నాని.. హీరో నుంచి నిర్మాత వరకు

సబ్జెక్ట్ ల్లో వైవిధ్యం, సినిమాల్లో వెర్సటాలిటీ, దర్శకుల్లో కొత్తదనం వెదికి వెదికి చూస్తున్న నాని నిర్మాతగా కూడా సక్సెస్ ఫుల్ ట్రాక్ లోనే వున్నారు

అష్టా చెమ్మా తో స్క్రీన్ మీదకు వచ్చి 17 ఏళ్లు పూర్తయింది..హీరో నాని పుట్టిన రోజు ఈ రోజు. ఒక్క మాటలో చెప్పాలంటె తెలుగులో వున్న ఒకే ఒక వెర్సటైల్ హీరో. హీరోగా నాని తన కెరీర్ ను తనే మార్చుకుంటూ, మలుచుకుంటూ వెళ్తున్నారు. ఇది అందరికీ సాధ్యం కాదు. అదృష్టం కూడా కలిసి రావాలి. నానికి అలా కలసివచ్చింది. ఒక దశలో నాని కెరీర్ కిందకు జారిపోయింది. అంతా అయిపోయిందనుకున్నారు. కానీ మళ్లీ పైకి లేచాడు.

కెరీర్ గ్రాఫ్ చూసుకుంటే ప్రతి సినిమా ఏదో ఒక డిఫరెంట్ గా ట్రయ్ చేసిందే తప్ప, రొటీన్ గా ఏదో ఒక సినిమా చాన్స్ వచ్చేసింది..చేసేసాం అనేది వెదికినా కనిపించదు. ఇలాంటి లైన్ హీరోలకు దాదాపుగా అసాధ్యం. ఎక్కడో ఒక దగ్గర ఓ పాప్ కార్న్ మూవీ లేదా ఓ టైమ్ పాస్ సినిమా పడుతూ వుంటుంది. కానీ నాని విషయంలో ఫ్లాప్ అయిన సినిమాలు కూడా ఏదో కొత్తగా ట్రయ్ చేసినవే.

నాని తన కెరీర్ ను తనే డిజైన్ చేసుకున్నట్లు క్లారిటీగా కనిపిస్తుంది. ఒక స్టేజ్ లో నాని వరుసగా ఫ్లాపులు చూసాడు. గమ్మత్తేమిటంటే అన్నీ పేరున్న దర్శకులతో చేసినవే. సినిమా జనాలు బలంగా నమ్మే కాంబినేషన్ ఫ్యాక్టర్ తో చేసిన సినిమాలే అవన్నీ. ఎప్పుడైతే ఈ కాంబినేషన్ ఫ్యాక్టర్ అనే దాన్ని నాని తనంతట తాను వదిలేసుకున్నాడో, అక్కడి నుంచి తిరుగులేకుండా వెళ్లాడు.

ఎవడే సుబ్రహ్మణ్యం..నాగ్ అశ్విన్ తొలి సినిమా. భలే భలే మగాడివోయ్, దర్శకుడు మారుతి అప్పుడప్పుడే తన ముద్ర నుంచి బయటకు వచ్చే ప్రయత్నం, తరువాత వరుసగా హను రాఘవపూడి, విరించి వర్మ, నక్కిన త్రినాధరావు, శివనిర్వాణ, వేణు శ్రీరామ్ ఇలా కొత్త వాళ్లకు, వన్ ఫిల్మ్ డైరక్టర్లకు అవకాశం ఇచ్చుకుంటూ వెళ్లాడు.

ఎప్పుడైతే ఈ స్టయిల్ సరైనది అని నాని ఫిక్స్ అయ్యారో అదే దారిలో వెళ్తున్నారు. మధ్యలో విక్రమ్ కుమార్, ఇంద్రగంటి లాంటి సీనియర్లే మళ్లీ నానిని నిరాశపర్చారు. కొత్త, యంగ్ టాలెంట్ మాత్రం నాని ని ఒక మెట్టు ఎక్కిస్తూ వస్తున్నారు. కేవలం నానికే దొరుకుతాయో ఇలాంటి కథలు, నానికే టచ్ లోకి వస్తారో ఇలాంటి కొత్త టాలెంట్ దర్శకులు అంతా అన్నట్లు నడుస్తోంది. ఇలాంటిది మరే హీరోకి సాధ్యం కావడం లేదు. అది ఎందుకో ఎవరికీ తెలియని వైనం. ఒక విధంగా చెప్పాలంటే నాని ఇప్పుడు డైరక్టర్ల కర్మాగారం.

కానీ రిపీట్ అన్నది నానికి పెద్దగా కలిసిరాదు. శివనిర్వాణతో మళ్లీ ప్రయత్నించినా అంత పాజిటివ్ రిజల్ట్ రాలేదు. అంటే సుందరానికి క్లిక్ కాకపోయినా సరిపోదా శనివారం చేసారు. ఓకె అనిపించుకుంది. ఇంద్రగంటి ని రిపీట్ చేస్తే పెద్దగా సక్సెస్ రాలేదు.

సబ్జెక్ట్ ల్లో వైవిధ్యం, సినిమాల్లో వెర్సటాలిటీ, దర్శకుల్లో కొత్తదనం వెదికి వెదికి చూస్తున్న నాని నిర్మాతగా కూడా సక్సెస్ ఫుల్ ట్రాక్ లోనే వున్నారు. హిట్ సిరీస్ అంటూ స్టార్ట్ చేసి రెండు హిట్ లు కొట్టారు. మూడోది విడుదలకు రెడీ అవుతోంది. మరోపక్క చిన్న చిన్న సినిమాలు తీస్తున్నారు. కోర్ట్ అనే చిన్న సినిమా ప్రియదర్శి హీరోగా విడదులకు రెడీగా వుంది.

బాపు దగ్గర అసిస్టెంట్ డైరక్టర్ గా జర్నీ స్టార్ట్ చేసారు నాని. ఇప్పుడు తన సినిమాల కంటెంట్, మేకింగ్ విషయంలో కీలకంగా వుంటున్నారు కానీ దర్శకుడిగా ఇంకా పేరు అయితే వేసుకోలేదు. బట్, ఆ రోజు వస్తుంది ఎందుకంటే నానికి ఆ ఆసక్తి అయితే వుంది.

ఒక్కటే సమస్య.

నాని సినిమాలు బాగుంటాయి. నాని సినిమాలు అనౌన్స్ చేయగానే నాన్ థియేటర్ మార్కెట్ అయిపోతుంది. నాని సినిమాలు అంటే ఓటిటి సంస్థలు పరుగెత్తుకు వస్తాయి. నాని సినిమాలు అంటే ఓవర్ సీస్ మార్కెట్ బాగుంటుంది. నాని సినిమాలు అంటే ఫ్యామిలీలు ఉత్సాహంగా కదిలి వస్తాయి.

కానీ ఒక్కటే సమస్య. నాని సినిమాలు నిర్మాతలకు పెద్దగా లాభాలు పండించవు. ఇది చేదు వాస్తవం. దీన్ని నాని అంగీకరించకపోవచ్చు. కానీ నిర్మాతలకు, బయ్యర్లకు తెలుసు. ఏ సినిమాకు మిగిలిందా..తగిలిందా..బయ్యర్లకు వెనక్కు ఇచ్చామా…బయ్యర్లకు ఇంకా వెనక్కు ఇవ్వలేదా..ఇలాంటి లెక్కలు అన్నీ పక్కాగా టాలీవుడ్ కు తెలుసు. అయితే సినిమా బాగుంది. ప్రశంసలు అందుకుంది. సమీక్షలు వచ్చాయి. వీటి మాటున సమాధి అయిపోతున్న చేదు వాస్తవం.బయ్యర్లు నష్టపోతున్నారు. నిర్మాతలకు మిగలడం లేదు అన్నది.

ఇది కూడా నాని చేతుల్లోనే వుంది. నాని తలుచుకుంటే ఆ నెగిటివ్ పాయింట్ కూడా పాజిటివ్ అయిపోతుంది. ఎలా అంటే తన రెమ్యూనిరేషన్ ను సినిమా సినిమాకు పెంచుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు ముఫై కోట్లు దాటేసింది. మేకింగ్ దగ్గర దగ్గర వంద కోట్లకు చేరిపోతోంది. తన రెమ్యూనిరేషన్ ను కాస్త తగ్గించడం, తన దర్శకులను తానే కంట్రోల్ చేసి, కాస్ట్ కటింగ్ చేయడం. ఈ రెండూ చేస్తే చాలు. నాని టాలీవుడ్ బెస్ట్ హీరో..అస్సలు వంక పెట్టడానికి వీలు లేని హీరో.

హ్యపీ బర్త్ డే నాని.

4 Replies to “నాని.. హీరో నుంచి నిర్మాత వరకు”

Comments are closed.