావాలి కనుక వివాహం కుదుర్చుకున్నట్లుగా మాత్రమే ఉంటుంది.
వేడుకలు, సెలబ్రేషన్ మూడ్, పార్టీలు, గంతులు, డాన్సులు ఆ జోష్ అంతా అయిపోయాక ఇక పెళ్లి అనే పదానికి వారికి విలువ ఉండదు. ఏర్పడిన బంధాన్ని తెగ్గొట్టుకుంటే తప్ప మళ్ళీ మరొక వేడుక చేసుకోవడానికి సందర్భం కలిసి రాదని ముచ్చట పడే వారు కూడా ఉంటారేమో అంటే అతిశయోక్తి కాదు.
విడిపోతున్న వివాహ బంధాలు కేవలం ఈ కేటగిరీలకు మాత్రమే పరిమితం కాదు. కేవలం బుద్ధి చాంచల్యం, స్థిరత్వం లేని వైఖరి, పెత్తందారీ పోకడలు, ధిక్కారాన్ని ఓర్వలేని దురహంకారం ఇవన్నీ కూడా సాఫ్ట్ డైవోర్స్ లకు కారణం అవుతుంటాయి.
కానీ వివాహబంధం పదిలంగా నిలబెట్టుకోవడం మరీ కుందేటికొమ్మును సాధించడమంత కష్టమైనదేమీ కాదు. అందుకు కావాల్సినదెల్లా కొంత సహనం, కొంత ఓరిమి, అవతలి వారి కోణంలో కూడా ఆలోచించగల తెలివిడి!
బంధాన్ని గాయపరచగల ఏ సందర్భం ఎదురైనా సరే.. సహనం అనే మందు వాడి.. కొన్నాళ్లు వేచిచూడడం ఎప్పుడూ సత్ఫలితాలు ఇస్తుంది. ఈలోగా.. అవతలి వారిలో తప్పులేదని గానీ, మనం తప్పుబట్టడం కరెక్టే అని అవతలి వారు గ్రహించడం గానీ జరుగుతుంది.
అలాంటి దశ వచ్చేవరకు వేచి ఉండే ఓరిమి ఇవాళ్టి సమాజానికి లేకపోవడమే ఆధునిక ప్రపంచపు విడాకుల అధ్యాయానికి అసలైన భూమిక. వయోభేదాలతో నిమిత్తం లేకుండా నేటి సమాజంలో ఓరిమి ఎందుకు లుప్తమైపోతున్నదో అర్థం చేసుకోవాలంటే.. అనేక కారణాలు కనిపిస్తాయి.
ఒక్కొక్కరికీ ఒక్కొక్క కారణం స్ఫురిస్తుంది. టెక్నాలజీ దగ్గరినుంచి, మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా, అందరిలోనూ పెరుగుతున్న ఆశలు, జీవితాల్లో పెరుగుతున్న వేగం ఇవన్నీ స్ఫురణకు వస్తాయి. మీకు ఏ కారణమైనా కనిపించనివ్వండి.. ఆ కారణాన్ని అధిగమించి.. ఓరిమిని పాటించగలిగితే.. వివాహబంధం ఖచ్చితంగా పదిలంగా ఉంటుంది.
– వెంకట్ ఆరికట్ల

“2002స0 Panjagutta PS లో “ప్యాలెస్ పెళ్ళాం” తన మాడామొగుడి మీద “కేసు పెడితే, ఆడు భయపడి పోయి, పెళ్ళాం పెట్టిన అన్నీ కండిషన్స్ కీ ఒప్పుకుని, Almost పోయిన పెళ్ళి బంధాన్ని డమ్మీ మొగుడిగా మారి నిలబెట్టుకున్నాడు అని ప్యాలెస్ లో పలువురి టాక్.
Well written Venkat garu. The definition of love is apt, as love is always dynamic. To keep it alive, living under one roof is essential. Long distance marriages do not survive. The other modern issues that is plaguing men is “Patutwam”. From food, environment, lifestyle, stress etc are effecting men. Women are biologically different so they are not effected much.
Mundas veda
కలిసి ఉండి 3AM కాల్స్, పంజగుట్ట పోలీసుస్టేషను లో కంప్లయింట్లు కన్నా విడిపోయి ఎవరి దారి వాళ్ళు చూసుకోవటం బెటర్!!